-తాటిపాముల మృత్యుంజయుడు
‘మాదీ స్వతంత్ర దేశం, మాదీ స్వతంత్ర జాతి ‘, ‘మేలుకో హరి సూర్యనారాయణా’ పాటల పేర్లు చెప్పుకోగానే ఠక్కున గుర్తుకు వచ్చేది బాలాంత్రపు రజనీకాంతరావు గారు. 1941 నుండి తన సంగీత, సాహిత్య, గాన మాధుర్యాలతో ఆకాశవాణిలో తెలుగుజాతిని ఓలలాడించిన ప్రముఖుడు బాలాంత్రపు రజనీకాంతరావు గారు 22 ఏప్రిల్ న మనలను వీడిపోయారు.
సరిగ్గా తేదీ గుర్తులేదు కాని, నాకు ఆ సంఘటనలు మాత్రం బాగా గుర్తు. కొద్ది సంవత్సరాల క్రితం సిలికానాంధ్ర నిర్వహించిన ఉగాది ఉత్సవంలో రజనీ గారి పాటలు కొన్ని నేర్చుకొని కార్యక్రమం ఇవ్వదలిచాం. అప్పుడు నేను ఉత్సుకతతో వారి గురించి ఇంటర్నెట్లో వెదుకుతుంటే వారి గురించిన సమాచారం ఎంతగానో లభించింది. వారి చేసిన ఎనలేని సేవలను ఆ సమయంలో తెలుసుకొన్నాను.
సిలికానాంధ్ర చైర్మన్, శ్రీ కూచిభొట్ల ఆనంద్ గారు రజనీకాంతరావు గారి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. అపూడు వారు మాతో పంచుకొన్న మాటలివి.
“నిండు జీవితం అనుభవించిన పాటల తోటమాలి… పండు వయసులో వీడ్కోలు గీతం పాడుతూ వెళ్ళిపోయారు. తొంభై ఎనిమిదేళ్ళ పరిపూర్ణ జీవితం ఆస్వాదించిన బాలాంత్రపు రజనీకాంతరావుగారు కన్నుమూయడంతో గత శతాబ్దపు మన ఆఖరి లలిత వాగ్గేయకారుడు కనుమరుగైపోయారు. ఆయనది కర్ణాటక సంగీతం లోతులు తెలిసిన సలలిత భావ సుమ రజనీగంధం. కవి, గాయక, వైతాళికుడుగా ఆయన వేసిన బాటలు, చూపిన తోవలు అపూర్వం. సిలికానాంధ్ర కుటుంబం తరఫున ఆ మహానుభావునికి శ్రద్ధాంజలి ఘటించి, వారి ఆఖరి పయనంలొ నా భుజమిచ్చి పాల్ల్గోవడం ఒక అదృష్టం.”
అలాగే, రజనీ గారి మేనకోడలు ప్రసూనగారి ఫేస్ బుక్ మాధ్యమంలో వచ్చిన నివాళులను కొన్నింటిని ‘బాలాంత్రపు నివాళులు ‘ అన్న ప్రత్యేక శీర్షికలో ప్రచురించాం. తప్పక చదవండి.