పందిరి నీడ
- వదలి రాధాకృష్ణ
‘తాతయ్యా! మనకు గుడి ఎంత దూరం! ఈ రోజు కోటిసోమవారం కదా గుడికి వెళ్ళి దర్శనం చేసుకు వద్దామని.’
భానుమూర్తి మాట్లాడలేదు.
‘అదే తాతయ్యా! శివయ్య గుడి అయితే మరీ మంచిది.’
‘ఇవన్నీ ఎవరు చెప్పారే నీకు. అసలు మీ ఊరిలో శివాలయం ఉన్నదా!’
‘లేకేమి. కాకపోతే మాకు ఓ పది కిలోమీటర్లు దూరం ఉంటుంది. డాడీ ప్రతిసారీ కార్లో తీసుకెళతారు.
‘మీ డాడీకి నిన్ను కారులో గుడికి తీసుకెళ్లే అంత తీరిక ఉందా’
‘ఉండకపోవడమేమిటి. తీసుకెళ్లకపోతే ఈ సంగీత ఊరుకుంటుందా ఏమిటి!’ అయినా ఎందుకలా అడుగుతున్నావ్.
‘లేదమ్మాయ్! ఐదు సంవత్సరాలు గడిచిపోయినా స్వంతదేశానికి వచ్చే తీరిక లేని మీ డాడీకి నిన్ను పది కిలోమీటర్లు తీసుకెళ్లే తీరిక దొరుకుతోందా అని.’
‘దట్స్ ఐయామ్ సంగీత’ గలగలా నవ్వేసింది.
భానుమూర్తి మాట్లాడలేదు.
‘సర్లే చెప్పు తాతయ్యా! ఈ కోటిసోమవారం రోజున శివాలయానికి వెళ్ళి దీపారాధన చేసి రావాలని!!’
‘ఈ ఊరిలో శివాలయం లేదు. మన ప