వీక్షణం 68 వ సమావేశం కాలిఫోర్నియాలోని ప్లెసంటన్ లో శ్రీ వేమూరి వెంకటేశ్వర్రావు గారింట్లో జరిగింది.
శ్రీ సి.బి.రావు గారు అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో ముందుగా కాళీ పట్నం రామారావు గారి “యజ్ఞం” కథ మీద సుదీర్ఘమైన చర్చా కార్యక్రమం జరిగింది.
ఇందులో సభలోని వారంతా ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ముందుగా ఈ కథ గురించి సి. ఎస్. రావు గారు రాసిన ఈ- మాట లోని పరిశీలనా వ్యాసం లోని కొన్ని భాగాలను యథాతథంగా తెలియజేస్తూ ఈ చర్చలో కథ ను, కథా సందర్భాన్ని సూక్ష్మంగా డా||కె.గీత వివరించారు.
“కథావేదిక సుందరపాలెం అనే గ్రామం. కథావిషయం అప్పల్రాముడి కుటుంబం గోపన్నకి బాకీగా ఉన్న అప్పుకు సంబంధించి, దేవాలయం దగ్గరి ధర్మమండపం పంచాయితీ వేదికగా జరుగుతున్న సమావేశంలో పడే తర్జన భర్జనలు. మండపానికి చుట్టూరా, వీధికి ఆ చివరి నుండి ఈ చివరి దనుకా హాజరై కూర్చున్న జనంలో మనం కలిసి పోతాము.
సంక్షిప్తంగా కథ: దశాబ్దాల క్రింద తాను మధ్యవయస్కుడుగా ఉన్నప్పుడు, గోపన్న వర్తకునిగా ఎదిగి స్థిరపడక పూర్వం, అప్పల్రాముడు తన వ్యవసాయ పంటలను అప్పుడే దళారి వ్యాపారిగా జీవితం ప్రారంభించిన గోపన్నకు ఆయన చెప్పిన ధరలకు మారుమాట్లాడకుండా అమ్ముతుండేవాడు. అయిదారు సంవత్సరాలలోనే గోపన్న అంచెలంచెలుగా ఎదిగాడు; అప్పల్రాముడి ఆర్థిక పరిస్థితి మాత్రం క్రమక్రమంగా దిగజారింది. గోపన్న దగ్గర తీసుకున్న కొద్ది అప్పు తడిసి మోపెడయింది. తనకున్న పొలం క్రమక్రమంగా తరిగిపోయి ఇప్పుడు కాసింత మాత్రమే మిగిలింది. గోపన్న అప్పు తీర్చాలంటే ఆ కాసింత అమ్మాలి. అది అమ్మితే తనకు, తన కొడుకులకు, మనవలకు బువ్వ లేనట్లే. బానిస బతుకులు బతకాలి. గోపన్న పరిస్థితి కూడా పెద్ద వర్తకుల పోటీ తట్టుకోలేక పోవటం వలన చితికిపోయింది.
ఇప్పుడు పంచాయితీలో తేల్చవలసిన విషయాలు ఒకటి – అది అప్పా, కాదా? రెండు – దానిలో ధర్మమెంత, అధర్మమెంత? మూడు – తీర్చవలసి వస్తే ఎంత ఇస్తే సరిపోతుంది?
శ్రీరాములు నాయుడు ఊరిలో పెద్ద మనిషి. ఊర్లో వారి తగాదాలు అతనే పరిష్కరించేది. శ్రీరాములు నాయుడు ఎంతో గుంజాటనకు లోనై ఇది అప్పే అని తీర్పు చెప్పాడు. అప్పల్రాముడికి కోపం వచ్చింది. అయినా కోపం దిగమింగుకుని ఆయన తీర్పులోని అసంగతాన్ని వివరించాడు. ఆ ‘కాసింత నేల’ అమ్మి అప్పు తీరుస్తానన్నాడు. కానీ, అప్పల్రాముడి రెండవ కొడుకు సీతారాముడికి ఇది ససేమిరా ఇష్టం లేదు. బ్రతికినంతకాలం చాకిరీ చేసి గోపన్న అప్పు తీరుస్తాను కానీ, నోటికాడి ఆ కాసింత పొలం అమ్మటానికి వీలు లేదన్నాడు. అమ్మితే తండ్రిని చంపి తానూ చస్తానన్నాడు. అయినా అప్పల్రాముడు తన మాటకు కట్టుబడి, అమ్మకం పత్రం మీద నిశానీ పెట్టి, కొడుకుల చేత, మనవళ్ళ చేత నిశానీ వేయించాడు. సీతారాముడి కళ్ళు చండ్రనిప్పు లయినాయి. ఇంటివైపు పరిగెత్తాడు. జనంలో కలకలం పెరిగింది. సీతారాముడికి తనకున్న ఒక్కగానొక్క కొడుకు కంబారీగా ఉండటం ఇష్టం లేదు. ఆ చిన్నవాడ్ని నరికి గోతంలో వేసుకుని ధర్మ మండపం ముందు దభాలున పడవేశాడు. ఈ అకృత్యంతో కథ ముగుస్తుంది.
‘రచయిత అవగాహనలో లోపాలు‘ అనే శీర్షికతో కాళీపట్నం రామారావుగారి యజ్ఞం కథ మీద వ్రాసిన వ్యాసంలో రంగనాయకమ్మగారు తర్కబద్ధంగా వారి విమర్శనాంశాలను వివరించారు. రంగనాయకమ్మగారు పరిశీలించిన ప్రధానాంశాలు:
*వ్యవసాయ రంగంలో వ్యాపార పంటలప్రవేశం
*శ్రీరాములు నాయుడి పాత్ర
*అప్పలరాముని అప్పు స్వభావం
కథ ముగింపు
1. వ్యవసాయరంగంలో వ్యాపార పంటల ప్రవేశాన్ని గురించి అంత విపులంగా చర్చించ వలసినంత ప్రాధాన్యత వాటికి కథ బాగోగులను బేరీజు వేయడంలో అవసరమా అని సందేహం వస్తుంది. దానిలో ఎక్కువ భాగం సాహిత్య విమర్శ క్రిందికి వస్తుందా అని అనుమానం కలుగుతుంది.
2. శ్రీరాములు నాయుడి పాత్రలో పెద్దగా వైరుధ్యాలున్నట్లు పాఠకులకనిపిస్తుందని నేననుకోను.
రచయిత చిత్రించిన పాత్రల స్వరూప స్వభావాలు ఒక క్రమంలోనే నడిచాయి. శ్రీరాములు నాయుడు మృదు స్వభావి, విద్యావంతుడు, ఊరికి మంచి చేద్దామనుకునే స్వభావం కలవాడు. న్యాయంగా తీర్పు చెప్పాలనే ప్రయత్నం చేసేవాడు. గోపన్నకు అప్పల్రాముడు అప్పు పడి వున్నాడనే ఆఖరుకు శ్రీరాములు నాయుడు తీర్పు చెప్పి, అప్పటి అప్పల్రాముడి ఆర్ధిక దుస్థితి దృష్ట్యా తాను అప్పు తీరుస్తానని చెప్పడం అప్పల్రాముడికి అవమానం అనిపించింది, కోపం తెప్పించింది. ఎక్కడా తొణకని, బెణకని అప్పల్రాముడు సహనం కోల్పోయి శ్రీరాములు నాయుడ్ని చాప కింద నీరు లాంటి వాడని, ఆయన కొట్టిన దెబ్బ అది తగిలిన చోట కాక మరోచోట బాధిస్తుందని విమర్శిస్తాడు. ఈ ఒక్కచోట తప్ప రచయిత తన మాటగా కాని, వేరే పాత్రలు కాని (సీతారాముడు మినహా) ఆయననెవరూ తప్పుబడుతూ మాట అన్నట్లు కనబడదు.
శ్రీరాములు నాయుడు గాంధీగారి తాత్విక చింతనతో ప్రభావితుడైతే మనం తప్పు బట్టవలసిన అవసరమేముంది? శ్రీరాములు నాయుడు గాంధేయవాది కనకే “పవిత్రమైన సేవా భావంతో అంత గొప్ప యజ్ఞం (గ్రామాభివృద్ధి) సాధించడం చెయ్యగలిగా”డని రచయిత భావమైతే ఆ భావం కలిగి ఉండే స్వాతంత్ర్యం, హక్కు ఆయనకుండటంలో తప్పు లేదు కదా! ఏ రచయితకైనా ఏవో భావాలు ఉండబట్టే కదా వాటి ననుసరించి రచనలు చేయడం. రంగనాయకమ్మగారు శ్రీరాములు నాయుడి పాత్రను గురించి చేసిన విమర్శలో “అతను గాంధి వాదం ఎడల విశ్వాసం ఉన్న ఆదర్శ నాయకుడుగానూ, ఇంకోపక్క అతను మోతుబరుల కొమ్ముకాసే కపటి గానూ కనిపిస్తా”డని వెల్చేరు నారాయణ రావుగారు చెబుతారు. కథలో ఎక్కడా అతను మోతుబరుల కొమ్ము కాసే కపటిగా కనిపించినట్లు అనిపించదే.
రామారావుగారు వర్గ వైరుధ్యాన్ని స్పష్టంగా చూపించలేదని రంగనాయకమ్మగారి వాదం. కారణం బాకీ ఉన్న అప్పలరాముడు, అప్పిచ్చిన గోపన్న, ఇద్దరూ బీదవాళ్ళే. వారిలో ఎవరూ దోపిడీ మనస్తత్వం కలవారు కాదు. వర్గ వైరుధ్యాల్ని ప్రవేశపెట్టకుండా కథలు వ్రాయడానికి వీలు లేదా? మనం చూసే నిజ జీవితంలో కూడా ఇద్దరు బీదవాళ్ళ మధ్య బాకీ తగవులు ఉండటం గమనిస్తాం. ఒక బీదవాడు ఇంకొంచెం మెరుగైన ఆర్థిక స్థితి ఉన్న బీదవాని దగ్గర వడ్డీకి ఋణం తీసుకోవడం మామూలుగా జరిగే పని. పైపెచ్చు కొంచెం ఎక్కువ వడ్డీకి కూడా. ఇద్దరూ పూరి గుడిసెలలో ఉండే వారే. వారిద్దరి మధ్య వర్గ వైరుధ్యాలు లేకపోయినంత మాత్రాన వారి స్వభావాలకు తగిన పాత్ర చిత్రణతో కథ వ్రాయటానికి వీలు లేదా? మార్క్సిస్ట్ తాత్విక దృష్టితో చూసినపుడు కాకపోయినా, వీరి మధ్య వర్గ వైరుధ్యాలు లేకపోయినా, సంఘర్షణలు తప్పని సరి. అప్పిచ్చిన వారి మధ్య తీసుకున్న వారి మధ్య కూడా సంఘర్షణలు అనివార్యం. వాటిని చిత్రిస్తూ కథలు వ్రాయడానికి వీలు లేదా?
3. గోపన్న అప్పల్రాముడి మధ్య ఉన్న అప్పు స్వభావం.
గోపన్న దళారి వర్తకం ప్రారంభించిన నాటి నుండి అప్పల్రాముడు తన పంటల నతనికే అమ్మేవాడు. గోపన్న చెప్పిన ధరలను గానీ, అతని తూకాలను గానీ అప్పల్రాముడు ఎప్పుడూ శంకించే వాడు కాదు. కొన్ని సంవత్సరాలుగా వారిద్దరి మధ్య బేరసారాలు సాగాయి. తనకున్న ఆరెకరాలను అప్పల్రాముడు తొమ్మిదెకరాలు చేయగలిగాడు. గోపన్న దళారీ వ్యాపారంలో ఎదిగాడు. వాణిజ్య పంటల ధరల అస్థిరత్వం వలన రైతులు దెబ్బ తిన్నారు. అప్పలరాముడి భూమి క్రమక్రమంగా తరగ నారంభించింది. గోపన్న స్థితి క్రమక్రమంగా మెరుగు పడింది. కానీ అచిర కాలంలోనే పెద్ద వర్తకుల పోటీకి తట్టుకోలేని గోపన్న స్థితి కూడా క్రమక్రమంగా దిగజారింది. ఆ కాలంలో గోపన్న దగ్గర అప్పల్రాముడు అప్పుడప్పుడూ తీసుకున్న అప్పులన్నీ కలిపి రెండువేల రూపాయలయినట్లు లెక్కలు తేల్చారు. వడ్డీతో రెండువేల అయిదొందల రూపాయలయింది. నోటు కాలపరిమితి అయిపోతుండగా అప్పు తీర్చటానికి మరి కొంత వ్యవధి కావాలంటే శ్రీరాములు నాయుడు పంచాయితీ తీర్పు ద్వారా అప్పల రామునికి మరి మూడు సంవత్సరాల వ్యవధి ఇవ్వడం జరిగింది. వడ్డీ కూడా గవర్నమెంటు రేటుకి తగ్గాలన్నాడు శ్రీరాములు నాయుడు. ఇప్పుడు ఆ వ్యవధి కూడా అయిపొయింది. ఇక బాకీ తీర్చాలి. ఒకప్పుడు తొమ్మిదెకరాలున్న అప్పల్రాముని కిప్పుడు రెండెకరాల ఇరవై సెంట్లు మాత్రమే ఉంది. గంపెడంత సంసారం. గోపన్న పరిస్థితి కూడా తారుమారై చితికిపోయి కొడుకులు కడుపు చేతబట్టుకుని తలా ఒక దిక్కు పోగా కూతురుతో బ్రతుకు వెళ్లదీస్తున్నాడు. ప్రస్తుతపు తీర్పులో అది అప్పే అన్నాడు శ్రీరాములు నాయుడు. వాస్తవానికి అది అప్పు ఎలా కాక పోతుంది? అది తీర్చవలసిందే. కాకపోతే వడ్డీ తగ్గించవచ్చు. సులభవాయిదాలలో తీర్చే అవకాశం ఇవ్వవచ్చు. వారిద్దరి ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఇది సరియైన తీర్పుగా తోస్తుంది. అప్పల్రామునికి భూమి అమ్మే పరిస్థితి కల్పించగూడదు. శ్రీరాములు నాయుడు అలా తీర్పు ఇచ్చి వుంటే బావుండేది. కాళీపట్నం రామారావుగారు పాత్రోచితంగా కథావసరాలను పాటిస్తూ అలా వ్రాసి ఉంటే బావుండేది.
4. కథ ముగింపు.
కథ బలహీనత, రామారావుగారి అవగాహనా లోపం ప్రబలంగా కథ ముగింపులో ఉంది. ఇది ఏ రకంగా సమంజసమైన ముగింపు అని రామారావుగారికి అనిపించిందో అర్ధం కాదు. తండ్రి భూమి అమ్మి గోపన్నకు బాకీ తీర్చడం ఇష్టం లేని సీతారాముడు తండ్రిని దూషించి, మెలోడ్రమటిక్‌గా ఇంటికి పరిగెట్టికెళ్ళి భూమి లేని కంబారీగా తన కొడుకు ఉండటానికి వీల్లేదని వీరావేశంతో ఊగిపోతూ కొడుకుని అడుగుతాడు “అరె!నువ్వు కంబారీగా బ్రతుకుతావా లేదా చచ్చిపోతావా” అని. ఆ చిన్నవాడు చచ్చిపోవటానికి పరుగెట్టుకొస్తాడు. ఇది చాలా అసంగతమైన మెలోడ్రామా, అన్‌కన్విన్సింగ్ ఐడియలైజేషన్. కొడుకంటే వాడు, తండ్రంటే తానన్నట్లు మాట్లాడతాడు. మానవీయత దృష్ట్యా చూసినపుడు ఈ పెద్దోళ్ళ తగాదాకు పరిష్కారంగా ముక్కు పచ్చలారని బాలుడిని దారుణంగా వధించటం అమానుషం, మహా ఘోరమైన అకృత్యం. తండ్రిగా పుత్రప్రేమ లేనివారు ఎవరూ ఉండరు. అభం, శుభం తెలియని, అయిదారేళ్ళయినా నిండని అర్భకుడిని, తన తనయుడిని వాడికే మాత్రం సంబంధం లేకపోయినా నిర్దయగా నరకటానికి ఆ తండ్రికి చేతులెలా వచ్చాయో, రచయితకు దీనిని కథకు ముగింపుగా వాడుకోవాలనే హృదయ కాఠిన్యం ఎలా వచ్చిందో అర్ధం కాదు.”
ఈ చర్చలో ముందుగా శ్రీమతి రమణ ఈ కథలో చివరి సన్నివేశాన్ని గురించి ప్రతిస్పందిస్తూ , “పెద్దవాళ్ల లావాదేవీల్లో చిన్న పిల్లల్ని బలివ్వటం అసమంజసమని” అన్నారు. శ్రీమతి ఆర్. దమయంతి, శ్రీమతి రాధాకుమారిఆమెను సమర్థించారు. దానికి సమాధానంగా శ్రీ చుక్కా శ్రీనివాస్ “ఈ కథను అన్యాయానికి గురవుతున్న అట్టడుగు వర్గాల జీవితాల్లో మారే జీవన సమీకరణాల నేపథ్యంలో అర్థం చేసుకోవాలని అన్నారు. తండ్రి మరో మార్గంలేని విధి లేని పరిస్థితులలో కొడుకును చంపుకోవాల్సి వచ్చిందని, కొడుకు బానిసగా బతకడం కంటే చావే మేలని భావించాడని అంటూ కథ లోను ఇతర అంశాలను సోదాహరణంగా వివరించారు. శ్రీ శివ చరణ్ ఆయనను సమర్థిస్తూ కథను, కథా సందర్భాన్ని ఉద్దేశించి మాట్లాడారు. శ్రీ చెన్నకేశవ రెడ్డి, శ్రీ లెనిన్ లతో పాటూ ఇతరులంతా ఎంతో ఉత్సాహంగా పాల్గొన్న ఈ చర్చ దాదాపు గంట సేపు కొనసాగింది.
తరువాత శ్రీమతి రమణ అమెరికా పర్యటన సందర్భంగా ఇటీవల తను రాసిన రెండు మూడు మ్యూజింగ్స్ చదివి అందరినీ అలరించారు.
తరువాత జరిగిన కవి సమ్మేళనం, పాటల కార్యక్రమం లో డా|| కె.గీత, శ్రీమతి ఆర్ దమయంతి తదితరులు పాల్గొన్నారు.
శ్రీ వేమూరి 68 సమావేశాల వీక్షణం ప్రస్థానాన్ని కొనియాడుతూ మొదటి సభ తమ ఇంటి లోనే ప్రారంభం కావడాన్ని గుర్తు చేసుకున్నారు. తనకు ఇష్టమైన ఆంగ్ల కథల్ని సభకు పరిచయం చేశారు.
“కథా పఠనం” కార్యక్రమంలో శ్రీమతి ఆర్ దమయంతి పురస్కారం పొందిన స్వీయ కథను చదివి వినిపించారు.
ఆద్యంతం రసవత్తరంగా జరిగిన ఈ కార్యక్రమంలో శ్రీమతి రాధాకుమారి, శ్రీమతి ఉమ, శ్రీమతి రమణమ్మ, శ్రీ శివచరణ్, శ్రీ శ్రీనివాస్, శ్రీ సిబిరావు, శ్రీమతి రమణ, శ్రీమతి గీతామాధవి, శ్రీ లెనిన్ , శ్రీ చెన్నకేశవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
***