సారస్వతం

గీతా సారం

-శారదాప్రసాద్

హిందూధర్మ సాహిత్యంలో ఎంతో ఉన్నతమైనది భగవద్గీత.వేదాలు,ఉపనిషత్తులు,
శాస్త్రాలు, పురాణాలు, ఇతిహాసాలు, సిద్ధాంతాలు!-'వీటిలో దేన్ని అనుసరించాల’ ని
చాలామంది అడుగుతుంటారు.దానికి సమాధానం--'సర్వ శాస్త్రమయీ గీతా..’. అన్ని
శాస్త్రాల సారమే గీత అని శ్రీకృష్ణుడే చెప్పాడు.భగవద్గీత ఒక్కటి చదివితే చాలు,
చాలా ధర్మ సూక్ష్మాలు తెలుస్తాయి! శాశ్వతమైన దానిని ,అశాశ్వతమైన దానిని
గురించి చెప్పింది. పాప పుణ్యాలను విశదీకరించింది . ఆత్మస్వరూపాన్ని గురించి
చెప్పింది. పరుల సుఖం కోసం జీవించమని చెప్పింది. పండితుడికి ,
స్థితప్రజ్ఞుడుకి గల తేడాను చెప్పింది. ప్రతిఫలాపేక్ష లేకుండా కర్మ చేయడంలో
ఉండే ఆనందాన్ని గురించి చెప్పింది.ఎలా జీవించాలో,ఎలా జీవించకూడదో కూడా
చెప్పింది.పరమాత్ముడికి ఇష్టమైన వారు ఎవరో చెప్పింది .ఆయనలో ఐక్యమయ్యే
మార్గాన్నిచూపించింది .ఈ జన్మలో చేసుకున్న కర్మలను బట్టి,మరుజన్మ ఆధారపడి
ఉంటుందని చెబుతూ పునర్జన్మ సిద్ధాంతాన్ని ధృవీకరిస్తుంది గీత - ‘శరీరం
యదవాప్నోతి. (15-8).ఈ లోకంలో వ్యవహరిస్తూ కర్మ చెయ్యకుండా ఒక్కక్షణం కూడా
ఉండలేం .అందుకే భగవద్గీతలో శ్రీ కృష్ణుడు “నహికశ్చిత్ క్షణమపి జాతుతిష్టత్య
కర్మకృత్” అని చెప్పారు . అంటే జీవించి ఉన్నంత వరకు ఒక్క క్షణం కూడా కర్మలు
చేయకుండా ఉండటం సాద్యంకాదు అని.ఈ లోకంలో కర్మలు చేస్తూనే జీవించాలి.ఇదే
మనకున్న మార్గం.మరొక మార్గం లేదు.కర్మ కళంకాన్నివ్వదు.కనుక జీవించినంత కాలం
కర్మలు చేస్తూ ఉండాల్సిందే.ఉపనిషతుల సారం, బ్రహ్మవిద్యా ప్రబోధము,
యోగాశాస్త్రము అయిన భగవద్గీతలో శ్రీ కృష్ణుడు ఇలా చెప్పాడు - ప్రారబ్ధ కర్మలను
అనుభవించి వాటిని నివృత్తి చేసుకోవటం “భక్తియోగం” ద్వార ,సంచిత కర్మలను
జ్ఞానగ్నిలో దగ్దం చేసుకోవటం "జ్ఞానయోగం" ద్వారా సాధ్యమని!ఏ ఫలాన్ని ఆశించి
మేఘాలు చల్లని వర్షాలను ఇచ్చి భూమిని సస్యశ్యామలం చేస్తున్నాయ్? ఏ లాభాన్ని
కోరి నదీనదాలు తియ్యని నీటిని ఇచ్చి మన దప్పికను తీరుస్తున్నాయ్? ఏ
ప్రత్యుపకారాన్ని కోరి వృక్షజాతులు మధురాతి మధురమైన ఫలాలను సృష్టిలోని
మానవులకు, జంతువులు, పక్షులకు ఇస్తున్నాయ్?ఒకరికి ఫలాపేక్షను ఆశించకుండా సహాయం
చేసి ఆనందాన్ని పొందటంలోనే ఉంది నిజమైన తృప్తి.కర్మఫలములను ఆశించకుండా
జీవించుట,ఫలితములు వచ్చినా వలసినంత అందుకొని మిగిలినవి త్యాగము చేయట
ముఖ్యం!ఇదే నిష్కామ కర్మ.జీవితంలో ఈ ముఖ్యమైన దాన్ని ఆచరించకుండా ఎన్ని పూజలు
చేసినా అవి నిరుపయోగమే!కర్మలు చేస్తూ కర్మలంటకుండా జీవించటానికి అవసరమైన
స్థైర్యాన్ని మనకు ఇవ్వమని  దైవన్ని ప్రార్థించాలి.తామరాకు మీద నీటి బొట్టులా
ఉండాలి.అంటే కర్మలు చేస్తూ కర్మ బంధము అంటకుండా జీవించటం!ఇదే నిజమైన
మోక్షం.మోక్షం అంటే వచ్చేది కాదు. ఉన్నది పోగా మిగిలింది .అంటే జీవితంలోని
బంధాలు పోతే!నిజానికి  ఏ విషయము
కూడా మనల్ని బంధించదు. మనం దానితో ఏర్పరుచుకున్న సంబంధము వల్ల అది మనల్ని
బంధిస్తుంది. భగవద్గీత చివరి అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ గీతా సారాన్ని అంతా
క్లుప్తంగా మూడు శ్లోకాలలో చెప్పాడు. జీవుడు ఏ సాధనాల ద్వారా పరబ్రహ్మ
సాక్షాత్కారమును పొందగలడో చక్కగా వివరించపడ్డాయి. కాబట్టి ఈ ముఖ్యమైన
శ్లోకాలను మనం ఎప్పుడూ నెమరవేసుకుంటూ ఉండాలి.
1. బుద్ధ్యావిశుద్ధయా యుక్తో ధృత్యాత్మానం నియమ్య చ
 శబ్దాదీన్విషయాం  త్యక్త్వా రాగద్వేషౌ  వ్యుదస్య చ         (18-51)
2. వివిక్త సేవీ లఘ్వాశీ యతవాక్కాయమానసః
ధ్యానయోగపరో నిత్యం వైరాగ్యం సముపాశ్రితః               (18-52)
౩.  అహంకారం బలం దర్పం కామం క్రోధం పరిగ్రహం
విముచ్య నిర్మమః శాన్తో బ్రహ్మభూయాయ కల్పతే.        (18-53)
"నిర్మలమైన మనస్సుతో, ధైర్యముతో మనస్సును స్వాదీనపరచుకొని, శబ్దాది విషయములను,
రాగద్వేషములను విడిచిపెట్టి, ఏకాంతవాసియై, మితాహారమును స్వీకరించుచు,శరీర,
వాక్,మనసులను నియంత్రించి, నిరంతరం ధ్యానయోగాభ్యాస మొనర్చుచు, వైరాగ్యమును
ఆశ్రయించి, అహంకార బలదర్పములను, కామక్రోధములను, భోగ్యవస్తు పరిగ్రహమును
 త్యజించి, మమకార రహితుడవై, శాంతస్వభావం కలిగియుండు మహనీయుడు పరబ్రహ్మ
సాక్షాత్కారము పొందుటకు సమర్థుడు అగుచున్నాడు." పై మూడు కూడా అధ్యయనం చేయలేని
వారు కనీసం ఈ ఒక్క శ్లోకాన్నైనా ఆకళింపు చేసుకోగలరు! "యత్ర యోగేశ్వరః కృష్ణో
యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ."
(భ.గీ.18-78)"ఎచట యోగేశ్వరుడగు శ్రీకృష్ణమూర్తియు, ఎచట ధనుర్దారియగు
అర్జునుడును ఉందురో, అచ్చోట లక్ష్మి,విజయం, ఐశ్వర్యం, నీతి తప్పక ఉండుట
నిశ్చయం" అని సంజయుడు చెప్పాడు.మరొక శ్లోకాన్ని చూద్దాం!-మన జీవితానికి ఎలా
మార్గ నిర్దేశం చేస్తుందో. "యదా సంహరతే చాయం కూర్మోఙ్గానీవ సర్వశః|
ఇంద్రియాణీంన్ద్రీయార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా" (2-58). తాబేలుఏ కొంచం
శబ్దం గాని, అలజడి గాని కలిగితే వెంటనే తన అవయవాలన్నిటిని లోపలకి (చిప్పలోకి
)ముడుచుకుంటుంది. దానికి తన అవయవాలు అంత స్వాదీనంలో ఉంటాయి. మనం కూడా మన
ఇంద్రియాలను అలా ఆధీనంలో ఉంచుకోవాలని చెబుతోంది ఈ శ్లోకం. అలవాటుగా మనసు చెడు
విషయాల మీదకి మళ్ళినా, వెంటనే ఆదీనంలోకి తెచ్చుకుంటే సమస్యలు ఉండవు . అంటే,
ఇంద్రియాలని ఆదీనంలో ఉంచుకుంటే, జ్ఞానం స్థిరంగా ఉంటుందని
 అన్వయించుకోవాలి.మహాత్మా గాంధీ ఇలా అన్నారు,
"గీత నాకు తల్లి లాంటిది,స్వాతంత్య్ర సముపార్జన దీక్షలో నాకు అపరితమైన
శక్తినిచ్చింది భగవద్గీత." వేదాల గురించి, భగవద్గీత గురించి సవివరంగా చెప్పిన
ఎడ్విన్ ఆర్నాల్డ్, మాక్స్ ముల్లర్, ఓపెన్ హామర్‌లు జర్మనీ
దేశంవారు.మహాత్మాగాంధీకి భగవద్గీతపైన ఎక్కువ మక్కువ గలగటానికి కారణం - ఎడ్విన్
ఆర్నాల్డ్ రాసిన ‘ద సాంగ్ ఆఫ్ సెలెస్టల్’ అనే గీతానువాద గ్రంథమే!ఈ ఆధ్యాత్మిక
జ్ఞానం అందరికీ  అవసరమని గుర్తించి, న్యూజెర్సీ (యూఎస్‌ఏ)లోని ‘సెటన్ హాల్
యూనివర్సిటీ’ లో చేరే ప్రతి విద్యార్థీ తప్పనిసరిగా భగవద్గీత చదవాలనే నిబంధన
పెడుతూ, ఈ కోర్సుకు ‘ద జర్నీ ఆఫ్ ట్రాన్స్‌ఫామేషన్’ అని పేరుపెట్టారు.కానీ మన
దేశంలో దురదృష్ట వశాత్తు ఎవరైనా చనిపోతేనే‘గీత’ వినిపించాలనే భావన ఉంది.మనిషి
జీవన్ముక్తుడు కావటానికి దారి చూపిన అత్యుత్తమ ఆధ్యాత్మిక గ్రంధం
భగవద్గీత.శ్రీ కృష్ణుడు బోధించిన గీతలో లేని వ్యక్తిత్వ వికాసం ప్రపంచంలో
ఇంకెక్కడ దొరకదు! . పర్సనాలిటీ డెవలప్మెంట్‌ కోసం వేలు, లక్షలు ఖర్చు చేసి,
విజయం కోసం నానా తంటాలు పడుతున్న నేటి తరానికి ఇది పాఠ్యాంశం కావాలి.దీన్ని మన
వారసత్వ సంపదగా గుర్తించి మనం అందులో చెప్పిన వాటిని ఆచరించాలి!

*శుభం భూయాత్! *

Leave a Reply

Your email address will not be published. Required fields are marked

2 Comments on గీతా సారం

జయలక్ష్మి said : Guest 6 years ago

చాలా బాగుందండీ!

  • guntur
వ్యాసమూర్తి said : Guest 6 years ago

గీతాసారాన్ని బాగా వివరించారు

  • హైదరాబాద్