అర్చన ఆర్ట్స్ అకాడెమీ (హ్యూస్టన్), శ్రీ శారదా సత్యనారాయణ మెమోరియల్ ఛారిటబుల్ సొసైటీ, సంయుక్త కథల పోటీ 2019
-యర్రమిల్లి విజయలక్ష్మి
ద్వితీయ బహుమతి పొందిన కథ
హాల్లో నా ఎదురుగా గోడమీద ఎత్తున ఇనుప తీగకు బిగించిన మా తాతగారి నిలువెత్తు తైల చిత్రం వ్రేలాడుతోంది. పక్కనే మా మామ్మది. ఇంకా ఎవరెవరో పూర్వీకులు, కుటుంబ సభ్యుల ఫోటోలు, దేవుళ్ళ ఫోటోలు తగిలించి ఉన్నాయి. వాటిని చూస్తుంటే నేను పరిష్కరించవలసిన ఇంటి సమస్య గుర్తుకొచ్చింది. దాదాపు వంద సంవత్సరాల క్రితం మా తాతగారు కట్టించిన ఇల్లది. మా తాతగారికి ఇద్దరు మగ సంతానం. మా నాన్న, గోవిందు నాన్న. చిన్నతనంలోనే తల్లినీ, తండ్రినీ పోగొట్టుకున్నాడు గోవిందు. మా తాతగారు అయన తరువాత మా అమ్మ, నాన్న వాడ్ని మాతోనే పెంచారు. చాలా తింగరి తింగరిగా ఉండేవాడు. చదువు వంటపట్టలేదు. ఎప్పుడూ ఊరిమీద తిరుగుతూ ఎవరికే సాయం కావాల్సినా చేస్తుండేవాడు. కన్నవాళ్ళు లేకపోవటం వల్ల అందరూ అవిటోడని, తింగరోడని జాలిగా, దయగా చూసేవారే కాని, వాడి భవిష్యత్ గురించి ఎవరూ ఆలోచించ లేకపోయారు. నేను అష్టావక్రుడని ఏడిపించేవాడ్ని. తరువాత మేనమామ కూతుర్నిచ్చి చేసి తన చేతిక్రింద ఉంచుకున్నాడు. ఒక ఇంటి వాడయ్యాక ఇక వాడి బాధ్యత తీరిపోయిందనుకున్నాం. కాలక్రమంలో చదువు కోసమని, ఉద్యోగాల కోసమని మా కుటుంబం అంచలంచలుగా నగరాలకి తరలిపోయింది. మా తాతగారు పోయినప్పుడు కొంతకాలం మేమాఇల్లు వదిలేయాలన్నారు. అప్పటికే మా నాన్న నగరంలో వ్యాపారంలో స్థిరపడిపోయారు. తమ్ముడి కొడుక్కి కొంపా, గోడూ లేదు కనుక ఇంట్లో దీపమన్నా పెడతాడని వాళ్ళని ఉండమన్నారు. గోవిందు మా ఇంటినీ, ఊరినీ అంటి పెట్టుకొని ‘స్థాపయామి పూజయామి’ అన్నట్లు అతుక్కుపోయాడు. నా ఆలోచన వెనక, ముందుగా సాగుతోంది. ఇల్లు పాడుపడిపోయింది. స్థలానికి తప్ప ఇంటికేమీ విలువుండదు. నగరంలో అంతా అపార్టుమెంటు కల్చర్! కోట్లు ఉన్నా గజం స్థలం దొరకని పరిస్థితి. ఇటీవల కొంతకాలంగా నా ఆలోచన ఈ ఇంటిమీదే! మంచి బేరం చూసుకుని అమ్మేసి మీరెక్కడన్నా ఒబ్బిడి చేసుకోవాలని.
లా మొత్తానికి వదిలెయ్యటం తెలివితక్కువ తనమనిపిస్తోంది. వెయ్యి గజాల స్థలం. కావాలంటే గోవిందుకో రెండొందల గజాలు ఇవ్వొచ్చు! పిత్రార్జితం. రేపు నా పిల్లలకి జవాబు చెప్పాలిగా! వచ్చింది గోవిందు కూతురి పెళ్ళికోసమే అయినా నా ఆలోచనంతా ఇంటిమీదే.
‘పిచ్చి సన్నాసి.. ఏ కళనున్నాడో మర్యాద కాపాడాడు. ఆడ పిల్లంటే ఇంటిపట్టున ఏదో పెట్టింది తిని గడిపేసుకుంటారు. వారసుడు.. మగపిల్లాడంటే అలా ఉండగలడా చెప్పండి. వీడీడు పిల్లలందరూ పెద్ద చదువుకనీ, ఉద్యోగాకాలనీ పట్నం వెళ్ళిపోయారు. వీడొక్కడే ఇల్లా గుడిపాములా.. పోనీ తెలివిలేనివాడా అంటే ప్రతి తరగతిలోనూ ఫస్టే. కంప్యూటర్ శిక్షణకని ఆర్నెళ్ళు హైదరాబాద్ వెళ్ళాలని…! ససేమిరా.. ఊళ్ళో సూపర్ బజారు పెట్టారు. డిగ్రీ ఉంటే మేనేజర్ పని ఇస్తామన్నారు. చేసుకోమని ఈయనగారు. ఇద్దరికీ చుక్కెదురు. మరిదిగారూ! మీరే ఏదో ఉపాయం ఆలోచించాలి. పిల్లాడికో దారి చూపించాలి’. ఉండుండి ఆ ఇల్లాలు తనగోడు వెళ్ళబోసుకుంటోంది. అదుపు తప్పిపోతున్న తన కొడుకునీ, అసమర్థుడైన పెనిమిటినీ మంత్రం వేసి దారిలో పెట్టేస్తానని ఆశలాగుంది! అమాయకురాలు.. మా అష్టావక్రుడి జీవితం ఎంత అస్తవ్యస్తంగా ఉందో అర్థమౌతోంది.
సాయంత్రం కేశవతో ఊరంతా తిరిగాను. ఏ అభివృద్ధీ లేదు. దుమ్ముకొట్టేకొని పోయిన పాత గ్రామమే! ఏమీ మార్పులేదు. అప్పటికీ, ఇప్పటికీ ఒక్క తేడా మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ముసలి, ముతక, కాయకష్టం చేసుకు బతికే కూలిజనం, రైతులు, లేబరు మనుష్యులు.. మా వాడిలాటి చెల్లని వాళ్ళు తప్ప నాగరికులే లేరు. యువకులసలే లేరు. ఊరంతా వసపోయినట్టుంది. పెద్ద పెద్ద భవంతులు కొన్ని తుప్పు తాళం కప్పులు వేలాడుతూ పాడుపడి ఉన్నాయి. మంచి స్కూలు కాని, హాస్పిటల్ కాని లేదు. రోడ్ల సంగతి సరేసరి. ప్రతీ అవసరానికి 25 కి.మీ. ఎర్ర బస్సులో సిటీకి వెళ్ళాలి. రోడ్లు, తాగునీరు విద్యుత్ లాంటి కనీస అవసరాలు కూడా అంతంత మాత్రమే! అమ్ముకు పోవాలనుకునేవారున్నారు. కొనేవాడే లేడు. అద్దెకు వచ్చేవాళ్ళు కూడాలేరు. ఇంటి గురించిన నా ఆలోచన అసమంజసమని అర్థమైంది.
తెల్లారేసరికి ఇల్లంతా పెళ్ళికళతో సందడించిపోతోంది. ఇంటిముందు పచ్చని పచ్చి తాటాకు పందిరిలోంచి సన్నాయి మేళం వినిపిస్తోంది. గుమ్మాలకు మామిడి తోరణాలు, బంతిపూల మాలలు… పెళ్ళివారి ఇల్లు వచ్చే పోయేవారితో హడావుడిగా ఉంది. పదిమంది ఆడవాళ్ళు, మగవాళ్ళు సరదా కబుర్లు చెప్పుకుంటూ పెళ్ళిపనులు చక్కబెడుతున్నారు. గోవిందు తనే నా కోసం కాఫీ తీసుకొచ్చి సంబరంగా చిన్నపిల్లాడిలా నవ్వుతూ ‘రాత్రికేగా పరమేశ్వరి పెళ్ళి… అదే హడావుడి’ అన్నాడు.
‘మీరొచ్చారు బాగుంది. చెల్లీ, పిల్లలు కూడా వస్తే ఎంతో బాగుండేది మరిదిగారూ!’ అంది కామేశ్వరి హడావుడి పడుతూనే. ‘పోనీలేరా… నువ్వొచ్చావు… అది చాలు! నువ్వే కాదు… ఇప్పుడు మన కుటుంబాలు మొత్తం తాతయ్య, మామ్మ, మీ అమ్మ, నాన్న, మా అమ్మ, నాన్న మొత్తం మనవాళ్ళందర్నీ నీలో చూస్తున్నాను. అందరూ నీ రూపంలో వచ్చి నా కూతుర్ని దీవిస్తున్నారు’ అన్నాడు చమర్చిన కళ్ళతో నన్నే తనివితీరా చూస్తూ ఆర్తిగా. ‘నాన్నా జగ్గూ బబాయ్ పిలుస్తున్నారు… అవతల పెళ్ళివారొచ్చేస్తున్నారు. ఇంకా ఇంట్లో ఏం చేస్తున్నాడని అరుస్తున్నాడు’ అంది బాల పరుగెత్తికొచ్చి. ‘పద’ నేనూ వాడితోపాటు బయల్దేరాను. మగపెళ్ళివారికి సీతారామస్వామి వారి ఆలయం పక్క వీధిలోనే విడిది ఏర్పాటు చేసారు. చెల్లెలి పెళ్ళి వేడుకల్లో తమునకలుగా ఉన్నాడు కేశవ్, కొత్త లాల్చీ పైజామా వేసుకొని పెళ్ళి కూతురి అన్న హోదాలో, పెద్ద ఆరిందాలా హుందాగా వ్యవహరిస్తున్నాడు. నన్ను చూసి ‘రండి చిన్నాన్నా… ఇలా కూర్చోండి’ అని ఒక పెద్దాయన పక్కన పందిట్లో కూర్చోపెట్టాడు. ‘మా చంద్రం చిన్నాన్న.. ముంబై నుంచి వచ్చారు’ అని పరిచయం చేసాడు. ‘మీరేనా చంద్రశేఖర్, ప్రత్యేకంగా చూడకపోయినా మీరు మాకు తెలుసు’ అన్నాడాయన మాట కలుపుతూ. ‘ఎల్లా’ అన్నాను అవివేకంగా. ‘ఎల్లా ఏమిటి… గోవిందు ఎప్పుడు మాట్లాడినా మీ గురించేగా… అల్లా…!’. ‘మీరంతా మావాడి కూతురి పెళ్ళికి ఎంతో సాయం చేస్తున్నారు’. ‘సాయమా… సాయమేమిటి? ఇది మా కర్తవ్యం! గోవిందు మావాడు.. అందరివాడు…!’. ‘అయితే మాత్రం పెళ్ళంటే మాటలా. ఎంత ఖర్చు…’ ‘ఖర్చా భలేవారండీ ఎంతిస్తే ఈ ఊరు, గోవిందు ఋణం తీర్చుకోగలదు. ఆయనలాంటి మనిషిని నేనింతవరకూ చూడలేదు. మీవాడు కనుక అతని విలువ మీకు తెలియటం లేదు. అంటారుగా పెరటి చెట్టు మందుకు పనికిరాదని. ఆ కుటుంబమే కుటుంబం.!’ వింటుంటే ఏదో న్యూనతా భావం కలిగింది. ఈపాటి పెళ్ళి నేను చెయ్యలేనా. కొట్లు సంపాదించాను.. గొప్ప ఉదారుడని పేరు పొందాను. కానీ వాడొకడున్నాడన్న స్ఫురణే లేదు కదా నాకు ఇప్పటివరకూ. ఊరు ఊరంతా రామాలయంలోనే ఉంది. ఇదేదో గోవిందుగాడింట్లో శుభకార్యంలా లేదు. సీతారామ కళ్యాణంలాగే ఉంది. అందరూ పెద్దలే అందరూ భాగస్వాములే! బిందువు, బిందువు సింధువైనట్టు ఊరంతా తలో చెయ్యి వేసి మహా వైభవంగా గోవిందు కూతురి పెళ్ళి జరిపిస్తున్నారు. ‘ఎంత దన్ను సంపాదించుకున్నావురా గోవిందుగా’ అనుకున్నాను అబ్బురంగా! లక్షకులక్షలు చిల్ల పెంకుల్లా వెదజల్లినా నా కూతురి పెళ్ళికి సిటీలో నేనెన్నెన్ని పాట్లు పడ్డానో గుర్తు చేసుకున్నాను. ఎవ్వరూ ఏ విషయంలోనూ రాజీ పడరు. ఫంక్షన్ హాలే ఒక రోజుకు లక్ష. కళ్యాణ మండపానికి, ఈవెంట్ మేనేజ్‌మెంట్, బ్రైడల్ డెకరేషన్, వీడియోగ్రఫీ, కాటరింగ్.. ఒక్కమ్మాయి పెళ్ళికే అబ్బాయికిచ్చింది కాక పాతిక లక్షలు ఖర్చు పెట్టాను. గోవిందు కూతురి పెళ్ళి చూస్తుంటే నా చిన్నప్పుడు ఈ ఊళ్ళోనే మా తాతగారు చేసిన పెళ్ళిళ్ళు గుర్తు వస్తున్నాయి. ఎవడో ఒక్కడుంటాడేమో గోవిందుగాడి వంటివాడు సాంప్రదాయం నిలబెట్టడానికి! శాస్త్రోక్తంగా పెళ్ళి పెళ్ళిలాగే లక్షణంగా జరిగింది. వధూవరులు పెద్దందరికీ ప్రతి ఒక్కరికీ పేరుపేరునా నమస్కరించి ఆశీస్సులు తీసుకునే సరికి తెల్లారవచ్చింది. అందరికీ పలహారం కాఫీ… మళ్ళీ విడిది ఇంట్లో వధూవరులిద్దరికీ ఏవేవో వేడుకలు… సరదాలు… నాకు ఆశ్చర్యం… వీళ్ళిద్దరూ నామకః తల్లిదండ్రులు, కన్యాదాతలు.. కర్తవ్యంగా పీటల మీద కూర్చుని కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం రుచికరమైన సాంప్రదాయపు వంటకాలతో ఊరందరికీ రామాలయం ముందు పందిట్లో పచ్చని అరిటాకుల్లో పప్పనం అనబడే కమ్మటి పెళ్ళి భోజనం. వంటలు, వార్పులు అన్నీ ఊరివాళ్ళే. పెళ్ళికి ముందు రాత్రి భోజనం.. ఇది పెళ్ళయ్యాక పెళ్ళి భోజనం. మా అమ్మాయి పెళ్ళికి మూడు పూటల విందు ఏర్పాటు చేసాను. పెళ్ళికి ముందు రాత్రి, పెళ్ళిరోజు, పెళ్ళయ్యాక విందు భోజనం.. అంతా కేటరింగే. 15 రకాల ఐటమ్స్ ప్లేటు 200 రూ.లు. బంధువులు, స్నేహితులు అటు ఇటు పరిచయస్తులు ఆహ్వానితులు మొదలైన వాళ్ళందరికీ రిసెప్షన్! పెళ్ళి అర్థరాత్రి అవటం వలన సిటీలో ఆ సమయానికి ఎవరూ రారు కనుక రాత్రి ఎనిమిది నుంచే రెసెప్షన్. పెళ్ళికిముందే వధూవరుల్ని ఎర్ర ముఖమల్ ఫంక్షన్ చేర్స్ లో కూర్చోపెట్టాం. క్యూలో ముందు దగ్గర వాళ్ళు… తరువాత తక్కినవారు ఒక్కొక్కరు వేదిక ముందుకు వచ్చి అక్షంతులు వేసి గిఫ్ట్‌ప్యాక్స్ అందించి, మేమిచ్చిన గిఫ్ట్స్ తీసుకొని, భోజనాలు చేసి, అట్నించటే వెళ్ళిపోయారు. ముహూర్తం సమయానికి మేం నలుగురం, పిల్లలు, మరీ సన్నిహితులు తప్ప ఎవ్వరూ లేరు. అట్లాంటిది మూడు పూటలు ఊరు ఊరంతా రామాలయంలో పెళ్ళిలో పాల్గొంది. సాయంత్రం కావస్తుండగా అప్పగింతలు పూర్తయ్యాయి. ఆనకే ‘వస్తామయ్యా… వస్తామమ్మాయ్…’ అంటూ పండు, తాంబూం తీసుకుని ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్ళారు. మూడు నిద్రలకి ఇద్దరు ముత్తయిదువలు.. పెళ్ళికూతురికి తోడుగా బాల వెళ్లారు.
‘నువ్వూ వెళ్ళిపోతావేమిట్రా చందూ అప్పుడే’ అన్నాడు ఆర్తిగా గోవిందు.
‘పక్కూరికేగా వెళ్ళింది అమ్మాయి. దిగులుపడతావేరా వెర్రివెధవా’ అన్నాను ఎగతాళిగా.
‘దిగులేనండి మరిదిగారూ మీ అన్నగారికి! పిల్లలు కనపడకపోతే నిమిషం తట్టుకోలేరు’ గూడెం వాసులందరికీ విస్తళ్ళలో పదార్థాలు నింపి బుట్టల్లో వేస్తూ అంది కామేశ్వరి. ఆమె ముఖం కూడా దిగులుతో కళ తప్పి ఉంది. ‘నువ్వేదో మావాడి కంటే ధైర్యస్థురాలివనుకున్నాను. నువ్వు ఇంతేనా…’ కావాలనే సరదాగా అన్నాను.
‘పిల్లలు కదా మరిదిగారూ, వాళ్ళెంత మంచివాళ్ళు, మానవత్వం గలవాళ్ళు అయినా ఆడపిల్ల.. మన పిల్ల కదా. అయినా దిగులు లేదు లెండి. పెద్దల దయవల్ల మన పరమేశ్వరి యోగ్యుడి చేతిలోనే పడింది…’
‘దిగులు లేదురా చందూ! నిజంగా చాలా తృప్తిగా ఉంది. ఆనందంగా ఉంది. నాలాంటి వాడి కడుపున పుట్టినందుకు ఈ పిల్లలకి ఏ గతి పడుతుందోనని భయపడేవాడ్ని!’
‘భయమెందుకురా పిచ్చోడా… ఊరు ఊరంతా నీ పక్కనే నిలబడింది. ఇంత యోగం ఎవరికి దక్కుతుంది చెప్పు! అందరి కోసం నీ తాపత్రయం. నీ కోసం ఊరు ఊరంతా. మనిషిగా నువ్వు ప్రేమగా మానవత్వంతో అందరికీ నీ వంతు సాయం చేస్తున్నావు.. ఏమీ ఆశించకుండా. మరి వాళ్ళు అవసర సమయంలో నిన్ను ఒంటరిగా వదిలేస్తారా. మానవత్వ విలువలున్నవాడే కదా మరి మనిషంటే!’ అన్నాను కాని నా మనస్సులో ఏదో వెలితి.
‘నిజంరా చందూ! ఇది నా స్వగ్రామం. నా తాత ముత్తాతలు పుట్టి పెరిగిన పుణ్యభూమి. ఈ జనం నావాళ్ళు, నా ప్రాణం, నా బలం. అర్భకుడ్ని అక్షరం ముక్క లేనివాడ్ని. పరాయి ఊళ్ళో ఎల్లా బతగ్గలను చెప్పు. మంచో, చెడో – కష్టమో, నిష్ఠూరమో బతుకంతా ఇక్కడే ననుకున్నా. సొంత మనిషిలా ఆదరించారు. నా కర్తవ్యాన్ని నిర్వర్తించటంలో శక్తి నిచ్చారు. ఇదంతా వాళ్ళు నన్ను గౌరవించే చేసారు. ఆ తరం తరలిపోయినా మన కుటుంబం పట్ల గౌరవం, మర్యాద ఇంకా ఉంది వీళ్ళ మనసుల్లో. వాళ్ళలో ఒక్కడిగా ప్రేమించి చేసారు. అభిమానంతో మానవత్వంతో అవసరమైన సాయం చేసారు. లేకపోతే నేనిదంతా చెయ్యగలనా… నేనెంత. నా సత్తువెంత?’
గోవిందు సంపాదించుకున్న స్థానబలం ఎంత విలువైనదో నాకు అర్థమైంది. ఎక్కడెక్కడకో వలసపోయి ఎన్నో కష్టాలు పడి, ఏదో ఏదో పొందెయ్యాలనీ, గొప్ప ఉద్యోగాలు చేసి కోట్లు కూడబెట్టినా అక్కడ నేను ఒంటరిని. డబ్బు తీసుకుని సేవలందించే సేవాకేంద్రాలే తప్ప మనసుతో పలకరించే మనుష్యులే కనపడరు. కష్టమైన, సుఖమైన నోట్లు వెదజల్లి పనులు జరుపుకోవటమే తప్ప నేనున్నానన్న మానవత్వ స్పర్శ, ఆస్వాదనే పొందలేకపోతున్నాను. ఎవరి బతుకులు వారివి. ఎవడి పరుగు వాడిది, ఎవడి పోరు వాడిది! సంఘ జీవితాన్నించి ‘అపార్ట’య్యాను కదా అనుకున్నాను.
హడావుడి తగ్గిపోయింది. ఆహ్లాదపరిచే శాంతి అంతటా నిండి ఉంది. ఏ విధమైన ధ్వనులు, రొద లేని పల్లెటూరి స్తబ్దత మనసుకి చిత్రమైన ఆనందాన్నిస్తోంది. ఎప్పుడూ మా ఊరి మీద నాకు మంచి అభిప్రాయం ఉండేది కాదు. ప్రేమ సరే, బంధం కూడా ఉండేది కాదు. కాస్త ఊహ తెలిసిందగ్గర్నించీ నా ఊహలన్నీ దూరదూరాల్లోనే ఉండేవి. రాత్రి భోజనాలయ్యాక గోవిందు, నేను పూలమొక్కల మధ్య ఉన్న సిమెంటు బెంచి మీద కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నాం. వాడే ఏవేవో మా చిన్నప్పటి కబుర్లు గుర్తు చేస్తున్నాడు. అనవసరమైన విషయాలని నేను వాటన్నింటినీ ఎప్పుడో తొలగించేసాను. వీడెప్పుడూ గతంలోనే బతుకుతాడు. కామేశ్వరి లోపల పనులు పూర్తి చేసుకుని కాలక్షేపంగా నవలడానికి చక్కిలాలు ప్లేట్లలో తెచ్చి తనూ అక్కడే కూర్చుని మా మాటలు వింటూ విరజాజి పూలు మాల కడుతోంది. చల్లని వెన్నెల మెత్తగా పువ్వులా విచ్చుకుంటోంది. పూల పరిమళాలతో గాలి వింజామరులు వీస్తోంది. అవివేకంతో ఏనాడో కాల తన్నుకుపోయిన అలౌకికానందమేదో అమ్మ ప్రేమలా ఆప్యాయంగా హత్తుకుంటోంది. ‘ఈ రెండు రోజులు అమ్మాయి పెళ్ళి హడావుడితో సరిపోయింది. మనం సరిగ్గా మాట్లాడుకొనేలేదు చందూ!’ ఇంతకాలం తరువాత కేవలం వాడి కూతురి పెళ్ళి కోసమే వచ్చానంటే నమ్మటం లేదు వాడు. ‘నిజం చెప్పు ఏం ఫరవాలేదు. నీకోసం ఏమన్నా చేస్తాను. ఇంటి గురించి ఏమన్నా ఆలోచన ఉందా!.. నేనూ ప్రయత్నిస్తున్నాను. మంచి బేరం తగుల్తుందేమోనని. ప్రపంచమంతా మన కళ్ళముందే మారిపోతుంది. అదేమిటో ఈ ఊరు మాత్రం తాతలనాటి లాగే ఉంది. కొనే నాధుడు లేక కొంపకు తాళాలేసుకుపోతున్నారు జనం!’ ప్రేమగా నా వంక చూస్తూ మెత్తగా నా భుజం తాకాడు. మనిషి మాటలోను, తీరులోనూ చెప్పలేని ఆర్ద్రత, స్నేహం.. ఆ స్పర్శలోంచి నా గుండెల్లోకి పాకింది. ఎంతోకాలం తరువాత నా అనురాగమయ కుటుంబం నీడన సేదతీరుతున్నట్లనిపిస్తోంది. కల్మషం, స్వార్థం అంటని స్వచ్ఛమైన ఆత్మీయ స్పర్శ పోగొట్టుకున్న పెన్నిధి తిరిగి దొరికినట్లు వాడి చేతినల్లాగే పొదివి పట్టుకున్నాను. ఇటువంటి మిత్రుడు ఎవరికి దొరుకుతాడు! వాడి శరీరక అవకరాన్ని, అంద విహీనమైన రూపాన్ని, తెలివిలేని తనాన్ని, అనర్హతని మాత్రమే చూసాను. అష్టావక్రుడని.. వాడికి ఎనిమిది వంకరలైతే వీడికి ఒళ్ళంతా వంకరేనని గేళి చేసాను. చదువు, సంధ్య, నాగరీకత లేని బడుద్ధాయని నిరసనగా చూసాను. నిర్మలమైన హృదయంలోకి చూడలేకపోయాను. నేను చూపిన నిర్లక్ష్యానికి, చులకనకి మరెవరన్నా అయితే మా బంధం ఏనాడో తెంపేసేవాడు. అమాయకుడు కనుక నాలోని వైకల్యాన్ని నేటికీ గ్రహించలేకపోతున్నాడు. గ్రహించినా తనవాడినన్న గౌరవంతో ‘వీడంతే’ అని క్షమించేసి ఉంటాడని నా ఆలోచనతో, నా ప్రవర్తనతో నిమిత్తం లేకుండా తనవంతు ధర్మంగా ప్రేమిస్తూనే ఉన్నాడు. ఇది వీడి స్వభావం. వీడు నామీద పెంచుకున్న వాత్సల్యం, అనురాగం అన్నింటినీ అధిగమించింది. ఇంతకాలం ఈ పెన్నిధిని దూరం చేసుకుని నేనెంత జీవితానందాన్ని కోల్పోయానో కదాని దిగులు కలిగింది. ఇక ఈ స్నేహహస్తాన్ని జన్మలో వదులుకోకూడదు. వాడెప్పుడూ ప్రేమమయుడే! నా కోసమే ఈ అపురూప స్నేహాన్ని పదిల పరుచుకోవాలి. ‘చెప్పవా’ అంటున్నాడు. ‘చెప్పమంటావా… కాదనవుగా మరి…’ చప్పున నన్ను దగ్గరికి లాక్కుని ‘కాదనటమా నీ మాట!’ తడబడిపోతున్నాడు. ‘సరే…విను. మీ కేశవని నాతో పంపుతావా. నా దగ్గర ఉంచుకొని వాడికి కావల్సిన చదువు చెప్పిస్తాను’.. ‘ఏమిట్రా నువ్వుంటున్నది.. కేశవ.. కేశవ.. వాడ్ని నువ్వు… నువ్వు…’ పట్టరాని సంతోషంతో గట్టిగా నన్ను కౌగలించుకున్నాడు. నిలువెల్లా పుకరించిపోతున్నాడు. తడిసిన నక్షత్రాల్లా మెరుస్తున్న కళ్ళలో ప్రేమ వెల్లువలా ప్రవహిస్తోంది. ‘అవును నీ ప్రేమ, వాత్సల్యం, స్నేహం, ఎప్పటికీ నాతోనే ఉండాలి, నీ కొడకు రూపంలో’. కేశవ ఎప్పుడు వచ్చాడో ‘చిన్నాన్నగారూ’ అంటూ నన్ను చుట్టేసాడు. చకితురాలై నీరు నిండిన కళ్లతో నన్నే చూస్తోంది కామేశ్వరి. నా మనసంతా అపూర్వమైన శాంతి. ఈ జీవితంలోనే నా తప్పిదాన్ని సరిదిద్దుకోగలిగాను.
—-