– కొడవంటి కాశీపతిరావు
మేస్టారి కోపం చూడ్డానికి పౌర్ణమినాటి వెన్నెల్లా తెల్లగా చల్లగా ఉన్నా అనుభవానికి వచ్చేసరికి నట్టనడి వేసవిలో మిట్టమధ్యాహ్నపు ఎండలా తీవ్రంగా ఉంటుంది.
పైగా “అమ్మాయ్ హోంవర్కు చెయ్యలేదేం? ఓ గంట సేపు ఎండలో నిలబడు… ఊఁ “అంటే ఆ ఎండే వెన్నెల్లా వుంటుంది.
అదే… “హోంవర్కు చెయ్యలేదూ… ఊఁ… సరే” అని పెదాలుబిగించి రెప్పెయ్యకుండా ఓసారి చూసి తలపంకించేరంటే అది మరి భరించలేను నేను. నేనే కాదు బహుశా ఎవరూను.
అంతకుముందు క్లాసులో ఇంగ్లీషు ఏమేస్టారెలా చెప్పేవారో కూడా తెలియనంత మరపుకొచ్చిందిగాని, ఈ మేస్టారు మాత్రం పాఠంలోకి తిన్నగా వెళ్ళిపోయే వారు కాదు.
ఒక్కో స్ట్రక్చరూ తీసుకుని తీగమీద డ్రిల్లు చేయించినట్టు చేయించి, ఒక్కో కంటెంటు వర్డూ తీసుకుని ఒక్కో పిప్పరమెంటు బిళ్ళ నోట్లోవేసి చప్పరించినట్టు చేయించేవారు.
ఆపైన ఒక్కసారో, రెండుసార్లో మరి పాఠం చదివించి అరటిపండు వలిచి చెతిలో పెట్టెసేవారు. అంతవరకూ ఇంగ్లీషంటే భూతమో దయ్యమో అని జడుసుకునే నాలాంటి అమ్మాయిలంతా మేస్టారు సోషల్స్టడీస్ చెప్పబోతే “ఇంగ్లీష్ చెప్పండి మేష్టారూ…” అంటూ మారాం చేసేవాళ్ళం.
“మరీ అంత వేలం వెర్రి కూడదర్రా” అంటూ మందలించేవారు.
“బేడ్మింటన్ నేర్చుకుంటారర్రా… నేర్పిస్తాను…” అని ఓసారి అన్నారు మేస్టారు.
“ఛీ… బేట్మేంటా?” అని ఒకరూ…
“అయ్యోరామా… మాకెందుకండీ…” అంటూ మరొహరూ సాగదియ్యబోతే…
“ఏవమ్మా మంగతాయారూ… తల్లి సుబ్బలక్ష్మి మీ కొద్దర్రా ఒద్దు… బేడ్మింటనూ వద్దు… పాడూ వద్దు… తల్లీ… మాత్రం సినిమా హీరోయిన్లా ఒళ్ళు పెంచండమ్మా… చూడూ… ఓ ఇద్దరు కుర్రాళ్ళెదురొచ్చి ఏయ్ అంటే బేర్ మందురు కానీ,,, అమ్మా ఒద్దు తల్లీ ఒద్దు…” అంటూ హాస్యంగా అని ఆ మంగ తాయారునీ, అదే సుబ్బిలక్ష్మినీ ఛాంపియన్స్ గా నిలబెట్టిన మా మేస్టార్నెలా మరిచిపోతాం?
టెన్త్ క్లాస్ పరీక్షలకు వెళ్ళేముందు ఎన్ని రకాలుగానో శిక్షణనిచ్చేరు. పరీక్షల్లో కూడా మా మేష్టారే మా రూముకి ఇన్విజిలేషన్‌కు వస్తే ’మా మాష్టారే కదా’ అని సంతోషించాం.
ఆ ’మా మాష్టారేకదా’ అన్నభావమే… అది నిర్లక్షమో… మరి నిర్లిప్తమో… ఇంకా నిర్భీతితో రఘుమాత్రం చక్కా మేజోడు మడతల్లోంచి కాగితముక్కలు లాగి కాస్త సాహసం చెయ్యబోయేడు.
“ఏమిటోయ్.. తెచ్చుకున్నావ్.. ఏదీ గురుదక్షిణగా ఇచ్చెయ్ నాయనా.” అన్నారు తమాషాగా, అది మా అమ్మాయిలకు తమాషాగా అనిపించడంవల్ల కాబోలు రఘు అహం దెబ్బతింది. అంతే కాదు ఆ అమ్మాయిల దగ్గరే ఆ మేష్టార్నే అవమానిస్తే అతనిమీద వర్ షిప్ పెరిగిపోతుందనుకున్నాడు.
స్టైల్ గా బెల్ బాటమ్ ఫేంటు వేసుకున్న కాలును బెంచీమీద పెట్టి, ఓ చెయ్యి నడుంమీద పెట్టి వెనుకనున్న గేంగ్ కేసి చూస్తూ.
“ఓరేయ్ మేష్టారుకి గురుదక్షిణ కావాలిట్రా గురుదక్షిణ..” అన్నాడు.
వెంటనే ఓహడు ” తగ్గు గురూ తగ్గు.. ఇక్కడకాదు..” అంటూ కాస్త తొందర తొందరగానూ, నచ్చజెప్తున్నట్లుగానూ అన్నాడు.
ఆ వెంటనే నడుంమీద పెట్టిన చెయ్యి దించకుండా రెండో చేత్తో ఆ స్లిప్స్ విసిరేసి… ఆ విసిరేసిన చేత్తోనే జులపాల జుత్తుని సుతారంగా దువ్వుకున్నాడు.
ఓ కుర్రాడిలా అవమానం చేసేడని కాదు గానీ.. ఇంత అక్రమంగా ప్రవర్తించేడంటే తన శిక్షణలోనే ఏదో లోపం ఉందని బాధపడ్డారు మేష్టారు.
అది మేం ఇంటర్మీడియేటులో చేరాక మంగతాయారూ, సుబ్బలక్ష్మి, నేనూ మేస్టారి గౌరవార్థం ఇచ్చిన టీ పార్టీలో ఆయనే చూచాయగా వ్యక్తం చేసేరు..
“చాలా సంతోషమర్రా.. నా తయారిలో కొన్ని బొమ్మలు వికృతంగా తయారైనా ఎక్కువశాతం అందంగా తయారయ్యేయంటే మరి నా కానందవే…” అంటూంటే అయన సంస్కారం ఎంతని చెప్పను.
మేష్టారు వేసిన పునాది బలంతో ఇంటర్మిడియేటులో చేరింది నేనూ, మంగతాయారూ, సుబ్బలక్ష్మియే కాదు.. కేవీ. రఘూ, అతని గేంగ్ లో మరో ఇద్దరూ కూడా ఉన్నారు.
కాలేజీలో జరిగే ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్‌డే, కాలేజీడేలకు జరిగే ఇంగ్లీషు డిబెట్లలో నేను పాల్గొనే ధైర్యమూ, బహుమతి పొందగలిగే యోగ్యతా వచ్చాయంటే అది మేస్టారి చలవకాక మరేమౌతుంది? పైగా ఆ మేష్టార్ని నా ఉపన్యాసాల్లోనూ, వ్యాసాల్లోనూ తల్చుకోకపోతే అది కృతఘ్నత కాక మరేమౌతుంది.
కాని ఓ రోజు—
“ఓరేయ్ గురూ… మేస్టార్ని తల్చుకుంటోందేవిట్రా… కొంపతీసి మేస్టారూ, ఇదీ కధల్లాగించలేదు గదా.. లేపోతే హైస్కూలు మేస్టర్లనీ.. ఎలిమెంటరీస్కూలు మేస్టర్లనీ ఇంకా తల్చుకోవటమేవిట్రా..” అంటూ ఇంకా ఏవేవో పొగరుగా మాట్లాడబోయేడు రఘు.
నాకు విపరీతమైన ఆవేశం వచ్చేసింది. మేష్టారనేవారు.. ఓ ఇద్దరు కుర్రాళ్ళెదురొచ్చి ఏయ్ అంటే బేవ్మందురు గానీ.. అందరు ఆడవాళ్ళూ అలా మూసల్లో పోసినట్టుగా కాకపోతే.. కాస్త చదువుకున్నందుకు మీరైనా మారకూడదుటర్రా..’ అని.
అది కూడా జ్ఞాపకం వచ్చి కాలిచెప్పు తీయబోయేను. మనకు స్థానబలిమి లేదని మంగతాయారు వారించకపోతే ఏవయ్యేదో మరి:
మరో రోజు అంతే…
ఆవేళ డిబేటులో ’మరపురాని మనుషులు’ శీర్షిక కింద మాట్లాడుతూ.. ’మేష్టారు..నాకు దైవమని’ ముగించాను.
అంతే, మర్నాడు ‘మేష్టారు.. మీరే కావాలి..’, ‘మేష్టారూ మీరే దైవం’, ‘మేష్టారు మీరే నాకు పతియు, గతియు..’ అంటూ రఘూవాళ్ళ బేచ్ వెక్కిరింతలూ, వెటకారాలు.
మేష్టారంటే పంచెకట్టూ, కల్లీలాల్చి, చంకలో గొడుగూ.. రూపమయితే ఇంత రాద్దాంతం జరిగి ఉండేది కాదేమో కాని మా మాష్టారంటే మాత్రం చక్కని మీసకట్టూ, ముప్పయ్యేళ్ళ వయసూ, సొగసున్న బ్రహ్మచారి కావడం వల్లనేమో పాపం నావల్ల రఘూవాళ్ళ నోళ్ళలో నానుతున్నారు.
కాని ఏంచేసేది? వీళ్ళకెలా బుద్ది చెప్పేది? చెప్పుతీసి ఎడాపెడా నాలుగంటించేదా అనిపించేది కాని తర్వాత దుష్పలితాల మాటేవిటి? పోనీ మేష్టారితోనే చెప్పి బుద్ది చెప్పించుదామంటే.. మేష్టారిమాట అప్పుడే వినలేదు ఇప్పుడు విఁటాడా… పైగా మేష్టారితో తాను ఏమని చెప్పుకుంటుంది?
రోజూ నా ఆలోచనిలా ఈగల్లాగా, దోమల్లాగా ముసురుకుంటూ పొగల్లాగా సెగల్లాగా సుళ్ళు తిరుగుతూనే ఉన్నాయి.
కాని ఆ రోజు…
నేనూ, మంగతాయారూ, సుబ్బలక్ష్మి ఎన్నాళ్లనుండో అనుకుంటున్న మల్లీశ్వరికి ఫస్టుషో ప్రోగ్రాం వేసుకున్నాం.
ఏ సెంటర్ హాల్లోనో అయితే ఫర్వాలేక పోనుగానీ, ఇలాంటి పాతసినిమాలు మూలనున్న థియేటర్లవాళ్ళే తెప్పిస్తారో ఏమో: వెళ్ళేటప్పుడు ఉత్సాహంలో ఏ సంకోచాలు రాలేదుగానీ.. సినిమా విడిచిపెట్టేక.. వచ్చిన కొద్దిమంది ప్రేక్షకులూ కొంతదూరానికి చెల్లాచెదురు అయిపోయాక, మిగతాదూరం నడిచి ఇంటికి చేరాలనుకునేసరికి ముగ్గురికీ చెప్పోద్దూ భయంవేసింది.
రోడ్డంతా నిర్మానుషంగా ఉంది.
“పదండివే… పిరికిమొద్దుల్లారా.. ఇది అంతర్జాతీయ మహిళాసంవత్సరవే… మనల్ని ఎవడేంచేస్తాడే.. పదండి పదండి..” అంటూ బింకంగా నడుస్తున్న సుబ్బలక్ష్మి.. “ఇదో తాయారూ… వెనక ఎవరో వస్తున్నట్టున్నారూ.. నువ్వు కాస్త ఇట్రావే…” అంటూ తాయారుని పక్కకి లాక్కుంది.
సుబ్బలక్ష్మి మాటలకీ, చేతలకీ నవ్వుకుంటున్న మేము మా వెనక దగ్గరగా ఆ ముగ్గురూ చీకటినీడాల్లా నిల్చునేసరికి మా నవ్వులూ నిశబ్దాలై నిలబడిపోయేయి.
పొగలు కక్కుతూన్న నిప్పుకణికల వెల్తుర్లో మమ్మల్ని అవి పరకాయించి చూసినట్టున్నాయ్.
“ఓసోస్ మనోళ్ళే గురూ..” అని ఓహటీ..
“ఎవర్రా గురూ..” అంటూ మరో కంఠం..
“మేష్టారి భక్తురాలూ.. వారి ఇష్టసఖులూనూ.” అని జవాబూ..
“మరి చెప్పవేం.. లక్కీచాన్సు.. ముగ్గురికీ మూడు..” అంటూ పంపకాలు– అన్నీ వింటూ నడుస్తున్న మాకు నిప్పకణికలు సిగరెట్లనీ, వాటిని పట్టుకు గాలిలో నడిపించినవి మూడుజతల పెదాలనీ, ఆ పెదాల తాలూకు శాల్తీలు రఘూ,వాళ్ళీద్దరి ఫ్రెండ్సూ అని కొంతదూరం నడిచాక ఒంటరిగా నిల్చున్న లైటు స్తంబం దగ్గరగానీ తెలిసిందికాదు.
తెలిసాక మనసులో గజగజ వణుకుతో పాటు గడగడ భయం కూడా ప్రారంభమైంది.
“మేష్టారి చిలకమ్మ… నాకు స్పెషల్..” అంటూ నా చెయ్యి పట్టుకోబోయేడు రఘు. ఏవైతే అయ్యిందని నేను కూడా గమ్మున వంగుని చెప్పు తీయబోయేను.
“గురూ… ఎవరో వస్తున్నారు. తగ్గు.” అంటూ రఘూని ఆపడంతో కాస్త ఆగేరు. ముందు మళ్ళీ లైటు లేక పోవడంవల్ల, ఆవచ్చే అఆయన్ని వీలైతే హెల్ప్ అడగొచ్చు కదాని మేము కూడా నిలబడిపోయాం ఆ లైటు స్తంబం దగ్గరే.
ఆ వచ్చింది మా మాష్టారే:
మమ్మల్ని, మాతోపాటు రఘూ వాళ్ళ గేంగుని చూసి ఆశ్చర్యపోయారు. “ఏవిటర్రా.. ఇక్కడున్నారు ” అంటూ మాదగ్గరగా వచ్చేరు. మాకు ప్రాణాలు లేచి వచ్చేయి.
“మేష్టారూ… చూడండి… వీళ్ళు…” అంటూ చిన్నప్పట్లానే ఏవీ చెప్పలేక వెక్కుతూ ఆయన వెనక్కి చేరేం.
“ఏవిటి రఘూ ఇది..” అంటూ చాలా నెమ్మదిగానే ప్రారంభించేరు. మేష్టారు. కాని అడిగేది అడగనివ్వకుండా, చెప్పేది చెప్పనివ్వకుండా..” ఒరే గురూ మేష్టారికి మనం గురుదక్షిణ బాకీ ఉండిపోయేం గురూ..” అని రఘు అనడం ఏమిటి ముగ్గురూ…? మేష్టారిమీద పడ్డారొక్కసారి మేం బిక్క చచ్చిపోయేం మా మాట అలావుంచి పాత పగతో మేష్టార్ని ఏంచేస్తారోనని బెంగటిల్లిపోయాం.
కాని…క్రిందపడ్డ మేష్టారు మేష్టారులా కాక దెబ్బ తీసే వస్తాదులా లేచేరు.
మెరుపుల్లాగా, పిడుగుల్లాగా గుభీ గుభీమని ముగ్గురుకి ఏకకాలంలో వడ్డిస్తున్నారు. ఆరడుగుల దున్నపోతులాంటి వాళ్ళూ ఆయనమీదికి వెళ్ళడం.. వెళ్ళినట్టేవెళ్ళి అంతదూరాన దభీమని పడటం.. ఏదో మంత్రంగానీ గురువుగారికి వచ్చునా అన్పిస్తోంది వాళ్ళు చెయ్యెత్తేలోగానే వాళ్ళ మెడల మీద కత్తివేటులాంటి అరిచేతి పోటుతో దెబ్బతీస్తున్నారు.
అందులో ఏదో ఇష్టం వచ్చిన దెబ్బ కొట్టడంలా కాక ఏదో నేర్పు కనిపిస్తుంది. కొద్దిసేపట్లో వాళ్ళు ముగ్గురూ నేలకరిచేక కానీ, అది బహుశా ఆయన కుస్తీ పట్లూ, జూడో నేర్చుకుని వుంటారని మాకు తట్టిందికాదు.
“పదండర్రా. మీ ఇళ్ళదగ్గర దిగబెట్టిపోతాను.” అంటూ చేతులు దులుపుకుంటూ మా దగ్గరకొచ్చాక కూడా ఆయన నిగ్రహంకేసి కళ్ళప్పగించి చూస్తూండిపోయేం.
“ఏవిటర్రా.. అలా ఉండిపోయేరు పదండి పదండి ఇళ్ళదగ్గర మీవాళ్ళెంత గాభరా పడుతుంటారో..” అంటున్న ఆయన మాటలకడ్డుపడుతూ అదికాదు మేష్టారూ. మీరు ఫైటింగ్..” అంటూ నసిగేను.
“అదా… నేర్చుకున్నానులే… లేకపోతే ఇన్విజిలేషన్సులోనూ, స్టూడెంట్ల గొడవల్లోనూ నెగ్గుకు రాగలనా..” అంటూ తేల్చి నవ్వేసి, “సరేగాని.. మంగతాయారూ.. నువ్వూ జూడో నేర్చుకుంటావేమిటి?” అన్నారు మేష్టారు నడుస్తూ.
ఠీవీగా మా ముందు నడుస్తూన్న మా మేష్టార్ని చూస్తుంటే.. ఆయన అన్నమాటలు విఁట్టూంటే.. రఘూలాంటి వాళ్ళకెలా బుద్ది చెప్పాలా అని ఆలోచిస్తూ ఉండే నాకు ఏదో మార్గం చూపిస్తున్నట్టు అన్పించింది.