శీర్షికలు

పద్యం – హృద్యం

– పుల్లెల శ్యామసుందర్

ఈ క్రింది “ప్రశ్న”కు పద్యరూపములో జవాబు పంపాలి. మీ జవాబులు విద్యుల్లేఖ ద్వారా (e-mail : padyam_hrdyam@yahoo.com) మాకు 20వ తారీఖు లోపల పంపించండి. ఉత్తమ పూరణలను తరువాయి సంచికలో ప్రచురిస్తాము. ఈ శీర్షికలో ప్రచురించడానికి పాఠకులనుండి పూరణలు మాత్రమే కాకుండా ప్రశ్నలను కూడా ఆహ్వానిస్తున్నాము. ప్రశ్నలు వీలున్నంతలో తేట తెలుగులో ఉండి, సమకాలీనములైతే బాగుంటుందని మా అభిప్రాయము.

ఈ మాసం ప్రశ్న:
సమస్య: రామా యన బూతుమాట రమణీ వినుమా!

గతమాసం ప్రశ్న:
సమస్య ” నీటి పైన వ్రాత నిలిచెను గద” (శ్రీ K.N.వరప్రసాదు, ఏలూరు, గారు పంపినది)

ఈ ప్రశ్నకు మాకు అందిన క్రమములో పూరణలు ఇలా వున్నాయి.

రాజేశ్వరి నేదునూరి, న్యూజెర్సీ

తామ రాకు పైన తనరి మెరయుచుండు
నీటి పైన వ్రాత నిలచెను గద
నేతి బీర లోన నేయెంత నిండునో
నీలి మేఘ మంత నీటి బుడగ

పోచిరాజు కామేశ్వర రావు, రాయిపూర్

దేశ దాస్య మెల్లఁ దీరంగఁ బ్రాణమ్ము
లొడ్డి పోరి రెల్ల రుత్తమముగ
ధరణి వారి హృద్విదార కోష్ణంపుఁ గ
న్నీటి పైన వ్రాత నిలిచెను గద

వారణాసి సూర్యకుమారి, మచిలీపట్నం

గాలి లోన మాట కలసి పోవును గాని
మంచి మాట నిలుచు మనసు లోన
నీటి కొరత దీర్చు నిర్ణయమ్మున నేత
నీటి పైన వ్రాత నిలిచెను కథ

సహస్రకవిరత్న, సహస్ర కవిభూషణ శ్రీమతి.జి. సందిత.బెంగుళూరు.

నేర్పనెంచె పొదుపునీటికరువునెంచి
వ్రాయగ నియమించెవ్యాఖ్యలెన్నొ!
ప్రభుతయాజ్ఞలిడగ పట్టణవీధులన్
నీటి పైన వ్రాత నిలిచెను గద!

“కళాగౌతమి” బులుసు వేంకట సత్యనారాయణ మూర్తి,రాజమహేన్ద్రవరం

కరుణ చూపి తాను కావ్యమ్ము వ్రాసెను
పూవు లేడ్చె నంచు పుణ్యమూర్తి
ఎదుటి వారి బాధ నెఱుఁగంగ వ్రాయ, క
న్నీటి మీది వ్రాత నిలిచెను గద

డా.రామినేని రంగారావు యం,బి,బి,యస్, పామూరు,ప్రకాశం జిల్లా.

చట్ట మెప్పుడైన చుట్టమే మాకౌను
పదవి, డబ్బు, హోద వదలకున్న
జయము మాదె యన్న జయబృంద స్థితి చూడ
నీటి మీద రాత నిలిచెను గద

చావలి శివప్రసాద్, సిడ్నీ, ఆస్ట్రేలియా

అభినవ మయసభలనదగునా రచనలు
నీటి తెరల మీద నేటి సృష్ఠి
తిమిర సంభవములు తెమ్మెరలందిరు
గాడు చిత్రములను కనుల విందు
గ గగన తలమందు కానగ క్షణమైన
నీటి మీద వ్రాత నిలిచెను గద!
(Based on the concept of water screen projection technique)

పుల్లెల శ్యామసుందర్, సాన్ హోసే, కాలిఫోర్నియా

పూలతోడ వ్యాఖ్య పొలుపుగా వ్రాయగా
పళ్ళెమందు నీరు బాగ పోసి
నీటఁ దేలు పూలు నేర్పుగా పేర్చగా
నీటి మీద వ్రాత నిలిచెను గద!
(Based on floating flower arrangements)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked