రావణుడు మహోదగ్రంగా మధుపురం మీద పోయి పడ్డాడు. అన్న రాక విన్న కంభీనసి వల వల ఏడుస్తూ వచ్చి అన్నపాదాల మీద వాలిపోయింది. ‘అభయం‘ ఇస్తే గాని లేవనన్నది. మన్న్ననగా అభయం ఇచ్చాడు రావణుడు. ‘నన్ను అనాథను చేయవద్దు. నా పసుపు కుంకుమ నిలబెట్టు‘ అని వేడుకుంది. ‘సరే! మంచిది! ఏడీ నీ భర్త. నేను ఇంద్రుడిపై దండయాత్ర చేయడానికి వెళుతున్నాను. నీ భర్తను కూడా నాకు సహాయంగా రమ్మను‘ అన్నాడు రావణుడు. ఆ రాత్రి చెల్లెలింట సత్కారం పొంది మర్నాడు మధురాక్షసుణ్ణి కూడా వెంటబెట్టుకుని సకల సేనా పరివారంతో పయనించి కైలాస పర్వతప్రాంతంలో కుబేరుడి అలక పట్టణం సమీపంలో సేనతో విడిది ఏర్పాటు చేసుకున్నాడు రావణుడు.
అది వెన్నెల రాత్రి. వసంత ఋతువు కూడా నేమో! ప్రకృతి రమణీయంగా ఉంది. దూరం నుంచి అచ్చరాల ఆటలూ, గందర్వుల పాటలూ వినవస్తున్నాయి. మలయా పవనమూ, వివిధ పుష్పసుగంధమూ రావణుణ్ణి మదన బాణ వివశుణ్ణి చేస్తున్నాయి. ఇంతలో ఒక దివ్యంగాన సర్వాలంకారభూషితురాలై, మేలిముసుగు ధరించి అక్కడకు వచ్చింది, రావణుడు ఆమెను ‘ఎవరు నీవు?’ అని అడిగాడు. ఆమె గజగజలాడుతూ తాను రంభననీ, కుబేరుడి కొడుకైన నలకూబరుడి ప్రియురాలిననీ, తనకోసం నిరీక్షిస్తున్న నలకూబరుడి కోసం వెళుతున్నాననీ చెప్పింది, కామ పరవశుడైన రావణుడు ఆమె పొందు కోరాడు. ఆమె వలవల ఏడుస్తూ తాను రావణుడికి కోడలి నవుతాననీ, అట్లా కోరటం తగదనీ చెప్పింది. అప్పుడు రావణుడు పకపక నవ్వుతూ వెలయాండ్రకు వావివరస లేమిటని అపహసిస్తూ రంభను బలాత్కారంగా పొందాడు.
ఆమె వాడివత్తలైన దివ్య కుసమంలాగా వెళ్ళి నలకూబరుడి పాదాలపై వాలి జరిగిన వృత్తాంతం నివేదించింది. నలకూబరుడి రంభను ఓదార్చి, రావణుడు ఇక ఎప్పుడైనా బలాత్కారంగా ఏ స్త్రీనైనా కూడినప్పుడు తల పలువక్కలై మరణిస్తాడని శాపమిచ్చాడు. ఇది తెలిసి దేవరలు, ఋషులు ఎంతో సంతోషించారు. రావణుడు అప్పటి నుంచి కాస్త ముందువెనుకలు ఆలోచిస్తూ వచ్చాడు. పరస్త్రీ కాముకతలో. రావణుడు చెరపట్టి తెచ్చిన స్త్రీలంతా ఈ వార్త విని ఎంతో ఆనందించారు.
అమరావతిపై దండయాత్ర
ఇక ఆ మర్నాడు రావణుడు ఇంద్రుడి రాజధాని అయిన అమరావతిపై దండెత్తి పోయినాడు. అప్పుడు ఇంద్రుడు వెళ్లి విష్ణుమూర్తిని శరణు వేడుకున్నాడు. నీ అనుగ్రహంతోనే నముచి, వృత్రాసురుడు మొదలైన క్రూరరాక్షసులను సంహరించగలిగాను. ఇప్పుడు కూడా శంఖ, చక్ర, గదా, శార్జ్గ పాణివై వచ్చి నన్నురక్షించు. రావణుడి మదం అణచు‘ అని నారాయణుణ్ణి ప్రార్థించాడు ఇంద్రుడు.
అప్పుడు శీ మహావిష్ణువు ‘రావణుణ్ణి వధించడానికి ఇది సమయమూ, సందర్భమూ కాదు. పితామహుడు వాడికి అవధ్యుడిగా వరాలిచ్చాడు. బ్రహ్మ మాట చెల్లాలి కదా! సమయం చూసి నేను రావణుణ్ణి వధిస్తాను‘ అని ప్రతిజ్ఞా వచనపూర్వకంగా ఇంద్రుడికి అభయమిచ్చాడు. ఇక చేసేది లేక మహేంద్రుడు సకల దేవతా సైన్యంతో యుద్ధ సన్నద్ధుడైనాడు. సమస్త ముఖ్యదేవతలు ఆయన పక్షాన సహాయులై వచ్చారు.రావణుడు కూడా మారీచుడు, ప్రహస్తుడు, మహాపార్శ్వుడు, మహోదరుడు, అకంపనుడు. శుకసారణులు మొదలైన ముఖ్యమంత్రులతో కూడి ఇంద్రుడిపై యుద్ధానికి తలపడ్డాడు.
సురాసురుల మధ్య యుద్ధం
అష్టవసువులలో సావిత్రుడు, ద్వాదశాదిధిత్యులలో త్వష్ట, మాషుడు వచ్చి ఇంద్రుడి పక్షాన రాక్షసులను మారణహోమానికి గురిచేయడం సాగించారు. శస్త్ర, ప్రతిశస్త్ర ప్రయోగాలతో భూనభోంతరాళాలు దద్దరిల్లాయి. వివిధ అస్త్రశస్త్రాలను పరస్పరం ఒకరిపై ఒకరు ప్రయోగించుకున్నారు. ప్రతిశస్త్రాలను కూడా ప్రయోగించుకున్నారు. సురలను రాక్షసులు, రాక్షసులను సురలు చీల్చి చెండాడారు.
రావణుడి మాతామహుడైన సుమాలి విజృంభించి పెనుగాలి మేఘాలను చెదరగొట్టినట్లు దేవతా సైన్యాలను చిందరవందర చేశాడు. సుమాలి విజృంభనకు ఆగలేకపోతున్న దేవసైన్యాన్ని చూసి కోపించి అష్టమవసువైన సావిత్రుడు సుమాలిని నిలువరించి
ఘొరయుద్ధానికి తలపడ్డాడు. శస్త్రప్రతిశస్త్రాలు మహా భయంకరంగా పరస్పరం ప్రయోగించుకున్నారు. సుమాలి ఎక్కి వచ్చిన పన్నగరథం, పసుపు బాణాలతో చూర్ణమై పోయింది. అప్పుడు సావిత్రుడు కాలదండం వంటి తన గదతో సుమాలి నెత్తిమీద మోదాడు. ఇంద్రుడి వజ్రం కొండను బద్దలు చేసినట్లు వసువు గద సుమాలి తలను బద్దలు చేసింది. అప్పుడు రాక్షస బలగాలు వెనుకంజ వేసి పారిపోయే ప్రయత్నం చేశాయి.
***