ధారావాహికలు

అమెరికా ఉద్యోగ విజయాలు-10

సత్యం మందపాటి చెబుతున్న

తాబేలు – కుందేలు

“అర్జునా!
వాళ నీకొక మంచి కథ చెబుతాను” అన్నాడు కృష్ణ.
“అదేమిటి బావా, ఇప్పుడు కథలెందుకు. ఇంతకు ముందు చెప్పినట్టుగా కాస్త మంచి విషయాలు చెప్పి, నా ఉద్యోగంలో పనికొచ్చేటట్టుగా చేయి” అన్నాడు అర్జున్.
నవ్వాడు కృష్ణ. “నీ ఉద్యోగ విజయాల్లో ఉపయోగపడే కథేనయ్యా. ఇది నేనొకసారి ఒక ప్రాజెక్ట్ మానేజ్మెంట్ సెమినారుకి వెడితే, అక్కడ చెప్పారు. ఇదే కథ ఇంకోరకంగా చిన్నప్పుడే పంచతంత్రంలో కూడా చదివాననుకో. విను మరి” అన్నాడు కృష్ణ.
“అయితే చెప్పు మరి” అన్నాడు అర్జున్ సర్దుకుని కూర్చుంటూ.
కృష్ణ చెప్పటం మొదలు పెట్టాడు.
“అనగా అనగా ఒక తాబేలు. ఒక కుందేలు. ఆ రెండూ ఒక రోజు, ఊరికే కూర్చుంటే ఊరా పేరా అని, పోటీ పడ్డాయి, మనం ఇద్దరం

పరుగెడితే ఎవరు గెలుస్తారూ అని. సరే ఎలాగూ అనుకున్నాం కదా ఇక ఆలస్యమెందుకు పరుగెడితే పోలా అని, అవి పరుగెత్తటం మొదలుపెట్టాయి. కుందేలు, ఎలాగైనా మరి కుందేలు కదా, చకచకా పరుగెత్తింది. తాబేలు కూడా మరి తాబేలు కదా, అందుకని తాపీగా నడిచింది. గమ్యానికి కొంచెం దగ్గర పడుతుండగా కుందేలు వెనక్కి తిరిగి చూసింది. కనుచూపు మేరలో తాబేలు ఎక్కడా కనపడలేదు. తాబేలూ, నువ్వు వెనక పడితే వెనకేనోయ్ అనుకున్నది. ‘గెలవటానికెందుకురా తొందరా’ అని తను కూడా కుసింత వెనక పడింది. కుందేలు కొన్నాళ్ళు ఒక గవర్నమెంట్ ఆఫీసు వెనకాల చెట్ల క్రింద పొంచి, కిటికీల్లోనించి లోపలికి చూసేది. అక్కడ కొంతమంది కునికిపాట్లు పడుతూ, మరి కొంతమంది బల్ల మీదే తల ఆన్చి నిద్రపొతూ వుండటం చూసి, దానికీ మధ్యాన్నం నిద్ర అలవాటయింది. తాబేలు తనని ఎలాగూ అందుకోలేదు కనక, చక్కటి నీడ వున్న ఒక చెట్టు చూసుకుని, నిద్రలాటి ఒక కునుకు తీసింది. ఆఫీసులు వదిలే టైముకి లేచి, మళ్ళీ పరుగెత్తి పొటీ కొనసాగించింది. చకచకా పరుగెత్తి ఆనందంగా గమ్యానికి చేరుకునేసరికి, అక్కడ చేతిలో గెలిచిన ట్రోఫీని చూపిస్తూ, జాతీయ గీతం పాడుతూ నవ్వు ముఖంతో కనిపించింది తాబేలు. ఈ కథకి నీతి ఏమిటి? స్లో అండ్ స్టెడీ విన్స్ ది రేస్ అని. అంటే నెమ్మదిగా, సాఫీగా పని చేసుకుపోతే గెలుస్తారు అని. ఎందుకురా ఆ హడావిడి, నెమ్మదిగా ఆలోచించి పని చేయాలి అనేవాడు మా పాండురంగం మామయ్య, అదే.. మీ నాన్న!”

పెద్దగా నవ్వాడు అర్జున్. “ఈ కథ ఎంతో చాలా బహు పాతన్నర పాతది బావా. అదీకాక ఇవి ‘నిదానమే ప్రధానం’ అనుకునే రోజులు కాదు. ఇవి ‘ఆలస్యం అమృతం విషం’ రోజులు. ఆన్ టైమ్ షిప్పింగ్, డెడ్ లైన్స్, టైమ్ టు మార్కెట్, కష్టమర్ డిమాండ్స్.. ఊపిరి ఆడనీయవు. నీకు తెలియనిదేముంది” అన్నాడు.
కృష్ణ కూడా నవ్వుతూ అన్నాడు. “అవును. నాకు తెలుసులేవోయ్ చెవలాయ్. అంటే ఇక్కడ చేప్పేది ఏమిటంటే, నీలో సత్తా పూర్తిగా లేకపోయినా, చక్కటి ప్లాన్ వేసుకుని, అవరోధాలను అధికమించి, శ్రమ అయినా విశ్రమించక ‘డూ ఇట్ రైట్ ఫస్ట్ టైం’ అని. అదే తాబేలు చేసి నిరూపించింది. సత్తా వున్నా గెలవక పోతానా అనే ధీమాతో కుందేలు వెనకపడింది. అదీ మనం గ్రహించవలసింది”
“అవును. ఇలాటి వాళ్ళని చూస్తూనే వుంటాము, ఆఫీసుల్లో” అన్నాడు అర్జున్.

“అవును, మనకి రోజూ ఆఫీసుల్లో అలాటి రెండు రకాలవారూ కనిపిస్తుంటారు. ఇంకా కథ అవలేదు బామ్మరిదీ. ఈసారి కుందేలు తాబేలుతో అంది, ‘ఇందాకటిది ఆటలో అరటిపండు అనుకుందాం. మళ్ళీ ఇంకోసారి పరుగెడదాం మిత్రమా’ అంది. ఒకసారి గెలిచింది కనుక, తాబేలుకి ఏమీ అభ్యంతరం కనపడలేదు. సై అంటే సై అంది. తాబేలూ, కుందేలూ మళ్ళీ పందెం పరుగులు పెట్టాయి. ఈసారి కుందేలు తన స్పీడుకి తగ్గట్టుగా, శ్రమించి పరుగెత్తింది. చక్కటి నీడ వున్న చెట్టు కనిపించినా, కునికిపాట్లు వస్తున్నా లెఖ్క చేయకుండా, ఏమీ పొరపాట్లు చేయకుండా, గెలుపే తన లక్ష్యంగా పరుగెత్తింది. పందెం గెలిచింది. ఈ కథకి నీతి ఏమిటి? త్వరత్వరగా పరుగెత్త గలిగే శక్తి వుంటే పరుగెత్తు నాయనా. ఆగకు. పదండి ముందుకి అని అనలేదూ మన గురువుగారు. అంటే అవసరమైనంత వేగంగా, ఏమీ తప్పులు చేయకుండా, గెలుపే లక్ష్యంగా గమ్యం వేపు వెడితే గెలుపు నీది కాక ఇంకెవరికి వస్తుంది అని”
అక్కడే వున్న రుక్మిణి నవ్వుతూ అంది. “గెలిచిన కుందేలుకి రెండు కొమ్ములున్నాయి. ఒకటి క కి, ఇంకోటి ల కి. ఓడిపోయిన తాబేలుకి ఒకటే కొమ్ము. ల కి మాత్రమే. అందుకని తాబేలు ఓడిపోయి వుండవచ్చు” అని. ఆవిడ ముళ్ళపూడి రమణగారికి ఏకలవ్య శిష్యురాలు మరి.

“ఈ కథలో మలుపు ఏమీ లేదు. సూటిగా వుంది. కొత్తదనం అసలే లేదు. తాబేలు మీద కుందేలు ఎందుకు గెలవదు?” పైకి అందామనుకుని, తన మనసులోనే అనుకున్నాడు అర్జున్.
“అవును. నువ్వు అనుకుంటున్నది ఏమిటో నాకు తెలుసు. నిజమే మరి. కుందేలు గెలవటంలో గొప్పేముంది. కాకపోతే, కార్పొరేట్ మేనేజ్మెంట్ పాఠాల దృష్ట్యా పై రెండిటినీ కొంచెం పరిశీలిద్దాం. మొదటి కథలో సత్తా వున్నా, చేసే పని మీద సరదా లేకుండా, ఏదో ఆఫీసుకి వెళ్ళాలి కనుక వెళ్ళి, పని చేయాలి కనుక ఆవలిస్తూ మన కుందేలులా పని చేస్తుంటే, తాబేళ్ళు కూడా వాటిని దాటి ముందుకు పోతుంటాయి. ‘టైం టు మార్కెట్’ ఎంతో అవసరమైన ఈ రోజుల్లో, త్వరత్వరగా క్వాలిటీకి డోఖా లేకుండా పని చేయటం ఎంత ముఖ్యమో చూపిస్తుంది ఈ రెండో కథ. కుందేలుకి ఉద్యోగ విజయమే లక్ష్యంగా పెట్టుకున్నప్పుడు, తన సహజ లక్షణాలని ఉపయోగించి, ముందుకు దూసుకుపోయింది”
అర్జున్, సాలోచనగా తల వూపాడు.

కృష్ణ అన్నాడు. “మన కథ ఇంతటితో కూడా అయిపోలేదు. ఇంకా వుంది. అదే సమయంలో, తాబేలు కూడా కుందేలు మీద ఎలా గెలవాలా అని ఆలోచించింది. తను తన సహజ లక్షణాలతో కుందేలు మీద గెలవటం కష్టం. అందుకని తనకి తెలిసిన ఇతర విద్యలని వాడుకోవటం అవసరం అని నిర్ణయించుకుంది. ‘మళ్ళీ సరదాగా పరుగెడదామని సరదాగా వుంది మిత్రమా. నీకూ ఆ సరదా వుంటే మరొక్కసారి పరుగెడదామా?’ అంది కుందేలుతో. ఇంతకుముందే గెలిచింది కనుక, ఆ సంతోషంలో కుందేలుకి ఏమీ అభ్యంతరం కనపడలేదు. సై అంటే సై అంది”
“తెలుగు టీవీ సీరియల్లా సాగదీస్తున్నావు, బావా. అయితే ఈసారేమయింది?” మనసులోనే అనుకున్నా, కృష్ణుడికి తెలిసిపోతుంది కనుక, పైకి అనేశాడు అర్జున్.

కృష్ణ ఇలా ఒక చిరునవ్వు అలా విసిరేసి, ఇట్లా చెప్పటం కొనసాగించాడు. “ముందుగానే ఏం చేయాలో ఆలోచించింది కనుక, తాబేలు ‘ఆ దోవ నాకు అచ్చి రాలేదు, వాస్తు ప్రకారం సరిగ్గా లేదని మా కూర్మావధాని వాసుగారు చెప్పారు, అందుకని ఇంకో దారిలో వెడదాం మిత్రమా’ అంది. అప్పుడే గెలిచింది కనుక కుందేలు ఎగిరెగిరి పడుతూ సరే సరే అంది గర్వంగా. పోటీ ప్రారంభమైంది. కుందేలు వెనకా ముందూ చూసుకోకుండా చకచకా పరుగెత్తింది. తాబేలు బాగా వెనక పడింది. దారి మారింది కనుక, కుందేలుకి కొత్తగానే వున్నా ఎంతో ముందు వున్నది. అప్పుడే చూసింది, అడ్డంగా వున్న ఆ నదిని. ఆ నదిని ఎలా దాటాలో, ఎలా ముందుకి పోవాలో తెలీక అక్కడే ఆగిపోయింది కుందేలు. ఈలోగా తాపీగా వచ్చింది తాబేలు. కుందేలుని చూసి చిరునవ్వింది. ఒక్కసారి కన్ను గీటి, తటాలున నీళ్ళల్లో దూకింది. ఈదుకుంటూ అవతలి గట్టుకి వెళ్ళింది. పోటీలో గెలిచింది. కుందేలు అసహాయంగా ఏం చేయాలో తెలీక తూర్పుకి తిరిగి దణ్ణం పెట్టింది”

అర్జున్ “నాకు ఏమనిపించిందంటే, కుందేలుది ఓవర్ కానిఫిడెన్స్. ఇందాక రెండో కథలో చూశాం కదా. అంటే గర్వంతో కూడిన ధీమా కుందేలుది. మొదలుపెడదాం. దారిలో ఏవన్నా సమస్యలు వస్తే ఆమాత్రం పరిష్కరించుకోలేనా, ఇంతకు ముందు గెలిచిన అనుభవం వుంది కదా అనే గర్వం. ఆ ధైర్యంతోనే ప్రాజెక్ట్ మొదలుపెట్టింది. అందుకే ఆ ప్రాజెక్ట్ ప్లాన్ సరిగ్గా లేదు. ప్లాన్ సరిగ్గా లేకపోతే, సమస్యలు వస్తాయి మరి. కె.వి.రెడ్డి, దుక్కిపాటి, విశ్వనాథ్, బాపుల్లాగా ముందే మంచి స్క్రీన్ ప్లే పకడ్బందీగా వ్రాసుకోకుండా సినిమాలు తీస్తే ఎలా వుంటాయో ఈనాటి మన తెలుగు సినిమాల్లో చూస్తున్నాంగా. అదే సమస్య కుందేలుతో కూడాను. తాబేలుది థిక్ స్కిన్. అంటే చర్మం గట్టిది. అనుకున్న గమ్యానికి చేరటమే లక్ష్యం. ముందే తన ‘కోర్ కాంపెటెసీలు వాడుకునే విధంగ ప్లాన్ చేసుకుంది. ఏది ఏమైనా, కష్టాల్ నష్టాల్ ఏవి వచ్చినా అన్నీ దులిపేసుకుని, ముందుకే వెళ్ళింది. ఇది నా పది పైసల ఎనాలిసిస్ అనుకో. అయినా దీనికి నీ తాత్పర్యం ఏమిటో చెప్పు బావా” అన్నాడు.
“నేను చెబుదామనుకున్నవన్నీ చాలవరకూ నువ్వే చెప్పేశావ్. అంటే ఏదన్నా ప్రొజెక్ట్ మొదలు పెట్టేటప్పుడు, ఆ ప్రాజెక్టు స్కోప్ ఏమిటి? దాన్ని పూర్తి చేయటానికి మన సత్తా, కోర్ కాంపెటెంసీలతో సహా, సరిపోతుందా, లేదా? అవసరమైన అర్హతలూ, పరికరాలూ వున్నాయా అని చూసుకోవటం అవసరం. ముందూ వెనకా చూసుకోకుండా పరుగెత్తితే, కుందేలుకి అయినదే మనకీ అవుతుంది. అవి లేనప్పుడు, అవి ఆ ప్రాజెక్టుకి అవసరమైనప్పుడు, జాగ్రత్తగా వేరే ఏవిధంగా వాటిని అధిగమించవచ్చు అనే ఆలోచన చేయటం కూడా చాల అవసరం” అన్నాడు కృష్ణ.

“అవును. బెగ్, బారో అండ్ స్టీల్ అన్నారు కదా. మనకి మంచి మార్గాలు దొరికితే సరే, లేనప్పుడు అవి తెలిసిన వారి దగ్గర నించీ తెలుసుకోవచ్చు కదా” అన్నాడు అర్జున్.
“అవును. బాగా చెప్పావు అర్జున్. ఈ కథ ఇంకా అవలేదు సుమా! ఈసారి అక్కడ మన ఒలెంపిక్స్ లాటివే, ‘అడవి పందాలు’ జరిగాయి. ఇలాటి పోటీల్లో, ఒక కుందేలూ ఒక తాబేలే కాదు. చాల కుందేళ్ళూ, చాల తాబేళ్ళూ పోటీకి వచ్చాయి. మరి ఇవి ప్రపంచీకరణ రోజులు కదా, అందర్నీ కలుపుకోవటం అవసరం. ఆ మహామహులనందర్నీ చూస్తే మన కుందేలుకీ, తాబేలుకీ గుండెలు బేజారెత్తాయి. అందులోనూ మళ్ళీ పరుగు పందెం. ఈసారి కూడా ఆ కొత్త దారిలోనే, నదిని దాటుకుంటూ వెళ్ళాలన్నారు. మన కుందేలూ తాబేలూ రెండూ కలసి ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాయి. ఆ నిర్ణయం ప్రకారం, చక్కటి ప్రాజెక్ట్ ప్లాన్ తయారు చేసుకున్నాయి. సరే పందెం మొదలయింది. ముందుగా కుందేలు మీద ఎక్కింది తాబేలు. తాబేలుని మోసుకుంటూ పరుగెత్తింది కుందేలు. మిగతా కుందేళ్ళన్నీ, వీళ్ళని చూసి నవ్వుకుంటూ, ‘పదండి ముందుకు, పదండి త్రోసుకు’ అని నినాదాలు చేస్తూ, వాటిని దాటిపోయి, ఎంతో ముందుకు వెళ్ళిపోయాయి. తాబేళ్ళన్నీ నెమ్మదిగా నడుస్తూ బాగా వెనక పడిపోయాయి. వీళ్ళు నది దగ్గరికి రాగానే, అక్కడ చెట్ల కింద కూర్చుని, ఆ నదిని ఎలా దాటాలా అని గాభరా పడుతున్న కుందేళ్ళు కనపడ్డాయి. వాటికి ఏం చేయాలో అర్ధం కావటం లేదు. అప్పుడే మన తాబేలూ కుందేలు చేతుల కలిపిన డబుల్ డెక్కర్ వచ్చింది. అక్కడ ఆగి, అటూ ఇటూ చూసి, పక్కనే వున్న నాయర్ షాపు వేపు నడిచాయి మన తాబేలూ, కుందేలూ. ఇద్దరూ వన్ బై టూ కాఫీ త్రాగారు. త్రాగటం అవగానే మన తాబేలు త్రేన్చుకుంటూ నీళ్ళల్లోకి దూకింది. దానిమీద ఎక్కింది కుందేలు. ఇందాకటి నించీ నడుము మీద మోసిన బరువుతో అలసి పోయిన కుందేలు ఇప్పుడు సేద తీర్చుకుంటుంటే, తాబేలు ఈదుకుంటూ అవతలి ఒడ్డుకి చేర్చింది. అలా వాళ్ళిద్దరూ చేతులు కలిపి, జంటగా ఆ పందెంలో గెలిచారు. అంటే ఏమిటి. ఈ ప్రపంచీకరణం రోజుల్లో, అంతమందినీ దాటుకుంటూ ముందుకి పోవాలంటే, ఆయా రంగాల్లో సమర్ధులైన వారితో జట్టు కలుపుకుని మీ జగన్నాధ రధ చక్రాలను కదిలించండి అని. ఆన్ని విషయాలూ మీకొక్కరికే తెలియక పోవచ్చు, అలాటప్పుడు అవి తెలిసిన వారితో జత కట్టండి. గెలుపు మీది కాక ఇంకెవరిదవుతుంది అని. అంటే టీం వర్క్ బాబూ, టీం వర్క్. ఏకో నారాయాణా అని కూర్చుంటే లాభం లేదు సార్ అని. టీం వర్కులో కావలసింది నమ్మకం. ఆ టీములో వున్నవారు అందరూ ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధారపడి వుంటారు. అందరూ ఎవరు చేయవలసిన పని వాళ్ళు చేస్తేనే, ఆ ప్రాజెక్ట్ విజయవంతమవుతుంది. ఉదాహరణకి మన సర్కసుల్లో చూస్తుంటాం కదా. పదిమంది వరసగా నుంచుంటే, వారి భుజాల మీద ఎనిమిది మంది నుంచుంటారు, వారి భుజాల మీద ఇంకో ఆరుగురు. ఇలా అది ఒక మానవ పిరమిడ్ అవుతుంది. అందరికన్నా పైన ఒక అమ్మాయి నుంచుని, చేతిలో నాలుగు పెద్ద రింగులు పట్టుకుని విన్యాసాలు చేస్తుంటుంది. క్రింద వున్న ఎవరు ఒక్క వెనకడుగు వేసినా, మొత్తం కూలిపోతుంది. జట్టులోని వారందరూ కూలి క్రింద పడిపోతారు. మొత్తం అభాసు పాలవుతుంది. అందుకే ఒకరి మీద ఒకరికి ఆ నమ్మకం అవసరం. కుందేలు ఇంకా కాఫీ త్రాగుతుంటే, మన తాబేలు గప్పుచుప్పున కుందేలుని వదిలేసి, నదిలో ఈదుకుంటూ వెళ్ళిపోవచ్చు. వెళ్ళి పందెం గెలిచి వుండవచ్చు. కాని వెళ్ళలేదు. అలా చేయలేదు. ఇద్దరూ ఒకళ్ళతో ఒకళ్ళు కలిసే ఆ పందెంలో గెలవాలనుకున్నారు. జమిలిగా గెలిచారు”

అర్జున్ తల గుండ్రంగా తిప్పుతూ అన్నాడు, “కలిసి వుంటే కలదు సుఖం.. మీకు లేని ఆ కోర్ కాంపెటెన్సీసుని, ఎవరి దగ్గరున్నాయో చూసి, వాళ్ళతో చేతులు కలపటం అవసరం కదా! అదే కదా టీమ్ వర్క్ అంటే. అలా అయితే ఉద్యోగంలోనే కాక, జీవితంలో కూడా విజయం సాధించవచ్చు కదా”
అంతా వింటున్న రుక్మిణి నవ్వుతూ అన్నది, “అవును. నా కోర్ కాంపెటెన్సీ రుచిగా వంట చేయటం. మీ బావగారి కోర్ కాంపెటెన్శీ ఏది చేసినా మెచ్చుకుంటూ తినేయటం. మాది కూడా మంచి టీమ్ వర్కే. ఒకళ్ళకొకళ్ళు అడ్డు రాకుండా మేం చేయగలిగేవి మేము చేస్తుంటాం” అని.
“అవును. మా సంసార జీవితంలో కూడా టీమ్ వర్కే. గివ్ అండ్ టేక్ అంటారు కదా. రుక్మిణి గివ్స్ అండ్ ఐ టేక్” అన్నాడు కృష్ణ నవ్వుతూ.
పెద్దగా నవ్వాడు అర్జున్.

*000*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked