సారస్వతం

క్రోధం

-శారదాప్రసాద్

అరిషడ్వర్గాల్లో ఒకటైన క్రోధం అంటే కోపాన్ని , ఉద్రేకాన్ని, ఆవేశాన్నికల్గి ఉండటం .ఆగ్రహావేశం వచ్చినటువంటి వాడు గురువుని చంపేయడానికి కూడా వెనుకాడడు. క్షణికావేశంలో చేయకూడని పనులు చేసి జీవితాంతం కారాగారంలో ఉండిపోయిన మేధావులున్నారు. ఈ మధ్యనే అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా లాస్ ఏంజిలస్ (యూసీఎల్‌ఏ)లో భారతీయ విద్యార్థి మైనాక్ సర్కార్ (38) కాల్పులకు పాల్పడి ఓ ప్రొఫెసర్‌ను హత్యచేశాడు.ఆ తర్వాత తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇందుకోసం అతడు ఏకంగా దాదాపు 3222 కిలోమీటర్ల దూరం కారులో ప్రయాణించి వచ్చాడు. అంటే అతని క్రోధం పగగా మారిందన్నమాట!ఐఐటీ ఖరగ్‌పూర్ (ఏరోస్పేస్ ఇంజనీరింగ్) విద్యార్థి అయిన మైనాక్ సర్కార్.. యూసీఎల్‌ఏ ప్రొఫెసర్ విలియమ్ వద్ద డాక్టరేట్ విద్యార్థిగా ఉండేవారు. 2013లో అతని డాక్టరేట్ పూర్తయింది.చూసారా ఒక మేధావి తన విచక్షణను ఎలా కోల్పోయాడో! మనుషుల్లో కోపానికి కారణాలను పరిశీలిస్తే ప్రకృతి పరమయిన సహజ పరిస్థితుల కంటే సామాజిక పరిస్థితులే ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. అంటే వ్యక్తిత్వం, అహంభావం, నమ్మకాలు, గుర్తింపు, గౌరవం, ఆధిపత్యం, తదితర అంశాలకు భంగం వాటిల్లినప్పుడు కోపం కలుగుతుంది. సహజ ఉద్వేగం అయిన కోపాన్ని మన అదుపులో ఉంచే ఓర్పును నేర్చుకోవాలి. సమాజానికి కానీ లేదా మన సమిష్టి ప్రయోజనాలకు కానీ భంగం కలిగినప్పుడు మనం కోపాన్ని సామూహికంగా ప్రదర్శించటం చూస్తున్నాం! సమ్మెలు, బందులు, ధర్నాలు లాంటి కార్యక్రమాలు కూడా ఉమ్మడిగా కోపాన్ని ప్రదర్శించడమే!అయితే దీన్ని తాత్కాలికంగానే భావించాలి.సమిష్టి ప్రయోజనాలు నెరవేరిన తర్వాత ఆ కోపాగ్నిని శాంతంతో చల్లార్చాలి! అప్పుడే సమాజం కలుషితం కాకుండా ఉంటుంది. క్రోధాన్ని గురించి భగవద్గీతలో శ్రీ కృష్ణ భగవానుడు ఇలా చెప్పాడు!
“దుఃఖే ష్వనుద్విగ్నమనా స్సుఖేషు విగతస్పృహః
వీతరాగభయక్రోధః స్థితధీ ర్మని రుచ్యతే”
అంటే దుఃఖానికి కలతపడక, సుఖాలకు పరవశించక, అనురాగ భయ క్రోధాలను విసర్జించినవాదినే స్థితప్రజ్ఞుడని అంటారు.
“వీత రాగ భయక్రోధాః మన్మయా మా ముపాశ్రితాః
బహవో జ్ఞానతపసా పూతా మద్భావ మగతాః”
అంటే రాగ, భయ, క్రోథాలను విడచి భగవంతుని ఆశ్రయించి ధ్యానించేవాడు భగవద్భావనను పొందుతాడు.
“క్రోధాద్భవతి సంమోహః సమ్మోహాత్ స్మ్రుతి విభ్రమః స్మ్రుతి భ్రంశాత్ బుద్ధి నాశో –బుద్ధినాశాత్ ప్రణశ్యతి ‘’అని గీతా చార్యుడు శ్రీ కృష్ణ పరమాత్మ చెప్పాడు .ఎప్పుడూ విషయ వాంఛల గురించి, సుఖాల గురించి ఆలోచిస్తే వాటి మీదే ధ్యాస ఉంటుంది .వాటి మీదే అనురక్తి పెరుగుతుంది .ఆ అనురక్తే నెమ్మదిగా కామం లేక కోరికగా మారుతుంది .కోరిక తీరకపొతే క్రోధం కలుగుతుంది .క్రోధం అవివేకానికి దారి చూపుతుంది. కాబట్టి అవివేకానికి మూలం క్రోధం.
“అక్రోధేన జయేత్ క్రోధం, అసాధుం సాధునా జయేత్
జయేత్ కదర్యం దానేన , జయేత్ సత్యేన చానృతం”
అంటే కోపరాహిత్యంతో కోపాన్ని జయించాలి.దుర్మార్గుణ్ణి సాత్విక లక్షణాలతో జయించాలి. లోభిని దానంతో జయించాలి. అసత్యాన్నిసత్యంతో జయించాలి.
“కామ ఏష క్రోధ ఏష రజోగుణసముద్భవః
మహాశనో మహాపాప్మా విద్ధ్యేనమిహ వైరిణమ్”(భగవద్గీత 3-37)
రజోగుణం వల్ల కలిగే కామమే క్రోధం.ఇది ఎంత మాత్రమూ తృప్తినివ్వదు. ఇదొక మహాపాపి.ఇదే మనకు శత్రువు. అరిషడ్వర్గాల్లో క్రోధమంత ప్రమాదకరమైంది వేరొకటి లేదు . అన్ని దుర్లక్షణాలు క్రోధ నుంచే పుడుతాయి .క్రోధం కనుక పెరిగితే విచక్షణను పూర్తిగా కోల్పోతాం!మహర్షులైన విశ్వామిత్రుడు,దూర్వాసుడు లాంటి వారు కేవలం తమకున్న క్రోధం కారణంగానే వారి తపోఫలాన్ని నష్టపోయారు.
ఇక కోపాన్ని గురించి సుమతీ శతక కారుడు ఏమన్నాడో చూద్దాం!
తన కోపమె తన శత్రువు,
తన శాంతమె తనకు రక్ష, దయ చుట్టంబౌ
తన సంతోషమె స్వర్గము,
తన దుఃఖమె నరక మండ్రు తథ్యము సుమతి!
మన కోపమే మనల్ని శత్రువులులాగా బాధిస్తుంది . మన శాంతమే మనల్ని రక్షిస్తుంది .మన దయా గుణమే మనల్నిచుట్టములాగా ఆదుకుంటుంది . సంతోషంగా ఉండటమే స్వర్గం,సుఖం . దుఖమే నరకం . ఇది ముమ్మాటికీ నిజం .
“కామం క్రోధం లోభం మోహం
త్యక్త్వా ఆత్మానం భావయ కో అహం|
ఆత్మజ్ఞాన విహీనా మూఢాః
తే పచ్యంతే నరకనిగూఢాః”
అని ఆది శంకరులు తన భజగోవింద కీర్తనలలో చెప్పారు. దీని అర్ధం ఏమిటంటే, కామ క్రోధ లోభ మొహములను వదలి, “నేను ఎవరు?” అనే ఆత్మ విచారము చేయాలి . ఆత్మజ్ఞాన విహీనులైన మూఢులు ఈ అరిషడ్వర్గములను వదలక సంసార నరకములో పడి బాధలు పడుతారు .మనకు శత్రువులు ఆరుగురు. ఆ ఆరుగురు మనలోనే ఉన్నారు. వారు-కామ, క్రోధ, లోభ, మద, మోహ, మాత్సర్యములు. వీరు ఆరుగురు మంచి స్నేహంతో ఒకరినొకరిని కలిసి ఐకమత్యంగా ఉంటారు.వీరిలో ఈ ఒక్కరికైనా మనం స్థానం ఇస్తే, ఆ ఒక్కడు మిగిలిన తన స్నేహితులను తీసుకొని వస్తాడు.నాకు కావాలి అనే కోరికే కామము.మనసుకు కామ వికారము కలిగిన వెంటనే,కోరుకున్నది తనకే ఉండాలన్న లోభము, అది ఇతరులకు ఉన్నచో మాత్సర్యము, మోహము పెరుగును.దాన్ని పొందిన తర్వాత మదము కలుగుతుంది.కోరుకున్నది దక్కకుండా ఎవరైనా అడ్డుపడ్డారని భావిస్తే వారిమీద కోపం కలుగుతుంది . ఈ అరిషడ్వర్గాలని జయించితే ఆత్మజ్ఞానము కలుగుతుంది.ఆత్మజ్ఞానం కలిగిన జీవుడు సంసార బంధాలనుండి విముక్తుడై మోక్షాన్ని పొందుతాడు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked

1 Comment on క్రోధం

విజయలక్ష్మి ఫ్రసాద్ said : Guest 6 years ago

Well explained about KRODHAM

  • GUNTUR