కథా భారతి

ఫ్రెంచ్ లీవు

– ఆర్ శర్మ దంతుర్తి

డాక్టర్ ఆఫీసులోంచి బయటకొచ్చి గుమ్మం మెట్లు దిగేడు మూర్తి. మనసంతా చిరాగ్గా ఉంది. ఈ మెడికల్ రిప్రజెంటేటివ్ ఉద్యోగం వచ్చిన అయిదేళ్లలో తనని తన ఏరియా మేనేజరూ ఆ పైన రీజినల్ మేనేజరూ మాటిమాటికీ చంపుకు తినడం తనకి తెలుస్తూనే ఉంది. ఈ ఉద్యోగం అంతే. ఎంత కాళ్ళీడ్చుకు తిరిగినా ఎప్పుడూ అలా తనని దెప్పుతూ ఉంటారు ఇంకా బాగా చేయాలనీ, ఏదో చేయలేదనీ. రెణ్ణెళ్ల కోసారి అలా మీటింగ్ మిషతో ముంబయి లాంటి పెద్ద సిటీలకి తిప్పినా అక్కడ కాన్ఫరెన్స్ రూములో తమకి వేసే అక్షింతలు బయటకి కనపడవు కనక తమకి బాగానే ఉంది జీవితం అనుకుంటూ ఉంటారు మామూలు జనం, కుటుంబాలూను. వేరే ఉద్యోగం వస్తే ఈ దరిద్రం లోంచి తప్పుకోవడానికి ఎవరు సిద్ధంగా లేరు? అంతవరకూ ఎందుగ్గానీ ఇప్పుడే తాను మాట్లాడిన డాక్టర్ ఊర్లో పేరొందిన సర్జన్ గారు. తమ కంపెనీ మందు గురించి ఒక బ్రోషర్ చూపించి చెప్తూంటే ఆయన ప్రశ్న వేసాడు. సర్జన్ గారు ఏమడుగుతాడో ఎలాగరా అనుకున్నాడు తాను ఇక్కడికొచ్చే ముందు, కానీ ఆయన అడిగినదేమిటీ? ఈ బ్రోషర్ అట్టమీద బొమ్మ కోతా? గొరిల్లానా? అని అడుగుతున్నాడు. ఇంతటి చిరాకులోనూ ఫక్కున్న నవ్వొచ్చింది మూర్తికి. ఈ డాక్టర్లకి కూడా తెలుసు తమకి ఏమీ ఆ మందు గురించి తెలియదనీ దాని గురించి తమతో మాట్లాడ్డం అనవసరం అనీను. వాళ్లక్కావాల్సిన సాంపిల్స్ ఇచ్చేసి బయటపడడమే. వారానికో రోజు మొహం చూపించి వాళ్ల పేరు తన రిపోర్ట్ లోరాసుకోవడం తన పని, మేనేజర్ కి పంపించడానికి. తను డాక్టర్ ఆఫీసులోంచి బయటకి రాగానే ఆ బ్రోషర్ కాయితాలు ఏమౌతాయో అందరికీ తెల్సిన విషయమే. ఓ సారి తాను ఇచ్చిన కాయితాల్తో డాక్టర్ గారబ్బాయి రాకెట్లు చెసి ఆడుకోవడం చూసాడు. చేసేదేవుంది?

పక్కనే ఉన్న హోటల్లో దూరి తన బేగ్ పక్కన పెట్టి ఓ కాఫీ ఆర్డరిచ్చిచుట్టూ చూసేడు. ఓ మూలన కూర్చుని ఏవో కాయితాల్తో కుస్తీ పడుతున్నాడు వేరే కంపెనీ లో పనిచేసే తన లాంటి మెడికల్ రిప్రజెంటేటివ్ నారాయణ. చేయి ఓ సారి అటువేపు ఊపి కూర్చున్నాడు. సర్వర్ తెచ్చిన కాఫీ తాగుతూండగానే నారాయణ వచ్చి పలకరించేడు,

“ఏమిటి గురువుగారు సంగతులు? మీ బాసు బాగున్నాడా?” వంకర నవ్వు.

“వాడికేమిటండి, నెత్తిమీద కూర్చుని మనల్ని దెప్పడం తప్ప పనేమీ లేదు కదా?”

“మధ్యాహ్నం ఊర్లోనేనా పని లేకపోతే కేంప్ ఉందా?”

మధ్యాహ్నం అసలు గోకవరం వెళ్లాలనుకున్నాడు మూర్తి కానీ మనసు మార్చుకుని చెప్పేడు, “లేదండి, ఇవాళ ఊర్లోనే మెడికల్ డిస్ట్రిబ్యూటర్
దగ్గిరకెళ్ళాలి. మీరో?”

“నాకు కేంప్ ఉంది అనపర్తి దగ్గిర ఆ చుట్టుపక్కల ఊళ్ళలోనూ కానీ వెళ్ళాలని లేదు. మా ఆవిడ ఏదో పని ఉందని చెప్పింది లెండి. అందువల్ల ఇవాళ సగానికి సగం ఫ్రెంచ్ లీవు,” నవ్వుతూ చెప్పేడు నారాయణ.

మూర్తి తలపంకించి హోటల్లోంచి బయటకొచ్చేడు నారాయణతోటి. ఆ కబురూ ఈ కబురూ అయ్యేక భోజనానికి ఇంటికొచ్చేడు. మధ్యాహ్నం నాలుగు దాకా విశ్రాంతి. ఆ తర్వాత మళ్ళీ రోడ్డుమీదకేళ్ళి మందుల షాపుల్లో ఆర్డర్లు బుక్ చేయాలి. మగతగా నిద్రపడుతుంటే నారాయణ అన్న ప్రెంచ్ లీవ్ సంగతి గుర్తుచ్చింది. పెదాలమీద చిర్నవ్వు విచ్చుకుంది. ఈ వృత్తిలో ఫ్రెంచ్ లీవ్ మామూలే – ఫలానా డాక్టర్ దగ్గిరకెళ్ళానని రాసేయడమే. చుట్టుపక్కన దగ్గ్రిలో రీజినల్ మేనేజర్ కానీ ఆరియా మేనేజర్ కానీ రారని తెలుసున్న రోజుల్లో ఈ ఫ్రెంచ్ లీవ్ అద్భుతంగా పనిచేస్తుంది. ఆ ఆరియా మేనేజర్ కి కావాల్సింది తాను మందులు అమ్మడం; డాక్టర్ల దగ్గిరకెళ్ళినా లేకపోయినా కొంప ములిగింది ఏమీ లేదు కానీ మందుల షాపులు తమ మందు కొనకపోతే ఉద్యోగం పోయినట్టే. అసలీ ఫ్రెంచ్ లీవ్ సంగతి వాళ్లకి తెలియకపోతే కదా? మందులు బాగా అమ్ముడైనంత కాలం వాళ్ళూ పట్టించుకోరు. ఈ ఏరియా మేనేజర్లు మాత్రం ఒకప్పటి రిప్రజెంటేటివ్లు కాదా? వాళ్ళూ ఫ్రెంచ్ లీవ్ వాడుకోలేదా?

సాయింత్రం నారాయణ మళ్ళీ కనిపించేడు బజార్లో వాళ్ళావిడతో ఏదో కొనడానికొచ్చినట్టున్నాడు. ఆవిడ షాపులో ఆవిడ ఏదో బేరం చేస్తూంటే బయటకొచ్చి మూర్తితో కబుర్లు మొదలుపెట్టేడు; అదే పనిలోగా తనకి తెలిసిన మరో ఘనకార్యమూను. మూర్తి నారాయణ చెప్పేది వింటూ ఊ కొడుతున్నాడు. ఇలా ఫీల్డులో ఉన్న వారితో మాట్లాడితే విషయాలు తెలుస్తాయి మంచిదే.

“ఈ రోజు పొద్దున్న మిమ్మల్ని కలిసినప్పుడు చెప్దాం అనుకున్నాను. కానీ కుదర్లేదు. మంచి ఇంటరెస్టింగ్ కధ వింటారా?”

మూర్తి ఆసక్తిగా చూసేడు వినడానికి సిద్ధం అన్నట్టూ.

“మనోహర్ తెలుసా? బీ.ఫార్మ్ చేసి మా కంపెనీలోనే వచ్చేడు చేరడానికి. ఆయనకి సబ్జక్ట్ మీద మంచి పట్టు ఉంది ఎంతైనా ఫార్మసీ కుర్రాడు కదా? ఏరియా మేనేజర్ కీ రీజనల్ మేనేజర్ కీ ఈ కుర్రాడంటే అదో రకమైన హడల్. పని బాగా చేస్తాడనీ ఆవలిస్తే పేగులు లెక్కపెట్టగలడనీను.”

“మనోహర్ తెలుసు చెప్పండి.”

“ఈ మధ్యే మనోహర్ ఓ డాక్టర్ దగ్గిరకెళ్ళి తన కంపెనీ విజిటింగ్ కార్డు నర్స్ చేతికిచ్చి కూర్చున్నాట్ట లోపలకి పిలుస్తారేమోనని. ఎంతకీ పిలవకపోతే
వెళ్ళి మరో సారి నర్స్ ని అడిగేడు ఏమైందో కాస్త కనుక్కుంటారా అని. ఆవిడెళ్ళి డాక్టర్ గార్ని అడిగింది ఇలా ఈ కుర్రాడు బయట మీ గురించి చూస్తున్నాడని. అసలే డాక్టర్ బిజీ గా ఉన్నాడేమో తన దగ్గిర చుట్టూ చూసి చెప్పేడుట, ‘ఆ కార్డ్ ఎక్కడ పోయిందో తెలియదు, మరో కార్డు ఇమ్మనూ అని”

మూర్తి కనుబొమలు పైకెత్తి ఆశ్చర్యంగా చూసాడు నారాయణ కేసి.

బయటకొచ్చి ఈ మాట మనోహర్ తో చెప్పేసరికి ఈయనకి వళ్ళు మండుకొచ్చింది. ‘నర్స్, ఇది ప్రింట్ చేసి పెట్టడానికి మా కంపెనీకి ఒక్కో కార్డుకి పది రూపాయలౌతుంది తెలుసా? మీ డాక్టర్ కి ఇంత నిర్లక్ష్యమా?’ అని ఆవిడతో అన్నాట్ట.”

మూర్తి ఈ సారి కళ్ళు పెద్దవి చేసుకుని చూసేడు.

“ఆ నర్సు గారు ఈ మాట విని లోపలకెళ్ళి డాక్టర్ తో యధాతధంగా చెప్పేసింది. ఆయన అసలే డాక్టర్ గారు. ఈ మనోహర్ లాంటివాళ్ళని రోజుకి పదిమందిని చూస్తూంటాడు కదా? ఆయనకి మంటెక్కింది కాబోలు, ఓ ఇరవై కాయితం తీసి ఇదిగో ‘ఇందులో పది తీసుకుని బయటకి పొమ్మను’ అన్నాట్ట.”

“అదేమిటి? అలా తన స్వంత కార్డు అమ్ముకోవడం కోసమా మనోహర్ డాక్టర్ దగ్గిరకి వెళ్లింది?” మూర్తి నవ్వుతూ అడిగేడు.

“అసలు కధ వినవోయ్ మగడా, ఆ ఇరవై కాయితం చూసి మనవాడికి మరింత మండుకొచ్చింది. అసలే పొద్దున్న నుంచీ వెయిట్ చేయిన టైం అంతా పోయింది. ఇప్పుడేమో పిలుస్తాడనుకుంటే ఇరవై ఇచ్చి పది తీసుకోమంటున్నాడు. జేబులో చేయిపెట్టి మరో కార్డు బయటకి తీసి మనోహర్ – ‘చిల్లరలేదు, మొదట ఇచ్చిన కార్డుకి పదీ ఈ కార్డుకి మరో పదీ లెక్క చూసుకోండి’ అని ఆ ఇరవై కాయితం పట్టుకుని బయటకి వచ్చేసాట్ట.”

పకపకా నవ్వేడు మూర్తి ఆపుకోలేక. నారాయణ కూడా నవ్వుతూ చెప్పేడు, “నన్ను అడిగితే మా బాగా చేసాడండి మనోహర్. లేకపోతే డాక్టర్ కదా అని అంత కావరం పనికిరాదు.”

మూర్తి ఎటూ చెప్పలేకపోయేడు. ఇద్దరిలో ఒకరు సర్దుకుపోయినా బాగా ఉండేదేమో అనిపించింది. “మరి మరో సారి మనోహర్ ఆ డాక్టర్ దగ్గిరకెళ్లగలడా? రీజనల్ మేనేజరో ఏరియా మేనేజరో వెళ్ళి డాక్టర్ని కలిసినప్పుడు ఆయన వీళ్లకి చెప్పడూ ఈ మనోహర్ చేసిన భాగోతం?”

“అవన్నీ అయిపోయాయండి. వాళ్ళు చెప్పారు మనోహర్ తో అంత దూకుడుగా ఉండొద్దని. మనలాంటి వాళ్లం అలా చేస్తే ఉద్యోగం పోతుంది కానీ మనోహర్ కి కాదు. ఆయన ఈ ఏరియాలో మహారాజు. మూణ్ణెల్ల కాన్ఫరెన్స్ లో టెస్ట్ పెడతారు చూడండి, అందులో మనవాడికి ఎప్పుడు 95 కి తగ్గదు స్కోరు. మనోహర్ అంటే రీజినల్ మేనేజర్ దగ్గిర్నుంచి అందరికీ గౌరవం ఉంది. ‘ఆయన డాక్టరైతే నాకేం, నా టైం ఇష్టం వచ్చినట్టు తగలేయొచ్చా?’ అని మొహం మీదే అడిగేడుట మేనేజర్ల నిద్దర్నీ. వాళ్లకేం చేయాలో తెలియక నోరు మూసుకున్నారు.”

నారాయణ వాళ్ళావిడ షాపులోంచి బయటకొచ్చేసరికి ఇద్దరూ కదిలేరు ముందుకి మూర్తికి టాటా చెప్పేసి. నవ్వుకుంటూ మూర్తి తన పని మీద బయల్దేరేడు. ఈ నారాయణ మంచి మాటకారి. తన దగ్గిర్నుంచి మూర్తికి విషయాలు ఇలా తెలుస్తూ ఉంటాయి .

​​మూడు నెలలు గడిచేక మరో సారి కనిపించినప్పుడు నారాయణ చెప్పేడు, తనకి విశాఖపట్నం ట్రాన్స్ఫరైందని. అలా అప్పటికి నారాయణ మూర్తి జీవితంలోంచి నిష్క్రమించేడు.

ఇది జరిగిన ఏడాదికి మూర్తి తన ఉద్యోగం రిజైన్ చేసి కాకినాడ లో కొత్తగా పెట్టిన ఎరువుల కంపెనీలో కెమిస్ట్ గా చేరేడు. రోజూ ఎండనపడి ఊర్లు తిరిగుతూ కాళ్ళీడ్చుకునే దరిద్రం లోంచి వారానికో సారి మారే షిఫ్ట్ పని మొదలైంది. అయితే ఇదే బెటర్ – ఏ మేనేజరూ తన మీద ఎగిరి నోరు జారడు. ఈ ఉద్యోగంలో చేరాక తర్వాత ఐదేళ్లలో ఇల్లూ, పెళ్ళీ, పిల్లలూ అన్నీ ఒక్కోటిగా అమరేయి మూర్తికి. మేనెల చివర్లో ఓ శనివారం అన్నవరం బయల్దేరేడు పెళ్ళాం పిల్లల్తో. దర్శనం అయ్యేక సన్ డయల్ చూస్తున్నప్పుడు పరిచయం ఉన్న మొహం కనిపించింది. ఇంకెవరు నారాయణే! పలకరించేడు. చుట్టూ పిల్లలూ సరంజామా అన్నీ ఉన్నాయి. కాస్త వళ్ళు చేసినట్టున్నాడు.

​మూర్తి ఉద్యోగం వదిలేసి కాకినాడలో చేరాడని తెలిసేక ఆడవాళ్లని వదిలేసి తన కబుర్లు చెప్పేడు అక్కడే మెట్ల మీద కూర్చుని ప్రసాదం తింటూ మూర్తితో నారాయణ, తానిప్పుడు మెడికల్ రిప్రజెంటేటివ్ ఉద్యోగం మానేసాడని.

“అదేం? ఏమైంది?” అడిగేడు మూర్తి.

“ఓ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ కాలేజి పెట్టామండి నేనూ మా బావమరిదీను. డబ్బులు బాగానే వస్తున్నాయి. ఎప్పుడో మర్చిపోయిన పుస్తకాలు తీసి ఆ పాఠాలు నేనూ చెప్తున్నాను అప్పుడప్పుడూ సాయంత్రం పూట.”

“మెడికల్ రిప్రజెంటేటివ్ ఉద్యోగం పొద్దున్న చేసుకుంటూ రెండూ లాగించవచ్చు కదా? విశాఖ అంటే కేంప్ లు ఉండవనుకుంటా?” మూర్తి అడిగేడు యధాలాపంగా ఏదో మాట్లాడాలికదా అని.

“ముందు నేనూ అలాగే అనుకున్నాను లెండి. పోనిద్దురూ, అది పోయింది లెండి.”

“పోయిందా, మానేసారా?”

“మీ దగ్గిర దాపరికం ఎందుకులెండి. పోయిందనే చెప్పాలి.”

మూర్తి కాస్త సాలోచనగా చూసేడు, నారాయణ ఇంకా ఏదైనా చెప్తాడేమో అని.

“ఫ్రెంచ్ లీవ్ కొంప ముంచింది లెండి.”

ఏసారి ఆశ్చర్యపోవడం మూర్తి వంతు అయింది. నారాయణ చెప్పేడు “మా రీజినల్ మేనేజర్ ఓ సారి దిగేడు చెప్పా పెట్టకుండా. దాదాపు ఇంటికొచ్చి ఉన్న పళంగా బయటకి రమ్మన్నాడు. ఇంట్లోంచి బయటకొచ్చాక హోటల్లో కూర్చోపెట్టి చెప్పేడు ఉద్యోగంలోంచి క్రితం వారమే తీసేసినట్టు. ఎందుకని అడిగితే తాను ఫ్రెంచ్ లీవుల సంగతి కనిపెట్టాడని చెప్పేడు. ఇంక మాట్లాడ్డనికేవుంది?”

“ఎలా తెలిసిందంటారు ఆయనకి మీ ఫ్రెంచ్ లీవు సంగతి?” మూర్తి కుతూహలంగా అడిగేడు, “ఎవరైనా మీ వాళ్ళే ఉప్పందించారా?”

“ఎందుకులెండి అవన్నీను ఇప్పుడు.ఈ కంప్యూటర్ కాలేజీలో మూడు రెట్లు జీతం వస్తోంది మునపటికన్నా అయినా మీకు చెప్పడానికేం?”

“మీకు చెప్పాలని ఉంటే చెప్పండి. లేకపోతే అభ్యంతరం లేదు. ఆ తిరుగుడులోంచి బయటకొచ్చారు మీరు కూడా; అదో సంతోషం. ఎవరిచేతా మాట పడక్కర్లేదు.”

“ఎవరూ ఉప్పందించలేదు; ఆ మేజేజరే పట్టుకున్నాడు. నేను ఫ్రెంచ్ లీవ్ కోసం ఓ పది మంది డాక్టర్ల పేర్లు సిద్ధంగా పెట్టుకున్నాను. ఈ యూనివర్సిటీ మూల ఒకడూ ఆ జగదంబా జంక్షన్ మూల ఒకడూ అలాగ ఎంచి. నేను రాసిన ఓ డాక్టర్ అక్కయ్యపాలెంలో ఉంటాడు ఆర్ ఎం పి గారు; ముసలాయనే. . ఆయన్ని అస్తమానూ పెద్ద చూడక్కర్లేదని అలా రాసేస్తూ వచ్చేను ఆయన పేరు పంపించే రిపోర్టుల్లో అప్పుడప్పుడూ. కానీ ఆయన పోయి రెండు నెలలు అయిందిట. నేను చూసుకోలేదు,” నవ్వుతూ చెప్పేడు నారాయణ.

ఒక్కసారిగా వచ్చిన నవ్వుకి తినే సత్యన్నారాయణమూర్తి ప్రసాదం గొంతుక్కి అడ్డం పడి పొలకమారింది మూర్తికి.

***

Leave a Reply

Your email address will not be published. Required fields are marked