-సునీత పావులూరి
అనుభూతివాదం, అనుభూతి కవిత్వం అనే పేర్లు శ్రీకాంతశర్మగారి తర్వాత సాహిత్యంలో మరింత బలంగా పాతుకున్నట్లుగా తోస్తుంది. 1982లో నందిని సిద్దారెడ్డిగారి ‘అనుభూతివాదం’, 1982లో కొడవంటి లీలామోహనరావుగారి ‘అనుభూతి కవిత్వం’, 1983లో డా, ముదిగొండ వీరభద్రయ్యగారి ‘అనుభూతి కవిత్వం’ (కొన్ని వ్యాసాలు), 1987లో డా|| జి.వి. సుబ్రహ్మణ్యంగారి ‘అనుభూతి కవిత్వం’, 1989లో ఆర్. యస్. సుదర్శనంగారి ‘అనుభూతి కవిత్వం’ – ఈ వ్యాసాలన్నీ వివిధ పత్రికలలోనూ, సంకలన గ్రంథాలలోనూ ప్రచురితమయ్యాయి.
వీరి తర్వాత పైన పేర్కొన్న విమర్శ వ్యాసాలు ప్రచురితం కావటమే ఇందుకు తార్కాణం. ఈ కాలంలో అత్యధిక విమర్శకులు అనుభూతిని కవిత్వ ప్రధాన లక్షణంగా గుర్తించటం కూడా మనం గమనించాల్సిన అంశం.
కుందుర్తిగారి అనుభూతివాదం అనే పదాన్ని ప్రయోగించటమే కాకుండా, “తిలక్ తాను ప్రధానంగా అనుభూతి వాదినని బల్లగుద్ది చెప్పుకున్నాడు” అని వీరు చెప్పారు. “పాఠకుడికి నీ అనుభూతి ఆకారం అందాలి, హత్తుకోవాలి” అనీ, “కవిత్వం అంతరాంతర జ్యోతిస్సీమల్ని బహిర్గతం చెయ్యాలి” అనీ తిలక్ “నవత-కవిత” అనే ఖండికలో కవితా దృక్పథాన్ని తెలియజేశారు.
కుందుర్తిగారు ఈ పీఠిక రాసే నాటికే, అద్దేపల్లిగారు తిలక్ ను ‘అనుభూతివాదిగా’ గుర్తించటం జరిగింది. అంటే 1968 నాటికే అనుభూతివాదం అనే పదం బాగా వ్యాప్తిలోకి వచ్చిందని మనం ఊహించవచ్చు. బహుశా, దీన్ని ఆధారంగా చేసుకునే, తిలక్ తనంతతానుగా నేను అనుభూతివాదిని అని చెప్పుకున్నారు అనేకన్నా కుందుర్తిగారే బల్లగుద్ది చెప్పినట్లు గమనించవచ్చు. పైగా వీరు “ఈ అనుభూతి వాదము ఇటీవలికాలంలో భావకవితా యుగసంబంధి. ఇది వ్యక్తివాదానికి మరొక పేరు” అని అంటూనే, “అభినవ కాల్పనిక వాదమని చెప్పుకోదగిన అతని అనుభూతి వాదము కవితకు తుది తీర్పు కాజాలదు” అని కూడా అన్నారు. అంటే వీరు అనుభూతివాదాన్ని ‘భావకవిత్వ సంబంధి’గానూ, ‘వ్యక్తివాదానికి మరొక పేరు’గానూ, ‘అభినవ కాల్పనికవాదం’గానూ పేర్కోవటం జరిగింది. అంతేకానీ, వీరు అనుభూతివాదాన్ని ప్రత్యేకించి ఒక కవితా లక్షణంగా ఒప్పుకోవటం జరగలేదు. పైగా, తిలక్ కవిత్వాన్ని ‘అభ్యుదయ భావ కవిత్వ మిశ్రరూపం’గా నిరూపించుకోవటానికి వీరు ప్రయత్నించారు. భావకవిత్వం అంటే కాల్పనిక కవిత్వం అనీ, అనుభూతి కవిత్వం అంటే మరో కొత్తరూపంలో మళ్ళీ తలెత్తిన భావకవిత్వమే అనీ, తిలక్ కవిత్వం అభినవ కాల్పనిక వాదమే కాక అభ్యుదయ భావకవిత్వ మిశ్రమ రూపమనే విరుద్ధ అభిప్రాయాలు వీరి మాటల్లోనే వ్యక్తమవుతున్నాయి.
కుందుర్తిగారి అనంతరం ఈ పదాన్ని 1969 జనవరి సంవేదనలో రాచమల్లు రామచంద్రారెడ్డిగారు వాడటం జరిగింది. వీరి “తనలో తానొక ఏకాంత సౌందర్యం రచించుకున్న స్వాప్నికుడు” అనే వ్యాస ప్రధానోద్దేశం తిలక్ “అమృతం కురిసిన రాత్రి”పై సమీక్ష. తిలక్ కవిత్వాన్ని సమీక్షిస్తూ తిలక్ కవితా దృక్పథాన్ని వీరు ఈ సమీక్షా వ్యాసంలో అంచనా వెయ్యటం జరిగింది. దీన్లో భాగంగానే తిలక్ ని వీరు ‘భావకవి’గా పేర్కొంటూ, ఆనాటి భావకవులందరినీ అనుభూతివాద కవులుగా పేర్కోవటం కూడా జరిగింది. కానీ, ఈయన సూటిగా తిలక్ ను అనుభూతివాద కవుల్లో చేర్చలేదు. అంతేకాక, కుందుర్తిగారి లాగానే తిలక్ కవితా మూలతత్త్వాన్ని ‘అభినవ కాల్పనికవాదం’గానే పేర్కొన్నారు.
“నా కవిత్వం కాదొక తత్త్వం, మరికాదు మీరనే మనస్తత్వం, కాదు ధనికవాదం, సామ్యవాదం” అని అంటూ తిలక్ సిద్ధాంతాలని తిరస్కరిస్తూ కవిత్వం రాయటమే తిలక్ కవితా దృక్పథ వివేచనానికి అడ్డంకి అయినట్లుంది రామచంద్రారెడ్డిగారికి. వీరి సిద్ధాంతం ప్రకారం ఏ సిద్ధాంతానికీ కట్టుబడని మనిషి, చివరికి తన అనుభూతిని వ్యక్తం చేసుకోవటానికైనా సరే ‘స్వప్నాల మరుభూము’లనీ, ‘అబద్ధాల మృగతృష్ణ’లనీ కవి ఆశ్రయించక తప్పదు. అంటే తిలక్ ఏ సిద్ధాంతాన్నీ నమ్ముకోకపోవటం వల్ల వీటిని ఆశ్రయించాడని ఆరోపించినట్లుగా ఉందే కానీ, నిజాన్ని వ్యక్తపరుస్తున్నట్లుగా మాత్రం ఈ వ్యాసం లేదు. ఈయన ఈ వ్యాసంలో కవి అసలు ఏ ధోరణికి చెందినవాడు అనే విషయంతోటే ఆలోచించారే తప్ప, తిలక్ కవిత్వంలోని ధోరణి ఏమిటి అని మాత్రం వీరు ఆలోచించినట్లుగా కన్పించదు.