– డా|| లెనిన్ అన్నే
వీక్షణం 64 వ సమావేశం మిల్పిటాస్ లోని స్వాగత్ హోటల్ లో డిసెంబరు 10 వ తేదీన ఆసక్తికరంగా జరిగింది.
శ్రీ చిమటా శ్రీనివాస్ అధ్యక్షత వహించిన ఈ సభలో ముందుగా మిసిమి పత్రిక సహ సంపాదకులు, ప్రముఖ చిత్రకళా చారిత్రకులు శ్రీ కాండ్రేగుల నాగేశ్వర్రావు ఆంధ్రుల చిత్ర కళ చరిత్ర గురించి సవివరంగా ప్రసంగించారు. ముఖ్యంగా పాశ్చాత్య యుగంలో రినైసాన్స్ తరువాత పునరుజ్జీవనం పొందిన చిత్రకళ ను గురించి, ప్రపంచ ప్రఖ్యాత చిత్రకారుడు పికాసో గురించి వివరించేరు. ముఖ్యంగా పికాసో భారతీయ చిత్రకళా గొప్పదనాన్ని, అప్పటి ఇల్లస్త్రేటెడ్ వీక్లీ సంపాదకులు ఏ. ఎస్. రామన్ గారికి తెలియజేసిన విధానాన్ని వివరించేరు. ఎవరికీ అంత సులభంగా ఇంటర్వ్యూ ఇవ్వని పికాసో ఏ. ఎస్. రామన్ ను దగ్గరకు పిలిచి మరీ ఇంటర్వ్యూ ఇస్తూ “ఇండియా ఈజ్ ఎ లాండ్ ఆఫ్ వేదాస్, ద బుద్ధా, అండ్ ద కలర్స్ ” అని పొగిడారట. పార్లమెంటు భవనంలో అశోక చక్ర నమూనా ని తీసుకుని అటు భారతీయ శిల్పకళను, ఇటు పాశ్చాత్య శిల్పకళను మేళవించి ఎలా నిర్మించారో వివరంగా చెప్పేరు. ఆంధ్రుల చితకళ గురించి వివరిస్తూ దామెర్ల రామారావు గారి గురించి సవివరంగా పరిచయం చేసేరు.
తరువాత “కాళిదాస రఘువంశం” గురించి శ్రీ శ్రీచరణ్ పాలడుగు ప్రసంగిస్తూ మొదటి సర్గ నుంచి దిలీపుని ఉదయం వరకూ తాత్పర్య సహితంగా కొన్ని శ్లోకాలు వివరించేరు. కాళిదాసు యొక్క సాభిప్రాయమైన ప్రయోగాల వివరణలు సోదాహరణంగా చెప్పేరు.
శ్రీమతి శారద “మెదడుకి మేత” అనే భాషా పరమైన పజిల్ ను క్విజ్ కార్యక్రమంగా ఆసక్తికరంగా నిర్వహించేరు.
విరామం తర్వాత జరిగిన కవిత్వ పఠనం లో డా|| కె. గీత, శ్రీమతి షంషాద్, శ్రీ లెనిన్, శ్రీ గంగిశెట్టి లక్ష్మీ నారాయణ, శ్రీ వేంటేశ్వర్రావు, డా|| ఆర్. గోపాల రెడ్డి గారు మొ.న వారు పాల్గొన్నారు.
ఆద్యంతం రసవత్తరంగా జరిగిన ఈ సమావేశంలో స్థానిక ప్రముఖులతో బాటూ ఆంధ్ర ప్రదేశ్ ఆధికారిక ఎన్నారై ప్రతినిధి శ్రీ కోమటి జయరాం కూడా ఈ సమావేశంలో పాల్గొనడం విశేషం.