*ఉన్నతమైన కధలతో ”ఆడది”*
కథ దిన దిన ప్రవర్ధమానమై నిత్యం మన ముందు ఎప్పటికప్పుడు తాజాగా కనిపిస్తూనే ఉంది.. అంటే 1910 లో ప్రారంభమైన కథలకు ఇప్పుడు వస్తున్న కధలకు వస్తువులు ఒకటే. రచించే విధానం లో, ఎత్తుగడలో, ముగింపులో మాత్రం తేడా కనిపిస్తుంది. మనిషి జీవితం లో సమస్యలు మారలేదు. ఆలోచించే విధానం లో మార్పు లేదు. మనం నిత్యం చేసే తప్పుల్ని సరిదిద్దుకోవాలనే తపన లేదు. మనం ఒక తప్పు చేస్తే ఆ ప్రభావం పది తరాల వరకు వినిపిస్తూనే ఉంటుంది. అదే ఒక ఒప్పు చేస్తే ఆ ప్రభావం శాశ్వతంగా నిలిచిపోతుంది అనే ధ్యాస లేదు. అంటే ఆకలి వేసిందంటే ఎదురుగా ఏది ఉంటె అది తినేయడమే. ఇంతకు ముందే తిన్నాము కదా ఇప్పుడు తింటే ఏమవుతుంది అనే ఆలోచనే ఉండదు. అలాగే మనసుకు ఏది తోస్తే అది చేసెయ్యడమే. ఏది అనిపిస్తే అది మాట్లాడేయడమే. ఈ మాటల వాళ్ళ ఎదుటి వారి మనసు ఎంత బాధ పడుతుంది అనే చింతనే ఉండదు. ఒక మాట అయినా, ఏదైనా ఒక చేత అయినా ఏదైనా మనమున్న స్థానాన్ని నిలబెట్టేవి. లేదా కిందికి పడదోసేవి. ఉదాహరణకు ఒక నమ్మిన వ్యక్తి ఒక అబద్దం మాట్లాడాడని తెలిస్తే ఆ వ్యక్తి పై అభిప్రాయం ఎన్నో అడుగులు కిందికి జారిపోతుంది. నిజం వినడానికి ఇబ్బందిగా ఉన్నా ఆ వ్యక్తి స్థానం మరింత ఉన్నతంగా బలపడుతుంది. అసలు ఈ మాటలెందుకు ఇప్పుడు అని అనుకోవచ్చు కానీ మన కధలన్నీ ఈ అంశాలపై సాగేవే. మనకు మనం సృష్టించుకునే సమస్యల నుండి పుట్టినవే మరి.. తమిరిశ జానకి గారు తెలుగు సాహిత్యం లో తమదైన ముద్రతో ముందుకు సాగిపోయే రచయిత్రి. సౌమ్యత, విజ్ఞత, నిరాడంబరత కలిగి తర్వాతి తరానికి మార్గదర్శకంగా నిలిచిపోయే మనస్తత్వం ఉన్నవారు. ఎంత ఎత్తు ఎదిగినా అందరినీ సమానంగా ఆదరించే తత్వం కలవారు. 1960 వ సంవత్సరం లో వై. జానకి అనే పేరుతో ప్రారంభమైన వీరి రచనా వ్యాసంగం ఇప్పటివరకు నిరాఘాటంగా సాగిపోతూనే ఉంది. ఇప్పటివరకు 16 నవలలు, 400 కధలు, 250 పైగా కవితలు, నాటికలు, పిల్లల కథలు , వ్యాసాలు, పుస్తక సమీక్షలు రచించి ఎన్నో ప్రతిష్టాత్మకమైన పురస్కారాలు సొంతం చేసుకున్న వీరు నేడు మన ముందుకు ”ఆడది ” అనే కథా సంపుటితో వచ్చారు. ఈ సంపుటి లో 29 కధలున్నాయి. మొదటి కథే శీర్షికకు సంబంధించినది … స్త్రీ అనే పదమే ఒక ప్రశ్న. ఈ ప్రశ్నకు ఎవరు సమాధానం చెప్పలేరు . అసలు అర్థం చేసుకోలేరు. అందుకే ఇన్ని సమస్యలు. జీవన గమనాలలో ఎన్ని ఒడుదుడుకులు ఉన్నా ఇంకా సంసారాలు సజావుగా సాగిపోతున్నాయి అంటే అందుకు స్త్రీయే కారణం. క్షమ ఒక్కటి ఆభరణం గా ధరించి ఎన్నో జీవితాలకు కొత్త జీవితాన్ని ఇస్తున్న మహా వ్యక్తిత్వం గల స్త్రీని ఒకడు కొట్టి హింసిస్తాడు. మరొకడు తిట్టి, తూలనాడి బాధపెడతాడు. ఇంకొకరు అనుమానపడి చంపేస్తాడు. ఇంత సులువా జీవితం ? పురుషుని అహంకారం ఎన్ని విధ్వంసాలు సృష్టిస్తుందో వారికే తెలుసు. ఆమె బాధకు విలువలేదు. ఆమె కన్నీటికి విలువ లేదు. అని తెలియజెప్పే కథ* ”ఆడది ‘*’ . గంగమ్మ , సావిత్రి, దుర్గ, నూకాలు, వరాలు, రాజు అనే పాత్రలకు సజీవమైన చిత్రణ చేసి చూపారు. స్త్రీ ఆలోచనలకు ఎంత ఉన్నతమైనవో తెలియజేసిన కథ ఇది. తరాలు మారుతున్నా ఆగని హింసలకు పరాకాష్ట ఇది. చక్కని విలువలతో సాగిన ఈ కథ ఎంతో బావుంది. ప్రేమ వివాహాల పట్ల పెద్దలు విముఖత చూపడం అనేది పరిపాటే. తెలిసి తెలియని వయసులో ఏదైనా ఎన్నుకోవడంలో తప్పు చేస్తున్నారేమో అని, దీనివల్ల వారి జీవితం ఏమవుతుందో అని భయం అంతే .. ఇప్పుడైతే ఉన్నవాళ్లు లేనివాళ్లు అని తేడా ఒకటి ఏర్పడటం కూడా కారణం అవుతోంది. కానీ ప్రేమించడం తప్పు అనడం ఎంతవరకు వాస్తవం ? అదే మనం చేస్తే తప్పుకాదని, వేరెవరైనా చేస్తేనే తప్పు అనే మనస్తత్వం ఉన్న రామారావు అనే పాత్రలకు భార్య సరోజినీ ఇచ్చిన చక్కని సమాధానమే* ”భావతరంగాలు ”* కథ . భర్త తప్పుని ఎన్నో ఏళ్ళు గుండెల్లో దాచుకుని అవసరం అనిపించిన ఒకరోజు నిలదీసిన ఒక స్త్రీమూర్తి కథ .. చాలా అర్థవంతంగా ఉంది తల్లి తండ్రులు తమ ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తూ పిల్లలకు ఏమి తెలియదు అనుకుంటారు. కానీ తమపట్ల పిల్లలకు ఎలాంటి అభిప్రాయాలు ఉంటాయో తెలియజెప్పే కథ
*”పెద్ద మార్పుకై చిన్న ఆశ ”*. తప్పుడు వ్యాపారాలు, మోసాలు చేసిన తండ్రి పట్ల, డబ్బుకోసం తండ్రిని ఏమాత్రం అదుపుచేయలేని భార్య ఏడుపు పట్ల కలిగే పసి మనసుల ఆవేదన ఎంతో కనువిప్పుగా ఉంది.. తప్పిపోయిన బిడ్డ గురించి బాధపడుతున్న లలిత, తన స్నేహితురాలు నడుపుతున్న అనాధాశ్రమం చూసి అక్కడున్న పిల్లల్ని చూసి అందరు తన బిడ్డలే అని అనుభూతి పొందే కధ *”కల నిజమాయెగా ”* . అహంకారంతో ఉన్న వ్యక్తి జరిగిన శాస్తిని వివరించిన కథ *”అనుకున్నదొకటి అయిందొక్కటి*” ప్రతి చిన్న విషయానికి విడాకులు అంటున్న యువతకు ఇచ్చిన సరైన సమాధానం చెప్పిన కథ *”పల్లవించిన కవిత ”* బంధాలు ఎంత విలువైనవో తెలిపే కథ* ”బంధాలు అనుబంధాలు ”* జీవితంలో జరిగే సరదా సంఘటనల్ని కధగా మార్చేందుకు దోహదపడిన కథ *”సివంగి ”* వంటి కథలతో రూపు దిద్దుకున్న ఈ సంపుటి ఎంతో ఆదర్శవంతంగా ఉంది అనడం లో అతిశయోక్తి లేదు. సీనియర్ రచయిత్రి ”తమిరశ జానకి ” గారు ప్రతి కధలో ఎంతో భాధ్యతను చూపారు. వ్యక్తుల మధ్య జరుగుతున్న ఈ తేడాలు, తారతమ్యాలు, అనవసరమైన కోప తాపాలు, ఆవేశాలు, అసూయలు, అంతరాలు ఏవీ వద్దంటారు. మనం మనుషులుగా జీవించడమే ముఖ్యమని తెలుపుతారు. వీరు ఇప్పటి కథకులు కారు అని అందరికి తెలుసు .. కానీ కాలానుగుణంగా కదలని తీర్చి దిద్దడం అనేది, ఈ ఆధునిక ప్రపంచంలో అందరు దేనికి ఇన్ని సమస్యలు తెచ్చుకుంటారో అని ఆవేదన చెంది వాటికి సరైన పరిష్కారాన్ని చూపిన అద్భుతమైన కథలివి. ప్రతి కథనుండి ఏదో ఒక నీతిని నేర్చుకునే రీతిలో నడపడం చాలా సంతోషం. ముఖ్యం గా తమిరిశ జానకి గారు తమ పెళ్లి కాని వయసులో రచించిన కథ *”వాడికైన వాడు ”* గురించి చెప్పుకోవాలి. అంత చిన్న వయసులోనే పెద్ద మనసుతో రచించిన కథ ఇది. ఒక రోజు ముష్టివాడు ఒకడు ఎవరు లేని సమయంలో వస్తే దొంగ అయిఉంటాడని భయపడి తలుపులు వేసుకుంటుంది. కాత్యాయని. కానీ పనిమనిషి ద్వారా అతనికి బిడ్డలు చేసిన అన్యాయానికి ఇలా అయిపోయాడని తెలుసుకుని ప్రతి రోజు అతనికి అన్నం పెడుతుంటుంది. కానీ ఒకరోజు టైం దాటినా రాకపోయే సరికి ఎంతో ఎదురుచూసి, అయ్యో ఏమయిందో ఏమో అనుకుని ఆవేదన పడుతుంది. చివరికి ”భిక్షందేహి ” అనే అతని గొంతు విని ఆనందపడిపోతుంది. ఇక్కడ స్త్రీ సున్నిత మనస్తత్వాన్ని చూపారు. ఈ కధ అప్పట్లోనే *”యువ ” *మాసపత్రిక లో ప్రచురించబడటం ఎంతో హర్షణీయం. చాలా చక్కని కథ ఇది. అదే కోవలో సాగిన *వనమాల , రెండు మొహాలు , స్త్రీకి స్త్రీయే శత్రువు, పెరటి చెట్టు , నేర్చుకున్న పాఠం , కనువిప్పు,తాతయ్య ఊరు, మంచి నిర్ణయం* వంటి కధలు ప్రస్తుత సమాజ పోకడలకు అద్దం పట్టాయి. కధకు మూలాధారం ముగింపు. అలాగే ప్రారంభం, ఈ రెంటినీ చక్కగా చూపిన ఈ కధలు భావితరాలకు, కథ రాయాలి అనుకున్నవారికి ఒక ధిక్సుచి లా ఉపయోగపడుతుంది ఈ సంపుటి. నిత్యం మంచిని ఆలోచిస్తూ, చక్కని చిరునవ్వుతో ఉన్న ఈ రచయిత్రి తమ లాగానే ఈ కధల్ని మలచడం హర్షణీయం. వీరికి నా మనః పూర్వక వందనాలు….
ప్రతులకు
తమిరిశ జానకి
102, రత్ననిధి ఆర్కేడ్,
శ్రీరామ చంద్ర ఎనక్లేవ్ , ఈస్ట్ ఆనంద్ భాగ్
హైదరాబాద్ – 47 తెలంగాణ
ఫోన్: 94411 87182