-సిహెచ్.నాగార్జునశర్మ
Cell No. 8978504127
ఈ రోజుల్లొ నెల జీతం వచ్చే ఉద్యోగం లేకపొతే మద్య తరగతి కుటుంబాలు బ్రతకడం కష్టం. అందుక్కారణం తమ పూర్వీకులు సంపాదించిన ఆస్థి పాస్థులు ఏమీ లేక పోవడమే. ఆ కోవలోకి చెందినదే రఘు పరిస్థితి.
రఘు నాన్న జిల్లా పరిషత్ హైస్కూల్ లో స్కూల్ అసిస్టెంట్ గా పని చేస్తున్నాడు. ఆయన మరో అయిదెళ్ళలో పదవీ విరమణ పొందుతారు. అతడికి తను ఉద్యోగం చేస్తున్న ఊళ్ళో సొంత ఇల్లు తప్ప వేరే ఆస్థిపాస్థులేమీ లేవు. అది కూడా వాళ్ళ నాన్నగారు సంపాదించి పెట్టినదే.
రఘుకు ఒక తోడ బుట్టిన చెల్లెలుంది. పేరు శిరీష. డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నది. రఘు పోస్ట్ గ్రాడ్యుయేషన్ దాకా చదువుకున్నాడు. మంచి తెలివి తేటలు గలవాడు. మితభాషి. చదువులొ అన్నింటా ఫస్ట్ మార్కులతోనే పాసయ్యాడు. ప్రస్తుతం అతడి ముందున్న లక్ష్యం తండ్రి ఉద్యోగం నుండీ రిటైరయ్యే లోపల తను ఉద్యోగస్థుడవ్వాలని. రఘు తన డిగ్రీ పూర్తి అయిన దగ్గర నుంచి ఉద్యొగ ప్రయత్నాలు మొదలు పెట్టాడు. దినపత్రికలలొ వేసే ఉద్యొగాలన్నింటికీ అప్లికేషన్లు వేసి పరిక్షలు వ్రాసేవాడు. ఆ తర్వాత వాటి ఫలితాల కోసం ఎదురు చూసేవాడు. తీరా వాటి ఫలితాలు వెలువడితే అందులో తను ఎంపిక కాకపోవడంతో కాస్తంత నిరుత్సాహానికి గురయ్యేవాడు.
ఈ విధంగా కాలచక్రంలో రెండు, మూడు సంవత్సరాలు గడచిపోయాయి.
గడచిన మూడు సంవత్సరాలలో శిరీష గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఇంటి పట్టు నుండి తల్లికి ఇంటి పనుల్లో, వంట పనుల్లో తన వంతు సాయం చేస్తుండేది. అంతే కాకుండా తను చదివిన చదువు నిరర్థకం కాకుండా సాయంకాలం పూట తన ఇంటి చుట్టు పక్కల వున్న స్కూలు పిల్లలకు ఓ గంట పాటు ట్యూషన్ చెప్పేది.
ట్యూషన్లో సంపాదించే డబ్బులు నెలకు వెయ్యిరూపాయల దాకా వస్తుంది. ఆ డబ్బుని తన సొంత ఖర్చులకు మరియు ఉద్యోగాన్వేషణలో చెప్పులరిగేలా తిరుగుతున్న అన్నయ్యకు ఉద్యోగ అప్లికేషన్లకు, వాటి పోస్టు ఖర్చులకు సాయ పడుతుంటుంది.
“మరో రెండు సంవత్సరాలలో తండ్రి పదవీ విరమణ పొందుతారు. ఈ లోపల నేనొక ఉద్యోగస్థుడనైతే తండ్రికి భారం కాకుండా వుంటాను”. అని అనుకున్నాడు రఘు.
రఘు పబ్లిక్ సర్వీసు కమీషన్ – గ్రూప్-1 ఉద్యోగ ప్రకటనని ప్రముఖ దిన పత్రికలలో విడుదల చేసిన విషయం తెలుసుకుని వాటి అప్లికేషన్స్ తీసుకుని అప్లై చేసాడు. అప్లికేషను వేసిన మరుసటి రోజు నుండి రఘు పరిక్షకు తయారవడం మొదలు పెట్టాడు. ఇందులో ఎలాగైనా పాసై, ఇంటర్వూకు ఎంపికవ్వాలన్న ఉద్దేశంతో పరిక్షకు సంవత్సర కోచింగ్ తీసుకున్నాడు.
పరిక్ష వ్రాసి ఇంటికొచ్చి తండ్రితో ” నాన్నా! పరిక్ష బాగా వ్రాశాను, ఈ సారి తప్పకుండా ఉద్యోగానికి ఎంపికవుతానని” చెప్పాడు.
ఆ మాటలు విన్న తండ్రి పరమానందభరితుడై కొడుకుతో “నీకి ఉద్యోగం వస్తే నా కంతే చాలు. ఇక నీ చెల్లిలి విషయమంటావా! నా కొచ్చే రిటైర్మెంటు డబ్బులతో దాని పెళ్ళి చేసేస్తాను. ఆ తర్వాత మీ అమ్మ, నేను ఏ గుళ్ళోనో కృష్ణా రామా అనుకుంటూ కాలం గడిపేస్తాం” అని అన్నాడు.
కొంత కాలం గడచిన తర్వాత రఘు వ్రాసిన పరిక్షా ఫలితాలు దిన పత్రికలలో వెలువడ్దాయి. అందులో రఘు పాసవడంతో ఇంటిల్లిపాదీ సంతోషించారు.
వారం రోజుల తర్వాత రఘు ఇంటర్వూకు హజరవడానికి హైదరాబాదుకు ప్రయాణమయ్యాడు. చెల్లెలు శిరీష ఒక బ్యాగులో ఇంటర్వూకు సంబందించిన సరంజామానంతా సర్థి అన్నయ్య చేతి కిచ్చింది.
“వెళ్ళొస్తానని” చెప్పాడు అమ్మా, నాన్నలతొటి మరియు చెల్లెలి తొటి.
అందుకు సమాధానంగా “క్షేమంగా వెళ్ళి లాభంగా తిరిగి రా నాయనా” అని దీవించారు.
ఇంటర్వూ స్థలానికి రఘు సకాలానికే చేరుకున్నాడు.
ఇంటర్వూ మొదలైంది. ఇంటర్వుకు వచ్చిన వాళ్ళని ఒక్కొక్కర్ని పిలిచి ఇంటర్వూ చేస్తున్నారు. ఇంటర్వూ హల్లో నుంచి బయటకొస్తున్న వాళ్ళల్లొ కొంత మంది చిరు మందహాసాలతో ఎపాయింట్ మెంట్ ఆర్డర్ తో బయటి కొస్తుంటే మరి కొంత మంది విచార వదనంతో రిక్త హస్తాలతో బయటి కొస్తున్నారు.
ఇంటర్వుకు రఘు పేరును పిలిచారు.
రఘు ఇంటర్వూ హాల్లోకి వెళ్ళ గానే ఇంటర్వూ పానెల్ మెంబర్స్ కు అభివాదం చేసి తనకి కేటాయించిన సీటులో కూర్చున్నాడు. పానెల్ మెంబర్స్ రఘు స్టడీ సర్టీఫికెట్సు, ఎంప్లాయిమెంటు కార్డు, కాండక్ట్ సర్టిఫికెట్ అన్నీ చూసిన తర్వాత రఘు ని కొన్ని ప్రశ్నలు అడిగారు. వారడిగిన ప్రశ్నలన్నింటికీ తడబడకుండా సమాధానాలు చెప్పాడు. అతడి తెలివితేటలకి, అతడి కున్న జనరల్ నాలెడ్జ్ కి ఇంటర్వూ చేసిన సభ్యులందరూ అతడిని అభినందించారు. కాని ఇంటర్వూ పానెల్లో వున్న ఓ ఉన్నతాధిగారి రఘుతో “రఘు, మీరు మేమడిగిన ప్రశ్నలన్నింటికీ జవాబులు బాగా చెప్పారు. కాని మీకీ ఉద్యోగం రావాలంటే మీరు యాభై వేల రూపాయలు లంచం కింద ముట్ట చెప్పాలి. అందుకు మీకు ఓ వారం రోజులు గడువు కూడా ఇస్తున్నాను. ఈ వారం రోజుల్లో ఆ డబ్బు తీసుకోస్తే ఉద్యోగం గ్యారంటి లేకపోతే మీ ముందు ఇంటర్వూ చేసిన వాళ్ళల్లో ఎవరు డబ్బులు తీసుకొస్తారో వాళ్ళకి ఈ ఉద్యోగం ఇవ్వడం ఖాయం” అని అన్నాడు.
ఆ మాటలు విన్న రఘు స్థాణువై పోయాడు. కొంత సేపు అతడి నోట మాట రాలేదు. వెంటనే తేరుకుని లంచం తీసుకు రమ్మని చెప్పిన అధికారితో తన దీన గాధను ఏకరవు పెట్టుకున్నాడు.
“సార్! నేను పేదవాణ్ణి సార్! కాళ్ళు, చేతులు తప్ప ఆస్థిపాస్థులేమి లేని వాణ్ణి, కష్ట పడి చదువుకుని పై కొచ్చిన వాణ్ణి, అంత డబ్బు లిచ్చు కోలేను సార్! ఈ ఉద్యోగం కోసం నిద్రాహారాలు మానుకొని చదివాను సార్! ఈ ఉద్యోగం నాకు చాల అవసరం సార్! దయచేసి ఈ ఉద్యోగం నా కిప్పించండి సార్! మీకు ఋణ పడి వుంటాను.”అని బతిమలాడుకున్నాడు.
“సరేనయ్యా! కాదనటం లేదు. నీకిచ్చే ఉద్యోగం ఆషామాషీ ఉద్యోగం కాదు. ఒక ఉన్నతాధికారి పోస్ట్, ఆ పొస్టులొ చేరిన వారందరికీ జీతం కంటే గీతం ఎక్కువగా వుoటుంది. సంవత్సరం తిరిగే లోపు లక్షల కధిపతివవుతావు. అటువంటి ఉద్యోగానికి ఈ మాత్రం ఇచ్చుకోకపోతే ఎలా?” అని ప్రశ్నించాడు. ఇప్పటికైనా మించి పోయిందేమి లేదు. ఓ వారం రోజులు టైమిస్తున్నాను. ఈ వారం రోజుల్లో నువ్వు మేమడిగిన డబ్బు తీసుకొస్తే ఎప్పాయింట్మెంట్ ఆర్డరు పై అప్పటికప్పుడు నీ పేరు టైప్ చేయించి ఇస్తాను. లేకపోతే ఈ బంగారంలాంటి అవకాశం మరొకడికి పొతుంది. ఆ పైన నీ యిష్టం”, అని హెచ్చరించాడు.
ఈ సంఘటనతో రఘు ఆశలన్ని అడియాశలయ్యాయి.
“ఉద్యోగమనే తాయిలం చేతికి అందినట్లే అంది లంచం అనే విషపు కోరల్లో చిక్కుకుని చేజారి పోయింది.” అని అనుకొని హైదరాబాదు నుండి తన వూరికి తిరుగు ప్రయాణమయ్యాడు.
రఘు రాక కోసం ఇంటిల్లిపాది ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. భగవంతుడి దయ వల్ల వీడికి ఈ ఉద్యోగం వచ్చినట్లైతే మనందరం తిరుపతికి వెళ్ళి వెంకటేశ్వరస్వామి వారికి కళ్యాణోత్సవం చేయిద్దాం” అన్నది రఘు తల్లి.
“అలాగే చేయిద్దాం. ముందు వాణ్ణి హైదరాబాదు నుంచి రానీ’. అన్నాడు రఘు తండ్రి. సాయం సమయం. సంజె చీకట్లు అలముకుంటున్నయి. పక్షులు కిలకిలారావాలతో గూళ్ళకు చేరు కుంటున్నాయి. రఘు విచారవదనంతో ఇల్లు చేరుకున్నాడు.
రఘు చెల్లెలు శిరిష అప్పుడే ఇంటి గుమ్మ ముందు నుంచుని లైటు వేసి తన అన్నయ్య రాకని గమనించి “అన్నయ్యా! హైదరాబాదు నుంచి ఇదేనా రావడం; ఇంటర్వూలో సెలెక్టయ్యావా! ఎపాయింట్ మెంట్ ఆర్డర్ చేతికిచ్చారా! లేక పోస్టులో పంపుతామన్నారా!” అని గుమ్మమ్ముందే ప్రశ్నల వర్షం కురిపించింది.
ఇంతలో తల్లి అక్కడికి వచ్చి “అసలు వాణ్ణి ఇంట్లోకి రానీయకుండా ప్రశ్నలు వేసి విసిగిస్తున్నవేమే?” అని అన్నది.
రఘు ముఖ కవళికలని గమనించిన తండ్రి “అబ్బాయ్! నీకా ఉద్యోగం రావాలంటే లంచం ఇవ్వమన్నాడు నిన్నింటర్వూ చేసిన మహనుభావుడు. అందుకు నీకు వారం రోజులు గడువు కూడా ఇచ్చాడు. ఈ వారం రోజుల్లో నీవా డబ్బులు తీసుకెళ్ళిస్తే నీకా ఉద్యోగం ఇస్తాడు లేకపోతే లంచ మిచ్చే మరొకడికిస్తాడు కదా!” అన్నాడు.
ఆ మాటలు విన్న రఘ “నాన్నా మీకీ విషయాలన్నీ……..”
“మీ మిత్రుడి ద్వారా తెలుసుకున్నాను”.
“పోనీలే బాబు ఉద్యోగం రాకపోతే పోయింది. నువ్వు ఎలాంటి అఘాయిత్యం చేసుకోకుండా క్షేమంగా ఇంటికి తిరిగొచ్చావు. నా కదే పదివేలు. ఈ ఉద్యోగం కాకపోతే మరొక ఉద్యోగం. ఉద్యోగం రాలేదని బాధ పడవద్దు, అధైర్య పడవద్దు”. అని దైర్యవచనాలు చెప్పి ఆ రోజు రాత్రి అందరూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ డిన్నర్ ముగించి నిద్రకుపక్రమించారు.
ఇంట్లో అందరూ నిద్ర పోయారు. ఉద్యోగ ప్రయత్నం విఫలమైన కారణంగా రఘుకి మాత్రం కంటి మిద కునుకు రాలేదు. ఆలోచనలు పరిపరి విధాలా పోతున్నాయి. “ఇక ఇప్పటికిప్పుడు ఉద్యోగ ప్రకటనలు వెయ్యరు. చిన్నా చితక ఉద్యోగాలు కోకొల్లలుగా పడుతుంటాయి. వాటికైనా ప్రయత్నిద్దాం”, అని అనుకుంటూ నిద్రలోకి జారుకున్నాడు రఘు. మరునాడు ఉదయం రఘు రెండు ప్రైవేటు కంపెనీలలో ఉద్యోగానికి అప్లై చేసి వచ్చాడు.
కొంతకాలం జరిగిన తర్వాత ఆరెండు కంపెనీల వాళ్ళు రఘు ని ఇంటర్వూకు పిలిచి ఇంటర్వూ చేశారు. ఇంటర్వూ పూర్తయిన తర్వాత మీకే విషయం ఓ వారం రోజుల్లో తెలియపరుస్తాం” అని చెప్పారు .అలా చెప్పిన వాళ్లు నెల రోజులైనా ఏ విషయమూ తెలియపరచక పోయే పాటికి తనే ఆ విషయంగా తెలుసుకున్నాడు. తనని నామ మాత్రానికి ఇంటర్వూ చేసి ఊద్యోగం మాత్రం యాజమాన్యానికి తెలిసిన వారికిచ్చారని తెలిసింది.
ప్రభుత్వ రంగంలో ఉద్యోగం రావాలంటే ప్రవేశ పరిక్షలో పాసై, ఇంటర్వూలో నెగ్గడంతో సరిపోదు. వారడిగినంత లంచం ఇస్తే ఆ ఉద్యోగం నీదవుతుంది.
ప్రైవేటు రంగంలో ఉద్యోగం రావాలంటే చదువు, విషయ పరిజ్ఞానం, తెలివితేటలు అక్కర్లేదు. ఆ వ్యక్తి యాజమాన్యానికి బాగా తెలిసినవాడై, వారితో సంబంధ బాంధవ్యాలుంటే చాలు ఆ ఉద్యోగం అతడికే ఇస్తారు అన్న విషయాన్ని రఘు ఆకళింపు చేసుకున్నాడు తన అనుభవసారంతో.
ఇటువంటి పరిస్థితులలో ఏమి చెయ్యాలో రఘుకి అర్థం కావడం లేదు. దీనికి పరిష్కారమార్గమొకటి ఆలోచించాల్సిందేనని రఘు తన చిరకాల మిత్రుడిని కలవడానికి వాళ్ళింటికెళ్ళాడు. రఘు రాకని గమనించి “హల్లో గురూ! బహుకాలదర్శనం ఏంటి విశేషాలు? అన్నట్లు… నీ ఉద్యోగ ప్రయత్నాలెంత వరకూ వచ్చాయి? ఇటివల పబ్లిక్ సర్వీస్ కమీషన్ పరిక్ష రాశావట గదా! ఏమైంది?”అని అడిగాడు.
“పరిక్ష వ్రాశాను. పాసయ్యాను. కానీ ఇంటర్వూ పానెల్లో వున్న ఓ ఉన్నతాధికారి నాకా ఉద్యోగం ఇవ్వడానికి యాబై వేల రూపాయలు లంచంగా ఇవ్వమన్నాడు. నా దగ్గర అంత డబ్బు లేదని చెప్పాను. అందుకాయన ఓ వారం రోజులు గడువిస్తాను. ఈ వారంలో నువ్వా డబ్బుతో హైదరాబాదు కొచ్చావంటే నీ ముందే అపాయింట్ మెంట్ ఆర్డర్లొ నీ ఫేరు టైపు చేసి నీ కిస్తాను, లేకపోతే నీ ముందు ఇంటర్వూ చేసిన వాళ్ళల్లో ఎవరైతే డబ్బులు తీసుకొస్తారో వాళ్ళ కివ్వటం జరుగుతుంది. కానీ ఇందులో ఫస్ట్ ప్రిఫరెన్స్ నీకే” అని హైదరాబాదులో జరిగిన ఉదంతాన్ని తన మిత్రుడికి చెప్పాడు.
ఆ మాటలు విన్న మిత్రుడు “మనలాంటి మధ్య తరగతి కుటుంబాల్లో అంత డబ్బు ఎక్కడుంటుంది? మనకు రోజు గడవటమే గగన కుసుమమవుతుంటే నువ్వంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకెళ్ళ గలవు? నీ కున్న తెలివితేటలకి మరో మంచి ఉద్యోగం చూసుకోవచ్చులే. ఆ ఉద్యోగం రాలేదని బాధపడమాక”.అని చెప్పాడు మిత్రుడు రఘతో.
నువ్వన్న మాటే మా నాన్న కూడా అన్నాడు. ఇప్పుడు నేనేం చెయ్యాలో పాలుపోక సలహ కోసం నీ దగ్గర కొచ్చాను”. అన్నాడు రఘు మిత్రుడితో.
“నేను చెప్పబోయే సలహను తు.చ. తప్పకుండా పాటిస్తానని నాకు మాటిస్తే చెబుతాను లేకపోతే లేదు” అని అన్నాడు.
“అన్నట్లు నీకు నా సలహ చెప్పే ముందు ప్రభుత్వోద్యోగం కోసం నేను పడ్డ పాట్లని నీకు తెలియజెప్పి ఆ తరువాత నీకు నా సలహ చెబుతాను”.అని తనకు జరిగిన అనుభవాన్ని రఘు తో ఏకరవు పెట్టాడు.
“ఓరే రఘు! హైస్కూలు చదువు వరకూ మనిద్దరం క్లాస్ మేట్ల మన్న విషయం నీకు తెలుసు. ఆ తర్వాత ఇంటర్ మీడియట్ లో చదివే గ్రూపు సబ్జెక్టులు వేరవడంతో మన దోవ వేరయింది, అయినా మనం వీలు దోరికినప్పుడల్లా కలుసుకుని మట్లాడుకుంటున్నాం. నా చదువు గ్రాడ్యుయేషన్ తో ఫుల్ స్టాప్ పెట్టేశాను. నువ్వేమో పోస్ట్ గ్రాడ్యుయేషన్ దాకా చదువు కొనసాగించావు.
నువ్వు నీ ఉద్యోగ ప్రయత్నాలు డిగ్రీ పూర్తయ్యాక మొదలెట్టావు. నేనైతే పదిపాసైన దగ్గర్నుంచే మొదలెట్టాను. ఒక పక్క డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నపుడు బ్యాంకింగ్ సర్వీస్ రిక్రూట్ మెంట్ ప్రకటన పేపర్లో వేస్తే క్లర్క్ కం టైపిస్ట్ పోస్టుకు అప్లై చేశా. అలా రెండు, మూడు సార్లు అప్లై చేసుంటాను, అప్పట్లో రెండు సార్లు ఇంటర్యూలో సెలెక్టయ్యాను. కానీ ఆ ఉద్యోగమిచ్చేవాడు లక్ష రూపాయలు తెమ్మనె, వెంటనే నేను “ఆ లక్ష రూపాయలే నా దగ్గరుంటె నేనీ ఉద్యోగాని కెందుకొస్తాను సార్!” అని అన్నాను.
“అట్లైతే ఉద్యోగం ఇచ్చేది లేదు పో” అన్నాడు.
“అక్కర్లేదు.’సేవకా వృత్తిచే వచ్చు పాయసం కంటే స్వచ్ఛంద వృత్తిచే వచ్చు గంజి మేలు ‘ అన్న చందాన మీకు లక్ష రూపాయలు లంచ మిచ్చి ఉద్యోగం సంపాదించుకుని సేవకా వృత్తి చెయ్యడం కంటే నా ఇష్ట మొచ్చిన పని చేసుకుంటూ స్వతంత్రంగా బతకడమే మేలు ‘ అని చెప్పి ఇంటర్వూ హాల్లోంచి బయటపడ్డాను. ఇక అప్పటి నుండీ ప్రభుత్వ ఉద్యోగాల జోలికి పోలేదు నేను.
ఆ మరుసటి రోజు మా యింటి ప్రక్కన ఒక పెద్దాయన ఓ నలుగురు యువకులను కూర్చో బెట్టుకుని ఉద్యోగాలు, ఎంట్రెన్స్ పరిక్షల గురించి, లంచగొండితనం గురించి అనర్గళంగా ఉపన్యసిస్తున్నాడు. నేనక్కడికెళ్ళి కూర్చున్నాను. ఆ మాటల మద్యలో ఆయనొక మాటన్నాడు. అదేంటంటే “సెల్ఫ్ ఎంప్లాయ్ మెంట్ ఈజ్ ది బెస్ట్ ఎంప్లాయ్ మెంట్” అని. అంటే స్వంత ఉపాధిని మనకు మనమే కల్పించుకోవడం. అందుకోసం ప్రభుత్వం వారు ఈ నిరుద్యోగాన్ని పారద్రోలటంలో భాగంగా జవహర్ రోజ్ గార్ యోజన, పనికి ఆహర పథకము లాంటి పథకాలను ప్రవేశపేట్టి ఆర్థిక సహాయాన్నందిస్తున్నారు”. అని అందుకు సంబందించిన వివరాలన్నీచెప్పాడు.
మరుసటి రోజు బ్యాంకు కెళ్ళి ఆ పెద్దాయన చెప్పినట్లుగా నా ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్స్ అన్నీసబ్ మిట్ చేసి జవహర్ రోజ్ గార్ యోజన క్రింద ఓ రెండు లక్షల రూపాయలు లోను తీసుకుని ఒక టైప్ ఇన్ స్టిట్యూట్ మరియు కంప్యూటర్ శిక్షణా కేంద్రాన్ని పెట్టాను. దాని ద్వారా ఒక వైపు నేను బ్రతుకుతూ ఇద్దరు ముగ్గురు నిరుద్యోగ యువకులకు బ్రతుకుతెరువు చూపించాను. కాబట్టి నా మాటిని నువ్వు కూడా ఏదో ఒక స్వయం ఉపాధి పధకం కింద లోను తీసుకుని ఏదో ఒక చిన్న తరహా పరిశ్రమ లాంటి నొక దాన్ని స్దాపించి ఒక వైపు నువ్వు బ్రతుకుతూ పది మందికి బ్రతుకు తెరువు చుపించు. అంతకంటే మనం ఈ సమాజానికి చెయాల్సినదేముంటుంది చెప్పు” అని అన్నాడు మిత్రుడు రఘతో.
ఆ మాటలు విన్న రఘు “సరే మిత్రమా! నీ సలహా మేరకు నేను కూడా స్వయం ఉపాధి పధకం క్రింద ప్రభుత్వ ఆర్ధిక సహాయంతో నీవన్నట్లుగ ఒక చిన్న తరహ పరిశ్రమను స్థాపించి నేను బ్రతుకుతూ పది మందికి ఉపాధి అవకాశాల్ని కల్పిస్తాను.
మిత్రమా! ఇంత మంచి సలహ యిచ్చి నాకు జీవితం మీద విరక్తి కలగకుండా నాలో అడుగంటిన ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించినందుకు నీకు నా హృదయపూర్వకమైన కృతఙ్ఞతలు తెలియపరచుకుంటున్నాను. అంతేకాకుండా మనలాంటి మధ్య తరగతి కుటుంబాలలో ఉన్న నిరుద్యోగ యువతీ యువకులకు “అందుబాటులో లేని ప్రభుత్వోద్యోగాల కోసం వెంట బడి అనవసరమైన కాలయాపన, డబ్బు ఖర్చు చేసుకోకుండా “సెల్ఫ్ ఎంప్లాయ్ మెంట్ ఈజ్ ది బెస్ట్ ఎంప్లాయ్ మెంట్” అని మరొకసారి రుజువు చేసి ఆ మార్గంలో నేటి నిరుద్యోగ యువతీ యువకులు నడవడానికి దోహదం చేస్తాను” అని చెప్పి రఘు తన ఇంటి ముఖం పట్టాడు.
_____________o___________