కథా భారతి

బ్రహ్మ పునః సృష్టి

– ఆర్ శర్మ దంతుర్తి

ఉమ్మడి ఆంధ్రదేశం విడిపోయాక ప్రథానమంత్రుల వారు గంగాజలం పట్టుకొచ్చి, ఆంధ్రదేశ శంఖుస్థాపన నాడు తనకూడా పట్టుకొచ్చిన మట్టితో సహా దాన్ని కాబోయే రాజథాని నోట్లో కొట్టాక నవ్వుకుంటూ వెనక్కి వెళ్ళారు. ఆ నవ్వు చూసి డబ్బులు బాగా రాల్తాయనుకుని రాష్ట్ర అమాత్యులవారు రాజథాని నిర్మాణం అట్టహాసంగా మొదలుపెట్టారు. అందులో ఆయన చేసిన మొదటి పని భూసేకరణ కోసం రెండు చేతుల్తో ఓ ఖాళీ చిప్ప పట్టుకుని భిక్షకి బయల్దేరడం.

రెండేళ్ళు తిరిగేసరికి భూమి దొరికింది గానీ దానిమీద భవనాలకీ, రోడ్లు వేయడానికీ డబ్బులు లేకపోయాయి. భూదేవి అసలే ఎండలకి తట్టుకోలేక గిలగిల్లాడుతూంటే, మూలిగే నక్కమీద తాటిపండు పడ్డట్టూ వర్షాభారం, నిథుల కొరతా మొదలయ్యేసరికి అమాత్యుల వారికేం తోచలేదు. ఈ లోపుల అరాచకం, రాజకీయాలతో రాజ్యం అస్తవ్యస్తం అవుతుంటే ప్రజలు విశృంఖలంగా దోచుకోబడుతున్నారు. రాష్ట్ర ఖజానా ఖాళీ అవుతోంది రాజకీయనాయకులవల్ల; ప్రజాధనం ప్రజలకోసం ఎంతమేర ఖర్చయిందో ఎవరూ చెప్పఖ్ఖర్లేని వింతే.

ఈ లోపుల ప్రజలు అబ్బాయి మాత్రమే పుట్టాలంటూ దేవుళ్ళకి మొక్కుకుంటూ, మొగ బిడ్డలకోసం పూజా పునస్కారాలు మొదలుపెట్టినా అవి ఫలించకపోయేసరికి డాక్టర్లమీద పడ్డారు ఫలితాలకోసం. ఎప్పుడైతే డాక్టర్లు ఇది గమనించారో అప్పుడే వాళ్ళు ప్రజలని “మొగ బిడ్డ పుట్టితీరుతాడు” అంటూ మందులిస్తూ వాటి పేర్లతో దోచుకోవడం మొదలుపెట్టారు. మొగబిడ్డలు పుడితే సరే లేకపోతే అబార్షన్ లూ, చావులూను. దేశ జనాభాలో మహిళల శాతం బాగా తగ్గడం మొదలైంది. ఈ లోపులే కొంపలు మునిగిపోతున్నట్టూ కంప్యూటర్ కంపెనీలు దివాళా తీయడం మొదలుపెట్టాయి. అప్పటివరకూ ఒక వెబ్ సైట్, లేకపోతే ఒక ఆప్ కనిపెట్టేసి బిలియనీర్లు అయిపోదామనుకున్న కుర్రాళ్ళు, కుర్రమ్మలూ నీరస పడ్డారు. ఇదే సందుగా చూసి పనిలేని కుర్రాళ్ళు అసలే మహిళ సంఖ్య తక్కువగా ఉన్నప్పుడు కనబడిన కుర్రమ్మలని మొదటగా ఏడిపించడం ఆ తర్వాత మాన భంగాలు చేయడం మొదలైంది. మెడలో గొలుసులు తెంపుకుని పోతున్నారని ఏడుస్తున్న మహిళలకి అసలుకే మోసం వచ్చి రక్షణ కరువౌడం కొత్త పోకడ.

దేశ పరిస్థితి రోజురోజుకీ మరింత దారుణంగా తయారవుతూంటే ఈ అథర్మం చూసి చూసి వళ్ళు జలదరించిన భూదేవి ఏం చేయాలో తెలియక ఓ సారి భగవద్గీత తెరిచి చూసింది. “యథా యథాహి థర్మస్య…” అనేది చదువుతూంటే తెలిసినదేమంటే, థర్మానికి గ్లాని ఎక్కువైనప్పుడే విష్ణువు అవతారం థరించేది. అయితే విష్ణువు పుట్టాలంటే, ఈ యుగంలో కల్క్యావతారం రావడం ఎప్పుడో తెలియాలంటే భాగవతం చూడాలి కనక భూదేవి తిరుపతి వెళ్ళి అయ్యగారి ప్రింటింగ్ ప్రెస్సులో ఉన్న పోతన భాగవతం పుస్తకాలు చూడబోయింది. ఈ పుస్తకాలు ఇలా తెరిచిందో లేదో ఎవరో చిన్నగా నవ్వినట్టై పక్కకి చూసేసరికి అక్కడున్న పబ్లిషర్ చెప్పేడు మందహాసంతో, “మాతా, భూదేవీ, ఈ భాగవతం చూడాలంటే రాజథాని నుంచి ఇంత దూరం రావాలా? అక్కడ్నుంచే వెబ్ సైట్ లో చూడొచ్చుగా?”

భూదేవి నాలిక్కర్చుకుని చెప్పింది, “అయ్యో, నేనంత హై టెక్ కాదు కదా?”

అప్పుడు పబ్లిషర్ వారు భూదేవికో లింకుచూపించి అది ఎలావాడాలో సోదాహరణంగా చూపించే యూ-ట్యూబ్ వీడియో చూడమని చెప్పాక ఆయనకో నమస్కారం పెట్టి భూదేవి మళ్ళీ రాజధానికి తిరిగొచ్చి అది చదవడం మొదలుపెట్టింది.

భాగవతం ప్రకారం కల్క్యావతారం రావాలంటే అనేకానేక విషయాలు కలిసిరావాలి. మొదటి విషయం ప్రకారం విష్ణువు దక్షిణ భారతంలో శంబళ గ్రామంలో విష్ణుయశుడనే వాడికీ, ఆయన భార్య సుమతికీ పుట్టాలి. రెండోది ఆయన ఏదో ఆషామాషీగా పుట్టేస్తే కుదరదు. కవి, ప్రాజ్ఞుడు, సుమంతుడు అనే ముగ్గురన్నల తర్వాత పుట్టాలి. మూడోది మరీ కష్టమైనది – పుట్టిన కల్కి పరశురాముని దగ్గిర విద్యాభ్యాసం చెయ్యాలి. ఇప్పుడీ పరశురాముడెక్కడున్నాడో ఎవరికెరుక? అయ్యవారే ఏర్పాటు చేసిన ఈ తతంగం మార్చడం అసంభవం. పోనీ ఇదంతా జరిగినా చివరి విషయం అత్యంత దుర్లభం – ఇదంతా కలియుగం నాలుగో పాదం ఆఖరి రోజుల్లో జరగవలసిన కథ. మరి ఇప్పుడే, ధర్మస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అంటే ఎలా కుదురుతుందీ?

ఇదంతా చదివిన భూదేవికో సందేహం పుట్టుకొచ్చింది. ఇలా యుగాంతంలో దశావతారాలలో కల్కి అవతారంలా కాకుండా సుయజ్ఞోవతారంగానో, కపిలావతారంగానో, దత్తాత్రేయోవతారంగానో, మరేదో చిన్న అవతారం ఎత్తలేడా మహా విష్ణువు? థర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అంటే థర్మం నాశనం అవుతున్నప్పుడు అని కానీ ప్రతీయుగంలోనూ ఒక్కసారే అని ఎక్కడా లేదు కదా?

భాగవతం ఈమూలనుంచి ఆ మూల దాకా, ఆ మూల నుంచి ఈ మూల దాకా ఎంత, ఎన్నిసార్లు చదివినా ఈ థర్మ సూక్ష్మం అర్ధంకాక తలనెప్పి పెట్టడం తప్ప మరోదారి లేకపోయేసరికి తాను చదివినదంతా ప్రింటు చేసి బ్రహ్మలోకానికి బయల్దేరింది ఆ కాయితాలు చూపించి అసలు విషయం సృష్టికర్తనే కనుక్కోవడానికి. ఆఫ్టరాల్, సృష్టికర్తకి తెలియని విషయం ఉండబోదు కదా? ఆఖరికి విష్ణువు పుట్టాలన్నా సృష్టికర్త హస్తం లేకుండా పని జరగదని జగద్విదితం కాదూ?

అయితే భూదేవి బ్రహ్మ లోకం చేరాక తెల్సిన విషయం బ్రహ్మ గారు అవుటాఫ్ ఆఫీస్. ఇదంతా – సరస్వతీ దేవి స్వంతంగా చెప్పినదే – భూమాత వస్తున్నట్టూ ముందుగా ఫోన్, లేదా ఈమెయిల్ ద్వారా తెలియపరచకపోవడం వల్ల వచ్చిన చిక్కు. బ్రహ్మగారు ప్రోజక్ట్ మేనేజ్ మెంట్ ట్రైనింగ్ కి వెళ్ళారుట. మరో నాలుగువారాల్లో దానిక్కావాల్సిన పరీక్ష రాసి సర్టిఫికేషన్ సంపాదించకపోతే ఆయనకి ఏడాది చివర్లో జరపబడే పెర్ఫార్మెన్స్ రిపోర్ట్ లో శ్రీముఖం ఇవ్వబడుతుంది, అదీ ఆయన్ని సృష్టించిన మహావిష్ణువు చేత. అందువల్ల మరో నెలా, నెలన్నరదాకా ఎవరికీ అపాయింట్ మెంట్లు లేవు.

ఇంత తెలిసాక చేయడానికేం లేదు కనక మరో ఆరువారాల్లో దొరికిన అపాయింట్ మెంట్ బుక్ చేసుకుని వెనక్కొంచ్చింది భూమాత. అరాచకం అలాగే ఉంది భూమ్మీద, పాపం భూదేవి దాన్ని భరిస్తూనే ఉంది.

ఈ లోపుల ఈ మానభంగాలూ, రాష్ట్రాలలో నిధుల సమస్య, వర్షాభారం ఇవన్నీ రాష్ట్రాల విడివిడి సమస్యలనీ ప్రధానమంత్రులవారేం చేయడానికీ లేదనీ, పోనీ చేద్దామనుకున్నా వారికి తీరికలేదనీ వారి సెక్రటరీ గారు అందరికీ పత్రికాముఖంగా శెలవిచ్చారు. అయినా అప్పనపల్లీ, అమలాపురం, నర్సీపట్నం లాంటి చిన్న చిన్న ఊళ్ళలో జరిగే ప్రతీ విషయం చూడ్డానికి ప్రధానమంత్రులవారికేమీ పనిలేదా? ఆయనిప్పుడు అనేకానేక ప్రపంచదేశాలలో ఉన్న మన జనాభాని వచ్చి సువిశాల, “అతి క్షేమమైన” భారద్దేశంలో పెట్టుబడులు పెట్టమని పిలవడానికి విదేశాలకి వెళ్ళారు. అవన్నీ ఓ నాలుగు నెలల్లో చుట్టి వచ్చేసరికి ఈ చిన్న చిన్న విషయాలు అవే సర్దుకుంటాయి. మీ పిచ్చి గానీ ఈ మానభంగాలు కొత్తగా ఉన్నవా భారద్దేశంలో? మహా భారతయుద్ధం జరగడానిక్కారణం దుశ్శాశనుడు ద్రౌపదిని సభలో అందరిముందూ మానభంగం చేయబోవడం, రాముడు యుద్ధంలో రావణాసురుణ్ణి చంపడానిక్కారణం రావణుడు సీతని ఎత్తుకుపోయి మానభంగం చేస్తానని బెదిరించడం కాదుటండీ? దేశం “వెలిగిపోతూ” ముందుకు వెళ్తున్నప్పుడు ఇటువంటి చిన్న చిన్న విషయాలు పట్టించుకోరాదు.

పెద్దపాపాలకి చిన్నవి కారణం అయినట్టూ, అవన్నీ కలిసి గొలుసుకట్టుగా మరింత పెద్దవైనట్టూ, ఇలా మొదలైన చైన్ రియాక్షన్ దేశం అంతా పాకుతూంటే ప్రజలని కొల్లగొట్టడానికి పూనుకుని బేంకులు అధిష్టానం ద్వారా ‘ఫలానా మెత్తంకన్నా ఎక్కువ తీయరాదు అకౌంట్ లోంచి’ అని ఆర్డర్లు తెచుకున్నై. దీనికి మసాలా అంటించడానికన్నట్టూ ఆర్థిక మంత్రి వర్గం కొన్ని నగదు నోట్లని రద్దుచేసింది హఠాత్తుగా, ఎవరికీ ముందుగా ఏమీ చెప్పకుండా. ప్రథానమంత్రికి ఇవన్నీ ముందే తెలుసని కొంతమందీ, తెలియదని మరికొంత మందీ అన్నా, ఆయన నోరు మెదపలేదు ఈ విషయంలో. కామన్ మేన్ అనబడే నోరులేని మేక మెడమీద కత్తి మరింత లోపలకి దిగబెట్టబడింది. రక్తం బాగా కారుతోంది కానీ మేక చావడానికి లేదు అప్పుడే. అది చస్తే దాన్ని పూర్తిగా దోచుకోవడం ఎలా?

ఈ సందులో దేశానికి అప్పు ఇచ్చిన ఇతర ప్రపంచ దేశాలు దేశ పరిస్థితి చూసి తమ డబ్బు వెనక్కిఇచ్చేయమని ఒత్తిడి తెచ్చాయి. దేశం పరిస్థితి దిగజారుతూ ఇంకా అలాగే ఉన్నప్పుడు ఆరువారాలు గిరగిరా తిరిగి భూదేవి అపాయింట్ మెంట్ ని గుర్తు చేస్తూ బ్రహ్మలోకం నుంచి ఫోన్ వచ్చింది – డాక్టర్ గారి ఆఫీసు నుంచి పేషెంట్ కి ఫోన్ వచ్చినట్టే – అపాయింట్ మెంట్ వదులుకుంటే మరో ఏడాది దాకా కష్టం అనీ మర్చిపోకుండా ఇప్పుడే రమ్మనమనీను.

దీనికోసమే చూస్తున్న భూదేవి వెంఠనే బయల్దేరింది ఆఘమేఘాలమీద, వాయువేగ మనోవేగాలతో కదులుతూ.

*****

భూదేవి బ్రహ్మలోకం జేరేసరికి బ్రహ్మగారు తన ప్రోజక్ట్ మేనేజ్ మెంట్ కాయితాలు చూసుకుంటున్నారు. సర్టిఫికేషన్ పాసైనట్టున్నారు, మొహంలో అదో సంతోషం, వెలుగూను. అసలే లెక్కలేనన్ని ప్రోజక్ట్ లు చేతినిండా. ఈ మల్టీ టాస్కింగ్ లో తను కూర్చున్న టేబిల్ మీద కట్టలకొద్దీ కాయితాలు. “శ్రీహరి, శ్రీహరి” అంటూ ఆగకుండా కొత్త రింగుటోన్ తో అరిచే టేబిల్ మీద ఫోను. అప్పుడే తాము నేర్చుకున్న ప్రాజెక్ట్ మేనేజ్ మెంట్ అమలు చేస్తున్నట్టూ రెండు మూడు పెద్ద సైజు మానిటర్లు, వాటిమీద అగకుండా కనిపించే ప్రోజక్ట్ లకి సంబంధించిన గాంట్, పెర్ట్, పారెటో గ్రాఫులూ వగైరా. చెవి దగ్గిర సెల్ ఫోను అలానే ఉంచి భూదేవిని చూసి చేత్తో కూర్చోమని చూపించాక ఆ ఫోనులో అరుస్తూనే ఉన్నారు బ్రహ్మగారు, ఆవిడ కూర్చున్న ఓ అరగంట దాకా. ఫోనులో మాట్లాడ్డం అయ్యేక భూదేవి కేసి తిరిగి అడిగేరు, “నా ఆఫీసు ఇలా గత నెలనుంచీ మిగిలిన అపాయింట్ మెంట్ల వల్ల బిజీ బిజీ బిజీ. ఈ మల్టీ టాస్కింగ్ ఉంది చూసావ్? ఎవరూ పని సరిగ్గా చేయరు. పైవాణ్ణి అడిగితే కిందవాడు సరిగ్గా చేయలేదనీ, కిందవాణ్ణి అడిగితే పైవాడు ఎలా చేయాలో చెప్పలేదనీ నా మీదకే విసుర్తారు ఆ రాళ్లన్నీను. ఎందుకొచ్చిన ఉద్యోగంరా భగవంతుడా అనిపిస్తోందనుకో. అవన్నీ అలా ఉంచు, ఏమిటిలా వచ్చావ్? ఏదైనా అర్జంటా?”

ఎవరి దగ్గిరకైనా వెళ్ళినప్పుడు ముందు వాళ్ల క్షేమం అవీ అడిగి ఊదరకొడితే మన పని అవడం సులభం కనక భూమాత అంది, “నా సంగతికేం? ఎప్పుడూ ఉండే గోలే లెండి కానీ, మీ సర్టిఫికేషన్ సరిగ్గా జరిగిందా, ట్రైనింగ్ బాగా ఎంజాయ్ చేసారా?”

ఆ తర్వాత అరగంటా బ్రహ్మ గారు భూదేవి తల బొప్పి కట్టేలా ఓ “పేద్ద” లెక్చర్ దంచారు. తాను చేసిన ట్రైనింగ్ ఎంత బాగుందో, సర్టిఫికేషన్ పరీక్ష ఎంత కష్టం అయినా శ్రీహరి చల్లనిచూపు వల్ల మొదటిసారే తానెలా పాసయ్యాడో అన్నీను.

అన్నీ విన్న చివరలో భూదేవి అంది, “అదృష్టవంతులు, మొదటిసారే పాసయ్యారు. లేకపోతే ఎంత కష్టం వచ్చేదో?”

ఆ తర్వాత భూదేవి చూపించిన కాయితాలు అవీ చూసి, చెప్పినదంతా విన్నాక దీర్ఘంగా నిట్టూర్చి బ్రహ్మ అడిగేడు, “అయితే ఇంతకీ నీ ప్రశ్న ఏమిటీ?”

“నాకు ఇన్ని సమస్యలున్నా విష్ణువు ఇంకా భూమ్మీద ఎందుకు అవతరించలేదు? అది అలా ఉంచండి, అసలీ అవతారం రావాలంటే ఈ శంబళ గ్రామం ఎక్కడుంది? ముందా విషయం చెప్పండి. గూగిల్ తీసి వెతికి వేసారాను కానీ శంబళ అనేదే కనబళ్ళేదు. గూగిలే చూపించలేనిది బింగూ, యాహూ ఏం చూపిస్తాయ్? అవీ వెదికాననుకోండి కానీ ఏమీ తేలలేదు. అసలీ గ్రామం ఎక్కడుందో తెలిస్తే మిగతా విషయాలైన విష్ణువు అన్నదమ్ముళ్ళవీ, పరశురాముడి గురించీ, ఆయన చదువు గురించీ తర్వాత చూద్దాం.”

భూదేవి కి ఉన్నది భూమ్మీద గూగిల్ లాంటి సెర్చ్ ఇంజిన్లు మాత్రమే కానీ బ్రహ్మగారికి మరింత గొప్ప సెర్చ్ ఇంజిన్లు ఉన్నాయి. అందులో మైండ్ బోగిల్ అనే దాన్ని తెరిచి బ్రహ్మగారు “ఓకే బోగిల్, శంబళ ఎక్కడుంది?” అనేది కొట్టాడు. ఆశ్చర్యంగా స్క్రీన్ మీద “మీరు అడిగినది మైండ్ బోగిల్ లో లేదు. అయితే దాన్ని మార్చి టైప్ చేసి చూడవచ్చు.” అని కనిపించింది. అది చూసిన బ్రహ్మ, అందరి మేనేజర్లలాగానే తన మొహంలో ఏ భావం కనిపించకుండా ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టూ కళ్ళు మూసుకున్నాడు కాసేపు.

తాను వెదికినా ఏమీ దొరకలేదనే మాట భూదేవి దగ్గిర చెప్తే పరువు పోదూ? మీటింగ్ లో కూర్చున్నప్పుడు పెద్దలు అడుగుతారు ప్రోజక్ట్ మేనేజర్లని, ప్రోజక్ట్ లో ఫలానా సంగతి ఏమైంది అని, మేనేజర్లకి ఈ పని తలా తోకా ఎక్కడుందో, ఎవరేం చేస్తున్నారో తెలియదు కనకా తెలిసినా వెంఠనే మర్చిపోతారు కనకా “ఆ విషయం ఐ హావ్ టు గెట్ బాక్ టు యు” అనడం సర్వసాథారణం కనకా బ్రహ్మ గారు తనకేసి కుతూహలంగా చూసే భూదేవితో చెప్పారు, “భూదేవీ ఇప్పుడిదంత పెద్ద విషయం కానట్టు అనిపిస్తోంది కానీ, ఇప్పుడే కదా ట్రైనింగ్ అయి వెనక్కొచ్చాను, మరో రెండు వారాల తర్వాత కనిపించు. ఈలోపుల నేను ఇక్కడ పని ముగించీ, శ్రీహరిని సంప్రదించీ నీకు సమాధానం అందిస్తా. లేకపోతే ఫోన్ కానీ ఈమెయిల్ కానీ చేయమంటావా? నీ ఇష్టం మరి.”

ఈమెయిల్ పంపుతాననే ప్రోజక్ట్ మేనేజర్లు ఏం పంపుతారో, అసలు అలా పంపుతాం అని చెప్పడం వాళ్లకి గుర్తే ఉండదని ముందే తెలుసు కనక వెళ్ళడానికి లేస్తూ భూదేవి కంగారుగా అంది, “లేదు, లేదు నేను వెనక్కి వస్తా రెండు వారాల్లో. కానీ నా విషయం మర్చిపోకండేం?”

భూదేవి అలా గుమ్మం దాటగానే బ్రహ్మ గారికి సరస్వతి కిసుక్కిన నవ్విన నవ్వు వినబడింది. “ఏం దేవీ అలా నవ్వుతున్నావు?” అడిగేడు సృష్టి కర్త.

“మానిటర్ ఆవిడకి కనబడకుండా ఇటువైపుకి పెట్టుకున్నారు కనక సరిపోయింది. అయినా నేను చూడలేదనుకున్నారా? ఈ శంబళ గ్రామం ఎక్కడా లేదు కదా, ఏం చేస్తారు ఆవిడ రెండు వారాల్లో వెనక్కొచ్చాక?” నవ్వు కొనసాగిస్తూ అడిగింది వీణాపాణి.

“మరో రెండు వారాలుంది కదా. ఆవిడ పని ఇంకా ఎనిమిది గంటల్లో అవ్వాలి అనే వరకూ అర్జెంట్ అవదు. ప్రోజక్ట్ లో ఎప్పుడూ కూడా అర్జంట్ కాని విషయం లో వేలు పెట్టరాదు. అర్జెంట్ అవగానే దానిమీద కూర్చుని పనిచేయడమే,” తాను ప్రోజక్ట్ మేనేజ్ మెంట్ లో నేర్చుకున్న విషయాలు అన్వయించడానికి ప్రయత్నం చేసాడు బ్రహ్మ, సరస్వతి ముందు.

ఆవిడ మరోసారి గల గలా నవ్వి ఊరుకుంది.

*****

ఆ తర్వాత రెండు వారాలూ సరస్వతి బ్రహ్మని గమనిస్తూనే ఉంది ఆయనేం చేస్తాడో, ఈ భూమాత పట్టుకొచ్చిన తంటాని ఎలా తేలుస్తాడో చూడ్డానికి. ఆయన మాత్రం తనకేం పట్టనట్టూ మిగతా పనులు చేసుకుంటూనే ఉన్నాడు. రాబోయే సోమవారం భూదేవి వస్తుందనగా శుక్రవారం బ్రహ్మ కొత్తగా చేరిన ఒక డెవలపర్ ని పిల్చి ఈ భూమాత తెచ్చిన తంటా ఆ కుర్రాడికి వినిపించి చెప్పాడు ఏం చేయాలో. వీణ సరిచేసుకుంటూన్న సరస్వతి కి వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న పేచ్, ఇంజిన్ వగైరా సాఫ్ట్ వేర్ భాషా, ఆ విషయాలు ఏమీ అర్ధంకాలేదు. విసుగొచ్చి ఆవిడ మధ్యాహ్నం బ్రహ్మ కన్నా ముందు ఇంటికెళ్ళిపోయింది. ఆయన ఆఫీసు కట్టేసి వచ్చేసరికి ఎప్పట్లాగానే ఎలాగా లేటవుతుంది కదా?

అయితే శుక్రవారం సాయంత్రం బ్రహ్మ ఆఫీసు తొందరగా కట్టేసినట్టున్నాడు, అయిదింటికే హుషారుగా ఇంటికొస్తూ చెప్పాడు సరస్వతితో, “బయల్దేరు మహేష్ బాబు కొత్త సినిమా చూసి వద్దాం. ఆఫీసులో కొత్తగా చేరిన డెవలపర్ కుర్రాడు అమ్ముతుంటే కొన్నాను రెండు టికెట్లు.”

అందరి ఆడవాళ్లలాగానే ఏ విషయానికైనా ఎప్పుడూ ఆలస్యంగా బయల్దేరే సరస్వతి, తెలుగు సినిమా అనేసరికి పది నిముషాలు ముందే తయారైపోయి బయటకొచ్చింది.

మహేష్ బాబు మహత్యం చూసి బ్రహ్మ నవ్వుకుంటూ సరస్వతి చేయి పట్టుకుని సినిమాకి బయల్దేరాడు.

*****

“ఇంతకీ మీకు ఆ ఊరేదో దొరికిందా?” బ్రహ్మ సరస్వతిని సినిమాకి తీసుకెళ్ళేక సినిమా మొదలైన పావుగంటకి ఆయన మీదకి తన చేయి పోనిచ్చి ఆయన భుజమ్మీద తలానిస్తూ అడిగింది సరస్వతి.

మహేష్ బాబు సినిమాలో నిమగ్నమయిన బ్రహ్మ ఒక్కసారి వులిక్కి పడి, “ఏ వూరు…?” అని అడిగాడు.

“అదే! శంబళ కుగ్రామం…” మెల్లగా అడిగింది సరస్వతి.

“లేదు దొరకలేదు,” చెప్పేడు ఇంకా సినిమలోనే లీనమైపోయిన బ్రహ్మ.

“మరెలా? భూమాత సోమవారం వస్తూనే మిమ్మల్ని అడగదూ?”

“చూడు భామా, నేను ఇప్పుడు నిన్ను ఇక్కడకెందుకు తీసుకొచ్చానో తెలుసా? వారం అంతా గాడిద చాకిరీ చేసి, నువ్వు పెట్టే నసుగుడూ,ఆఫీసులో గోలా భరించలేక దాన్ని తప్పించుకుని సరదాగా ఎంజాయ్ చేద్దామని. రేప్పొద్దున్న చూసుకుందాం ఆ విషయాలన్నీ. ఇప్పుడు శంబళా గ్రామం, దాని బొందా అన్నీ గుర్తు చెయ్యకు. చూడు పోకిరీ సినిమాలో మహేష్ బాబు ఎంత బాగున్నాడో.”

సినిమా పూర్తయ్యాక రాత్రి తీరుబడిగా ఇంటికొచ్చి అన్నం తిని మంచం మీదికెక్కేడు బ్రహ్మ. ఏదో అడగబోయిన సరస్వతి బ్రహ్మ ‘మూడ్’ చూసి మళ్ళీ మాట్లాడలేదు.

తెల్లవారింది. ప్రోజక్ట్ డిప్లాయ్ మెంట్ ఐపోయేక తీరిగ్గా పడుకునే టీం లీడర్లాగా బాగా పొద్దెక్కేక, పదకొండింటికి లేచి దంతధావనం ఆరభించేడు బ్రహ్మ. అదయ్యేసరికి సరస్వతి కాఫీ కప్పుతో వస్తుందేమో అని చూసేడు కానీ ‘అంత అదృష్టమా?’ అనుకుంటూ వంటింట్లోకి నడిచేడు స్వంతంగా కాఫీ కలుపుకోవడానికి.

న్యూసు పేపర్ చదువుతూంటే సరస్వతి “నాధా బయటికి పోదామా లంచ్ కి, ‘ ఇండియా గ్రిల్ ‘ రెస్టారెంట్ లో వీకెండ్ బఫే ఎనిమిది వరహాలే” అంది.

ఈ మాటతో ఇంక ఆవిడ ఎలాగా వంట వండదని తెలిసిపోయింది కనక “సరే పోదాం నడు” అంటూ లేచేడు బ్రహ్మ.

టి.వి.కి ఎదురుగుండా బల్ల చూసుకుని దానిమీద కలగా పులగంగా వచ్చే తింగరి డేన్స్ లు చూస్తూ తిండి తినడం మొదలు పెట్టేరు.

“సరే ఇప్పుడు చెప్పండి, శంబళ గురించి” అంది సరస్వతి.

ఈవిడ దీని గురించి మర్చిపోయిందేమో అనుకున్న బ్రహ్మ కి పొలమారింది. ఖళ్ళున దగ్గేడు. నోట్లో నాన్ రొట్టి టేబుల్ మీద పడ్డాక కాసిని మంచినీళ్ళు తాగి సరస్వతికేసి దీనంగా చూసేడు. ఆవిడ వదుల్తుందా?

“రేపు చెప్తానన్నారుగా నిన్న అడిగితే?”

“సరే. అన్నీ గాలించేక ఆ శంబళ ఎక్కడా దొరకలేదని చెప్పానుగా?”

“అది కాదు నేనడిగేది. భూమాతకి ఏమి చెప్తారు? ఈ ప్రోబ్లెం ఎలా సాల్వ్ అవుతుంది?”

“ఇది సాల్వ్ చేయడానికి ఇప్పుడున్న టెక్నిక్కులన్నీ కలిపి నేను చేయగలిగేది ఏమిటా అని ఆలోచించేను. ప్రోజక్ట్ మేనేజ్ మెంట్ లో చెయ్యవల్సింది ఏమిటి? అందులో ముఖ్యమైన మొదటి పని ఏమిటి అని చూసాను.”

“ఏంటది?”

“ప్రోబ్లెం ఐడెంటిఫికేషన్.”

“హేవిటీ?” కళ్ళు విప్పార్చి చూసింది సరస్వతి బ్రహ్మ కేసి.

“ఇప్పుడు నాకున్న ప్రోబ్లెం భూమ్మీద ఏమి జరుగుతోందో కాదు. భూదేవి కంప్లైంట్ మాత్రమే.”

“అవునా?” చిన్న నవ్వు సరస్వతి మొహంలో

బ్రహ్మ నవ్వేడు చులాగ్గా. “నువ్వే ఆలోచించు సరస్వతీ. ఇప్పుడు భూదేవి నాదగ్గిరకొచ్చి ఉండకపోతే నాకు ఇవన్నీతెలిసేవా? ఈ రాజకీయాలు, కుళ్ళూ ఎప్పుడూ ఉండేవే. విష్ణువు తీర్చవల్సిన తగాదాలు నాకేల? టెస్టర్ చేయవల్సిన పని డెవలపర్ ఎందుకు చెయ్యాలి?”

“నాకర్ధం కాలేదు”

“సరే అయితే. నా ప్రశ్నలకి సమాధానం చెప్పు. నీకే అర్ధం ఔతుంది.”

“భూమ్మీద కుళ్ళు పోవాలంటే విష్ణువు శంబళ గ్రామంలో జన్మించాలి. రైటేనా?”

“అవును రైటే”

“విష్ణువు ఎప్పుడు పుట్టాలో నేను శాసించగలనా?”

“అసంభవం”

“సో ఇప్పుడు నాకున్న ప్రోబ్లెం అంతా ఏవిటి?”

“మీరే చెప్పండి,” అంది సరస్వతి గడుసుగా

“భూదేవి కంప్లైంట్ మాత్రమే”

“అవును కదా?”

“ఈ భూదేవికి శంబళ గ్రామం చూపించి విష్ణువు పుట్టబోయే కుటుంబాన్ని చూపించామనుకో?”

“వావ్”

“ఇదో వైటూకే టైప్ ప్రోబ్లెం. చిన్న పేచ్ తో ప్రోబ్లెం సాల్వ్ ఐపోయింది.”

“ఎలాగెలాగా? అసలు శంబళ గ్రామం ఎక్కడా లేదుగా?”

“అక్కడేనోయ్ భామా, మన మేనేజ్ మెంట్ స్కిల్ సెట్ బయటకొచ్చేది,” చిర్నవ్వు నవ్వేడు బ్రహ్మ లేచి రెండో సారి ప్లేట్ లో భోజనం తెచ్చుకోవడం కోసం వెళ్తూ.

వెనక్కొచ్చాక మళ్ళీ చెప్పడం మొదలు పెట్టేడు బ్రహ్మ.

“చెన్నాయ్ అనేది కానీ, ముంబయి అనేది కానీ ఉందా కొన్నేళ్ళ క్రితం?”

“లేదు.”

“అర్ధం అయిందా?”

“సరిగ్గా చెప్తే కదా? సంగీతం వాయించుకునే దాన్ని నాకు సాఫ్ట్ వేర్ ఎలా తెలుస్తుంది?”

“సరే అయితే. ఎర్త్ ఎక్స్ ప్లోరర్లో శంబర గ్రామం ఉంది దానికో పిన్ కోడూ 532547 ఉంది. దాని పేరు శంబళ అని మార్చిపారేయడమే.”

“అదంత ఈజీ వీజీనా? దానికి టైం పడుతుంది కదా?”

“ఎందుక్కాదు? టైం ఎప్పుడూ పడుతుంది. రావణాసురుణ్ణి చంపమని భూదేవి వచ్చి అడిగిందనుకో, విష్ణువు వెంటనే చంపేస్తాడా? ఆయన యోగ నిద్రలోంచి బయటకి రావాలి మానవ జన్మ ఎత్తాలి, విలువిద్య నేర్చుకోవాలి, పెళ్ళి చేసుకోవాలి, ఇంకా ఎంత తతంగం? దానికి టైం పట్టట్లే?”

“అయితే ఏమిటంటారు?”

“ఒక పేచ్ ప్రోగ్రాం రాసి పారేసాం. శంబర పేరు ఇప్పుడు శంబళ అవుతుంది. మనం తయారు చేసిన పేచ్ పనిచేసి మైండ్ బోగిల్ ఇంజిన్ కి తగిలిస్తే, సరిగ్గా పనిచేయడానికి ఒక రోజు పడుతుంది. తర్వాత “శంబళ” అని వెదికితే మొదటి లింక్ గా “శంబళ” అని అసలు గ్రామం శంబర కనిపిస్తుంది. భూదేవికి చూపించి పేరు మారింది చూసుకో అని బోగిల్లో చూపించేస్తే ప్రోబ్లెం సాల్వెడ్.”

“అదెలా? మన కంప్యూటర్లో కనపడితే ఐపోయిందా?”

“లేదు. ఆ పేచ్ భూదేవిని డౌన్ లోడ్ చేసుకోమని చెప్పడమే. ఆ పేచ్ ఆవిడ కంప్యూటర్లో ఉన్నంతవరకు, ఆవిడ ఏ బ్రౌజర్ ఓపెన్ చేసి ‘శంబళ’ అని వెతికినా, ఆ శంబర గ్రామం మొదటి లింకులో కనబడుతుంది.”

“అన్యాయం, కొన్నేళ్ళు పోయేక భూదేవి మనమీదకి దండెత్తుకు రాదూ?”

“కొన్నేళ్ళు పోయేక్కదా ఆవిడొచ్చేది? అప్పుడింకో పేచ్ రాయొచ్చు భామా. ఈ లోపున నువ్వు చెప్పినట్టుగా టైం పడుతుంది. మద్రాసు చెన్నై అయినట్టు, బాంబే ముంబయి అయినట్టూ శంబర గ్రామం శంబళ అవుతుంది, అక్కడ భాగవతంలో చెప్పినట్టూ లెక్కల ప్రకారం దక్షిణ భారతదేశాగ్రంలో ఆ కుగ్రామంలో శ్రీ మహావిష్ణువు కల్కి అవతారంగా రావాలి. అదెలాగంటే, శంబళ గ్రామంలో విష్ణుయశుడనే వాడికీ, వాడిభార్య సుమతికీ శిశువుగా ఆయన జన్మమెత్తాలి. ఆయనకి కవి, ప్రాజ్ఞుడు, సుమంతుడు అనే ముగ్గురన్నలుండాలి. అవన్నీ తేల్తాయ్ నిదానంగా అని చెప్పేసి ఆవిడ్ని వదిలించుకోవడమే”

“దారుణమైన అన్యాయం కాదూ ఇది?”

“ఏమిటి అన్యాయం? ముందు ఇంటర్నెట్టు ముప్ఫైరెండు బిట్లు వాడి తక్కువ బేండ్ విడ్త్ తో మొదలెట్టారు. ఉన్న వెబ్ సైట్లన్నీ ఇంత త్వరగా ఐపోతాయని ఎవరైనా ఊహించారా? ఇప్పుడు బేండ్ విడ్త్ పెంచి 128 బిట్లకి మార్చి మాములుగా వాడుకోవట్లే? ప్రోబ్లెం సాల్వ్ చేసినందుకు మెచ్చుకోక వెక్కిరిస్తున్నావే?”

“ఐతే ప్రోజక్ట్ మేనేజ్ మెంట్ సర్టిఫికేషన్ వచ్చాక ఇదన్న మాట మీరు చేసే నిర్వాకం ఆఫీసులో”

గులాబ్ జాం నవుల్తూ చిర్నవ్వు తో చెప్పేడు బ్రహ్మ, “నేనే కాదు అందరు ప్రోజక్ట్ మేనేజర్లూ చేసే పని ఇదే.”

సరస్వతి గుడ్లు మిటకరించి చూసింది బ్రహ్మ కేసి. అది పట్టించుకోనట్టూ మరో ప్లేట్ ఫుడ్ తెచ్చుకోడానికి లేచేడు బ్రహ్మ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked