కరోనా నేర్పుతున్న ఒక గొప్ప పాఠం “మనిషి సంఘజీవే “
మనిషి తన జీవన ప్రయాణంలో తనకు ఎదురయ్యే ఎన్నెన్నో సంఘటనల ద్వారా కావాల్సినన్ని అనుభవాలు పొందుతూనే ఉంటాడు. అందుకే ప్రతి సమస్యలో, ప్రతి సంక్షోభంలో ఎన్నెన్నో కొత్త కొత్త పాఠాలు నేర్చుకుంటూనే ఉంటాడు. ఈ నేపధ్యం లో భాగంగా ప్రస్తుత సామాజిక ప్రపంచం లో వందల కోట్ల మంది ప్రజలు కరోనా రక్కసి కారణంగా “ఆరోగ్య సంక్షోభంలో” కూరుకొని పోయి స్వీయరక్షణ మార్గాల ద్వారా తమ ఆరోగ్యాలను కాపాడుకొనే దిశగా అడుగులు కదుపుతున్నారు.
ఇందులో భాగంగా ముఖ్యంగా మన దేశంలో కోట్లాది ప్రజలు “లాక్ డౌన్ ” ప్రక్రియలో భాగంగా తమ తమ ఇళ్లకే పరిమితమయ్యారు. దీనివలన ప్రధానంగా ఉద్యోగులు ,వ్యాపారస్తులు లేదా ఇతర వృత్తులలో ఉన్నవారికి కళ్ళ ముందే కుటుంబ సభ్యులు, వేళకు ఆహారం,పిల్లలతో ఆహ్లాదం అలాగే వృత్తి ,వ్యాపారాలలో ఇంటికే పరిమితమై పని చేసే వారికి పెద్దగా ఒత్తిడి లేని స్వేచ్ఛాయుత పని విధానాలు, కొంతలో కొంత ఆర్ధిక భరోసాలు, కావాల్సినంత సేపు మొబైల్ మాటలు, చేయగలిగినంత మేరకు చాటింగులు, ఓపిక వున్నంతవరకు బుల్లితెరల కాలక్షేపాలు ఇది ప్రస్తుతం నడుస్తున్నమన జీవన విధానం. నిజంగానే ఇటువంటి సౌకర్యవంతమైన అవకాశాలు రమ్మన్నా వస్తాయా! ఇలా కలిసిమెలిసి అందరూ ఒకే చోట రోజులకు తరబడి వుండే అవకాశం యెంత అమూల్యం! దీనిని ఒక చక్కని అవకాశంగా సద్వినియోగం చేసుకోవాలి అనే వార్తలు, వ్యాఖ్యానాలు మొదట్లో బాగా వినపడ్డాయి ఇప్పటికీ కొద్దిగా ధ్వని మందగించినా కూడా ఇప్పటికీ వినపడుతూనే వున్నాయి.అయినా సరే ఇంతటి అపూర్వ అవకాశాలు కళ్ళ ముందర ఉన్నాకూడా కుటుంబాలలో ఏదో తెలీని వెలితి, కనిపించని దిగులు, తెలియని ఒంటరితన భావన, వెంటాడే భయం,చెప్పలేని లేదా చెప్పుకోలేని బాధ. మరి ఇన్ని మానసిక ప్రకంపనలకు కారణాలు ఏమిటి ? అదే సందర్భంలో దీని కనుగుణంగానే ఏర్పాటవుతున్న”ఆన్ లైన్ కౌన్సిలింగ్” సెంటర్స్ యొక్క ప్రాముఖ్యతలు ఎందుకు పెరుగుతున్నాయి?
వాస్తవాన్ని పరిశీలిస్తే స్వతహాగానే ప్రముఖ తత్వవేత్త అరిస్టాటిల్ ప్రకారం “మనిషి సంఘజీవి” (Man is a Social Animal). ఇన్ని సౌకర్యాలు కళ్ల ముందే వున్నా Social Connectivity Chain లో వచ్చిన దూరమే మానసిక అసమతూల్యతలకు ప్రధాన కారణాలుగా మారినాయి. ఒక్కసారి మనకు మనంగా పరిశీలించుకుంటే నిన్నటి వరకు నయా సాంకేతిక పరిజ్ఞాన సంస్కృతిలో మునిగిపోయి మన ప్రక్క మనిషితో మాటలున్న లేక పోయినా,మాట్లాడే ఇష్టత వున్నా లేకపోయినా, ప్రక్క వారి సంగతులు మనకెందుకులే అని అనుకున్నా, అసలు పరాయి మనిషితో మనకు పనేమిటి? అని అనుకున్నా కూడా,అరచేతిలో సాంకేతిక పరిజ్ఞానం ఇమిడి ఉండి కూడా .. ఇపుడు తెలుస్తోంది నిర్మానుష్యమైన రహదారుల నిశ్శబ్ద ఘోష, రోడ్డు మీద మనిషి లేడు ,మనిషి మాట లేదు .ఎక్కడ చూసిన ప్రశాంతమే,నిశ్శబ్దమే ఎప్పటికి ఈ మౌనంలో నుండి మాట పుట్టేది, పొంగి పొరలేది. అందుకే వ్యక్తిగా మనం ఎప్పటికీ “సంఘ జీవులమే” ప్రతి కుటుంబమూ సంఘంలో భాగమే. ఈ వాస్తవం మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన విషయం .
అందుకే మనిషి అంతర్లీనంగా కోరేది సామాజిక మౌనం కాదు సమాజం లో గల గల పలికే మనుష్యుల మాటల శబ్దమే! అదే మనలో అంతర్లీనంగా నిక్షిప్తమై మన గమనంలోకి రాని ఒక మానసిక భరోసా అవే సమాజంలోని మనిషి కదలికలు. అందుకే ఈనాటి ఈ “ఆరోగ్య సంక్షోభం” తాత్కాలికంగా మనల్ని భౌతిక దూరం పాటించమన్నా భవిష్యత్లో సామాజికంగా మనిషితో మనిషి మానసికంగా దగ్గరవ్వాలన్నదే కరోనా నేర్పుతున్న ఒక గొప్ప పాఠం! అవునంటారా!
అమరనాథ్.జగర్లపూడి
కౌన్సిలింగ్ సైకాలజిస్ట్
9849545257