విశ్వామిత్ర సరెండర్ అయిపోయాడు పోలీస్ స్టేషన్ లో. మీడియాకి ఆ విషయం ముందే తెలియడం వల్ల,మీడియా మొత్తం,నేషనల్ ఛానెల్స్ తో సహా పోలీస్ స్టేషన్ ముందు ఉంది. “నగరంలో జరిగిన బ్లాస్ట్ లకు మీకు సంబంధం ఉందా?” అని విశ్వామిత్రని అడిగినప్పుడు “ఉంది”అని విశ్వామిత్ర చెప్పినప్పుడు మీడియా మొత్తం స్టన్ అయింది.
“ఎందుకు బ్లాస్ట్ చేశారు?”
“నేరం కాదు కాబట్టి”
“ఎందుకు నేరం కాదని మీరు అనుకుంటున్నారు?”
“నేను బ్లాస్ట్ చేసిన ప్రోపర్టీస్ అన్నీ నా, నామిత్రుల ప్రోపర్టీలు.”
“కొన్ని హాస్పటల్స్, హోటళ్ళు కూడా కూల్చేశారు కదా? ఉదాహరణకి గ్రాండియోర్ హోటల్, డాక్టర్స్ n డాక్టర్స్ హాస్పటల్”
“అవన్నీ నాలాల్లోనూ, ప్రభుత్వస్థలాల్లోనూ కబ్జాలు చేసి కట్టినవి. కూలిస్తే తప్పేముంది? ఒక్క ప్రాణనష్టమైనా జరగలేదే. అధికారంతోటి, రాజకీయబలం తోటి, కొంతమంది అధికారుల అవినీతిని ఆసరాగా చేసుకుని ప్రభుత్వ యంత్రాంగాన్ని కొంతమంది దుర్మార్గులు, లొంగ దీసుకున్నప్పుడు చేసేదేముంది? ముఖ్యంగా ఆ దుర్మార్గులు హైప్రొఫైల్ లో ఉన్నపుడు ఇంతకంటే ఎవరూ ఏం చేయలేరు”
“హైప్రొఫైల్ అంటున్నారు. వాళ్ళ పేర్లు చెప్పగలరా?”
“అన్నీ కోర్టులో తెలుస్తాయి”
“సిటీ సబర్బ్స్ లో ఉన్న దాబాలో మర్డర్స్ జరిగాయి.వాటికి మీకు సంబంధం ఉందా?”
“లేదు. వేట మొదలైంది. అలాంటి మర్డర్స్ ఇక జరగకూడదనే లొంగిపోయాను”
హైప్రొఫైల్ అన్నమాట మీడియాలో, ప్రజల్లో సంచలనం రేకెత్తించింది. ఎవరై ఉంటారన్న ఊహాగానాలు జోరందుకున్నాయి.
విశ్వామిత్ర లొంగిపోయాడన్న విషయం తెలుసుకున్న హోమ్ మినిష్టర్ జైలుకొచ్చి విశ్వామిత్రని కలుసుకున్నాడు.”భలే మోసం చేశావురా. మీడియాను అడ్డం పెట్టుకుని తప్పించుకుందామని చూస్తున్నావా? మీడియాని, మీడియాద్వారా ప్రజల్ని రెచ్చగొడితే భయపడిపోతాం అనుకుంటున్నావా?”
విశ్వామిత్ర అన్నాడు”నేను నిన్ను మోసం చేయలేదు. నీవలన ప్రజలకు జరిగిన మోసాన్ని తగ్గించాను. నీన్యాయమైన ఆస్తి నష్టాన్ని కూడా నేను పూడుస్తాను”
“ఏంట్రా నువ్వు నా నష్టాన్ని పూడ్చేది, నా కాలికింద పని చేసిన కుక్కా. నీ మీడియా అటెన్షన్ నిన్ను ఒక నెలమాత్రమే కాపాడగలదు. ప్రజలందరూ మర్చిపోతారు. అప్పుడు, నిన్ను.నీగురువు ద్రోణాచార్యుడ్ని, ఆద్రోణాచార్యుడి కూతురు శివహైమని భయంకరంగా చంపకపోతే నేనీ స్టేట్ హోమ్ మినిష్టర్నే కాదు. అయినా ఏంటిరా నీధైర్యం? ఒక ఛీఫ్ మినిష్టర్ని. హోమ్ మినిష్టర్ ని ఎదిరించే ధైర్యం?”
నవ్వాడు విశ్వామిత్ర” నువ్వు హోమ్ మినిష్టర్ వి ఎలా అయ్యావు? ఛీఫ్ మినిష్టర్ నియమిస్తే అయ్యావు? ఆ ఛీఫ్ మినిష్టర్ ఎమ్మెల్యేలందరూ ఒప్పుకుంటే సిఎమ్ అవుతాడు. నీపార్టీ అంటే నువ్వూ నీసిఎమ్మే కాదు. చాలమంది ఉంటారు. అందులో కొంతమందైనా న్యాయం, ధర్మం కోసం ఎంతదూరమైనా వెళ్ళేవాళ్ళుంటారు. లేదా అపోజిషన్ పార్టీవాళ్ళను పట్టుకున్నా నాపని అయిపోయుండేది. “విశ్వామిత్ర మొహం సీరియస్ గా మారింది”కాని నాకప్పుడు ఒక ఆలోచన వచ్చింది. ఇది నేను చదువుకున్న ఊరు. ఆడుకున్న ఊరు. స్నేహితులతో కలిసి మెలిసి తిరిగిన ఊరు.ఈఊరుకి సేవ చేయడానికి ఎవరి పర్మిషనో ఎందుకు తీసుకోవాలి?ప్రజలకు సేవ చేయడం ఏవైనా రాజకీయ నాయకులొక్కళ్ళకే ఉండే హక్కా?ప్రజలకు లేదా?నాకు అధికారం లేదు. కాని హక్కుంది. నేను చదువుకున్నవాణ్ణి. నామిత్రులూ చదువుకున్నవాళ్ళే. చదువుకున్నవాళ్ళే కాదు.తెలివైనవాళ్ళు హృదయం ఉన్నవాళ్ళు కూడా. మేం అందరం ఒక మంచి పని చెయ్యాలనుకున్నప్పుడు ఎవడైనా ఏ పొజిషన్ లో ఉన్నవాడైనా మా హక్కుకు అడ్డం వస్తే ఎందుకు ఊరుకోవాలి? మీరు చేసే చెత్తపనుల ఫలితం ఎందుకు అనుభవించాలి? దమ్మున్నవాడు ఏం పని చేస్తాడో అదే పని చేశాను. నీకు నీసిఎమ్ కి రోజులు దగ్గర పడ్డాయి.నువ్వు నాకు నెలరోజులు టైమ్ ఇచ్చావు. నేను నీకు రెండువారాలు టైమ్ ఇస్తున్నాను. నువ్వూ నీ సిఎమ్ కుర్చీల్లోంచి దిగిపొండి. వేరే ఎవర్నో సిఎమ్ గా ఎన్నుకోండి. ఆ ఫ్లైఓవర్ ప్రాజెక్ట్స్ కి మళ్ళీ టెండర్లు పిలవండి. నేను కోర్టులో టెండర్ విషయంలో మీరు చేసిన ఫ్రాడ్స్, మింగేసిన సొమ్ము వీటివేటి గురించి మాట్లాడను. ప్రాణనష్టం జరగకపోయినా బ్లాస్ట్ లు చేసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసినందుకు కోర్టు ఏశిక్ష విధిస్తే ఆ శిక్షను అనుభవిస్తాను”
విశ్వామిత్ర మాటలు విన్న హోమ్ మినిష్టర్ రగిలిపోయాడు. వెంటనే జగదీష్ ని పిలిపించాడు. “ఏం చేస్తావో నాకు తెలీదు. ఈడి నోటినుంచి నా బినామీగా ఈడు కొన్న ఆస్తుల లెక్కలు,డాక్యుమెంట్ లు బయటకు రావాల. వారం రోజుల్లో ఈడి చావు కబురు నా చెవిన పడాల. “జగదీష్ తల ఊపాడు అర్థమైందన్నట్టు. వెంటనే విస విస నడుచుకుంటూ జైలు బయటకు వెళిపోయాడు హోమ్ మినిష్టర్.
****