కథా భారతి

తనదాకావస్తే?

-డా. పి. కే . జయలక్ష్మి

“అన్నయ్యా ! నీ దగ్గర రెండు పెన్సిల్ బాక్సులున్నాయిగా నాకోటివ్వవా!’’ గారంగా అడిగింది భవ్య. .’’అమ్మా ఆశ ! ఒకటి డాడీ కొన్నారు . ఇంకోటి నా బర్త్ డే కి నా ఫ్రెండు ఇచ్చాడు . ఐనా రెండో క్లాస్ లో ఉన్నావు, నీకప్పుడే పెన్సిల్ బాక్స్ ఎందుకే ? నాలాగా సిక్స్త్ కొచ్చాక ఇస్తాలే !” అన్నాడు వెక్కిరిస్తూ భరత్ ఇద్దరి సంభాషణ తన చెవుల్లో పడటంతో చేతిలో పని ఆపి నడుం మీద చేయి వేసు కొని ఏం మాటలు భరత్ ? అని కోప్పడింది తల్లి శ్రావణి . “లేకపోతే ఏంటమ్మా, నా దగ్గిర ఏం చూస్తే అవి తనకి ఇచ్చేయ మంటుంది చెల్లి…… ” ఇంకా వాడి మాటలు పూర్తవకుండానే “ తప్పేంట్రా ,అదేమైనా పరాయి పిల్లా ?నీ స్వంత చెల్లెలు . అన్న దగ్గిర ఏమైనా తీసుకునే హక్కు చెల్లికి కాక ఇంకెవరికి ఉంటుంది ? ఇవ్వడం అలవాటు చేసుకో ! ఆడపిల్లని బాధ పెట్ట కూడదు . ముందు దానికి ఆ బాక్స్ ఇచ్చేయ్ నేను చెప్తున్నాను ” అంటూ కసిరింది కొడుకుని . గొణుక్కుంటూ చెల్లి చేతిలో పెన్సిల్ బాక్స్ పెట్టాడు భరత్ . ‘ థాంక్యూ అన్నా’ పరిగెత్తింది భవ్య .

సాయంత్రం శశాంక్ ఆఫీస్ నుంచి రాగానే కాఫీ తాగుతూ “ శ్రావణీ ! వచ్చే వారం పిల్లలకి దసరా సెలవులు కదా ,అన్నయ్య విజయ నగరం రమ్మంటున్నాడు ,అక్క కూడ వస్తుందట వెళ్దామా ! ” అన్నాడు . ముందు వైజాగ్ వెళ్దాo కావాలంటే అక్కడ నుంచి వెళ్దాo . వైజాగ్ లో మా చెల్లి ,తమ్ముడు , మిగిలిన చుట్టాలు అంతా ఉన్నారు . బీచ్ సింహాచలం ఐనాక్స్ ఇవన్నీ చూడొచ్చు అంది కళ్ళు తిప్పుతూ శ్రావణి . అదేంటి శ్రావణీ ! మొన్ననే గా మేనకోడలు పుట్టిన రోజని పిల్లల స్కూలు కూడ మాన్పించి వెళ్లొచ్చావు . ఇంకా మూడు నెలలు కూడ కాలేదు . మా ఊరి పండగప్పుడు కూడ వెళ్లలేక పోయాం . అమ్మ, నాన్నా లేకపోయిన ఏడాది కోసారైనా తోబుట్టువులo కలుసుకోవద్దా ? అక్క ఎన్ని సార్లు పిలిచిందో ? ఒక్కసారి కూడ కుదరలేదు వెళ్ళడం . తనని ఎప్పుడైనా పిలుద్దామంటే నువ్వేదో ప్రోగ్రాం పెట్టేసుకుంటావ్ . కనీసం అన్నయ్య పిలిచి నపుడైనా వెళ్ళక పోతే ఎలా ?ఏమైనా సరే ఈసారి విజయనగరం వెళ్ళాల్సిందే అని పట్టు పట్టాడు శశాంక్ .

అంతే లెండి అంతా మీ ఇష్టమే. సెలవుల్లో హాయిగా మా వాళ్ళతో ఎంజాయ్ చేయాలనుకున్నా. మా మరదలి తో అన్నీ చేయించుకొని ఎంచక్కా మా చెల్లి దాని పిల్లలతో తిరగాలను కున్నాను. నా బతుక్కి రెస్టు అనేదే లేదు .
“నీకేం పని చెప్తారు? మా వదిన , అక్కే కదా అన్నీ చేసేది.”
“ఆఁ చెప్పరు …? కానీ వాళ్ళు చేస్తుంటే చూస్తూ కూచోలేనుగా ! పదండి విజయనగరమే వెళ్దాం.” విసురుగా లోపలికి వెళ్లిపోయింది. రెండు రోజులు ముభావంగా మూతి ముడుచుకునే ఉంది శ్రావణి.
భర్త చేతి లో పెట్టిన వైజాగ్ టిక్కెట్లు చూసి ఆశ్చర్యపోయింది శ్రావణి . “అవును… మీరు ముగ్గురూ వైజాగ్ వెళ్ళండి . నేనొక్కడ్నే విజయనగరం వెళ్తాను. వచ్చేటప్పుడు ఒక్క పూట వైజాగ్లో దిగి మీ వాళ్లందర్ని పలకరించి మిమ్మల్ని తీస్కోని హైద్రాబాద్ వచ్చేస్తా” అన్నాడు శశాంక్. వెయ్యి ట్యూబ్ లైట్ల కాంతి శ్రావణి ముఖం లో.

ఆ సాయంత్రం షాపింగ్ కి బయలు దేరింది శ్రావణి. తమ్ముడి పిల్లలకి, చెల్లి పిల్లలకి, చెల్లెలికి, మరదలికి చీరలు కొనుగోలు చేసింది. భరత్ అడిగాడు దార్లో “అమ్మా మనం పెద్ద నాన్న దగ్గిరకి వెళదామా ? అత్తకి చీర కొన లేదేం?’’ “అబ్బా నీకెందుకురా అవన్నీ? డాడీ చూసుకుంటార్లే!” అంది విసుగ్గా వాడి నోరు మూయిస్తూ. కనీసం చిన్న పిల్లవాడికైనా అన్పించింది తండ్రి వైపు బంధువులకి ఏమైనా కొనాలని. “అవును శ్రావణీ అక్కకి చీర కొన్నావా ?”రాత్రి పెట్టె సర్దుతుంటే అడిగాడు శశాంక్. “సంక్రాంతికి మీరు ఎంతో ముట్టచెప్పే వుంటారు గా ! ఎన్నిసార్లు పెడతాం ఏడాది పొడగునా ? అయినా ఇంటికి పెద్దకొడుకు మీ అన్నగారున్నారుగా. ఎంతమంది పెట్టాలేంటి ఆవిడ గార్కి ?” దీర్ఘాలు తీసింది శ్రావణి.భరత్ ఆశ్చర్య పోయాడు…. తల్లి మాటలకి ! చెల్లితో అన్నీ షేర్ చేసుకోవాలని తెగ చెబ్తుంది. పిన్ని వచ్చినా,తను పిన్ని దగ్గిరకు వెళ్ళినా చీరలు, ఫ్యాన్సీ వస్తువులు ఏవేవో ఇస్తూనే ఉంటుంది . అత్త ఎంతమంచిదో ? వాళ్ళింటికి వెళ్తే తమని ఎంతో ముద్దు గా చూసుకుంటుంది . ఎన్ని రకాల వంటలు చేస్తుందో, మామయ్య గారు కూడా ఎన్ని కొనిపెడతారో ? వచ్చేటప్పుడు డబ్బులు కూడ ఇస్తారు. ఎన్నో మంచి విషయాలు చెప్తారు. మేనమామ తనని, చెల్లిని అసలు పట్టించే కోడు. అయినా అమ్మకి వాళ్ళంటేనే ఇష్టం.

పెదనాన్న తమని పొలానికి తీసుకెళతారు. వాళ్ళ చిన్నప్పటి సంగతులన్నీ కధలు కధలుగా చెప్తారు .పెద్దమ్మ సరేసరి ప్రాణంగా చూసుకుంటుంది . ఎప్పుడూ విసుక్కోదు. ఎంత అల్లరి చేసినా, లేటుగా లేచినా ఏమీ అనదు. జున్ను, కజ్జికాయలు, జంతికలు ఎన్నిచేసి పెడుతుందో? కానీ అమ్మకి పిన్నితో కబుర్లు చెప్పుకోవటం ఇష్టం. పిన్ని కూతురు తనకంటే ఒక క్లాస్ జూనియర్. అయినా ఎంత పొగరో ? మామయ్య కొడుకు కరాటే నేర్చుకుంటున్నాడట ఫోజు గీరగా మాట్లాడతాడు. అదే పెద్దనాన్న కూతురు గీత అక్క ఐతే “తమ్ముడూ, తమ్ముడూ” అంటూ ఆప్యాయంగా మాట్లాడుతుంది. అత్త కొడుకులు కూడా తమని ఎంత బాగా చూస్తారో వాళ్లదగ్గిర ఏముంటే అవి ఇచ్చేస్తారు. డాడీ అమ్మ వైపు చుట్టాల్ని ఎంతబాగా చూసుకుంటారో తమ ఇంటికి వచ్చినపుడు. కానీ అమ్మ మాత్రం అలా కాదు .
తల్లి ద్వంద్వ వైఖరి భరత్ కి అంతు పట్టడం లేదు. తల్లి మాట ప్రకారమే వైజాగ్ వెళ్లారు దసరా శలవులకి. ఒక్కసారైనా విజయనగరం వెళ్తే బాగుండును అని ఎంతో అన్పించింది భరత్ కి. “అమ్మా నాకు పెద్ద నాన్నని, అత్తని చూడాలని ఉంది వెళ్దామా?” అనితల్లిని అడిగాడు ఆశగా. హుంకరిoచింది శ్రావణి “అక్కడేం పనిరా నీకు? కావాలంటే ఫోన్ లో మాట్లాడు. హాయిగా మనవాళ్ళతో ఎంజాయ్ చేయమంటుంటే ఆ ఊరు వెళ్తానంటావేంటి ? కాలక్షేపం ఏదైనా ఉందా అక్కడ ?” అంటూ.
అనురాగం, ఆప్యాయత నిండిన పాలపుంతలాంటి మనుషుల కంటే వేరే కాలక్షేపం ఏముంటుంది అసలు? స్వేచ్ఛ ప్రశాంతత పరిపూర్ణంగా ఇచ్చే తన తండ్రి ఊరంటే భరత్ కి ఎంతో మమకారం. దాన్ని తృణీకరించే తల్లి వైఖరి తనకెప్పుడూ అంతుబట్టదు ఎందుకనో .

కాలక్రమంలో భరత్ ఇంజినీరింగ్ పూర్తి చేసి మంచి జాబ్ లో చేరాడు. భవ్య సి ఏ చేస్తోంది. పెద్దవాళ్లయ్యారు కాబట్టి విచక్షణ జ్ఞానం కూడా బాగానే పెరగడంతో తల్లి ఏం చెప్పినా ఇదివరకటిలా వినేయడం లేదు .కొన్నిసార్లు విమర్శిస్తున్నారు కొన్నిసార్లు ఎదిరిస్తున్నారు కూడా! చాలా విషయాల్లో శ్రావణి మంచిదే కానీ తేడాగా ఉన్నా పుట్టింటివాళ్లని అమితంగా ప్రేమిస్తుంది ,ఎంత మంచివాళ్లయినా అత్తింటివాళ్లని ఆమడ దూరం పెడుతుంది .

ఆఫీస్ నించి ఇంటికి వచ్చిన భరత్ కి డ్రాయింగ్ రూంలో ఫ్రెండ్ తో కల్సిఎంబ్రాయిడరీ చేస్తూ కబుర్లాడుతున్న తల్లి మాటల్లో తన పేరు విన్పించడంతో షూ విప్పుకుంటూ ఆసక్తిగా వినసాగాడు. ‘’అవునే ప్రియా ఇందులో ఏం అనుమానం లేదు , వాడు నా మాట కాదనడు. మా భరత్ చేసుకోబోయే అమ్మాయి పూర్తిగా నా సెలక్షనే.’’
“’ఏంటమ్మా అంత నమ్మకం ?’’అంది ప్రియ.
“’పెంపకం తల్లీ! నా పెంపకం. నేను గీసిన గీటు దాటరు ఇంట్లో ఎవరూ. అయినా రాబోయే కోడలి తల్లిదండ్రులకి కొన్ని టెస్టులు పెడతాను ముందు.”
“’కోడలి తల్లిదండ్రులకి పరీక్షలేంటే మధ్యలో ?”’
‘’అవునే, వాళ్ళు తమ పెద్ద వాళ్లని ఎలా చూసుకున్నారో ? ఆవిడ తన అత్తామామల్ని ఎలా చూసుకుందో తెలిస్తే చాలు తల్లిని అనుసరించేగా కూతురూనూ! అలాగే మా పిల్ల చేసుకోబోయేవాడికి ఏ రకమైన బాదరబందీలు ఉండకూడదు.కావల్సినంత కట్నం ఇస్తాం కదా అత్త, ఆడపడుచులు లేని సంబంధమే చూస్తాం.”
“అబ్బా ఏం తెలివితేటలే శ్రావణీ! కోడలు నిన్ను బాగా చూస్కోవాలా ? కూతురికి అత్త ఆడపడుచులు ఉండకూడదా? అత్తలంతా నీలా ఆలోచిస్తే ఇంక లోకంలో పెళ్లిళ్లు అయినట్లే !” ప్రియ ఆశ్చర్య పోయింది. భరత్ ఇంక ఉండబట్టలేకపోయాడు “సారీ అమ్మా!నేను చేసుకోబోయే అమ్మాయి విషయంలో నాక్కొన్నిఅంచనాలు పట్టింపులున్నాయ్.’’
”ఏంట్రోయ్ ? అందంగా ఉండాలి, బాగా చదువుకొని ఉండాలి అంతేగా !”

“అవి సరేసరి! అవి కాకుండా అమ్మాయి పుట్టింటివాళ్లు బాగా సపోర్టివ్ గా ఉండాలి మాకు. పెళ్లయ్యాక తనవాళ్లే నా వాళ్ళు . డాడీని నువ్వెంత బాగా చూస్కుంటున్నావో! తన వైపు వాళ్ళతో కలవకుండా నీ వాళ్ళనే నెత్తిన పెట్టుకుంటూ అలా నన్ను చూస్కోనే అమ్మాయి నాక్కావాలి. ఇంటిని చక్కదిద్దుకొనే నైపుణ్యం తోపాటు గడుసుదై ఉండాలి. ఒక్కమాటలో చెప్పాలంటే నీలా ఉండాలి. అవును నీలా ఉంటే ఏ సమస్యా ఉండదు. చిన్నప్పుడు నీకు అమ్మమ్మ చెప్పినట్లు డాడీకి నాన్నమ్మ చెప్పే ఉంటారు తోబుట్టువుల్నిఆదరం గా చూస్కోవాలని, కానీ డాడీ నాన్నమ్మ కంటే నీకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. అందుకే తనవాళ్లని నువ్వు సరిగ్గా పట్టించుకోపోయినా మిన్నకుండిపోయారు. అంటే మగవాళ్ళకి తల్లి కంటే భార్య. తన తోబుట్టువులకంటే భార్య తోబుట్టువులు చాలా ప్రియమైనవాళ్లని నా కర్ధమైంది. తన వాళ్ళతో కంటే భార్య వైపు వాళ్ళతో సంబంధాలు కొనసాగించాలని డాడీ ని చూసి తెల్సుకున్నా ! ముందుముందు నేను డాడీ ని అనుసరిస్తా ! నీ కూ సంతోషమేగా?”

కొడుకు వాక్ప్రవాహాన్ని మ్రాన్పడిపోయి వింటూ ఉండిపోయింది శ్రావణి . ఆ క్షణం ఆమెకి తన భర్తని ఎలా కొంగున ముడేసుకుందో అత్తింటివాళ్లని ఎలా దూరం పెట్టిందో తన వాళ్ళని ఎలా నెత్తికెక్కించుకుందో గుర్తు రాలేదు. అంటే పెళ్లయ్యాక తన భార్య, ఆమె బంధువులతో కులాసాగా కాలక్షేపం చేస్తూ తమని పట్టించుకోడా? చెల్లిని తల్లిని గుమ్మంలోకి రానివ్వడా ? నవమాసాలు మోసి కనీ పెంచి ఇంతవాణ్ణి చేస్తే …. ఎక్కణ్ణించో ఊడిపడే పెళ్ళాం, దాని బంధువులు వీడికి ముఖ్యమైపోతారా ? ఆమె కి అంతా అయోమయంగా అన్పించసాగింది

ప్రియకి అంతా అబ్బురంగా అన్పించసాగింది . ఆ క్షణంలో ఆమెకి పండగలకీ పబ్బాలకి కూడా ఇంటికి పిలవని అన్న. తమ ఇంటి మీంచే వాళ్ళ అత్తగారింటికి వెళ్తూ తమ గుమ్మంలోకి రాని తమ్ముడు గుర్తు వచ్చారు. శ్రావణి లాగే వాళ్ళ భార్యలు కూడా తమ పుట్టింటికే ఎక్కువ విలువిస్తూ భర్తల్ని తమ వెనకాలే తిప్పుకుంటారు. అన్నదమ్ములకీ అన్పించదేమో? అమ్మానాన్నా లేనందుకు మనమైనా కల్సుకుంటూ కష్టసుఖాలు కలబోసుకోవాలి అని., భార్యలకి ఉన్నట్టే తమ అక్కచెల్లెళ్లకి కూడా పుట్టింటి మీద ఆశ ఉంటుందనీ.; చిన్నవాడైనా భరత్ ఎంత ఆరిందాలా మాట్లాడుతున్నాడో ? ఆడవాళ్ళ మనస్తత్వాన్ని కాచి వడబోసినట్టే.

భరత్ మాటలతో వర్తమానం లోకి వచ్చింది ప్రియ. ఎందుకమ్మా నీకంత స్వార్ధం, అభద్రతా భావం ? అత్త , పెద్దనాన్న వాళ్ళు ఎంత ప్రేమగా ఉంటారు మనతో? ఎపుడైనా ఏ అవసరమైనా సాయం చేస్తున్నది వాళ్ళేగాని నీ వాళ్ళు కాదు. అవునా ? గుండె మీద చెయ్యేస్కొని చెప్పు నీ వాళ్ళు నీకేం నిలబడ్డారసలు ? అయినా ఎప్పుడూ నీకు వాళ్ళే కావాలి ఎంత మంచి వాళ్ళయినా డాడీ వైపు బంధువులు నీకు నచ్చరు. రేపు నేనూ డాడీ లాగే నా అత్తింటి వాళ్ళకే ప్రాధాన్యత ఇస్తానని చెప్పానో లేదో ఎలా అయి పోయావో చూడు. నీకు చెప్పేంతవాణ్ణి కాదు గాని ‘”కోడలు అంటే అందర్నీ ఆత్మీయంగా అమ్మలా ఆదరించాలి. పొరపాట్లు చేసినాక్షమించి సర్దుకుపోవాలి. అంతా నా వాళ్ళే,ఇది నా కుటుంబం అనుకోవాలి . అంతేకాని పక్షపాతం చూపిస్తూ బంధాలని బలహీనం చేయకూడదు. కుటుంబాలని కలిపే వంతెన లా ఉండాలమ్మా కోడలంటే విడదీసే గోడలా కాదు. నేనూ చేసుకోబోయే అమ్మాయి అందగత్తె కాకపోయినా ఏ భేషజాలు లేకుండా కుటుంబంలో అందరితో ఆప్యాయంగా మసలుకొనే సంస్కారవంతురాలు అయితే చాలు నా మాటల వల్ల ఈ కాసేపటి లో నీకు బాధకలిగించినందుకు నన్ను క్షమించమ్మా నిన్నెవరైనా విమర్శిస్తే నేను తట్టుకోలేను.. అందుకే ………:’’భరత్ ఇంకా ఏదో చెప్తున్నాడు .ప్రియ కి ఏమీ విన్పించట్లేదింక. ఆరాధనగా ఆ అబ్బాయినే చూస్తూ ఆలోచనలో పడింది.

కొడుకులంతా కుటుంబ వ్యవస్థ కి, మానవ సంబంధాలకి ప్రాధాన్యత ఇస్తూ భరత్ లాగా వివేకంతో ఆలోచిస్తే ఆడవాళ్ళ మనస్తత్వం లో మార్పు రాక ఏమవుతుంది ? భరత్ మాట్లాడిన విధానంతో శ్రావణి సంకుచిత వైఖరిలో ఖచ్చితంగా పరివర్తన వస్తుందని నమ్ముతూ మనసులోనే భరత్ ని ఆశీర్వదిస్తూ అభినందనా పూర్వకంగా అతని భుజం తట్టింది ప్రియ.

****

Leave a Reply

Your email address will not be published. Required fields are marked