శీర్షికలు

సంగీత పాఠాలు

సేకరణ: డా.కోదాటి సాంబయ్య

సంగీత ప్రాశస్త్యం : న నాదేనా వినా గీతం న నాదేన వినా స్వరః |

న నాదేన రాగస్త స్మా నాదాత్మకం త్రయం ||

గీతము, స్వరము, రాగము ఈ మూడూ నాదాన్ని విడిచి ఉండలేవు. మామూలుగా మనం వ్యవహారం లో వినే ధ్వనులను చప్పుడు అంటాము. ఈ చప్పుడుకూ

సంగీత ధ్వనికీ చాలా భేదం ఉంది. ఒక వస్తువు ఒక సెకండులో ఎన్నిసార్లు కంపిస్తుందో ఆ సంఖ్య ఆ వస్తువు యొక్క పౌనఃపున్యం అంటారు. సంగీత ధ్వనుల పౌనః పున్యం

ప్రతి సెకండు కూ ఒకే విధంగా ఉంటుంది. అందుకే ఆ ధ్వనులను ఎంతసేపు విన్నా ఇంకా వినాలని అనిపిస్తుంది. చప్పుడు ధ్వని తరంగం ప్రతి సెకను సెకండు కూ మారుతుంటుంది. అందుకే ఆ ధ్వనులను వింటుంటే చెవులు మూసుకుంటాము.

సంగీత ధ్వనులకు మూడు ప్రత్యెక లక్షణాలు ఉన్నాయి…అవి.

1. పిచ్ : పౌనః పున్యం పెరిగితే పిచ్ పెరిగింది అంటాము. షడ్జం కంటే రిషభం పౌనః పున్యం ఎక్కువ…రిషభం కన్నా గాంధారం పౌనః పున్యం ఇంకా ఎక్కువ.

2. తీవ్రత : ( sound )..దూరంగా ఉన్న మైక్ నుండి వచ్చే పాట చిన్నగా వినిపిస్తుంది. మైక్ దగ్గరగా వచ్చే కొద్దీ పాట పెద్దగా వినిపిస్తుంది . చిన్నగా వినిపించినా పెద్దగా వినిపించినా పౌనః పున్యం మారదు.

3. గుణం : మనకు బాగా పరిచయం ఉన్న వారి గొంతు వారిని చూడకుండానే గుర్తుపట్టగలం. అలాగే వాయిద్యాన్ని చూడకుండా దాని ధ్వని ని బట్టి అది వాయులీనమో వీణ నో చెప్పగలం. దీనినే ధ్వని గుణం అంటారు.

*****

గీతమ్ వాద్యం తధా నృత్యం త్రయం సంగీత ముచ్యతే ||

గీతము, వాద్యము, నృత్యము ల కలయికయే సంగీతమని సంగీత రత్నాకరం లో చెప్పబడింది.కానీ కాలక్రమేణా నృత్యం వేరుపడి….

గీత వాద్యోభయం యత్ర సంగీత మితి కేచన ….గీతము, వాద్యముల చేరికయే సంగీతమని కొందరు…

రాగ స్వర తాళశ్చ త్రిభి సంగీత ముచ్యతే ….రాగ, స్వర, తాళముల కలయికయే సంగీతమని ఇప్పుడు అందరూ అభిప్రాయ పడుతున్నారు.

భారత దేశమంతటా క్రీ.శ. 13 వ శతాబ్దం వరకు ఒకే సంగీతం ఉండేది, దానినే భారతీయ సంగీతం అనేవారు. భారతీయ సంగీతం రాగ ప్రధాన మైనది.

( melodycal )…..పాశ్చాత్య సంగీతం స్వర ప్రధాన మైనది. ( hormonical ). క్రీ. శ. 13 వ దశాబ్దం తర్వాత ఉత్తర భారత దేశం ముస్లిముల దండయాత్రల వల్ల , తర్వాత వారి పరిపాలన వల్ల ..ఉత్తర భారత సంగీతం పర్షియా, అరబ్బు దేశాల సంగీత ప్రభావానికి లోనై క్రమక్రమంగా మారుతూ, నేటి హిందుస్తానీ సంగీతం గా ఏర్పడినది.

కానీ దక్షిణ భారత సంగీతం ముస్లిం పరిపాలనా ప్రభావం లేనందువల్లనూ, వెంకట ముఖి, పురందరదాసు, త్యాగరాజు, శ్యామశాస్త్రి, ముత్తుస్వామి దీక్షితుల వల్ల ఎంతో అభివృద్ధి చెంది, నేడు సంగీత ప్రపంచం లో కర్ణాటక సంగీతం అగ్రగామిగా నిలిచింది.

కర్ణ మనగా చెవి, ఆటకమనగా యింపు. అంటే చెవులకు యింపుగా ఉండి వింటూంటే ఇంకా ఇంకా వినాలనిపించే సంగీతం కర్ణాటక సంగీతం.

నాదము :- నకారం ప్రాణ నామానం దకార మనలం విదుః

జాత ప్రాణాగ్ని సంయోగా త్తేన నాదో భి ధీయతే ||

నాద మనే రెండక్షరాలలో న అనే అక్షరం ప్రాణ మునకు సంకేతం, ద అనే అక్షరం దహనం కు సంకేతం. అంటే ప్రాణాగ్నుల సంయోగం చేత నాదము పుట్టును.

ఇట్టి నాదము రెండు రకములు. 1. ఆహత నాదము. 2. అనాహత నాదము. అనాహత నాదము గురు ముఖతః బోధించబడును. అచంచల మనోరథము గల మునులకే ఇది సాధ్యమగును. ఆహత నాదము శృతి, స్వర, మూర్చనాదులచే కూడి, సామాన్య ప్రజలకు కూడా రంజనము కూర్చి ముక్తి ప్రదమగుతున్నది. ఇదియే భారతీయ సంగీతం యొక్క లక్ష్యము .

శృతి :- చెవికి వినబడు అతి తక్కువ ధ్వని నుండి అతి ఎక్కువ ధ్వని వరకు ఒకదానికొకటి హెచ్చుగానూ, విడివిడిగానూ విభజించినచో రాదగిన ధ్వనులు 66 మాత్రమె వీటినే శ్రుతులు అంటారు. ( audible sounds ). ఈ శ్రుతులు మానవుని యందు నాభిలో గల మూలాధార చక్రము లో నాద రూపం లో మొదలయి క్రమముగా…

1. హృదయం నుండి వచ్చు 22 శ్రుతులను మంద్ర శ్రుతులని…
2. కంఠం నుండి వచ్చు 22 శ్రుతులను మధ్య స్థాయి శ్రుతులని….
3. శిరస్సు నుండి వచ్చు 22 శ్రుతులను తారా శ్రుతులని అంటారు. ఈ విషయాన్నే త్యాగరాజు తన జగన్మోహిని రాగ కృతి శోభిల్లు సప్తస్వర అను పల్లవి లో
…నాభీ హృత్కంఠ రసన నాసాదుల యందు అని రచించారు.
స్వరములు:- స్వతో రంజయతి శ్రోత్రు చిత్తం సుస్వర ఉచ్యతే ….సంగీత రత్నాకరం .
స్వ అనగా స్వయముగా….రం అనగా రంజింప జేయు విశేషమును స్వరము అంటారు. పైన తెలిపిన ప్రతి 22 మంద్ర, మధ్య, తారా శ్రుతులను విడి విడిగా శబ్దించినచో వాటి మధ్య వ్యవధులు చాలా తక్కువగా ఉండి, గమకం చేయడానికి వీలు కానందున రంజనము కలుగదు. అందుకే పై 22 శ్రుతులను రంజనము చేయగల ఏడు అక్షరములుగా విభజించారు.
వాటినే సప్త స్వరములు అంటారు.

( సశేషం )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked

1 Comment on సంగీత పాఠాలు

బుగుడాల వరప్రసాద్ said : Guest 6 years ago

బాగుంది సంగీత పరిచయం

  • సంగారెడ్డి