హాస్యరసాన్ని నీళ్లల్లా చిలకరిస్తూ వ్యంగ్యం వేళాకోళం చమత్కారం సమపాళ్ళలో కలిపి ఒక రచన వండాలనిపించింది రాజేశ్వరికి.
అనుకున్నదే తడవు అందుకుంది పాత్రలా పేపరుకాయితం. అడుగులో హంసపాదు అన్నట్టుగా ఆపాత్రకి గరిట కనపడలేదు అంటే అదే పెన్ను కనపడలేదు. తొలివిఘ్నం అనుకుంటూ పుత్రరత్నం పుస్తకాల దగ్గిర ఏదో ఓపెన్ను కనపడకపోదని వాడి అలమారలో చూసింది. అది ఉంది ఒక అడవిలా. దారీ తెన్నూ లేని ఆ అడవిని ఒక్క నిమిషంలో సరి చెయ్యడం కుదరదు ఎలాగో . అందుకే ఆ పని తలపెట్టకుండా తలదూర్చి పుస్తకాల కుప్పలో వెతికింది. ఆశనిరాశ కాలేదు. దొరికింది. అమ్మయ్య అనుకుంటూ సద్దుకుని కూచుంది. ట్రింగ్ ట్రింగ్ అంటూ టెలిఫోన్ మోగింది.
మలివిఘ్నం పళ్ళుకొరుక్కుంటూ లేచింది . తప్పుతుందా.
రిసీవర్ చెవి దగ్గిర పెట్టుకోగానే ఎవరో ఆయన హిందీలో ఏదో అడుగుతున్నాడు. అసలే హిందీలో పండితురాలు తను. ఆయన అడిగేదాన్లో వాక్యంచివర హై హై అంటూ హైరానా పడటం తప్ప ఇంకేమీ అర్ధం కాలేదు. ఎటొచ్చీ రాంగ్ నెంబరని మాత్రం అర్ధమైంది. ఆమాటే విసుగ్గా అనేసి టక్కున పెట్టేసింది ఫోన్.
అమ్మో తొందరగా రాయడం మొదలుపెట్టాలి ఇంకా ఎన్ని ఫోన్లో రిలయన్స్ అంటారు ఎల్.ఐ,సి. అంటారు ఐసి.ఐసి.ఐ.బ్యాంకంటారు అలా వస్తూనే ఉంటాయి రోజూ. అయినా వాటన్నిటికీ సమాధానాలు చెప్పాల్సిన ఇంటి యజమాని పగలు ఉద్యోగాలకో సద్యోగాలకో బయటికి పోతారు కదా ఆ సమయాల్లో ఫోన్లు చేసి ఇంట్లో ఆడాళ్ళని ఈ కార్డూ ఆ కార్డూ ఈబ్యాంక్ ఆబ్యాంక్ అంటూ ఎందుకు విసిగిస్తారో అర్ధం కాదు.
ఉరుమురిమి మంగలం మీద పడ్డట్టు కోపం అంతా భర్త రామనాధం మీదకి తిరిగింది.
ఔనుమరి ఆఫీసునించి ఇంటికి వస్తూనే నీ జీవితం హాయి ఇంటిపట్టున దర్జాగా రోజంతా విశ్రాంతిగా కూచుంటావు పనమ్మాయి వొచ్చి అన్ని పనులూ చేసి వెళ్తుంది వంట ఒక్కటేగా నీపని అంటాడు.
బంధువులో స్నేహితురాళ్ళో ఫోన్ చేస్తేనో లేదా వాళ్ళకి తను చేస్తేనో ( తెల్లారి లేచి ఎప్పుడూ ఉండే కార్యక్రమం అదే కదా ) గంటలకి గంటలు మాట్లాడుతుంది తను. రోజంతా ఆ టైమ్ టేబుల్ పొద్దున్నించీ సాయంత్రం దాకా ఎలాగో ఉంటుంది. అది వేరే విషయం. కానీ మధ్యలో తనకవసరంలేని ఫోన్ల గోలేవిటో చిరాకంతా కుర్చీ మీద చూపిస్తూ గట్టిగా ఒక్కలాగులాగి కూచుంది రాజేశ్వరి ఈసారి ఏ ఆటంకం రాకుండా రచన మొదలుపెట్టేసెయ్యాలని.
ఓం శ్రీరామ అని రాయబోయింది పైన కాయితం నెత్తిమీద . ఇంకా పెన్ను ఆన్చనేలేదు భయ్యిమంది బజర్. ఎవరో చూడకతప్పదు కదా లేకపోతే కథ రాయడం సంగతి దేవుడెరుగు కర్ణభేరి చిల్లుపడటం నిజం. కోపం చూపించుకోడానికి మళ్ళీ కుర్చీయే బలి అయ్యింది.
వచ్చిందెవరో కాదు బద్ధశత్రువు పక్కింటి కామాక్షి.
ఇద్దరూ ఎప్పుడూ ఒకరిమీద ఒకరు లోలోపల రగిలిపోతూనే ఉంటారు పైకిమాత్రం పదిజన్మలెత్తినా మనం ఇలాగే స్నేహితురాళ్ళలా పుట్టాలి అని ఇరుగుపొరుగు ముందు నటనా కౌశలం చూపిస్తూనే ఉంటారు నందిఅవార్డు రాలేదుగానీ. ఏంచేస్తున్నావు నీదయవల్ల ఇప్పటివరకూ ఏమీ చెయ్యలేదు ఆరంభ శూరత్వం తప్ప గొణుక్కుంది మనసులోనే రాజేశ్వరి.
ఇది విన్నావా కళ్లు విప్పార్చి ప్రశ్న.
నువ్వు చెప్పావా తడుముకోకుండా తిప్పి కొట్టింది ప్రశ్నతో.
అదేలే చెప్తున్నా చెప్తున్నా. మీ పనిమనిషి సివంగి కొడుకు పోయాట్ట. చేతికి అందివచ్చిన కొడుకు.
చేతిలో పెన్ను జారిపడటం తను చటుక్కున నేలమీద చతికిలపడిపోవటం ఏదీ తెలియదు రాజేశ్వరికి. కత్తివాటుకి నెత్తురుచుక్క లేనట్టుగా అయింది మొహం.
వింతగా చూసింది కామాక్షి.
ఏమిటి రాజేశ్వరీ అయ్యో అలా అయిపోయావేమిటి కంగారు పడుతూ దగ్గిరగా వచ్చి లేవదీసి కుర్చీలో కూర్చోపెట్టింది.
ఎప్పుడూ రాజేశ్వరి మొహం ఇలా ఇంత విచారంగా చూడని కామాక్షికి నిజంగానే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తోంది. ఆమె కళ్ళల్లో నీళ్ళు చూసి తన కళ్ళల్లో కూడా నీళ్ళు తిరుగుతుంటే కొంగుతో అద్దుకుంది.
ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవలుండచ్చు భేదాభిప్రాయాలుండచ్చు కానీ విచారకరమైన సంఘటనలు జరిగినా కంటనీరు తెప్పించే దృశ్యాలు చూసినా ఆ ఇద్దరి మనసులూ స్పందించేందుకు భేదాభిప్రాయాలు అడ్డురావుగా కామాక్షీ జీరపోయిన గొంతుతో పిలుస్తూ ఆమె చెయ్యి పుచ్చుకుంది రాజేశ్వరి. నేను చాలా తప్పు చేశాను కామాక్షీ. నా మూలంగానే ఆ పిల్లాడు చనిపోయాడన్నమాట.
అదేమిటి మధ్యన నువ్వేం చేశావు వాడికేదో అనారోగ్యం వచ్చిందిట పోయాడు.
ఎవరైనా పరాయివాళ్లయినా వాళ్ళు చనిపోయారన్న కబురువింటే అయ్యో అనుకోవడం జాలిపడటం సహజమే. కానీ ఇంతలా కన్నీళ్ళుపెట్టేసుకుంటోందేమిటీవిడ అర్ధంకావట్లేదు కామాక్షికి.
పొద్దున్న పని చేసి వెళ్ళేటప్పుడు పిల్లాడికి ఖరీదైన మందులేవో కొనాలన్నారని ఒక అయిదొందలు ఇమ్మని మెల్లిగా రెండునెలల తర్వాత తీర్చుకుంటాననీ అంది నేను ఇవ్వలేదు కాకమ్మ కబుర్లు చెప్తోందని. ఇదివరకు పనిచేసిన సత్తెమ్మకిలాగే జీతంలో పట్టుకోవచ్చులే అన్న ఉద్దేశ్యంతో ఒకసారిస్తే తీసుకున్న నాలుగురోజులకే ఐపు జాడ లేకుండా ఇల్లు మారిపోయింది. అందుకే దీనికి ఇవ్వలేదు. చాలా తప్పు చేశాను కామాక్షీ తను డబ్బిచ్చిఉంటే మందులుకొనడమో ఇంకా పెద్ద డాక్టర్ కి ఎవరికైనా చూపించడమో చేసుండేదేమో బతికేవాడేమో అన్న ఆలోచన రాజేశ్వరి మనసుని కుదిపేస్తోంది.
అది సహజమే మనసుకి ఆనందపడటం ఎంత తెలుసో విచారపడటమూ అంత తెలుసు.
ఆనందాన్ని అదుపు చేసుకోవడం కాస్త తేలికే కావచ్చుకానీ విచారాన్ని అదుపుచేసువకోడం అతి కష్టం .
తరంగాలై ఉవ్వెత్తున గుండెలోంచి ఎగసిపడుతూనే ఉంటుంది గుర్తుకొచ్చినప్పుడల్లా ముల్లులా మనసుని గుచ్చుతూనే ఉంటుంది.
ఓ పదిహేను రోజుల తర్వాత పనిలోకి వచ్చిన సివంగి వైపు చూడటానికి మొహం చెల్లలేదు రాజేశ్వరికి. బాధని దిగమింగుకుంటూ అప్పుడే పన్లోకి వచ్చేసిందే పాపం అనిపించింది.
పనికిపోకుండా ఇంట్లో కూచుంటే వాళ్ళకెలా గడుస్తుంది మరి సివంగీ నెల్లాళ్ళ జీతం ఊర్కేనే ఇస్తాన్లేమ్మా పనిలోకి రావక్కర్లేదు. ఇంట్లోనే ఉండవే ఓ నెల్లాళ్ళు . ఇంత కష్టంలో కూడా పనికి రావడం ఎందుకు నేను చేసుకుంటాలే కొద్దిరోజులు అంది మనస్ఫూర్తిగా.
ఆశ్చర్యంగా కళ్ళింత చేసుకుని చూసింది సివంగి. దానిపేరు సివంగి కానీ మనసు నవనీతం. ఎందుకమ్మా ఊరికే డబ్బిస్తానంటన్నారు సేతనైన పనిసేసుకుని బతికేటోల్లం. ఊరికే ఇంటికాడ కూసుంటే కొడుకు పోయిన బాద మరింత ఎక్కువై పిచ్చెక్కిపోదా తల్లీ. సావు పుట్టక మన సేతుల్లో ఏవుంది తల్లీ బతికినన్ని దినాలూ మాట పడకుండా బతికేదీ ఆడినించి పిలుపొచ్చిన్నాడు పోయేదీ చేతులు జోడించి పైకి చూసింది సివంగి.
ఏమీ చదువుకోని సివంగి ఒక్కమాటలో జీవితసారం ఎంతచక్కగా చెప్పిందనిపించింది. కానీ ఆమాటలో ధైర్యం గొంతులో జీర గొలుసులా అల్లుకుపోయి విచిత్రంగా ధ్వనించింది.
అప్రయత్నంగా సివంగి భుజమ్మీద ఓదార్పుగా చెయ్యి వేసింది రాజేశ్వరి . ఆమె కళ్ళల్లో నీళ్ళు తిరగడం చూసిన సివంగికి అనిపించింది మందులకోసం తను డబ్బులడిగితే ఇయ్యనందుకు అమ్మ ఎంతగానో మనసులో బాధపడిపోతా ఉందని.
మెల్లిగా అమ్మని కుర్చీలో కూచోపెట్టి తను కింద కూచుంది. అమ్మా తవరు నవ్వుతాలుగా కతలు రాస్తా ఉంటారని నా కొడుకు సెప్పిండు. ఆడికెవురో సెప్పిన్రంట.
ఔనన్నట్టుగా తల ఊపింది మరి మరి అందరికీ నవ్వులు పంచే తవరేడుస్తున్నారామ్మా నేనూ మనిషినేకదా సివంగీ. ప్రాణం లేని బొమ్మని కాదుగా . బేలగా సమాధానమిచ్చింది. ఎందుకోగానీ ఊళ్ళో ఉన్న తన చెల్లెలు గుర్తొచ్చింది సివంగికి. అది కాస్తో కూస్తో సదూకుంది. మొగుడు తిట్టే తిట్లు బరించలేక ఎప్పుడూ తన దెగ్గిర అంటా ఉండేది నేను పేనం లేని బొమ్మని కాదుగా అక్కా అని. కళ్ళనిండా నీళ్ళు కమ్మి మసకబారాయి.
నా కొడుకు సిన్నతనాన సేసిన అల్లరి ఆకతాయి పన్లు నవ్వుతాలు పన్లు రోజుకొకటి నీకు సెప్తా వొస్తాను అయి కతలుగా రాయి తల్లీ మనిద్దరం రోజూ నవ్వుకుందాం.
గుండె దిటవు చేసుకుని మాట్లాడుతున్న సివంగి మొహంలోకి చూస్తూ సరేనన్నట్టుగా తల ఊపింది. ఇద్దరి కన్నుల్లో తడి తడి ముత్యాలు ఇద్దరి పెదవుల్లో నవ్వుల రతనాలు. నవ్వినా ఏడ్చినా కన్నీళ్ళే . మనిషికి దేవుడిచ్చిన వరం అది. మనసు భారాన్ని దింపేది మనిషిని మళ్ళీ మనుషుల్లో పడేసేది ఆ వరమే కదా.
తమిరిశ జానకి