ఇంద్రుడితో రావణుడి యుద్ధం
మేఘనాధుడు ఆగ్రహావేశంతో సింహనాదం చేసి రాక్షస సైన్యానికి ఉత్సాహం కలిగించాడు. దావాగ్నిలా విజృంభించాడు. ఇంద్రుడు తన కుమారుడైన జయంతుణ్ణి మేఘనాధుడిపై యుద్ధం చేయటానికి పంపాడు. మేఘనాధ, జయంతుల పోరు అరవీరభయంకరంగా మహాతీవ్రంగా జరిగింది. శతసహస్ర సంఖ్యో అస్త్రశస్త్రాలు పరస్పరం గుప్పించుకున్నారు వాళ్ళు. మేఘనాధుడి మాయా ప్రయోగం దేవతలకు భరించరానిదై పోయింది. అస్త్రశాస్త్రాలతో చీకటి ఆవరించింది. యుద్ధభూమిలో ఎవరు ఎవరో తెలియక దేవతలు దేవతలను, రాక్షసులు రాక్షసులను చంపుకున్నారు, మోదుకున్నారు. జయంతుడి మాతామహుడు పులోముడు జయంతుణ్ణి తీసుకొని వెళ్లి సముద్రంలో దాచాడు. జయంతుడు కనపడక దేవరలు విచారంతో ఉండగా మేఘనాధుడు మరింత రెచ్చిపోయి శత్రుసంహారం చేశాడు. ఇక ఇంద్రుడే స్వయంగా యుద్ధరంగాన నిలిచాడు. ఆయన సారథిగా మాతలి ఒడుపుగా యుద్ధంతో ఇంద్రుడికి సారథ్యం చేశాడు. దేవతలంతా ఉల్లసిల్లారు.
అయితే దేవతలకు కొన్ని దుర్నిమిత్తాలు తోచాయి. సూర్యుడు మసకబారి పోయినాడు. ఉల్కలు తెగిపడ్డాయి. అప్పుడు రావణుడు విశ్వకర్మ నిర్మించిన దివ్యరథం ఎక్కి యుద్ధానికి వచ్చాడు. ఆ రథానికి ముందు క్రోధోద్రిక్తమైన తమ బుసలె అగ్నికీలలుగా వెలువడుతున్న మహోపన్నగాలు నడిచాయి. భయంకరులైన దైత్యవీరులు రావణుడి చుట్టూ ఉన్నారు. అప్పుడు రావణుడు మేఘనాదుణ్ణి కొంచెం సేపు ఆగాల్సిన్డిగా చెప్పి తానే ముఖాముఖిగా ఇంద్రుణ్ణి ఎదిరించాడు. అప్పుడు వాళ్ళ మధ్య ప్రచండయుద్ధం జరిగింది. మహా భయంకరమైన పోరు వాటిల్లింది. కుంభకర్ణుడు విజృంభించి దేవసైన్యాన్ని నుగ్గుచూనం చేశాడు. ఏకాదశరుద్రులు అప్పుడు యుద్ధరంగంలోకి వచ్చి రాక్షసులను పీనుగుపెంటలను చేశారు. యుద్ధభూమిలో రక్తనదులు పారాయి. రావణుడు మహోగ్రుడై దేవసైన్యాన్ని చీకాకుపరుస్తూ ఇంద్రుడితో తలపడ్డాడు. ఇంద్రుడు, రావణుడు
ప్రయోగించిన శరవర్షం యుద్ధభూమిని చీకటి కమ్ముకునేట్లు చేసింది. ఆకాశం అస్త్రశస్త్రాచ్చాదితమైంది. రావణుడికీ, మేఘనాధుడికీ తామెవరో ఎక్కడున్నారో తెలుస్తున్నది కాని రాక్షసులకు, దేవతలకు ఎవరు ఎవరో తెలియడం లేదు.
ఇంద్రుడి అస్త్రశస్త్రపాతంతో రాక్షసులు మూకుమ్మడిగా కుప్పకూలి పోతుండటంతో రావణుడు రోషభీషణమూర్తి అయినాడు. సేనామధ్యంలో ఇంద్రుడికి అభిముఖంగా తనను తీసుకొని పోవలసిందిగా సారథిని కోరాడు రావణుడు. ‘వీడు బ్రహ్మవరం వల్ల చావడు. వీణ్ణి బంధించటమే కర్తవ్యమ్ మనకిప్పుడు. చాకచక్యంగా యుద్ధం చేయండి.’ అని దేవవీరులను ప్రోత్సహించాడు ఇంద్రుడు. ఇక అక్కడ నుండి దక్షిణదిశగా వెళ్ళాడు ఇంద్రుడు. అక్కడ రాక్షసులతో భయంకర యుద్ధం చేశాడు. రాక్షసులంతా కుయ్యో, మొర్రో అని ఆక్రందనలు చేశారప్పుడు. ఈ దీనాలాపాలు మేఘనాధుడు విని క్రోధసంరక్తలోచనుడైనాడు. అమితంగా రోషించాడు. తన రథంతో మహావేగంగా సైన్యమధ్యానికి వచ్చి పరమశివుడి వల్ల పొందిన తన మాయను ప్రయోగించాడు. హుటాహుటి ఇంద్రుడి మీదికే వచ్చాడు. అప్పుడు ఇంద్రుడు రథం విడిచిపెట్టి ఐరావతం ఎక్కాడు. మేఘనాధుడెక్కడ అని వెదకటం సాగించాడు. మేఘనాధుడు మాయతో అదృశ్యుడై ఇంద్రుడిపై శరపరంపరలు గుప్పించాడు. ఇంద్రుడు దిగ్భ్రాంతుడైనాడు. ఇంతలో మేఘనాధుడు కిందికి వచ్చి ఇంద్రుణ్ణి బంధించాడు. మేఘనాధుడు తాను కనపడకుండా ఐరావతంతో సహా ఇంద్రుణ్ణి ఆకాశం మీదికి ఎగురవేసుకొని పోతున్నాడు. దేవతలందరికీ ఏమి చేయాల్సిందీ పాలుపోయింది కాదు.
అప్పుడందరు దేవతలు ఏకమై రావణుడితో యుద్ధం చేశారు. ఆదిత్యులు, వసువులు రావణుణ్ణి కమ్ముకున్నారు. రావణుడికి దిక్కుతోచింది కాదు. ఆ సమయంలో మేఘనాధుడు రావణుడి దగ్గరకు వచ్చి ‘తండ్రీ! ఇక యుద్ధంతో పనిలేదు. ఇంద్రుణ్ణి బంధించాను చూడు’ అని సంతోషంగా చెప్పాడు. రావణుడి సంతోషానికి పట్టపగ్గాలు లేకపోయినాయి. కుమారుణ్ణి బహువిధాలా పొగిడాడు. తండ్రీకొడుకులు ఇంద్రుణ్ణి బంధించి లంకకు తీసుకొని పోయారు. మహానందభరితులైనారు. లంకలోని రాక్షసులంతా కోలాహలంగా ఆనందించారు. ఆటపాటలలో మునిగితేలారు.
అప్పుడు దేవతలంతా బ్రహ్మ దగ్గరకు వెళ్లి రాక్షసులు ఇంద్రుణ్ణి బంధించుకొని లంకకు తీసుకొని పోయిన వార్త విచారంగా చెప్పారు. బ్రహ్మదేవుడు దేవతా ప్రముఖులతో లంకకు వెళ్ళి ఆకాశంలోనే నిలిచి రావణుడితో ఇట్లా అన్నాడు. ‘నీ కొడుకు యుద్ధంలో ఇంద్రుణ్ణి జయించటం నీ వంశోన్నతికి గర్వకారణం. నిన్ను మించిన పరాక్రమవంతుడు నీ కుమారుడు. అందువల్ల ‘ఇంద్రజిత్తు’ అనే పౌరుషనామతో ఇక ముందు విరాజిల్లుతాడు. దేవదానవులకు అసాధ్యుడై వర్దిల్లుతాడు. ఇప్పుడు ఇంద్రుడూ, సకల దేవతలూ నీకు లోబడినట్లే. కాబట్టి ఇంద్రుణ్ణి బంధవిముక్తుణ్ణి చేసి విడిచిపెట్టు. ఇది నీ గొప్పతనానికి తార్కాణంగా ఉంటుంది’ అంటూ ‘వేల్పులందరూ నిన్ను దేహి అని యాచిస్తున్నారు’ అని కూడా చెప్పాడు రావణుడికి, బ్రహ్మదేవుడు.