కథా భారతి

శామీల నభోగము

-ఆర్. శర్మ దంతుర్తి

మే నెలాఖర్న రోహిణీ కార్తి ఎండలు దంచుతుంటే, తన ఆశ్రమంలో ఏ.సి. గదిలో చుట్టూ శిష్యగణం కూర్చునుండగా మీరోజు న్యూస్ పేపర్ చదువుతున్న యోగీశ్వరుడు ఒకసారి అయిదో పేజీ తిరగేసి ఓ చిన్న న్యూస్ ఐటం చదివాక యధాలాపంగా చిరునవ్వుతో ఆ పేపర్ పక్కన పారేసి ధ్యాన ముద్ర వహించాడు. కిందన నేలమీద కూర్చున్న శిష్యులు వెంట వెంటనే తమలో తాము మాట్లాడుకోవడం ఆపి సర్దుకుని కూర్చున్నారు గురూగారితో పాటు ధ్యానానికి.
కంగారుగా గురువుగారి అంతర్గత శిష్యులు ఆయన పక్కన పారేసిన పేపరూ, అవీ తీసి బయటపారేసి చుట్టూ శుభ్రం చేసారు ధ్యానం చేసుకునే గదిలో. పావుగంట మౌనంగా గడిచేక ఇంకా అందరూ ధ్యానంలో ఉండగానే గురువుగారి గంభీరమైన కంఠం వినిపించింది, “వచ్చేనెల నాలుగో తారీఖునుంచి ఆరో తారీఖులోపు మన హైద్రాబాద్, చుట్టుపక్కల ఊళ్ళలో శామీల నభోగం రాబోతోంది. అది నా అంతర్గత శిష్యులకే కాక మొత్తం అందరిమీదా విస్తరించబోతోంది. అదృష్ఠవంతులైన వాళ్ళు హైద్రాబాద్, ఆ పరిసర ప్రాంతాలకి వెళ్ళి చూసుకోవచ్చు.”
“అది మా తెలంగాణా వాళ్లకేనని అనుకోవచ్చాండి?” రాష్ట్రం వేరు పడిపోయాక్కూడా ఆంధ్రా అంటే తెలంగాణా వాళ్లని దోచుకోవడం మాత్రమే అనుకునే ఒక తెలంగాణా ప్రజా ప్రతినిధి మొహం మాడ్చుకుంటూ అడిగేడు.
గురువుగారు పుట్టిందీ పెరిగిందీ ఉమ్మడి ఆంధ్రాలోనే. ఆయన ఒకే ప్రదేశానికి చెందినవాణ్ణని చెప్తే శిష్యవర్గం తగ్గిపోతుంది కనక “అదేంలేదు, ఎవరైనా హైద్రాబాదు వెళ్ళొచ్చు. ఎవరికి ఎంత ప్రాప్తం ఉంటే అంత దక్కుతుంది.” మళ్ళీ గురువుగారు ధ్యానంలోకి వెళ్ళారు. ఆయనకి ధ్యాన భంగం కలక్కుండా ఉండడం కోసం అందరూ నోరు మూసుకోవాల్సిన పరిస్థితి. ఓ పావుగంట పోయేక అంతసేపు నేలమీద బాసింపీట వేసుకుని కూర్చోలేని అయిదారుగురు బయటకొచ్చారు. ఒకాయన రెండో ఆయనతో మరో ముగ్గురు ఇంకో పక్కనా కబుర్లు మొదలుపెట్టారు.
సడన్ గా ఓ పెద్దమనిషి అడిగేశాడు ఉండబట్టలేక మరొకాయనని, ”ఇప్పుడే గురువుగారు అన్నారు కదా, ఏదో రాబోతోంది అని? శామీల నభోగం అంటే ఏవిటండి?”
శిష్యుల్లో ఎవరికైనా తెలియకపోతే అలా తెలియదని చెప్పడం పరువు తక్కువ కనక ప్రశ్న విన్న పెద్దాయన ఓ చిరునవ్వు నవ్వేడు, “అటువంటివి గురువుగారు విడమర్చి చెప్తారు ఆయనకి తోచినప్పుడు. అప్పటిదాకా మనం మాట్లాడరాదు. అయినా ఓ వారంలో చూడబోతూ రుచులెందుకు?”
ప్రశ్న అడిగిన పెద్దమనిషి రెండు చేతులతోనూ నోరు నొక్కుకున్నాడు. కాసేపటికి ధ్యానం అయిపోయింది. అందరూ వెళ్ళిపోతూంటే తలో అర్టిపండూ ప్రసాదం తీసుకుని అందరూ శెలవు తీసుకున్నారు. అయితే గురువుగారు శామీలనభోగం అంటే ఏమీ చెప్పలేదు ఆరోజు. సరే ఎలాగా ఆయనే చెప్తారు కదా, లేకపోతే వెళ్ళి చూడొచ్చు అనుకుంటూ శిష్య గణం కూడా ఏమీ అడగలేదు.
* * * * *
అనుకున్న జూన్ నాలుగో తారీఖుకి శిష్యులందరూ హైద్రాబాదు చేరుకున్నారు. నాలుగో తారీఖూ, అయుదో తారీఖునా కూడా ఏమీ జరగలేదు కానీ ఆరో తారీఖు రాత్రి హైద్రాబాద్ శివార్లలో ఆకాశం మేఘావృతమై ఉన్నప్పుడు ఏవో చిన్న చిన్న నల్లటి శకలాలు పడడం మొదలైయ్యాయి. అటువంటివి సాధారణంగా ఇళ్ళు కాల్తున్నప్పుడో, లేకపోతే ఈ పోరంబోకు కంపెనీయో అనుమతిలేకుండా టైర్లు తగలేస్తున్నప్పుడో రావడం మామూలే కనక ఎవరూ పట్టించుకోలేదు. కానీ వాటితోపాటు అదోరకమైన వాసనతో తెల్ల తెల్ల శకలాలు కూడా పడ్డాయి. వీటికోసమే హైద్రాబాదు చేరుకున్న గురువుగారి శిష్యులు మాత్రం ఆ ముక్కలు తమ తలలమీద పడేలా చూసుకున్నారు కొంతమంది. అవి తలమీద పడిన వాళ్ళు అదృష్టవంతులగా పరిగణింపబడ్డారు. లేనివాళ్ళు కిందపడిన వాటిని తీసి తమ తలలమీద పెట్టుకున్నారు భక్తితో. ఓ గంట గడిచాక ఆ శకలాల ధాటి ఆగిపోయింది.
గురువుగారు ముందు చెప్పినట్టూ ఇలా జరగడం శిష్య గణానికి విస్మయం కలిగించింది. అయితే గురువుగారు మాత్రం ఎప్పటికీ శామీలనభోగం అంటే ఏమిటో ఎవరికీ చెప్పలేదు. ఈ రోజుల్లో ఎవరికీ నిన్న మాట్లాడింది ఈరోజు గుర్తుండదు కనక ఎవరూ గురువుగార్ని మరోసారి ఇదేమిటో అడగలేదు. అది కాక అసలు గురువుగార్ని అలా అడక్కూడదూ, అడిగే ధైర్యం ఎవరికీ లేదు కదా?
అయితే ఈ పరమానందయ్య శిష్యుల్లో ఓ కుర్రాడికి సందేహం వచ్చి పరిశోధన మొదలుపెట్టాడు. హైద్రాబాదులో తనకి తెలుసున్న ఎవరిని అడిగినా సమాధానం దొరకలేదు. ఇలాక్కాదని తెలుగు యూనివర్సిటీలో ఉండే ఓ ప్రొఫెసర్ గారి పట్టుకుని ఆయన్ని అడిగేడు ఈ శామీలనభోగం సంగతి. కొత్తగా చేరిన ఆ ప్రొఫెసర్ గారు ఈ మధ్యనే తెలుగులో పీ.హెచ్. డీ చేసి వచ్చాడు. అటు హిందువూ కాదు, ముసల్మానూ కాదు, ఏసు ప్రభువు శిష్యుడు కాదు కానీ తనకేమీ మతం మీద నమ్మకం లేదని, నాస్తికుణ్ణని చెప్పుకున్నే కుర్రాడు. వచ్చిన గురువుగారి శిష్యుణ్ణి కూర్చోపెట్టి అసలు విషయం కూపీలాగాడు. ఎవరు ఎప్పుడు ఈ పదప్రయోగం చేసిందీ. ఫలానా గురువుగారు ఇలా ఉవాచ అని తెలియగానీ రెట్టింపు ఉత్సాహంతో పరిశోధన మొదలుపెట్టాడు. అసలే నాస్తికుడు కదా?
కాసేపు కుస్తీ పట్టి ఈ శామీలనభోగం సంగతి చూసాడు. శామీలము అంటే బూడిద. నభోగం అంటే వర్షం అని తెలిసింది యూనివర్సిటీలో ఉన్న చిరిగిపోతున్న ఏదో నిఘంటువు చూస్తే. అలా తెలిసింది ఏమిటంటే శామీలనభోగం అంటే “బూడిద వర్షం.” అలా “హైద్రాబాదులో కింద పడిన బూడిదకి పేరు సరిపోయింది, హమ్మయ్య ఓ పనైపోయింది” అనుకుంటూ శిష్యుడూ ప్రొఫెసర్ గారూ చేతులు దులుపుకున్నారు. అయితే ఈ బూడిదవర్షం గురువుగారికు ముందు ఎలా తెలిసిందో ఎవరికీ అంతు బట్టలేదు. ఆయనకి ధ్యానంలో కనిపించి ఉండొచ్చని కొంతమంది అంటే నిజమని మిగతా వాళ్లనుకున్నారు. మరో సందర్భంలో గురువుగారు ఈ బూడిద తాను చేసిన ప్రార్ధన ఆలకించి, తన శిష్యులకోసం మాత్రమే ఆకాశం నుంచి భగవంతుడు కిందకి రాల్చాడనీ చెప్పుకున్నాడు చాలాకాలం. అదే అందరూ నమ్మారు కూడా.
అయిఈ శామీలనభోగం గురించి చెప్పకముందు గురువుగారు మీరోజు పేపర్ అయిదో పేజీలో చదివిన ఈ చిన్న అయుదు లైన్ల వార్త మాత్రం ఎవరికీ గుర్తురాలేదు.
“జూన్ నాలుగైదు తారీఖులలో చైనావారు కొన్నేళ్ళ క్రితం ప్రయోగించిన ఒక ఉపగ్రహం కాలం చెల్లిపోయి భూమ్మీదకి పడబోతోంది. అయితే దీని వల్ల ఎవరికీ ఎటువంటి ప్రమాదం సంభవించదని నాసా వారు చెప్తున్నారు ఎందుకంటే కిందకి పడేటప్పుడు రాపిడికి అది మండిపోయి, దాని తాలూకు శకలాలు బూడిదగా హైద్రాబాద్, పరిసర ప్రాంతాలలో పడవచ్చు. ఏదైనా ఉపగ్రహం కాలం చెల్లిపోయాక ఇలా పడడం సర్వ సాధారణం.”

***

Leave a Reply

Your email address will not be published. Required fields are marked