ఆర్ శర్మ దంతుర్తి
రాజు సభలో కూర్చొనుండగా సేవకుడొచ్చి చెప్పేడు, “ఓ పరదేశి మీకు ఏదో వింత వస్తువు చూపించడానికి వచ్చాడు. లోపలకి తీసుకురమ్మని శెలవా?”
రాజు మంత్రికేసి చూసి, ఆయన సరేనన్నాక చెప్పాడు, “సరే, రమ్మను చూద్దాం.”
లోపలకి వచ్చిన పరదేశి, అక్కడే ఉన్న బల్లమీద తన చేతిలోది ఏదో వస్తువు ఉంచాడు. చూడబోతే కోడి గుడ్డు లా ఉంది. గుడ్డు కాదన్నట్టు పైన ఒక చార లాంటిదేదో ఉన్నట్టుంది కూడా. రాజు, మంత్రీ తర్జన భర్జనలు పడి మొత్తానికి అది కోడి గుడ్డు కానీ మరో పక్షి గుడ్డు కానీ కాదని నిర్ధారించుకున్నాక అడిగేరు పరదేశిని, “ఏమిటి విషయం?”
“ఇదేదో మీకు నచ్చుతుందేమో, కొనుక్కుంటారేమో అని అడగడానికి వచ్చాను.”
“ఇదేమిటో తెలియకుండా ఎలా కొనడం?”
“ఇదేమిటో నాకూ తెలియదు, దారిలో దొరికితే తెచ్చాను. మీకు నచ్చితే ఏదో ఒక ధర ఇప్పించండి” తాను దారిలో చిన్నపిల్లలు అడుకుంటూంటే వాళ్ళకో కాసు ఇచ్చి కొన్నట్టు చెప్పకుండా అబద్ధం ఆడేసేడు పరదేశి.
రాజు మంత్రికేసి చూసాడు. మంత్రి మాటాడకపోవడం చూసి రాజే చెప్పాడు, “ఇరవై కంటే ఎక్కువ ఇచ్చేది లేదు.”
పరదేశి అదే భాగ్యమన్నట్టూ డబ్బులు తీసుకుని బయటకెళ్ళిపోయాడు.
* * * * * *
మర్నాడు రాజు సభికులనందర్నీ పిల్చి, తాను కొన్న వస్తువు చూపించి అడిగేడు, “చూసారు కదా దీన్ని? ఇది ఇక్కడ రాజ సభలోనే ఉంచుదామనుకుంటున్నాం అదేమిటో తెలిసేదాకా. మీరందరూ చదువుకున్న వాళ్ళు, అనేక దేశాలు తిరిగి జ్ఞానం సంపాదించిన వాళ్ళు. ఇదేమిటి, ఎక్కడనుంచి వచ్చి ఉండొచ్చు అనే విషయాలు చూసి, చెప్పండి.”
తెలివైన వాళ్ళుగా పరిగణించబడే సభికులందరూ రెండు మూడు రోజులు కిందా పైనా పడ్డారు దీని గురించి. మొత్తానికేమైంతేనేం, ఈ వస్తువేమిటో దాని తలా తోకా అర్ధమై చావలేదు ఎవరికీ. చివరకి రాజు గారికేం చెప్పాలా అనుకుంటూంటే మర్నాడు ఈ వస్తువుంచిన కిటికీ దగ్గిరో పక్షి వాలి దాన్ని ముక్కుతో పొడవడం, అ వస్తువులోంచి ఏదో పిండిలాగా రాలడం కనిపించింది. కాస్త ధైర్యవంతుడు ఆ రాలిన పిండి నోట్లో వేసుకుని చప్పరించాక అప్పుడు తెలిసింది. ఇదో జొన్న గింజ మాత్రమే.
వెంఠనే రాజుగారికి ఆ వార్త చేరేసారు. సభికులు ఎంత ఆశ్చర్యపోయారో రాజూ, మంత్రీ దానికి రెట్టింపు ఆశ్చర్యపోయేరు. నిజంగా జొన్న గింజ ఇంత పెద్దదిగా ఉండడం సాధ్యమేనా? అది తెలుసుకోమని రాజు మరోసారి ఈ సభికులనీ, తెలివైన పండితులనీ పురమాయించాడు.
పుస్తకాల్లో ముక్కలు ముక్కస్య ముక్కార్ధంగా చదివిన పండితులందరూ మరో సారి వాళ్ళ దగ్గిరున్న పుస్తకాల మీద పడ్డారు. ఎన్నాళ్ళు గడిచినా ఏమీ తెలియలేదు. అబద్ధాలు ఆడి పీకలమీదకి తెచ్చుకోవడం కంటే నిజం చెప్పడమే మంచిదనే నిర్ణయానికొచ్చి అందరూ కూడబలుక్కుని రాజు దగ్గిరకెళ్ళి చెప్పారు, “మేము దీని గురించి విపులంగా పరిశోధన చేసాం మా దగ్గిరున్న పుస్తకాలతోటీ, మిగతా వాటితోటీను. ఏమీ తెలియలేదు. ఇటువంటి జొన్న గింజ ఉండదనే మా ఊహ. మా దగ్గిర ఇటువంటివాటికి సమాధానం లేదు.”
“మరెలాగా? ఇంత చదువుకున్న మీకే తెలియదా?” రాజు అడిగేడు. ఈ జొన్న గింజ గురించి రాజుగారి ఉత్సాహం ఏమిటంటే ఇటువంటి జొన్నలు కనక పండితే పది గింజలతో ఒకడి కడుపు నిండిపోతుంది. రాజ్యంలో ఆకలి పోగొట్టడం ఒక్క ఏడాదిలో పని.
రాజు ప్రశ్న కి తెల్లమొహాలు వేసిన పండితులని చూసి మంత్రి సమాధానం చెప్పాడు, “ఇటువంటి జొన్న గింజలు ఒకానొకప్పుడు రైతులు పండించి ఉండొచ్చు – మన దేశంలో గానీ మరోచోట గానీ. దేశంలో ఉండే రైతులని అడిగితే తెలియవచ్చు. వాళ్ళకి తెలియకపోయినా ఆ రైతులు వాళ్ళ తాత ముత్తాతల నుండి ఇటువంటి జొన్న గింజల గురించి విని ఉండవచ్చేమో.”
మంత్రి సలహా ప్రకారం, మర్నాడు దండోరా వేయబడింది రాజ్యంలో – “దేశంలో ఉండే ముసలి రైతులెవరైనా ఇలా కోడి గుడ్డంత జొన్న గింజ గురించి కని/విని ఉంటే ఓ సారి రాజు గారి దగ్గిరకి రావాల్సింది, దీని వివరాలు చెప్పడానికి.”
దండోరా వేసిన కొన్నాళ్ళ దాకా ఎవరూ రాలేదు గానీ చాలా రోజులు పోయాక ఓ ఆసామీ వచ్చాడు. వచ్చినాయనకి వందేళ్ళు ఉండచ్చేమో. నోట్లో పళ్ళు లేవు, నడుము వంగిపోయి, రెండు కర్రల సాయంతో మొత్తానికి ఎలాగోలా కుంటుకుంటూ, నిక్కుతూ, నీలుగుతూ సభలోకి వచ్చాడు.
వయసు ప్రకారం గౌరవం ఇచ్చి రాజు అడిగేడు వచ్చిన ముసలి రైతుని, “తాతా, ఇది జొన్న గింజ అని అనుకుంటున్నాం. ఇటువంటివి ఎక్కడ పండిస్తారో, అసలు అవి మన భూముల్లో పండుతాయో లేదో నీకేమన్నా తెలుసా?”
వచ్చిన ముసలాయన ఈ జొన్న గింజని చూసాడు పది పదిహేను నిముషాలు. కళ్ళు కూడా సరిగ్గా కనిపించవు కాబోలు, దాన్నీ చేత్తో తడిమీ, చుట్టూ తిప్పి చూసి అవస్థ పడ్డాక చెప్పాడు, “ఇటువంటి జొన్నలు నేను ఎప్పుడూ పండించలేదు. నాకు తెల్సినంతలో ఇది ఏవిటో అర్ధం కావట్లేదు కానీ మా నాన్నకి తెలుస్తుందేమో”
ముసలి తాత చెప్పినట్టు తాత తండ్రిని సభలోకి తీసుకొచ్చారు. వింతేవిటంటే తాత నాన్నగారు ఏ కర్రలూ అక్కర్లేకుండానే నిటారుగా నడవగలుగుతున్నాడు. చెవులు కొంచెం వినిపించవు కాబోలు కానీ పెద్దగా మాట్లాడితే చెప్పేది అర్ధం చేసుకోగల్గుతున్నాడు. ఆయన్ని కూడా రాజు ఈ జొన్న గింజ గురించి అడిగేడు, “ఇటువంటి గింజ నీ పొలంలో పండడం ఎప్పుడైనా విన్నావా?”
సమాధానం అనుకున్నట్టే వచ్చింది, “లేదు, ఇటువంటి జొన్న గింజ గురించి విననే లేదు. మా కాలంలో ఎవరి గింజలు వాళ్ళు పండించుకునేవారం. ఎవరి భూమి వారిది. ఎవరికైనా అవసరం అయితే ఒకళ్లకొకళ్ళు ఇచ్చిపుచ్చుకోవడం జరుగుతూండేది. అమ్మడం కొనడం అనేది ఉండేది కాదు ఇప్పటి రోజుల్లోలాగా. అసలు బేరసారాలు గానీ, డబ్బులనేవి కానీ ఉండేవి కాదు. కావాల్సింది పండించుకోవడం, అవతలవాళ్లకి సహాయం చేయడం, ఇవే మాకు తెలిసున్నవి. ఇది మీరు జొన్న గింజ అంటున్నారు కనకా, దీని రుచి బట్టీ చూస్తే జొన్న గింజే అయ్యిండొచ్చు. నేను మాత్రం ఎప్పుడూ ఇటువంటివి పండించలేదు. కానీ మా నాన్నని అడిగి చూడండి. ఆయన కాలంలో గింజల్లోంచి ఎక్కువ పిండి వచ్చేదని అంటూండం నాకు గుర్తు. ఆయనకి తెలిసి ఉండొచ్చేమో.”
సరిగ్గా నడవలేని తాతకి తాత ఇంకా బతికి ఉన్నాడని తెలిసి రాజూ, మంత్రీ మరింత ఆశ్చర్యపోయేరు తాతగారి తండ్రి ఇలా అనేసరికి. అలాగే తాత తాతకి కబురుపెట్టారు. ఈ ముత్తాత గారు పెద్ద ఆర్భాటం లేకుండా సునాయాసంగా నడుచుకుంటూ వచ్చాడు సభలోకి. ఆయనికి కళ్ళూ చెవులూ శుభ్రంగా పనిచేస్తున్నాయి. కాళ్ళు చేతులూ బాగున్నాయి కూడా. కర్రలూ ఏమీ లేకుండా నిటారుగా నడుచుకుంటూ రావడం చూసి ఆ దేహ ధారుఢ్యానికి సభలో అందరూ నోళ్ళు వెళ్లబెట్టారు.
వచ్చిన పెద్దాయన ఈ గింజని చేతిలోకి తీసుకుని గోటితో గీకగా వచ్చిన పిండి నోట్లో వేసుకుని చెప్పాడు, “ఇటువంటి గింజ చూసి చాలా దశాబ్దాలు గడిచాయి. నాకు తెలుసున్నట్టి, మేము సాగు చేసిన జొన్న పంటే ఇది. ఇదెక్కడ దొరికింది మీకు?”
రాజు అడిగాడు, “తాతా ఇటువంటి గింజ మన భూముల్లో పండడం నీకు తెలుసా?”
“ఇది తెలియకేం? మా రోజుల్లో ఇటువంటి గింజ పండని పొలమే ఉండేది కాదు. ఈ జొన్న రుచి చూసి ఎన్నాళ్ళైందో? ఇదే మేము సాగు చేసినది. ఇలాంటి జొన్నలు తింటూనే నేను పెరిగిందీ, పెద్దైనదీను.
“అవునా? ఇది మీరు ఎక్కడైనా కొనుక్కునేవారా పంట వేయడానికి? అలా అయితే ఏ దేశం నుంచి?”
ముసలాయన సమాధానం చెప్పేడు, “మేమే పండించుకునేవారం. మా రోజుల్లో కొనడం అమ్మడం అనేటువంటి పాపాలు లేవు. ఎవరు పంట వేసినా, ఫలం మాత్రం మొత్తం అందరిదీను.”
“మరైతే ఎవరి పొలంలో పండేది ఇటువంటి పంట?”
“పొలం అనేడి ఒకరిదీ అని ఉండేది కాదు ఎందుకంటే భూమి అంతా సమానంగా పంచుకునే వాళ్లం. ఇక్కడే నా భూమి అనేదే లేదు. ఈ చెక్క నాది, ఆ చెక్క నీది అనేదే లేదు. ఎవరికిష్టమైన చోట వాళ్ళు పంటవేసుకోవచ్చు. దేవుడిచ్చిన మొత్తం భూమి అంతా ప్రజలదే. ఎవరికీ దీని విషయంలో కొట్లాటలూ, ఆభిప్రాయభేధాలూ ఉండేవి కాదు. నాది అని చెప్పుకోవడానికి రెక్కల కష్టం ఒక్కటే తప్ప మిగతావన్నీ అందరికీ సంబధించినవిగా ఉండేవి. నేను వేసిన పంటా, పక్కవాడు వేసిన పంటా అనీ, విడివిడిగా అనీ కాక మొత్తం అన్నీ ప్రజలందరూ సంతోషంగా పంచుకునేవారం. అందువల్ల మనుషుల్లో కల్మషం అనేది ఉండేది కాదు.”
సమాధానం విన్న రాజు అడిగేడు, “వింతగా ఉందే. అలా అయితే మరో రెండు ప్రశ్నలకి సమాధానం చెప్పు. మొదటిది, ఇటువంటి గింజలు మీరు పండిచినప్పుడు ఈ విత్తనాలు మా దాకా ఎందుకు రాలేదు? మేము ఇప్పుడు ఎందుకు పండించలేకపోతున్నాం? రెండోది, నీ మనవడికి కళ్ళూ చెవులూ సరిగ్గా పనిచేయవు, నిలబడలేకపోతున్నాడు. నీ కొడుకు నడవగలడు కానీ కళ్లు కనబడినా చెవులు వినపడకపోవడం వంటి ఒకటో రెండో వైకల్యాలు ఉన్నాయి. మరి నువ్వు చూడబోతే జెమాజెట్టీ లాగా అన్ని విధాలా శుభ్రంగా ఉన్నావు? ఇటువంటి మార్పులెలా సంభవం?”
ముసలాయన చిరునవ్వు నవ్వి చెప్పాడు, “ఇటువంటివి ఎలా జరిగాయంటే, ప్రజలందరూ తమ కష్టం మీద ఆధారపడడం మానుకున్నారు. ఎప్పుడైతే అవతలవాడి రెక్కల కష్టం మీద ఆధారపడ్డం మొదలైందో అప్పుడే బద్ధకం మొదలైంది. మా రోజుల్లో ప్రపంచంలో ఉన్నది ఒకే ఒక సూత్రం – భగవంతుడిచ్చిన ఈ ప్రపంచం అందరిదీను. మనుషులందరూ సమానం. మా కున్నదానితో సంతోషంగా ఉండడం ఒకటే మాకు తెలిసినది. ఎప్పుడూ అవతలి వాళ్ల సొమ్ము ఆశించడం గానీ అసలు అటువంటి ఆలోచనలు గానీ ఉండేవి గాదు. ఎప్పుడైతే మనసు ఏ కల్మషం లేకుండా ఉంటుందో అప్పుడు శరీరం ధృఢంగా ఉంటుందనేది తెలిసినదే కదా? అటువంటి శుభ్రమైన మనసూ, దృఢమైన శరీరంతో చేసే కష్టానికి ఇటువంటి గింజలు పండడంలో వింతేమి ఉంది? కానీ ఎప్పుడైతే ప్రజలందరూ స్వంతంగా కష్టపడడం మానేసారో అప్పట్నుండీ మనసుల్లో, పంటల్లో సంకరం ప్రారంభమైంది. దానితో ఇంతటి జొన్న గింజా చిన్నదవడం, మనుషుల్లో రోగాలూ రొచ్చులూ చిన్న వయసునుంచే రావడం మొదలైంది. అందుకే నేను ధృఢంగా ఉన్నాను, మా అబ్బాయి కాస్త బాగున్నా, ఈ తరంలో అందరి లాగానే నా మనవడు అన్ని వైకల్యాలతో ఉన్నాడు.”
నిక్కచ్చిగా తాత చెప్పిన మాటలు విన్న సభలో అందరూ, కాలాణుగుణంగా వచ్చిన మార్పులనీ, తమలో కలిగిన మాలిన్యాలనీ తల్చుకుని ఏమనాలో తెలియక తలలు వంచుకున్నారు.
(A grain as big as hen’s egg – Leo Tolstoy – 1886 – http://www.online-literature.com/tolstoy/2898/)
* * * * * *