కథా భారతి

చేదు కూడా రుచే!

ఆచార్య పి.కె. జయలక్ష్మి M.A.,Ph.D.,
సోఫియా విశ్వవిద్యాలయం, సోఫియా, బల్గేరియా(EU)

సంజె వాలుతోంటే ఆనందవల్లి మొక్కల దగ్గర్నించి నెమ్మదిగా లేచి బియ్యం ఏరుతూ ఆలోచనలో పడింది. భర్త అనంతశయనం చదువుతున్న పుస్తకం బల్ల మీద పడేసి “ ఆనందం! రాత్రికి ఏం వండుతున్నావేంటీ?” అని ఆసక్తిగా అడిగాడు. “ ఆ! మధ్యాహ్నం ముక్కల పులుసు, దోసకాయ పచ్చడి ఉన్నాయిగా,అప్పడాలు వేయిస్తా లెండి.” అంది చిరాగ్గా. “ నాల్గు బంగాళాదుంపలు వేయిద్దూ,కరకరలాడుతూ కమ్మగా “ ఆశగా అడిగాడు వంటింటి గుమ్మం దగ్గర నిలబడి. ‘” అబ్బ! కోరికలకేమీ తక్కువ లేదు. అలాగే చేస్తా గాని మీరోసారి డాబా మీదకెళ్లి మల్లె తీగ పక్కకి వాలిపోతోంది సరిచేసి రండి” అంటూ కుక్కర్ పెట్టి, దుంపలు తరగడం మొదలు పెట్టింది ఆనందవల్లి. “ఇదిగో ఇప్పుడే వెళ్తా ,కాసేపు నడిచి కూడా వస్తా .వంట పూర్తవగానే పిలు.” అంటూ డాబా మీదకి వెళ్ళాడు అనంతశయనం.

ముక్కలు తరుగుతూ ఆలోచిస్తోంది ఆనందవల్లి.”’ ఏంటీ జీవితం? నాకంటూ పైసా సంపాదన లేదు.అన్నిటికీ మొగుడి దయాధర్మం మీద ఆధారపడాల్సిందే! చిన్నప్పుడు నాన్న ముందు, పెళ్లయ్యాక మొగుడు ముందు చెయ్యి చాచడమే తప్ప తనకి వేరే గత్యంతరం ఏముందసలు? వానాకాలం చదువుతో పెళ్లి చేసేసి బాధ్యత వదిలించుకున్నారు ఇంట్లోవాళ్లు. చదువుకొని ఉంటే ఎంత బాగుండేది? దర్జాగా ఉద్యోగం చేసుకుంటూ ఎవరిమీదా ఆధారపడకుండా నచ్చినట్లు ఖర్చు పెట్టుకుంటూ ఉండేదాన్ని కదా? పెళ్లయ్యాక కుటుంబ బాధ్యతలు,పిల్లల చదువులు, పెళ్ళిళ్ళు,ఇల్లు కట్టుకోవడం…..ఎప్పుడూ తీరిక లేదు. తన గురించి ఆలోచించుకునే సమయమే లేదు. తనకేం కావాలో తనకే తెలియకుండా భర్త తెచ్చిన దాంట్లో సరిపెట్టుకుంటూ, ఏ కోరికలూ లేకుండా 40 సంవత్సరాలు గడిపేసింది. ఈమధ్య భర్త రిటైర్ అయ్యి స్వగ్రామం లో సొంత ఇంట్లో స్థిరపడ్డంతో కాస్త ఊపిరి పీల్చుకున్నట్లయింది.

ఇప్పుడిప్పుడే ఆమెకి తను ఇన్నేళ్లు ఏం పోగొట్టుకుందో అర్ధమవసాగింది. ఆరోజు భర్త అలా ప్రవర్తించకపోతే ఈ ఇంట్లో తన స్థానం ఏంటో తనకెప్పుడూ తెలిసేదే కాదు. తన స్నేహితురాలి మనవడి పుట్టినరోజుకి బహుమతి కొనాలని భర్తని డబ్బులడిగితే “ఎందుకిప్పుడు?”అన్నాడు. తనకి చాలా బాధన్పించింది. ఆయన ఎవరికి ఏమిచ్చినా తను అడగదు.తనకి చెప్పడు కూడా. ఇంటిక్కావాల్సినవన్నీ తెచ్చి పడేస్తాడు. కాపురానికొచ్చినప్పటినించీ తనేనాడూ బజారుకెళ్లి ఏమీ కొన్నట్టు గుర్తు లేదు. తనకేo కొనాలో ఎప్పుడూ కొనాలో ఆయనకి బాగా తెల్సు. తనకి ఎప్పట్నించో కోరిక….తనకంటూ కాస్త డబ్బు ఉండాలని, తనకేమైనా కావాలన్పిస్తే తనంతట తాను కొనుక్కోవాలని…! అందుకే ఒకట్రెండు సార్లు అడిగింది కూడా …. “ ఏమండీ! నాక్కొంచెం డబ్బులివ్వరూ… ఏమైనా కొనుక్కుంటాను” అని. “ ఏం కావాల్రా ఆనందం?” అంటూ ముద్దుగా అడిగాడు. కానీ ఏం కావాలో వెంటనే చెప్పలేకపోయింది తనే. “ చూశావా! నీకేం కావాలో నీకే తెలియదు. డబ్బులివ్వడం నాకిష్టం లేదనుకోకు. ఎక్కడైనా పడేస్తావు అలవాటు లేక. నీకేం కావాలో చెప్పు కొనిపెడతాను.” అన్నాడు. తనకేం మాట్లాడాలో తెలియలేదు.
ఎప్పుడైనా పుట్టింటినించి అన్నదమ్ముల పిల్లలెవరైనా వస్తే వాళ్ళకి డబ్బులిద్దామంటే తన చేతిలో ఉంటే గదా? భర్తని అడిగితే ఎందుకు, ఎంత అని అడిగి సగం మాత్రం చేతిలో పెడతాడు. చాలా చిన్నతనంగా అంపిస్తుంది వల్లికి. ఇటు పుట్టింత్లోను.అటు అత్తింట్లోనూ వదినలు, తోడికోడళ్ళు ఉద్యోగాలు చేయకపోయినా డబ్బు పెత్తనం మాత్రం వాళ్ళదే! పుట్టింటికి వెళ్తే తనకి బొట్టుపెట్టి ఏమైనా కొనుక్కోమని వదినలే తన చేతిలో డబ్బు పెడతారు, అన్నయ్యలేమీ కల్పించుకోరు. కానీ భార్య చేత్తో కాకుండా అక్కగారికి తానే స్వయంగా డబ్బులిచ్చుకుంటాడు అనంతశయనం. ఇంక లాభం లేదు ఇన్నాళ్ళు ఆయన చెప్పినట్టల్లా ఆడాను,ఇవాళ అటో ఇటో తేల్చేస్తాను ఏమైతే అదవనీ అని గట్టిగా తీర్మానించేసుకుని భర్తని భోజనానికి కేకేసింది వల్లి. కంచాలు పెట్టి వడ్డిస్తూ “ ఏమండీ నేనొకటి అడగనా?” అంది. “ఏంటోయ్ కొత్తగా అడుగుతున్నావ్ ? వేపుడు బాగుంది” అని కరకరలాడించాడు. “ ఏం లేదు. నాకు ఇకనించీ చేతి ఖర్చు కింద నెలకి 500 కావాలి.” అంది పాఠం అప్పచెప్తున్నట్లు. “ చేతి ఖర్చా?” పెద్దగా నవ్వాడు. “ఎందుకో?” అన్నాడు పులుసు వేసుకుంటూ “, ఎందుకో చెప్తే గాని ఇవ్వరా? నా కుండే ఖర్చులు నాకుంటాయి.’” అంది కోపం మేళవించిన స్వరంతో”. సరే ఇవిగో తాళాలు, అదిగో బీరువా ! ఎంత కావాలో తీస్కో కానీ ఎందుకో కూడా చెప్పాలి మరి” అన్నాడు గోడకి తగిలించిన తాళాలు చూపిస్తూ. “అహ అలా కాదు నాకంటూ ప్రతి నెలా 500 ఇవ్వాలి లెక్క అడక్కూడదు” అంది అమాయకంగా. “అదేంటలాగ? నాకు తెలియకూడని ఖర్చులేమున్నాయేంటి? అయినా ఎప్పుడూ లేంది ఏంటిది కొత్తగా?” మజ్జిగన్నం తింటూ విసుగ్గా అడిగాడు అనంతశయనం.

“ఏవో ఖర్చులుంటాయి. ఇంటికి ఎవరైనా రావచ్చు నేను నా స్నేహితులిళ్ళకో, బంధువులిళ్ళకో ఏ శుభకార్యానికో వెళ్ళచ్చు లేదా గుమ్మంలోకి ఎవరైనా రావచ్చు. ప్రతిసారీ మిమ్మల్ని దేవుళ్లాడ్డం కంటే నా దగ్గర కొంత డబ్బుంటే ఇబ్బంది ఉండదు కదా. మీరూ ఆలోచించండి.” అంది బతిమాలుతున్నట్లుగా“. ఓహో! అందరికీ పందేరాలు చేయడానికన్నమాట. నీకు బొత్తిగా డబ్బు విలువ తెలియదు ఆనందం. నేను సంపాదించింది అందరికీ దానధర్మం చేయడానికి కాదు. నీకేమైనా కావాలంటే చెప్పు కొనిపెడతాను. అంతేగానీ చేతిఖర్చు పేరుతో ఎవరెవరికో పంచుతానంటే ఒప్పుకోను” అని విసురుగా లేచి వెళ్లిపోయాడు. హతాశురాలైంది వల్లి. భర్త మాటలకి కళ్ళ నీళ్ళు తిరిగాయామెకి . కళ్ళు గట్టిగా తుడుచుకొని పడగ్గదిలోకి భర్త వెనకాలే వెళ్ళి “ రేపు పెద్దాడి దగ్గరకి వెళ్తున్నాను, వాడూ ఎప్పటినించో రమ్మనమని అడుగుతున్నాడు.” అంది బీరువా మీంచి పెట్టె దించుతూ. “ ఓహో! డబ్బులు గురించే కదా? వెళ్తే వెళ్ళు బెదిరించక్కర్లేదు!” అన్నాడు కోపంగా. మాట్లాడకుండా పెట్టె సర్దేసుకుంది వల్లి. కొన్నాళ్లు తను లేకపోతే ముసలాయనకి తన విలువ తెల్సివస్తుంది. చక్కగా అన్నీ వేళకి అమర్చి వేడివేడిగా వండి వారుస్తూంటే అయ్యగారు మరీ విర్రవీగుతున్నారు. చూస్తా ఒంటరిగా ఎలా ఉండగలరో? అనుకుంది మనసులో.

ఇంట్లో మౌనం రాజ్యమేలసాగింది.ఆమె మౌనం అనంతశయనాన్ని కుదిపేస్తోంది. పెళ్ళైన ఇన్నేళ్లల్లో భార్య ఎప్పుడూ ఇలా అలగలేదు. ఉద్యోగం చేసే రోజుల్లో తాను పని హడావిడి లో ఉంటే ఆమె కుటుంబనిర్వహణ లో తలమునకలుగా ఉండేది. కానీ ఇప్పుడు బోలెడంత విశ్రాంతి. పిల్లలు ఎవరి మానాన వాళ్ళున్నారు.ఏ సమస్యా లేదు. హాయిగా ఉండక ఇప్పుడేంటి ఇలా కొత్త సమస్య తెచ్చిపెట్టింది? నెలవారీ చేతి ఖర్ఛంటూ…? ఏం చేస్తుందో లెక్క అడక్కూడదట. ఇవ్వనన్నానని కొడుకు దగ్గరకి వెళ్లిపోతానని బెదిరింపొకటి. నిజంగా వెళ్లిపోతే నేను ఒంటరి అయిపోనూ?
తెల్లవారే లేచి ఆనందవల్లి గబగబా పనులన్నీ తెముల్చుకొని స్నానం, పూజ కానిచ్చి పెట్టె పట్టుకుని ముందుగది లోకి వచ్చి కూచుంది. కిటికీ లోంచి చూస్తే వీధి చివర వచ్చే బస్సు కన్పిస్తుంది. ఇంటి ముందుకి రాగానే చెయ్యెత్తితే డ్రైవర్ బస్సాపుతాడు. రెండు గంటలు ప్రయాణం చేస్తే కొడుకు దగ్గరకి చేరుకోవచ్చు. అనంతశయనం నిద్ర లేవగానే భార్య తయారై ఉండడం చూశాడు. ఏం మాట్లాడకుండా బాత్రూమ్ లోకి దూరాడు. ఆనందం వెళ్లకుండా ఏం చేయాలి అని ఆలోచించసాగాడు.

ఒకపక్క బస్సు ఇంకా రావడం లేదు. వల్లి మనసు పరిపరి విధాలా పోతోంది, తను వెళ్లిపోతే ఎలా?అనవసరంగా గొడవ పెట్టుకున్నాను. ఏదో … జీవితం ఎలాగో గడిచిపోతోంది. ఇన్నేళ్ల బట్టీ లేనిది ఇప్పుడేందుకు చేతి ఖర్చు అంటూ అడగడం? అయినా ఆయనైనా వెళ్ళొద్దు ఆనందం, ఉండిపోవే తప్పైపోయింది అని బతిమాలితే ఉండిపోనూ? మొండి మనిషి కాకపోతే?.ఈలోగా అననతశయనం వంటింట్లో కాఫీ వేడి చేసుకొని కప్పులో పోసుకొని తాగుతూ డ్రాయింగ్ రూమ్ లో నించొని బస్సు కోసం ఆతృతగా ఎదురు చూడసాగాడు ఆనందవల్లికి వీడ్కోలు చెప్పడానికా అన్నట్లు. కాసేపట్లో ఎదురుచూపులు ఫలించి దుమ్ము రేపుతూ బస్సు వస్తూ కన్పించింది. వల్లి నిస్త్రాణగా పెట్టె పట్టుకొని లేచినిలబడింది.

అనంతశయనం ధోవతి సవరించుకుంటూ “ నువ్వు నాతో ఉండడానికి ఇష్టపడ్డం లేదుగా! అందుకే ఈ ఇంట్లో నువ్వే ఉండు, నేను వెళ్లిపోతున్నా!”అంటూ గబగబా బైటకి వెళ్ళి బస్సాపి ఎక్కి కూచోగానే రయ్యిమంటూ బస్సు కదిలిపోయింది. ఊహించని ఈ హఠాత్పరిమాణానికి ఆమె నిర్ఘాంతపోయింది. ఒక్కసారిగా నిస్సత్తువ ఆవరించిందామెని. ఇప్పుడేం చేయాలో అర్ధం కావడం లేదు. భర్త ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? చేతిలో డబ్బులు కూడా ఉన్నట్టు లేవు, బట్టలు కూడా తీసుకు వెళ్లలేదు,కోపంలో ఏ అఘాయిత్యమో చేసుకోరు కదా? అసలే బి పి మనిషి. వల్లికి తన మీద తనకే చాలా కోపం వచ్చింది. ఎవరైనా వింటే ఎంత అప్రదిష్ట? జీవితమంతా ఎన్ని కష్టాలు, ఎన్ని ఒడిదుడుకులు అనుభవించాం? పిల్లల్ని పెంచాం,చదివించాo, పెళ్లిళ్లు చేశాం , అన్నీ వేళలా కలిసే ఉన్నాం! అప్పుడేమీ అనర్ధాలు జరగలేదు. కానీ ఇప్పుడు ఈ వార్ధక్యం లో సుఖంగా కలిసి మెలిసి కాలం గడపాల్సిన తరుణంలో నేనెంత పని చేశాను? అని తనని తాను నిందించుకుంటూ , ఏడుస్తూ సోఫా లోనే నిద్ర లోకి జారిపోయింది. అలా ఎంతసేపైందో తెలియదు. ఎవరో తలుపు కొడుతోంటే ఉలిక్కిపడి కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న గడియారం చూస్తే పదిన్నర కావొస్తోంది. కళ్ళు తుడుచుకొని ఎవరా అని తలుపు తీస్తే పక్కింటి పెద్దరైతు దామోదరం గారబ్బాయి పదిహేనేళ్ళ రవి. “ఆంటీ ! అంకుల్ మీకు కాకరకాయలు ఇమ్మన్నారు మీకు చాలా ఇష్టం ట కదా? ఇప్పుడే వెల్లుల్లి కారం పెట్టి కూర చేసి మామిడికాయపప్పు, టొమాటో పెరుగుపచ్చడి చేయమన్నారు. చాలా ఆకలేస్తోందట. అంకుల్ పొలం దగ్గరే స్నానం చేసి వస్తారట.” నవ్వుతూ అన్నాడు లేత కాకరకాయలున్న సoచి చేతికిస్తూ.

“ఆయన పొలానికి ఎప్పుడు వచ్చారు?” ఆశ్చర్యపోతూ అడిగింది వల్లి. “అదేంటి మీకు తెలియదా?పొద్దున్నే బస్సులో… పొలం దగ్గర దిగిపోయి నాన్నగారితో కబుర్లు చెప్తూ కూచున్నారు. నేనిక్కడికి వచ్చే ముందే చెరువులో స్నానానికి దిగారు నాన్న, అంకులూ! వస్తా ఆంటీ!” అంటూ వెనక్కి తిరిగాడు రవి.
ఆనందవల్లి ఆనందపరవశురాలయింది. భర్త తనని బతిమాలి ఆపితే బాగుండనుకుంది, కానీ ఈ రకం గా బతిమాలి తను ఇలా ఆగేలా చేస్తాడనుకోలేదు. ఈ రెండు గంటల్లో తమ మధ్య ఉన్న అనుబంధం మరింత బలపడేలా చేసిన భర్త వైఖరిని ఆమె మెచ్చుకోకుండా ఉండలేకపోయింది. నేను గెలవనూ లేదు, ఆయన ఓడనూ లేదు అనుకుంటూ వల్లి కాకరకాయ కూరకి వెల్లుల్లి కారం తయారు చేసుకోసాగింది. చేదుగా ఉన్న కాకరకాయ ఆరోగ్యానికి చాలా మంచిది . చేదుకాకర ని కూడా రుచిగా వండుకోవచ్చు. చేదు కూడా రుచే .ఎప్పుడూ తీపి పులుపు కారమే తిన్నా మొహం మొత్తుతుంది, అప్పుడప్పుడు చేదు తింటేనే తీపి విలువ పెరిగేది. సంసారం లో కూడా ఇలా చిన్న చిన్న అలకలు పొరపొచ్చాలు వస్తూ ఉంటేనే ప్రేమ మరింత పెరిగేది. ప్రేమలో చేదు కూడా ఆనందాన్నిస్తుంది అనుకుంటూ దూరంగా వస్తున్న అనంతశ యనాన్ని చూసి ఆనందవల్లి ముసిముసిగా నవ్వింది.

** ** **

Leave a Reply

Your email address will not be published. Required fields are marked