అలాగే గురజాడ అప్పారావుగారూ సంఘసంస్కరణ పతాకగా వెలిగారు.
“ధూమకేతువు కేతువనియో
మోము చందురు డలిగి చూడడు?
కేతువాయది? వేల్పు లలనల
కేలి వెలితొగ కాంచుమా!’’
అని చెప్పి ప్రజలలో ఆలోచనని రేకెత్తింప చేశారు. మగడు వేల్పన్న పాతమాటను, స్త్రీపురుష సంబంధాన్ని గురించి, బూజుపడ్డ పాతభావాలనీ కడిగివేశాడు. ఈ విధమైన రచనల్లో అనుభూతి జ్ఞాన చైతన్య ప్రవృత్తిని ఆశ్రయించి (Intellectual Domain) ప్రకాశించిందని చెప్పుకోవచ్చు.
ఆంగ్ల విద్యా ప్రభావంవల్ల తెలుగు భాషలో నవలలు, నాటకాలు, కధలు, విమర్శలు, జీవితచరిత్రలు మొదలైన ఎన్నో ప్రక్రియలు తెలుగుబాషలో తమ తమ స్థానాలను ఆక్రమించుకుంటూ వచ్చాయి. నవలలు పౌరాణికాలుగా, చారిత్రకాలుగా, సామాజికాలుగా – మరెన్నో విధాలుగా విభాగాన్ని కలిగి ఉన్నా ప్రధానంగా నవల కాల్పనిక చైతన్యానికి (Emotional Domain) కి సంబంధించిది. ఇంగ్లీషులో Fiction విభాగానికి చెందిన నవల కల్పనలకి చెందినదై, ఊహల అల్లికకు చెందిన దైనందువల్ల దీన్నే కాల్పనిక ప్రవృత్తికి ప్రధానంగా చెందినదని చెప్పుకోవచ్చు. ఈ యుగంలో చక్కని నవలలు రాసి ప్రసిద్ధిగాంచిన వారిలో చిలకమర్తి లక్ష్మీనరసింహం పంతులుగారు, అడవి బాపిరాజుగారు, ఉన్నవ లక్ష్మీనారాయణగారు, విశ్వనాథ నారాయణగారు వంటి వారెందరో ఉన్నారు. మాలపల్లి సమకాలీన సమాజ పరిస్థితులను ఊహాత్మకంగా చిత్రించిన ప్రఖ్యాతమైన నవల. గణపతి వంటి నవలల్లో కాల్పనిక లక్షణాలు చక్కగా ద్యోతకమవుతాయి. వేయిపడగల వంటి సమగ్రమైన నవలలు కూడా ఈ యుగానికి చెందినవే. కాబట్టి ఈ యుగంలో కాల్పనిక ప్రవృత్తి (Emotional Domain)కి సంబంధించిన అనుభూతి నిలిచే ఉందని చెప్పుకోవాలి.
ఈ కాలంలో పల్లకీలనెక్కి ఊరేగిందీ, గజారోహణలు చేసి, వెలుగులు చిమ్మిందీ, రాజాస్థానాల కనకాభిషేకాలు చేసుకున్నదీ ఆశుకవితాధార. తెలుగుభాషకే సొంతమైన అష్టావధాన ఆశుకవితా ప్రక్రియలు రాజ్యమేలిన కాలమిది అని చెప్పవచ్చును. తిరుపతి వేంకటకవులు ‘ఏనుగు లెక్కినాము సుకవీంద్రులు మ్రొక్కగ నెక్కినాము’ అని సగర్వంగా చెప్పుకున్న ఆశు కవితా స్వర్ణకవితా యుగమిది. వీరేగాక వేంకట పార్వతీశ్వర కవులు, కొప్పరపు సోదరులు మొదలైనవారు ఎందరో కలరు. ఈ విధంగా కవిత్వానుభూతిలో జీవచైతన్యం (Psychic Domain) తన చోటును భద్రం చేసుకుంది.
ఈ కాలంలోనే వెలిసిన వేంకట పార్వతీశ్వర కవుల ఏకాంతసేవ, వానమామలై వరదాచార్యులుగారు రాసిన పోతన వంటివి భక్తికావ్యాలు. ఈ సందర్భంలో మరో విషయాన్ని గమనించాలి. ఒకప్పటి దైవభక్తికి చెందిన ఈ భక్తి ప్రవృత్తి నవ్యకవిత్వోద్యమ కాలంలో దేశభక్తిగా అభినవరూపం దాల్చింది. దీనికి వీరం స్థాయిగా ఆధునిక అలంకారికులు చెప్పుకుంటున్నారు. పరాయిపాలనలో మగ్గిపోతున్న దాస్యసంకెళ్ళను తెంచటానికి కవులంతా కంకణం కట్టుకున్న కాలమది.
“దేశమును ప్రేమించుమన్నా
మంచి అన్నది పెంచుమన్నా”
అని గురుజాడ అప్పారావుగారు దేశభక్తి ప్రారంభగీతికని ఆలపించగా,
“ఏ దేశమేగినా, ఎందుకాలిడినా
ఏ పీఠమెక్కినా, ఎవ్వరేమనిన
పొగడరా! నీ తల్లిభూమి భారతిని
నిలుపరా! నీ జాతి నిండు గౌరవము!’’
అంటూ రాయప్రోలు వారు గొంతు కలిపారు. వీరేకాక చాలామంది కవులు వీరితోపాటు గొంతు కలిపారు.
ఈవిధంగా ఈ కాలంలో భక్తిప్రవృత్తి పలు ప్రక్రియలలో వెలసి ఆధ్యాత్మిక చైతన్యానికి (Spiritual Domain) ఆధారభూతంగా నిలిచాయి. “ఇక్కడ ఒక ప్రశ్న మీమాంసకు వస్తుంది. అదేమిటంటే, వీరేశలింగం పంతులుగారు యుగచైతన్యాన్ని సృష్టించారా? సమాజ చైతన్యానికి పంతులుగారు ప్రతినిధులుగా నిలిచారా? అని. పైకి చూస్తే పంతులుగారి కృషి నిర్ద్వంద్వంగా కనపడుతుంది. కాని, లోనచూస్తే మూఢాచారాల మూగబాధతో మూలుగుతున్న సమాజ చైతన్యం అసన్మార్గం నుండి సన్మార్గంవైపు, చీకటినుండి వెలుగువైపు పయనించాలన్న తీవ్ర వేదనలో నుండి పంతులుగారు కార్యచైతన్యంలా ఉద్భవించినట్లు కనపడుతుంది. కానీ, సమాజ వేదన ఆయనలో ప్రవహించి ఆయనను తనకు కావలసిన అనుభవంవైపు మళ్ళించుకొన్నది. వ్యక్తిదృష్టితో చూస్తే కాలం కన్నబిడ్డ; కర్తవ్యం నిర్వహించిన కార్యకర్త; యుగచైతన్య ప్రతినిధి – యుగకర్త.
యుగకర్త యుగచైతన్య స్రష్టగా గోచరించినా, యుగచైతన్య ప్రతినిధి. ఆ యుగంలోని సాహిత్యానుభవం అతడనుభవించి ఆవిష్కరించినట్లుంటుంది; సమాజ చైతన్యం అతణ్ణి సృష్టించుకొని అతని ద్వారా ఆ అనుభవాన్ని ఆస్వాదించుకొంటున్నట్లూ ఉంటుంది. అనుభవం వ్యక్తినాశ్రయించి ప్రవహిస్తే ప్రక్రియ; అది సృజన వ్యాపారాన్ని ఆశ్రయించి సాగిన చైతన్యం: అనుభవం ఆస్వాదన ప్రవృత్తి నాశ్రయించి ప్రసరిస్తే సామాజిక చైతన్యం; అది వ్యక్తిలోనికి ప్రవహిస్తే రచన; అదే వ్యక్తినుండి సమాజం వైపు ప్రసరిస్తే ధోరణి – లేదా – ఉద్యమం.
కవిత్వాన్ని అనుభూతి కవితా ధోరణిగా, దానినొకవాదంగా ప్రస్తావించటం జరిగింది ఇరవయ్యో శతాబ్దం ఏడవదశకంలోనే. అంటే కవులు, రచనలు పుట్టినప్పటినుంచే కవిత్వంలో అనుభూతిని అనుభవిస్తున్నా దానిని ఒక కవితారీతిగా గుర్తించి, ప్రచారంలోకి తెచ్చింది ఆధునికయుగంలోనే. ఆఫ్రికాఖండాన్ని మననం అన్వేషించి, దాన్ని ఆ పేరుతొ ఇటీవలి కాలంలో పిలుస్తున్నా, ఆఫ్రికాఖండాన్ని మనం ఇప్పుడే పుట్టించాం అని అనలేము కదా! అనుభూతి ధోరణులు, అనుభూతివాదం మనమిప్పుడున్న రీతిలో గుర్తింపనికాలంలో అనుభూతి ఎలా తన ఉనికిని చాటుకోవాల్సి చాటుకుంటూ వస్తుందో మనం ఇప్పుడు పరిశీలిస్తున్నాం. పంచకోశ పరివ్యాప్తమైన కవిత్వంలోని అనుభూతి మన ప్రాచీన అర్వాచీన కవిత్వాలలో ఎంతవరకు వ్యాపించి ఉందొ మనం ఇప్పుడు స్థూలంగా పరిశీలిస్తున్నాం. ప్రాచీనాంధ్ర సాహిత్యంలో సమగ్ర స్వరూపంతో నిండారిన అనుభూతి కవిత్వం క్షీణయుగంలో ఎలా పల్చబడ్డదీ, వీరేశలింగంగారి యుగంలో మరలా ఎలా మలచబడ్డదీ మనం అవలోకించాం. తర్వాత వచ్చిన భావకవిత్వయుగంలో కూడా అనుభూతిని రచనల్లో మనం దర్శింపగలం. వీరేశలింగం యుగంలో వాస్తవికతకు ప్రథమస్థానమైతే, భావకవితాయుగంలో కాల్పనికతకు అగ్రతాంబూలం. ఆంగ్లభాషా ప్రభావంతో ఉవ్వెత్తుగా లేచిన కాల్పనిక ప్రవృత్తి కెరటం ఆంద్ర సాహిత్యరంగాన్ని తడిపి ముద్దచేసింది. ఇరవయ్యో శతాబ్దం ప్రధానంగా రెండు, మూడు దశకాలల్లో భావకవిని అని అనిపించుకోవటం, భావకవిగా కన్పించటం ఫ్యాషన్ అయిపొయింది. మన కవులకు ‘ఆంధ్రాకీట్స్; అనీ ‘ఆంధ్రా షెల్లీ’ అని మనం బిరుదులిచ్చి మురిసిపోయామంటే భావకవితా ప్రభంజనం ఎంతగట్టిగా వీచిందో ఊహింపవచ్చు. ఈ నవ్య కవితాయుగం రాయప్రోలు వారితో ప్రారంభమైనా నవ్యకవులుగా చెప్పుకోదగినవారు అనేకులు రంగం మీదికి వచ్చారు. ఎవరు ఎంతమంది వచ్చినా నవ్యకవితా చక్రవర్తి కృష్ణశాస్తే.
ఊహాతీతమైన దేనికో అర్రులు చాచేవాడూ, ఆశయాలలో, జీవితంలో అనుభవాలలో నూతనత్వం, విశేష ప్రత్యేకత సంతరించుకున్నవాడూ, ప్రేమకై జీవితంలో తపించినవాడూ, విరహంలో వేగిపోయినవాడూ కృష్ణశాస్త్రి. ఆ దుఃఖమే అవ్యక్తవేదనగా జాలువారింది. కృష్ణశాస్త్రి నిజజీవితంలోంచే ప్రేమ, విరహం పొంగులు వారింది. కవిత్వం కోసమే బతికాడు. భావ కవితా యుగ సార్వభౌముడిగా వెలిగాడు. భావకవిత్వ లక్షణానికి కృష్ణశాస్త్రి ఉదాహరణ ప్రాయమైయ్యాడు. “కవియొక్క ఒక అవిస్పష్ట వాంఛాంకురము, ఒక అంతర్నిగూఢ తాపము ఒక చిన్న కావ్యములో ఊదబడినచో అది భావకవిత్వం” అవుతుందని విశ్వనాథ వారంటారు.
“కాల్పనిక యుగచైతన్యం మానవునిలోని అంతరజగత్తుకి సంబంధించిన అనుభవాన్ని వ్యక్తీకరించటానికి శాబ్దికమైన, ఆర్థికమైన చింబపరికల్పనం చేసుకోవటంలో ప్రధానంగా జీవిస్తుంది. స్వేచ్చ, ఊహ, భావనాశక్తి, గాఢతన్మయత, ఆత్మాశ్రయత్వం, అంతర్ముఖీనత్వం, అభివ్యక్తి నవ్యత, లయాత్మకత మొదలైన లక్షణాలతో కవితా ప్రయోగాలలో అది ప్రత్యక్షమౌతుంది.