– యస్. యస్. వి రమణారావు
ఎగసిపడుతున్న అలలతో ఎఇడి లైట్ ల వెలుగులతో విశాఖపట్టణ సముద్రం మెరిసిపోతుంది.సమయం రాత్రి పదకొండు గంటలు దాటింది.అయినా ఎక్కువగా లేనప్పటికీ ఇంకా జనం ఉన్నారు బీచ్ లో ఆశ్చర్యంగా. దానికి కారణం ఉంది.బీచ్ సాండ్ లో లైట్ లు పెట్టారు. కూర్చోడానికి వీలుగా బీచ్ రోడ్ పొడవునా గ్రానైట్ స్టోన్ వేశారు. గ్రానైట్ స్టోన్ ముందర ఒక పదడుగుల దూరంలో గ్రనైట్ స్టోన్ తోనే చేసిన సోఫాలు అక్కడక్కడ ఉన్నాయి. అక్కడ కూర్చుని ఎగసిపడుతున్న అలలని,సముద్రంమీద పడుతున్న చంద్రకాంతిని చూస్తూ ఎంతకాలమైనా గడిపేయచ్చు. పోలీస్ పేట్రోల్ వాహనం అప్పుడప్పుడు అటూ ఇటూ రౌండ్స్ వేస్తోంది.ఎంతో అందంగా, కొంచెం సెక్యూర్డ్ గానే అనిపిస్తున్నప్పటికీ కూడా….. అంతరాత్రి ఒక అమ్మాయి ఒంటరిగా అక్కడ ఆ సోఫాలో కూర్చుని ఉండడం కొద్దిగా ఆశ్చర్యమే!
అదే ఆశ్చర్యం,దానితోపాటు కొంచెం కోరిక, నోవాటెల్ లో డ్రింక్ చేసి ఇంటికి వస్తున్న ఒక నలుగురు కుర్రాళ్ళకి కలిగింది. దానికి తోడు వాళ్ళందరూ రాజకీయంగా బాగా పలుకుబడి ఉన్నవాళ్ళు. కారు ఆగింది.ఒకడు దిగి ఫుట్ పాత్ మీంచి గ్రనైట్ స్టోన్ మీదకెక్కి, గ్రనైట్ స్టోన్ మీంచి బీచ్ ఇసకలోకి దూకి అమ్మాయి కూర్చున్న రాతి సోఫా దగ్గరికి వెళ్ళాడు.మిగతా ముగ్గురూ కారులోంచి అంతా చూస్తున్నారు.వాళ్ళకిది అలవాటే. ఒంటరిగా ఉన్న అమ్మాయిలని చూడడం,మాటలు కలపడం, నెమ్మదిగా తీసుకొచ్చి కారులో ఎక్కించడం. సాధారణంగా ఇదంతా పెద్ద ఎక్కువ టైమ్ పట్టదు.కానీ ఎందుకో ఈసారి అంత తొందరగా పని జరుగుతున్నట్టు లేదు.అమ్మాయి వేసుకున్న దుస్తులు చూస్తుంటే బాగా ఖరీదైనవిలాగే ఉన్నాయి.డబ్బుకి లొంగట్లేదేమో? వాడేదో మాట్లాడుతున్నాడు, కాని ఆఅమ్మాయి వాడివైపుకూడా చూడట్లేదు.కారులోంచి ఇంకో ఇద్దరు దిగి, ఫుట్ పాత్ ఎక్కి,గ్రానైట్ స్టోన్ ఎక్కి బీచ్ లోకి దూకి ఆ అమ్మాయి వైపు నడక ప్రారంభించారు.వాళ్ళు రావడం చూసిన మొదటి వాడు ఆ అమ్మాయి భుజంమీద చెయ్యి వెయ్యబోయాడు. అంతే! ఆ అమ్మాయి చటుక్కున వెనక్కి తిరిగి వాడి చెయ్యిని మణికట్టు దగ్గర పట్టుకుంది. అప్పూడు చూసింది ఆ వస్తున్న మిగతా ఇద్దరినీ. మొదటివాడు నవ్వాడు.’ మొత్తం నలుగురం. ఇంకొకడు కారులో ఉన్నాడు.గొడవచేసి ఉపయోగం లేదు. హోమ్ మినిస్టర్ కొడుకే మాఫ్రెండు.మేం ఇప్పుడు ఫోన్ చేస్తే వాడుకూడా వస్తాడు.ఎంత కావాలంటే అంత ఇస్తాం. నువు చాలా అందంగా ఉన్నావు. ఇది ఈరోజుతో పోయేది కాదు. నీకేం కావాలన్నా మేం ఉంటాం”ఆ అమ్మాయి మొహంలో ఎలాంటి భావమూ వాడికి కనబడలేదు.
వాడికి చాలా ఆశ్చర్యం వేసింది.క్లాసు,మాసు అన్ని రకాల అమ్మాయిలని చాలామందిని లైన్ లో పెట్టిన అనుభవం వాడికుంది.ఎప్పుడు వాడు అమ్మాయిల చెయ్యి పట్టుకోవడమే కాని ఒక అమ్మాయి వాడి చెయ్యి పట్టుకోవడం ఇంతవరకూ జరగలేదు. ఆ పట్టు చాలా బలంగా ఉంది.చెయ్యి విడిపించుకోలేకపోతున్నాడు. “నీ పేరేంటి?”అప్పుడు సోఫాలో బోర్లా పెట్టి ఉన్న పుస్తకంమీద ఉన్న పేరు చదివాడు”శివహైమ ఎంబిబిఎస్.ఓహ్ డాక్టరువా,నీకే హాస్పటల్ లో కావాలంటే ఆ హాస్పటల్ లో ఉద్యోగం ఇప్పిస్తాను.ప్రమోషన్ లు కూడా ఇప్పిస్తాను.ఏం కావాలి చెప్పు.ముందీ చెయ్యి వదులు”ఈ లోపల వాళ్ళిద్దరూ దగ్గరికి వచ్చేశారు. శివహైమ ఒక్కసారిగా మొదటి వాడి చెయ్యి వదిలేసింది. సోఫాలో పడి ఉన్న పుస్తకాన్ని తీసుకుని అక్కడనుండి వెళ్ళిపోవడానికి రాతి సోఫాలోంచి పైకి లేచింది.లేచి నాలుగు అడుగులు వేగంగా ముందుకు వేసింది. వాళ్ళు ఆమెని వెంబడించారు.ఆమె సడన్ గా ఒకచోట ఆగింది.వాళ్ళు కూడా ఆగారు.ఆమె ముందు ఇద్దరు. వెనకాల ఒకడు.ముగ్గురూ వికటంగా నవ్వారూ ఆమెను చూసి.శివహైమ చేతిలోని పుస్తకం దూరంగా విసిరేసింది.ఆమె రెండూ చేతులు పైకి లేచాయి. నెమ్మదిగా ఒకదాని పక్కకు ఇంకొకటి వచ్చాయి.పక్క పక్కన ఉన్న రెండు కాళ్ళు ఒకదాని వెనకాల ఒకటి వచ్చాయి.మార్షల్ ఆర్ట్ కుంగ్-ఫూ లో సైడ్ స్టాన్స్ అది. “ఓహ్, కరాటే ఫైటర్ వా?”వెనకాలనుంచి నైఫ్ దూసిన శబ్దం వినబడింది. శివహైమ చటుక్కున వెనక్కు తిరిగింది, అదే స్టాన్స్ లో. కుడికాలు ముందరికి, ఎడమకాలు వెనక్కి. తిరిగాక మళ్ళీ కొంచెం స్టాన్స్ రిలాక్స్ చేసింది..ఇద్దరి మధ్య దూరం అంచన వేసింది. దాదాపు నాలుగడుగుల దూరం ఉంది.వాడు కత్తితో అడుగు ముందుకు వేశాడు.శివహైమ ఎడమ కాలుపైకి లేపుతూ అర్థచంద్రాకారంగా గిర్రున తిరిగి ఒక అడుగు ముందుకు వేసింది. ఎడమకాలు నేలకి ఇంకా ఆనీ ఆనకముందే కుడికాలుని గాలిలో లేపి కాలితో సహా గిర్రున తిరిగి,కుడికాలు పాదంతో వాడి మెడని బలంగా తన్నింది.స్పిన్నింగ్ హుక్ కిక్,లేదా టోర్నడో కిక్.కుంగ్ ఫూ లో అడ్వాన్స్డ్ అండ్ పవర్ఫుల్ కిక్ అది. అంతే!వాడి మెడ ఎముక పటుక్కున విరిగిన శబ్దం వినబడింది ఆ నిశ్శబ్దంలో!!వాడి చేతిలో కత్తి ఎగిరి కింద దూరంగా పడింది.చటుక్కున ఆ మిగిలిన ఇద్దరివైపు తిరిగింది శివహైమ. సైడ్ స్టాన్స్ లో నిలబడి,ఎడంకాలుని కుడికాలుకి జాయిన్ చేస్తూ రెండు అడుగులు ముందుకు వేసి,కుడికాలుని చటుక్కున ముందుకు దూసి ఒకడి చాతీమీద బలంగా కుడికాలి వేళ్ళతో తన్నింది.ఫ్రంట్ కిక్!. బలంగా తగిలిన ఆదెబ్బకి వాడు అన్ బాలెన్స్ అయి బాధగా అరుస్తూ ఇసకలో పడిపోయాడు. శివహైమ,వెంటనే మళ్ళీ స్టాన్స్ లోకి వచ్చి, కుడి కాలు పైకెత్తి ఫుట్ పైభాగంతో అదేస్పీడ్ తో రెండవవాడి దవడమీద రౌండ్ హౌస్ కిక్ డెలివర్ చేసింది.ఆ దెబ్బకి వాడినోటినుంచి రక్తం ఎగజిమ్మింది. మూడే మూడు నిమిషాలు.ముగ్గురి పనిపోయింది. ఇప్పుడిప్పుడే వాళ్ళు పైకిలేచే అవకశం లేదు.
ఒకసారి వాళ్ళకేసి చూసి ఇందాక కింద విసిరేసిన పుస్తకం తీసుకుని నెమ్మదిగా నడుచుకుంటూ బీచ్ బయటకు వచ్చేసింది.ఇదంతా కారుకు దగ్గరగా ఫుట్ పాత్ మీద నిలబడి చూస్తున్న నాలుగవవాడి కళ్ళు భయంతో పెద్దవై శరీరం వణికిపోయింది.వాడు ఇంక ముందుకు వెళ్ళే ధైర్యం చేయలేదు. జేబులోంచి సెల్ బయటకు తీసి,దూరంగా కనబడుతున్న శివహైమని ఒక క్లిక్ చేసి కారు వెంటనే స్టార్ట్ చేసి దూసుకు వెళ్ళిపోయాడు. శివహైమ ఫొటో వెంటనే వాట్సాప్ ద్వారా హోమ్ మినిస్టర్ కొడుకుకి వెళ్ళిపోయింది,అవసరమైన మెసేజ్ తో సహా. ఒక పది నిమిషాల్లో త్రీటౌన్ పోలీస్ స్టేషన్ లో ఫోన్ మ్రోగింది. నైట్ డ్యూటీలో ఉన్న రాజు ఫోన్ ఎత్తాడు.
***