-యనమండ్ర భానుమూర్తి
“నాన్నా! మీరు, అమ్మ పెద్దవారైపోయారు. పదవీవిరమణ చేసి కూడా పది సంవత్సరాలయింది. ఇంకా ఈఇంట్లో ఒంటరిగా ఉంటే ఎలా? నేను అన్నయ్య అమెరికాలో ఉంటున్నాం కదా. అక్కడికి రమ్మని ఎన్నోసార్లు చెప్పినా మీరు రారు. ఎంతసేపు పుట్టిన వూరు, పెరిగిన వూరు అని ఈ కాకినాడ లో ఉంటే, మీ బాగోగులు ఎవరు చూస్తారు.” రాత్రి భోజనాలయిన తరువాత, ప్రస్తావన లేవనెత్తాడు రమేష్. జగన్నాధంగారి రెండో కొడుకు రమేష్. మొదటి వాడి పేరు సతీష్. జగన్నాధంగారికి ఒక అమ్మాయి కూడా వుంది. పేరు అనూరాధ. రమేష్, సతీష్ అమెరికాలో వుంటున్నారు. అనూరాధ, అల్లుడు హైదరాబాద్ లో వుంటున్నారు. దసరా పండుగకు అందరూ కలుసుకున్నారు. మిగతా రోజుల్లో కలుసుకోక పోయినా, దసరా పండుగకు మాత్రం ప్రతిఏడూ అందరూ కలుసుకుంటారు. జగన్నాధం ప్రధానోపాధ్యాయుడు గా చేసి పదవీవిరమణ చేసాడు. తాతలు, తండ్రులు ఇచ్చిన ఆస్తిపాస్తులు ఏమీ లేవు. కస్టపడి పైకొచ్చాడు. టీచరుగా అందరిచేత శెభాష్ అనిపించుకున్నాడు. పిల్లల్ని బాగా చదివించాడు. రమేష్, సతీష్ ప్రయోజకులై అమెరికాలో వుంటున్నారు. కూతురికి కూడా, మంచి సంబంధం చూసి పెళ్ళిచేసాడు. అల్లుడు తెలంగాణా సచివాలయంలో పనిచేసున్నాడు. ఎవరికీ ఏ లోటూ లేకుండా సంసారాన్ని నడిపించాడు. మనవళ్ళు, మనవరాళ్ల ముద్దు ముచ్చట్లు కూడా జగన్నాధం దంపతులు చవి చూసారు. అన్నట్లు జగన్నాధం భార్య గురించి చెప్పనేలేదు. భార్యపేరు సుశీల. పేరుకు తగినట్లుగానే సౌశీల్యవతి. భర్త మనసుకు అనుగుణంగా నడుచుకుంటుంది. జగన్నాధం కూడా, భార్య మనసు తెలుసుకుని ప్రవర్తిస్తుంటాడు. నెలవారీవచ్చే పింఛను డబ్బులు, ఈ సొంత ఇల్లు మిగిలాయి. ఇల్లు నూట యాభై గజాల్లో కట్టడం వల్ల, పెద్ద విశాలంగా కూడా ఉండదు. నాలుగు గదులు మాత్రమే వున్నాయి. పై అంతస్తువేయడానికి డబ్బులు చాలక, వూరుకున్నాడు జగన్నాధం. ఆ ఇల్లు అమ్మేయాలన్నదే రమేష్, సతీష్ కోరిక. ఇద్దరూ మంచి ఉద్యోగాలు చేస్తున్నా, ఇంకా సంపాదించాలన్న కాంక్షతో చిన్న, చిన్న వ్యాపారాలు స్నేహితుల ప్రోద్బలంతో ప్రారంభించారు. అనుభవం లేని కారణంగా ఊహించని నష్టాలు వచ్చాయి. స్నేహితులు కూడా కొంత మోసం చేశారు. దానికి తోడు విలాసవంతమైన జీవితాలకు అలవాటుపడ్డారు. అప్పులవాళ్ళ వత్తిడి కూడా పెరుగుతోంది. కాకినాడ లోని ఇంటి ధర షుమారు డెబ్భై లక్షలు పలుకుతోంది. ఇల్లు అమ్మేస్తే తమ వాటా కనీసం చెరో ఇరవై లక్షలు వస్తే కొన్ని అప్పులైనా తీరుతాయన్నదే రమేష్, సతీష్ ఆలోచన. పైకి మాత్రం మీరు ఒక్కరే ఉంటే మీ బాగోగులు ఎవరు చూస్తారంటూ ఎక్కడాలేని ఆప్యాయత ఒలకబోస్తున్నారు. సంభాషణ కొనసాగుతోంది.
“నాకీ వూరు వదిలి రావటం ఇష్టంలేదురా. ఎందుకంటే అమెరికా వాతావరణానికి మేము అలవాటుపడలేము. నా స్నేహితులు కూడా, వాళ్ళ పిల్లలు విదేశాల్లో ఉంటె వెళ్లి, మూడు నెలలు కూడా ఉండలేకపోయారు. మేము మాత్రం ఎలా ఉండగలం. ఇక్కడ తీరికలేని జీవితానికి అలవాటుపడి, అక్కడ వూరికే గోళ్లు గిల్లుకుంటూ కూచోలేము. రెండోది “జనని జన్మభూమిశ్చ” అని కని, పెంచిన వూరిని వదలలేము. ఏదోవిధంగా ఇక్కడ ఉండాలన్నదే మా కోరిక. ఈ విషయం మీకింతకుముందే చెప్పాము. అయినా మళ్ళీ అడుగుతున్నారు.” అన్నాడు జగన్నాధం.
“అలాకాదు నాన్నా! మీకిక్కడ ఎవరూ సాయం లేరు. ఒకరికొకరు సాయం చేసుకోవటం కూడా కష్టమే. ఏదైనా అనారోగ్యం చేస్తే చూసుకోవటానికి ఎవరున్నారు. మీరు పెద్దవారయ్యారు. ఎప్పుడైనా, ఏదైనా జరగొచ్చు.
ముందు జాగ్రత్త మంచిది కదా. బంధువులున్నా ఒకటి రెండు రోజులు వుంది వెళ్ళిపోతారే తప్ప, ఎక్కువ రోజులు వాళ్ళు కూడా ఉండలేరు. చెల్లేమో దూరంగా హైదరాబాద్ లో ఉంది. తనకి కూడా మాటిమాటికి రావడం కష్టమవుతుంది. అందుకని మేము చెప్పేది జాగ్రత్తగా ఆలోచించండి. మీ మంచికే కదా చెపుతున్నాము. ఇలాంటి చర్చలు జగన్నాధం గారి కుటుంబంలోఈ మధ్య చాలా సార్లు జరుగుతున్నాయి.
కానీ జగన్నాధం దంపతులకు, ససేమిరా ఆ ఇంటిని వదిలి వెళ్లాలని లేదు. దుర్గాష్టమి రాత్రి జగన్నాధం దంపతులు గుడికి వెళ్లారు. ఆ సమయంలో రమేష్, సతీష్ మాట్లాడుకొంటున్నారు. “నాన్నగారికి ఎంత చెప్పినా వినటంలేదు. ఈ ఇల్లు అమ్మక పొతే, మన అప్పులు కొంతైనా తీరవు. నా భార్యకూడా రోజూ ఈ విషయాన్నే గుర్తుచేస్తున్నది.” అన్నాడు రమేష్. “నా భార్య మాత్రం తక్కువా. తనూ రోజూ ఇదే అడుగుతున్నది. వీళ్ళ చాదస్తం కాకపొతే ఇద్దరూ ఒంటరిగా ఈ ఇంట్లో ఏం చేస్తారు.” అన్నాడు సతీష్. “మరి ఇల్లమ్మిన తరువాత నాన్న వాళ్ళు ఎక్కడుంటార్రా.” అడిగింది అనురాధ. తనకు మనసులో ఇల్లమ్మాలని వున్నా ఆడపిల్ల గాబట్టి బయటపడటంలేదు. “ఒకవేళ ఇల్లమ్మటానికి ఒప్పిస్తే, నాన్న వాళ్ళు ఎక్కడ వుంటారన్నదికూడా వాళ్లకి చెప్పగలిగి ఉండాలి. లేకపోతె వాళ్ళు ఇల్లమ్మటానికి ఒప్పుకోరు. లెక్కల మాస్టారు కదా. లెక్కలు వేస్తుంటారు.” అడిగాడు సతీష్. “నేనేం తెలివితక్కు దద్దమ్మ అనుకున్నారా. ఆ విషయం కూడా ఆలోచించాను. అద్దె ఇంట్లో ఉండమని అనలేము. ఎందుకంటే మళ్ళి ఒంటరితనం సమస్య ఉంటుంది. అందుకని మన వూర్లోనే వున్న “గౌతమి వృద్ధాశ్రమం” లో చేర్పిద్దాము. నేను చాలాసార్లు కనుక్కున్నాను. అక్కడ వసతులన్నీ బాగుంటాయి. విడిగా గది. ఉదయాన్నేకాఫీ, టిఫిను, మధ్యాన్నం భోజనం, మళ్లీ సాయంత్రం పకోడీలాంటివి, రాత్రికి భోజనం కావాలంటే భోజనం లేకపోతె టిఫిను ఇస్తారు. అమ్మకూడా వంటకు ఇబ్బంది పడనక్కరలేదు. ముందు కొంతసొమ్ము జమచేసి, నెలకింత అని కడుతూ ఉంటే సరిపోతుంది. నేను మొన్న వెళ్లి చూసిన్నప్పుడు, పెద్ద ఉద్యోగాలు చేసినవాళ్ళే చాలామంది అందులో వుంటున్నారు. ఈ విషయం నాన్న వాళ్లకు నచ్చచెపితే, బహుశా ఒప్పుకోవచ్చు.”చెప్పాడు రమేష్. రమేష్ తెలివితేటలకు ఆశ్చర్యపోయాడు సతీష్. “నువ్వింత క్షుణ్ణంగా ఎప్పుడు వృద్దాశ్రమం పరిశీలించావురా” అడిగాడు సతీష్. “చాలామంది నా స్నేహితులు వాళ్ళ అమ్మా నాన్నలను చేర్పించారు. ఒకరోజు స్నేహితుడితో వెళ్లాల్సివచ్చింది. అప్పుడు చూసాను. వివరాలన్నీ కనుక్కున్నాను. అప్పుడే నాకీ ఆలోచన వచ్చింది”. అన్నాడు రమేష్. “సరే ఇప్పుడు కాదు. రేపు వీలుచూసుకొని, నాన్నావాళ్ళకు చెపుదాము. నచ్చచెప్పి ఇల్లు అమ్మకానికి పెడతాము.”అన్నాడు సతీష్. మరునాడు మహర్నవమి. ఉదయాన్నే అందరూ అమ్మవారి పూజ చేసుకొన్నారు. పిండివంటలతో భోజనం చేసిన తరువాత, పెద్దవాడు సతీష్, తండ్రితో ఇంటి ప్రస్తావన తీసుకువచ్చాడు. చర్చ షుమారు రెండు, మూడు గంటలు సాగింది. వృద్దాశ్రమంలో ఉంటే బాగుంటుంది అనికూడా పిల్లలు సూచించారు. పిల్లలు చాలా పట్టుదలతో ఉండటంతో, జగన్నాధం దంపతులకు ఒప్పుకోక తప్పలేదు. “సరే మీ ఇష్టంవచ్చినట్లు చేయండి” అసహనంగా చెప్పాడు జగన్నాధం. ఒకటా రెండా ముప్పై సంవత్సరాలు ఆ ఇంటితో అనుబంధం పెనవేసుకుంది.
ఇల్లు దగ్గరవుండి రెండు సంవత్సరాలు కస్టపడి కట్టించాడు. పెరట్లో పూలమొక్కలు, కూరగాయ చెట్లు కూడా శ్రద్హగా పెంచుకుంటున్నారు. ఇప్పుడు ఒక్కసారిగా వదిలి వెళ్లాలంటే చాలా బాధగా ఉంది. ఆఇంట్లోనే పిల్లలు పెరిగి పెద్దవారయ్యారు. అనేక వేడుకలకు నిలయం ఆ ఇల్లు. తన కుటుంబ మధుర స్మృతులకు గుర్తు ఆ ఇల్లు. వేడుకలకే కాకుండా విషాదాలకు కూడా ఆ ఇల్లే వేదిక.
తన తల్లితండ్రులు ఆ ఇంట్లోనే చనిపోయారు. తన పదవీ విరమణ కూడా ఆ ఇంట్లోనే జరిగింది. పండుగ గడచిపోయింది. కొడుకులు అమెరికాకు వెళ్లారు. కూతురు, అల్లుడు హైదరాబాద్ వెళ్లిపోయారు. ఆలోచిస్తున్నాడు జగన్నాధం. ఇప్పుడు ఆ ఇంటిని వదలి వెళ్లాలంటే చెప్పలేని బాధ. గుండెను పిండేసినట్లు బాధపడ్డాడు జగన్నాధం.
“ఇల్లు అమ్మకానికి పెట్టాము. ఒకవేళ ఎవరైనా ముందుకు వస్తే, మేము మళ్ళీ డిసెంబర్లో వచ్చి రాతకోతలు పూర్తిచేసుకుంటాము.” వూరికి వెళుతూ పెద్దవాడు చెప్పిన మాటలు జగన్నాధం చెవిలో రింగురింగుమంటున్నాయి. ఆరోజు రాత్రి జగన్నాధం దంపతులు భోజనాలతరువాత కూర్చొని మాట్లాడుకొంటున్నారు. “పిల్లల్లో ఈ మార్పు నేను వూహించలేదు సుశీలా. మన పెంపకంలో ఏమైనా లోపం వుందంటావా. లెక్కల మాస్టారుగా వున్న నాకు, నా లెక్కే తప్పిందేమో!” బాధపడుతూ అడిగాడు జగన్నాధం. “అయ్యో! అలాంటిదేవి లేదండి. కాలం మారింది. కాలంతో వచ్చే మార్పుతో మనుషులు కూడా మారుతున్నారు.” సర్దిచెప్పడానికి ప్రయత్నించింది సుశీల. “కాలం మారినా డబ్బుమీద ఇంత వ్యామోహం పెరగాలా? మా తల్లితండ్రుల్ని నేను ఇలాగే చూసుకున్నానా. నీకు గుర్తుండేవుంటుంది, మనం పిల్లల్ని ఎలా పెంచామో. నేను ఏనాడూ నా జీతపు డబ్బులుని వృధాగా ఖర్చు పెట్టలేదు. పైసా పైసా కూడబెట్టాము. అన్నీ పిల్లల గురించే ఖర్చు పెట్టాము. సినిమాకూడా సంవత్సరానికి ఒకసారి చూసేవాళ్ళం. డబ్బులు ఖర్చు కాకూడదని, సినిమా హాలుకి రిక్షాలో కాకుండా నడిచి వెళ్ళేవాళ్ళం. నేను కూడా ఎప్పుడైనా జీతం బకాయిలు వస్తే వాటినికూడా పిల్లలకో, ఇంటికో ఖర్చుపెట్టాను తప్ప, సొంతానికి ఏనాడు మనం ఖర్చు పెట్టలేదు. నువ్వు కూడా బంగారం మీద వ్యామోహం లేదంటూ, పుస్తెలతాడు తప్ప, ఏ నగలు చేయించుకోలేదు. ఈ విషయంలో నీ సహకారం మరువలేనిది. “చీమలు పెట్టిన పుట్టలు పాముల కిరువైన యట్లు” మనం కూడబెట్టినది, ఇలాంటి విశ్వాసంలేని వాళ్ళ పాలబడింది. “అన్నాడు జగన్నాధం. “అయ్యో మీరలా అనుకోకండి. మనం బాధపడితే పిల్లలకు అశుభం కలుగుతుంది.
మనమేమైనా ఈ ఇంటిని కట్టుక పోతామా. ఎలాగా వాళ్ళకిచ్చేదేకదా” భర్తను ఓదారుస్తూ చెప్పింది సుశీల. “నీదెంత మంచి మనసు సుశీలా. మన బాధకూడా వాళ్లకు అశుభమౌతుందేమో అని, మనకు బాధపడే హక్కుకూడా వద్దంటున్నావు. నీ ఆలోచనలో వెయ్యోవంతైనా వాళ్ళకుంటే బాగుండేది.” కన్నీళ్లు పెట్టుకున్నాడు జగన్నాధం. క్రిస్మస్ సెలవులకు రమేష్, సతీష్ వచ్చారు. వచ్చేముందు ఇంటి అమ్మకం పూర్తి అయిందని, డిసెంబర్ ఆఖరు వారంలో రాతకోతలు జరుగుతాయని, జగన్నాధానికి ముందే చెప్పారు. ఇంటి అమ్మకం జరిగిపోయింది. డబ్బు, ఇల్లు చేతులు మారాయి. ఇక కొనుక్కున్నవాళ్ళు ఎప్పుడు వస్తారో ఇంకా తెలియలేదు. తల్లితండ్రుల గురించి “గౌతమి వృద్దాశ్రమంలో” ఒక గది ఏర్పరచారు పిల్లలు. ఇంక వృద్దాశ్రమానికి వెళ్ళటమే తరువాయి. పిల్లలు కూడా ఇంకా ఒకటి రెండు రోజులలో ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోతారు.
ఇలావుండగా, ఒకనాటి ఉదయం షుమారు పది గంటలకు, ఇంటిముందుకి కారువచ్చి ఆగింది. అందులోనుంచి ఒక వ్యక్తి దిగి ఇంట్లోకి వచ్చాడు. “నమస్తే మాస్టారూ! నన్ను గుర్తు పట్టారా.” అడిగాడు. జగన్నాధం అతని వంక తేరిపారా చూసాడు, కానీ ఎవరో గుర్తుకి రావటం లేదు. “కూర్చోండి” అని కుర్చీ చూపించాడు జగన్నాధం. ఇంతలో పిల్లలు కూడా ఎవరా అని గదిలోనుంచి బయటకు వచ్చారు. అతన్ని చూడగానే, అతనే ఇల్లు కొనుక్కున్నాడని పిల్లలు గుర్తు పట్టారు. “నేను మాస్టారూ! సత్యానందాన్ని.
నేను పదో తరగతి మీ బళ్ళోనే చదివాను. అప్పుడు మీరు దానికి ప్రధానోపాధ్యాయుడుగా ఉండేవారు. మీరు మాకు లెక్కలు చెప్పేవారు.” అన్నాడు సత్యానందం. జగన్నాధానికి ఎంత గుర్తుకు తెచ్చుకుందామనుకున్నా గుర్తుకు రావటం లేదు. కానీ అతను చెప్పినవన్నీ సరైనవే. బహుశా నేను పాఠం చెప్పిన విద్యార్థుల్లో ఒకడేమో అనుకున్నాడు.
“లెక్కల్లో మార్కులు తక్కువగా వచ్చే నాకు, మీ వల్ల, మంచి మార్కులు వచ్చాయి. నేనిప్పుడు వ్యాపారం చేస్తున్నాను. రెండు రైసు మిల్లులు, రెండు బంగారం షాపులు వున్నాయి. స్థిరాస్తి వ్యాపారం కూడా చేస్తున్నాను. వ్యాపారాలు తల్లితండ్రులవల్ల సంక్రమించటంతో, వాళ్ళని పువ్వుల్లోపెట్టి చూసుకున్నాను. కానీ వాళ్లిప్పుడు లేరు. కాలంచేసారు. నాకు మీ ఇంటి అమ్మకం విషయం మధ్యవర్తుల ద్వారా తెలిసింది. వాళ్ళు మీ పిల్లల గురించికూడా చెప్పారు. నాకు చాలా బాధ వేసింది. మీరు ప్రధానోపాధ్యాయుడుగా ఉన్న కాలంలో మన బడికి ఎన్నో రాష్ట్ర ప్రభుత్వ బహుమతులు కూడా వచ్చాయి. ఉత్తమ ఉపాధ్యాయుడుగా మీకూ ఎన్నో సత్కారాలు జరిగాయి. మీ గురించి పేపరులో, చాలా వ్యాసాలు కూడా వ్రాసారు. అలాంటి మీకు ఈ పరిస్థితి అంటే నేను తట్టుకోలేకపోయాను. అందుకే మీ ఇంటిని ఎంతయినా కొనాలనుకున్నాను. కొన్నాను కూడా. కానీ ఇల్లు స్వాధీనపరుచుకోవాలని కాదు. నాకు చాలా స్థిర,చరాస్తులు వున్నాయి. ఈ ఇల్లు నాకు ఒక లెక్కలోనిది కాదు. అందుకే ఈ ఇంటిని కానుకగా, తిరిగి మీకే ఇస్తున్నాను. దానికి తగిన దస్తావేజును తయారుచేయించాను. రిజిస్ట్రేషన్ కూడా చేయిస్తాను.
మీ జీవితాంతము, మీ దంపతులిద్దరూ ఈ ఇంట్లో ఉండవచ్చు. నామమాత్రపు అద్దె ఇస్తే చాలు. కానీ మీ తదనంత రంమాత్రం, ఈ ఇల్లు మా పిల్లలకు చెందుతుంది. అంతవరకు ఈ ఇంట్లో వుండే హక్కు, మీకు ఉంటుంది.” చెప్పాడు సత్యానందం. జగన్నాధానికి అది కలా, నిజమా తెలియడం లేదు. అవాక్కయిపోయాడు. సుశీలకైతే కన్నీళ్లు ఆగటంలేదు. పవిట కొంగుతో కళ్ళు వత్తుకుంది. ” సత్యానందంగారు! అలా చేయటం బాగుండదేమో ఆలోచించండి. మీకు నాపై అభిమానం ఉండొచ్చు. నేను మీకు ఏ సాయము చేయలేదు. నా వృత్తిధర్మం ప్రకారం పాఠాలు చెప్పాను. కానీ మీరు ఈనాడు ప్రదర్శించిన దాతృత్వం అనిర్వచనీయం.” కృతజ్ఞతతో తలదించుకున్నాడు జగన్నాధం. పిల్లలు కూడా ఆ షాకునుంచి తేరుకోలేకపోయారు. రమేష్, సతీష్ ల వైపు చూస్తూ, సత్యానందం చెపుతున్నాడు.” తల్లితండ్రులు కనిపించే ఆది దంపతులు, వాళ్ళని బాగా చూసుకోవటం అనేది మన బాధ్యతే కాదు, మన ధర్మం కూడా. గుళ్లో దేవుణ్ణి పూజించటం దేవుడిగురించి కాదు, మనగురించి. ఇదీ అంతే. తల్లితండ్రులను జాగ్రత్తగా చూసుకోవటం కూడా మన కుటుంబ క్షేమానికే. మీరనుకొంటున్నట్లు వృద్ధాశ్రమం అనేది, పిల్లలు ఉండికూడా తల్లితండ్రులను చూసుకోలేక చేర్పించే ఒక వసతి గృహం కాదు.
ఏ ఆసరాలేని వృద్దులకు చేయూతనిచ్చే ఒక పవిత్ర ఆశ్రమం. మీలాగే అందరూ తల్లితండ్రుల్ని వృద్దాశ్రమాలకు పంపిస్తే అక్కడకూడా హౌసేఫుల్ బోర్డులు తయారవుతాయి. అప్పుడు నిజంగా కావలసినవాళ్లకు చోటుండదు. ఒక నాలుగు రోజులు మీరు వృద్ధాశ్రమంలో ఉంటే మీకు దాని విలువ తెలుస్తుంది. ఈ మాట ఈమధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తున్నది. పూర్వకాలంలో పిల్లల చేతులమీదుగానే ప్రాణం పోవాలన్నదే పెద్దవాళ్ళ కోరిక. అదీ ప్రాణం పోయేటప్పుడు, గుక్కెడు తులసి తీర్థం కొడుకు చేతనో, కూతురు చేతనో తాగాలని మనవాళ్ళు కోరుకునేవారు. కాలాన్ని మనమే మార్చి, వృద్ధాశ్రమం నిర్వాహకుల చేతిమీదుగా తల్లితండ్రుల ప్రాణం పోయేటట్లు చేస్తే ఎలా. దైవం హర్షిస్తుందా.
రేపు మీ పిల్లలు కూడా ఇలాగే చేస్తే ఎలావుంటుందో ఒక్కసారి వూహించుకోండి.” వస్తున్న కోపాన్ని అదుపుచేసుకొని చెప్పాడు సత్యానందం. రమేష్, సతీష్ జీవితంలో ఎప్పుడూ అనుభవించని అవమానభారాన్ని అనుభవించారు. కానీ ఇప్పటికే పరిస్థితి చెయ్యి దాటిపోయింది. ఎందుకంటే ఇంటిని అమ్మేశారు. రమేష్, సతీష్ లకి ఏంచేయాలో అర్ధంకాక తల్లితండ్రులను క్షమించమంటూ కాళ్ళు పట్టుకున్నారు. వాళ్ళల్లో వచ్చిన మార్పుకి జగన్నాధం దంపతులు, సత్యానందం కూడా సంతోషించారు. ఏది ఏమైనా జగన్నాధం దంపతులకు, ఆ ఇంటిని వదలి వెళ్లాల్సిన అవసరం లేకుండా పోయింది. బహుశా ఇది వాళ్ళ పూజల ఫలమేమో!
****