సాహిత్య అకాడమీ గ్రహీతలకు అభినందనలు
ఎన్నో ఏళ్ళ కృషి , దీక్ష , పట్టుదల తో సాగుతున్న కవి లేదా రచయిత ఎవరైనా ఒక్క సాహిత్య అకాడమీ అవార్డు రావడంతో ఒక్కసారిగా సేదదీరుతారు. అంటే సాహిత్యం లో తమకంటూ ఒక పేజీ ఉంటుందని ఎవరికైనా ఆనందం కలుగుతుంది. ప్రస్తుతం కవిగా సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్న దిగంబర కవి నిఖిలేశ్వర్ గారు అసలు పేరు కుంభం యాదవరెడ్డి. తెలుగులో నిఖిలేశ్వర్ రచించిన అగ్నిశ్వాస కవిత్వానికి ఈ అవార్డు ఇచ్చారు. వీరు కవి గానే కాకుండా అనువాదకుడిగా, కథకునిగా విమర్శకునిగా ప్రజాదృక్పథం గల రచనలను చేశారు. 1956 నుండి 1964 వరకు తన అసలు పేరు మీదే వివిధ రచనలు చేశారు. 1965 నుండి తన కలం పేరుని నిఖిలేశ్వర్ గా మార్చుకొని, దిగంబర విప్లవ కవిగా సాహితీ ప్రపంచం లో విరజిల్లారు. దిగంబర కవులలో ఒకరిగా, 1965 నుండి 1970 వరకు మూడు సంపుటాల దిగంబర కవిత్వమును ప్రచురించారు. నిఖిలేశ్వర్ విప్లవ కవిత్వోద్యమంలో కూడా ప్రధానమైన కవి. దిగంబర కవిగా ఉన్న ఆయన ఆ తర్వాతి కాలంలో విప్లవ కవితోద్యమం లో ప్రధాన భూమికను పోషించారు.
ఒక లింగమార్పిడి యొక్క ఆత్మకథ – తమిళ పుస్తకాన్ని అనువదించినందుకు ఆంధ్రప్రదేశ్ పి సత్యవతి అనువాద విభాగంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును అందుకున్నారు. సత్యవతి కథల్లో అనసవరమైన పాత్రలు, సంఘటనలు, వర్ణనలు వుండవు. శైలీ వ్యామోహంగానీ, వర్ణనా చాలప్యం గానీ ఆమెకు లేవు. ఒకటి రెండు చోట్ల తళుక్కుమన్నా అది హద్దులు దాటలేదు. సత్యవతి శైలిలో భావం (సెన్స్), భావోద్రేకం (ఫీలింగ్), కంఠస్వరం (టోన్), ఉద్దేశం (ఇన్టెన్షన్) స్పష్టంగా వుండవలసిన మోతాదులో వుంటాయి. అందులో కవిత్వం బరువుకాని, భాష బరువుకాని, వాక్య నిర్మాణపు బరువుకాని వుండవు. సత్యవతి కథలు ‘నిశ్చల నిశ్చితాలను’ ఆదర్శీకరించవు. కుహనా ఆదర్శాలాను ప్రతిపాదించవు. సమాజ పరిణామశీలతను తిరస్కరించవు. జీవిత సమస్యను పరిణామం నుంచి వేరు చేసి చూడవు. స్త్రీ కళ్ళలోకి చూడగల సాహసంలేక మనం తప్పించుకు తిరుగుతున్న ప్రశ్నల్ని ఈ కథలు మనం నడుస్తున్న బాటలో నాటుతాయి.
అలాగే కధా రచయిత్రిగా ఎంతో కృషి చేసిన కన్నెగంటి అనసూయకు బాలసాహితి పురస్కారం, ఎండ్లూరి మానసకు యువ పురస్కారం లభించింది. మిలింద షార్ట్ స్టోరీని మానస ఎండ్లూరి రచించారు. 18 భాషల్లో 2020 సాహిత్య అకాడమీ యువ పురస్కారాలు ఇచ్చారు. బావుంది .. 2020 సంవత్సరానికి గాను ముగ్గురు తెలుగు వారు సాహిత్య అకాడమీ అవార్డులు సాధించడం అంటే నిజంగా గర్వకారణం.