వీక్షణం

వీక్షణం సాహితీ గవాక్షం-107 వ సమావేశం

వీక్షణం సాహితీ గవాక్షం-107 వ సమావేశం-వరూధిని వీక్షణం-107 వ సమావేశం ఆన్ లైన్ సమావేశంగా ఆద్యంతం అత్యంత ఆసక్తిదాయకంగా జూలై 11, 2021 న జరిగింది.

ఈ సమావేశంలో డా|| కె.గీత గారి కథాపఠనం, చర్చ, కవిసమ్మేళనం, శ్రీధర్ రెడ్డి గారి కవిత్వ సంపుటి “ప్రతిబింబం” ఆవిష్కరణ జరిగాయి.

ముందుగా డా|| కె.గీత గారు కాలిఫోర్నియాలోని వైల్డ్ ఫైర్స్ నేపథ్యంలో రాసిన కథ “ఇవేక్యుయేషన్” ను చదివి వినిపించారు. ఈ కథ జూలై 4న ఆంధ్రజ్యోతిలో అచ్చయింది.

ఈ కథలో ప్రధాన కథ ఒకపక్క విరుచుకుపడుతున్న విపత్తును గురించి తెలియజేస్తూ ఉన్నా, అంతర్లీనంగా కోవిడ్ కష్టకాలంలో భార్యా భర్తల మధ్య దూరమవుతున్న అనుబంధాన్ని చెప్పడం ప్రధాన ఉద్దేశ్యంగా కొనసాగింది. ఉద్యోగమే సర్వం అనుకునే భర్త, భర్తే సర్వమనుకునే భార్య. ఇద్దరూ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న జంట అయినా జీవితాల్లోని ఒడుదుడుకులు ఎదురయినపుడు ఒకరినొకరు ఓదార్చుకోకుండా సమస్యని జటిలతరం చేసుకోవడం ఇందులో కనిపిస్తుంది. ఇందులో భర్త శశాంక్ విపరీతమైన ఉద్యోగ వత్తిడి సతమతమవుతూ, ఇంట్లో వ్యక్తులను ప్రేమించడం మర్చిపోతూ, ఎమోషన్స్ లేకుండా తయారవుతున్న ఇప్పటి తరపు యువకులకు ప్రతీక. కథంతా భార్య పట్ల విసుగు, అసహనాలతో డాంబికాన్ని ప్రదర్శిస్తూ ఉన్నా చివర్లో దుఃఖ పడతాడు. ప్రతి మనిషిలోనూ లోపల్లోపలెక్కడో ఉన్న దుఃఖం బయటికి వచ్చే సమయం ఒకటుంటుంది అనే ముగింపుతో కథ ముగుస్తుంది. ఇందులో కథానాయిక రాగ సంయమనానికి ప్రతీక భార్య. హౌస్ వైఫ్ గా ఉంటూ మొక్కల సరక్షణలో ఆనందాన్ని పొందే మమూలు యువతి. కానీ భర్త బాధని సంయమనం తో అర్థం చేసుకోగలిగిన భార్య. కొన్ని ప్రశ్నలకు సమాధానాలు కథలో లేకున్నా పాఠకులు ఊహించుకోవడానికి తగిన స్పేస్ తో రాసిన ప్రయోగాత్మకమైన కథ ఇది. ఇక కార్చిచ్చుల నుంచి తప్పించుకోవడం కోసం ఇప్పుడిప్పుడు అడవుల నుంచి, గడ్డిభూముల నుంచి ఊళ్ళకి రక్షణ కల్పించే మార్గాల గురించిన కూడా వివరణ ఇందులో కనిపిస్తుంది.

కథాపఠనం పూర్తి కాగానే జరిగిన విస్తృతమైన చర్చలో శ్రీ ఆరి సీతారామయ్య, శ్రీ సుభాష్ పెద్దు, శ్రీ బాలకృష్ణారెడ్డి, శ్రీ శ్రీధర్ రెడ్డి , శ్రీమతి కొండపల్లి నీహారిణి, శ్రీమతి షర్మిల, శ్రీమతి అపర్ణ గునుపూడి, శ్రీమతి ఉదయలక్ష్మి మొదలైన వారు పాల్గొన్నారు. గీత గారు ఈ ప్రయోగాత్మక కథలో రెండు సమాంతర కథల మధ్య పాటించిన బాలెన్సుని కొనియాడారు. ఎన్నో రోజుల తరువాత ఒక గొప్ప కథను విన్న అనుభూతి కలిగిందన్నారు. కథావస్తువులో కొత్త డయాస్పోరా అంశాన్ని స్పృశించడమే కాకుండా, కథనంలోనూ కొత్తపుంతలు తొక్కించారని అన్నారు. తరువాత గీతగారు మాట్లాడుతూ కథా ముగింపు గురించి, కథనంలో పడ్డ కష్టం గురించి, ఆంధ్రజ్యోతి పాఠకుల ప్రశ్నల గురించి ప్రస్తావిస్తూ సభలోని వారి ప్రశ్నలతో కలిపి సమాధానాలు ఇచ్చారు.

ఆ తర్వాత జరిగిన కవిసమ్మేళనంలో శ్రీ బాలకృష్ణారెడ్డి, శ్రీ శ్రీధర్ రెడ్డి , డా|| కె.గీత తమ కవిత్వాన్ని చదివి వినిపించారు. ఆ తర్వాత శ్రీధర్ రెడ్డి గారి కవిత్వ సంపుటి “ప్రతిబింబం” ఆన్లై న్ ఆవిష్కరణ, పుస్తక పరిచయ కార్యక్రమం జరిగాయి. డా|| కె.గీత గారు “ప్రతిబింబం” పుస్తక పరిచయం చేస్తూ శ్రీధర్ రెడ్డి గారు పద్య, వచన కవిత్వ సమాహారంగా రచించిన ప్రతిబింబంలో వేటికవే ప్రత్యేకమైనవని, రాస్తున్న ప్రక్రియలో ఒదిగిపోయే శైలి, వస్తువులు శ్రీధర్ గారి సొంతమని అన్నారు. కవి శ్రీధర్ రెడ్డి గారు మాట్లాడుతూ వీక్షణం వల్లనే తాను రాయడం ప్రారంభించానని, ఇప్పుడిలా పుస్తక ఆవిష్కరణ వీక్షణంలోనే జరుపుకోవడం తనకు అత్యంత ఆనందకరంగా ఉందని పేర్కొన్నారు.

ఆద్యంతం ఎంతో ఆసక్తిదాయకంగా జరిగిన ఈ సభలో స్థానిక ప్రముఖులు, సాహిత్యాభిలాషులు పాల్గొని సభను జయప్రదం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked