కవితా స్రవంతి

*తెలుగు వెలుగు*

కవితా స్రవంతి
-అభిరామ్ పరాయి భాషలన్ని నేలపై తారలైతే ఆ తారలకే వెన్నెలనిచ్చే నేల చంద్రుడే తెలుగు పరాయి భాషలన్ని ప్రవాహించే నదులైతే ఆ నదులన్నింటికి పవిత్రతనిచ్చే గంగతీర్థమే తెలుగు పరాయి భాషలన్ని గొప్పగా కనిపించే చెట్లు అయితే ఆ చెట్లన్నిటికి ప్రాణం పోస్తూ తన ఘనతను త్యాగం చేసే వేరు రూపమే తెలుగు పరాయి భాషలన్ని మాటలైతే ఆ మాటలకే మమకారం పంచే మాధూర్య స్వభావం తెలుగు పరాయి భాషలన్ని పోటాపోటి తత్వాలైతే ఆ పోటికే దీటుగా నిలిచిన ద్రవిడ భాష తెలుగు

తెలుగు వైభవము

కవితా స్రవంతి
-రచన: ఆచార్య రాణి సదాశివ మూర్తి సంస్కృతమ్ము నుండి సంస్కారములనొందె తమిళ కన్నడాలతళుకులొందె మలయసింహళములమక్కువన్ మన్నించె మధ్యదేశభాష మదిని నిల్పె. ఒరియ నుడిని గూడి ఒరవడి గుడికట్టె తెల్ల వాని భాష తెగువ జూచె. పారసీకపుర్దు భాషల యాసల తనవి చేసుకొనియె తనివి దీర. తెలుగు పాత్రలోన తేనెలూరగ నిండి భాషలన్నికలిసి బాస జేసె మధురసమ్ములేము మధుపాత్ర తెలుగేను దేశభాషలందు తెలుగు లెస్స భాష తెలుగు జూడ భావమ్ము తెలుగేను బలము మేమె వెనుక ఫలము తెలుగు. పలికె నిట్లు తాము పలుకుబడుల పెంచె తెలుగు జగతిలోన తేజరిల్ల. రాజసభలలోన రాణించె రసరమ్య కవులకావ్యవాటి కన్య తాను. పద్యగద్యకృతుల పరిపాటి తానాయె తెలుగు నింగి తనకు తెన్ను యనుచు. -:-

తెలుగు తల్లి

కవితా స్రవంతి
- బులుసు వెంకటేశ్వర్లు మధురమైన తెలుగుతల్లి మది పూచిన కల్పవల్లి పూలతేనే జావళి లో పులకించిన వెలుగువల్లి ఆణిముత్యముల వంటి అక్షరములురా అమ్మ మాట తొలిపాఠం అయిన భాష రా "2" జీవనదుల గలగలలై నినదించునురా జానపదుల గుండెల్లో నిదురించునురా తమిళ కవులు మనసుపడిన తరతరాలు విరబూసిన వెలుగుల వెన్నెల మడుగు కైతల ముత్యాల గొడుగు "2" పద్యానికి గద్యానికి పరిమళమ్ములద్దురా తల్లి భాష మారువకుంటే జీవితమె ముద్దురా   *****

శరత్ పున్నమలు

కవితా స్రవంతి
-శాంతి కృష్ణ (హైదరాబాద్) అరుదెంచిన ఆనందమేదో చైత్రగీతమవుతుంటే.... ఎన్ని జ్ఞాపకాల మధురిమలో పువ్వులా విచ్చుకున్న మనసుపై అదేపనిగ పుప్పొడులు కురిపిస్తున్నాయి.... ఈ ఏకాంతానికిపుడేపేరు పెట్టాలో తెలియట్లేదు.... వద్దన్న కొద్దీ మోసుకొచ్చే నీ ఊసుల తెమ్మెరలతో తన్మయమొందుతున్నాయి పరిసరాలన్నీ.... మళ్ళీ నిన్ను నాకు పరిచయం చేస్తూ పేరు తెలియని భాషలో మనసు అదేపనిగ కావ్యాలు రాస్తోంది.... గాలి లాలి పాటలో జోలపాడే ఈ రేయిలో కలల వర్షంలో మరీ మరీ తడవాలనుంది.... ఎన్ని మధుర భావనలు కురిశాయో.... కన్నులిపుడు శరత్ పున్నమలై వెలుగుతున్నాయి...!!

గురువులంటే జ్ఞానసిరులు

కవితా స్రవంతి
-"జనశ్రీ" జనార్ధన్ కుడికాల(వరంగల్) పల్లవి: గురువులంటే జ్ఞానసిరులు - గురువులంటే సురవరులు ప్రతిభాపాటవాలు పరిమళించు విరులు || గురువు || చరణం: విశ్వమంత విస్తరించు విజ్ఞాన వీచికలు విద్యార్థి లోకానికి నవ్య దిక్సూచికలు || విశ్వ || అజ్ఞానపు అడివి నుంచి విజ్ఞాపు వీధిలోకి నవయువతను నడిపించే నరవరుల పాచికలు || గురువు || చరణం: నమస్కార బాణాలకు లొంగిపోదురు సంస్కార శిష్యులగని పొంగిపోదురు || నమ || మత్సరాలు పెరిగినపుడు మానవతం తరిగినపుడు మదిలోపల మధనపడుచు కుంగిపోదురు || గురువు || చరణం: గురు శక్తి గొప్పదా? గురుభక్తి గొప్పదా? గురు శిక్షణ గొప్పదా? గురుదక్షిణ గొప్పదా? || గురు || తరతరాల తర్కమైన ఈనాటికి తేలకున్నా గురుశిష్యుల బంధము అన్నిటికన్న మిన్న || గురువు ||

స్వార్థమనర్థము

కవితా స్రవంతి
-చంద్రశేఖర్. పి.వి. తానొక సమిధగా పరమార్థభావనతో ప్రకృతి మన ప్రత్యక్ష దైవమై స్ఫూర్తిగా నిలిచె ! పృథివి పథము జూపె, జనుల మనుగడ నెంచె సహన మార్గమే మనకు సహజమని నేర్పె ! ప్రాణవాయువు మనకు పరమావశ్యమనె కలుష జీవనమది విషతుల్యమని ఎంచె ! నింగి నేలను కలుపు నిత్యరశ్మితో మనకు చైతన్యము నింపె మనము చతురతతో మెలగ ! రెక్కలతో పైకెగిరి విత్తన వ్యాప్తితో సతత హరితము కొరకు పక్షులు ప్రాకులాడె ! కొండకోనలు దాటి నిండైన మనసుతో దాహార్తి తీర్చిన నీరు ప్రాణదాతగ మెరిసె ! ఎదిగి ఒదగమని దిగజారవద్దని ఆకసమే హద్దని వృద్ధి హితవుల పలికె ! పంచభూతాలన్ని పరహితము నెంచగా కించిత్ ప్రేమ లేని ఈ మానవాళి ! కలికాలమన్న ఏ కాలమో ఎరుగ అపకారమే కాని ఉపకారమెరుగదు ! స్వార్థ రచనలే కాని, సర్వహితములు లేవు ఆర్తనాదమే కానీ, ఆర్ద్రతలు కరువు ! విశ్వ విజయమునకు నిస్వార్థ మవసరము మానవా ! మానవా ? స్వార్థచింతనము !

కవిత్వం

కవితా స్రవంతి
- పారనంది శాంతకుమారి రాసేవారు ఎక్కువ,చదివేవారు తక్కువ ఇదీ నేటి కవితల పరిస్థితి. రాశి ఎక్కువ,వాసి తక్కువ ఇదే ఇప్పటి కవిత్వపు దుస్థితి. పదం పక్కన పదం పేరిస్తే దానినే కవిత్వమనుకోవటం పైత్యం. పదం హృదయాని స్పందిస్తే అది కవిత్వమౌతుందనేది సత్యం. మదిలో అలజడి కలిగితే కవితకు తొలినుడి చుట్టబడుతుంది. భావావేశపు సుడిలో మునిగితే కవితకు గుడి కట్టబడుతుంది. నిశ్శబ్ధంతో నువ్వు చేసే యుద్ధంలో నిర్వేదంతో నిన్నునువ్వు చూసుకొనే నిబద్ధంలో కవిత్వం జాలువారుతుంది. నిగూఢంలో నీతో నీవు చేసే సాహచర్యంలో నిర్భేధ్యంగా నీపై నీవు జరిపే గూఢచర్యంలో కవిత్వం నిన్ను చేరుతుంది.   ***

రెండవ వైపు

కవితా స్రవంతి
- భమిడిపాటి స్వరాజ్య నాగరాజా రావు అట్టుకు రెండవ వైపు ఉంటుందని తెలుసుకోలేని అజ్ఞానులం మనం. మన ………మనదీపమై వెలుగుతోందని గర్విస్తామే తప్ప, అదే దీపం మనం చేసుకున్న పాపమై, భవిష్యత్తులో మననే కాలుస్తుందని తెలుసుకొనలేము. కన్నూమిన్నూ కానని ఆవేశంలో, మిడిసిపాటుతో కూడిన యవ్వనంలో, మనం ఆడిందే ఆట, పాడిందే పాట అవుతూ ఉంటే, అదే శాశ్వతం అనుకుంటూ గడుపుతాము నేడు ఇటుకాలిన అట్టు రేపు అటుకూడా అలానే కాలుతుందని, గుర్తించలేము,తెలుసుకోలేము నేటి మన దుష్ప్రవర్తనలే రేపటి యమ పాశాలై మనని దుఃఖానికి గురిచేస్తాయని ఊహించలేము తీరా తెలిశాక చేయటానికి ఏమీ మిగిలి ఉండదు అనుభవించటమే తప్ప ఆలోచనకు తావుండదు ఆక్రోశించటమే తప్ప ఆచరణకు అవకాశం ఉండదు   ***