సారస్వతం

హయగ్రీవ స్వామి

-శారదాప్రసాద్

హయగ్రీవ స్వామి చదువుల యొక్క దేవుడు.హయగ్రీవ స్వామిని కూడా విష్ణు అవతారముగా భావిస్తారు.హయగ్రీవుణ్ణి జ్ఞానమునకు, వివేకమునకు, వాక్కుకు, బుద్ధికి మరియు అన్ని విద్యలకు దేవుడుగా భావిస్తారు. హయగ్రీవ స్వామిని చదువుల యొక్క దేవుడుగా పూజిస్తారు.హయగ్రీవుడు, హయశీర్షగా కూడా పిలవబడుతున్నాడు. హయము అనగా గుర్రము. హయశీర్షుడు అనగా గుర్రపు తల కలవాడు. తెల్లని తెలుపు మానవ శరీరం, గుర్రం (అశ్వము) యొక్క తల, నాలుగు చేతులు. శంఖము మరియు చక్రము పై రెండు చేతులలో కలిగి యుండును. క్రింది కుడి వ్రేళ్ళు జ్ఞాన ముద్రలో అక్షరమాలను కలిగి యుంటాయి.ఎడమ చేతిలో పుస్తకము ఉంటుంది.హయగ్రీవ సతీమణి మరిచి (మరిచి బహుశా ఒక అవతారము), మరియు లేదా లక్ష్మి. శ్రావణ పూర్ణిమ హయగ్రీవ స్వామి అవతరించిన రోజు.

హయగ్రీవ స్వామి వైష్ణవ సంప్రదాయంలో ప్రముఖ దేవత. ఉన్నత చదువు మరియు లౌకిక విషయాలను అధ్యయనం ప్రారంభించినపుడు హయగ్రీవ స్వామిని తప్పక పూజించాలి. విద్యార్థులు హయగ్రీవ స్వామిని ప్రతి రోజు ద్యానించాలి.”జ్ఞానానంద మయం దేవం నిర్మల స్ఫటికాకృతిమ్| ఆధారాం సర్వవిద్యానాం హయగ్రీవ ముపాస్మహే ||”అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ సన్నిదిలో, సత్యనారాయణ వ్రత కథ చెప్పె పండితులు ఈ మంత్రాన్ని చదివి కథ మెదలు పెడతారు. ప్రతి దేవతకు ఒక గురు స్వరూపం ఉంది. పరమేశ్వరుడిని గురువుగా భావిస్తే దక్షిణామూర్తిగా అనుగ్రహిస్తాడు. అమ్మవారిని గురువుగా కొలిస్తే శారదగా జ్ఞానం ప్రసాదిస్తుంది. విష్ణుమూర్తిని గురువుగా పూజిస్తే.,హయగ్రీవుడుగా కరుణిస్తాడు.ఆయన అవతరించిన శ్రావణ శుద్ధ పౌర్ణమిని హయగ్రీవ జయంతిగా జరుపుకుంటారు.వేదాలను మధుకైటభులు అనే రాక్షసులు అపహరించగా, హయగ్రీవుడు వాటిని సంరంక్షించి మళ్లీ బ్రహ్మకు అందజేశాడని పురాణాల ద్వారా తెలుస్తుంది.గుర్రం ముఖం చైతన్యానికి ప్రతీక. గుర్రం సకలింపు నుంచి బీజాక్షరాలు ఉద్భవించాయని అంటారు.రెండు చేతుల్లో శంఖ, చక్రాలు ధరించి ఉంటాడు. మరో చేతిలో పుస్తకం ఉంటుంది. ఇంకో చేతిని చిన్ముద్రతో చూపుతూ భక్తులను అనుగ్రహిస్తుంటాడీ దేవుడు. జ్ఞానాన్ని ప్రసాదించేవాడు హయగ్రీవుడు.ఆయన్ను గురువుగా భావించి ఉపాసిస్తే సద్బుద్ధి కలుగుతుంది. సత్వ గుణం వికసిస్తుంది. విద్యాప్రాప్తి కలుగుతుంది.బ్రహ్మదేవుని వర ప్రభావంతో బలగర్వితుడైన రాక్షసుడు హయగ్రీవుడు సజ్జన హింసతో రెచ్చిపోతున్నాడు. రాక్షస హయగ్రీవుడు బ్రహ్మను చావు లేకుండా వరమివ్వమని వేడుకుంటాడు. అందుకు బ్రహ్మ ఆ ఒక్కటి తప్ప మరేదైనా వరం కోరుకొమ్మని హితవు చెబుతాడు.

అందుకు హయగ్రీవుడు తనలాగే ఉండేవాడి చేతిలోనే తనకు చావు కలగాలని కోరుకుంటాడు.హయం అంటే గుర్రం, గ్రీవం అంటే కంఠం. కంఠం పైనుంచి గుర్రం ముఖంగా కలిగిన వాడు కనుక ఈ రాక్షసుడికి హయగ్రీవుడనే పేరు వచ్చింది. అతని బాధలు తట్టుకోలేక దేవతలంతా త్రిశక్తులను, త్రిమూర్తులను శరణువేడారు. ఆ సమయంలో మహావిష్ణువు యోగనిద్రలో ఉన్నాడు. అదీ ఓ రాక్షస సంహారానంతరం ఒక వింటిపై తలవాల్చి నిద్రిస్తున్నాడు.దేవతలు నిద్రలేపగా హడావుడిగా లేచిన ఆయన తలకు వింటినారి తగిలి తెగిపడిపోయింది. హయగ్రీవుడిని సంహరించటానికి సమయం ఆసన్నమైంది.దేవతలంతా జరిగిన దానికి చింతిస్తుండగా బ్రహ్మదేవుని సలహాపై ఒక గుర్రం తలను విష్ణువు శరీరానికి అతికిస్తారు. అలా విష్ణుమూర్తి కూడా హయగ్రీవునిగా ఖ్యాతిగాంచాడు. ఆయన దేవతలకు అభయం ఇచ్చి హయగ్రీవుని హతమార్చాడు. అయితే ఆయన ఆ సమయంలో ఎంతో ఉగ్రత్వంతో ఉండగా, ఆయనను శాంతింపజేయడానికి పార్వతీదేవి వచ్చింది. ఆమె “హయగ్రీవా! నిన్ను ఆరాధించిన వారికి సర్వవిద్యలూ కలుగుతాయి” అని ఆయనకు ఒక దివ్యశక్తిని ప్రసాదించింది. దాంతో ఆయన ఆగ్రహం నుండి పూర్తిగా ఉపశమనం పొందాడు.సాక్షాత్తూ ఆ ఆదిపరాశక్తి స్వామివారికి ఈ శక్తిని అందించింది . స్వామివారు తనదైన బాణిలో ఆ అసురుని సంహరించడం విజ్ఞానదాయకమైన అంశం. సమస్యను పరిష్కారించటానికి కావలసినది జ్ఞానమే కదా! అలా జ్ఞానానికి ప్రతీకగా అవతరించిన హయగ్రీవుని స్తుతి చేసినవారికి సర్వవిద్యాబుద్ధులు లభిస్తాయి. విద్య ఉన్న చోట లక్ష్మీ కటాక్షం కూడా ఉంటుంది.వినయంతో కూడిన విద్య,ఐశ్వర్యం మానవుని ముందుకు నడిపిస్తాయి.

హయగ్రీవుడు ఆవిర్భవించిన శ్రావణ పౌర్ణమి నాడైనా కనీసం హయగ్రీవ స్తుతిని చేసిన వారికి జ్ఞానం,సకల సంపదలు లభ్యం అవుతాయి. విద్యార్థులు అనుదినం హయగ్రీవ స్తుతి చేస్తుంటే వారు విద్యలో పరిపూర్ణులవుతారు. మంత్రశాస్త్రం ప్రకారం మానవ, జంతు ఆకృతులు కలగలిసిన దేవతలు శీఘ్ర అనుగ్రహ ప్రదాతలు. అటువంటి వారిలో నరసింహస్వామి,శ్రీ హయగ్రీవ స్వామి, వారాహీ అమ్మవారు,గణపతి ముఖ్యులు.తాంత్రిక విద్యలను ఉపాసించేవారు కూడా ఈ దేవతలను వారి వారి పద్ధతిలో ఉపాసిస్తారు.వీరిలో వారాహీ అమ్మవారు మాత్రం ఉగ్ర స్వరూపురాలు.ఈమెను ఆరాధించ తలుచుకున్నవారు పెద్దల సలహా తీసుకొని వారు చెప్పిన విధంగా ఆరాధించాలి. హయగ్రీవుని ఉపాసించిన వారికి సర్వవిద్యలు ,సర్వ సంపదలు లభించడం తథ్యం.అత్యంత నిష్టతో కూడుకున్న హయగ్రీవ ఉపాసన అందరికీ సాధ్యం కాదు కాబట్టి, కనీసం హయగ్రీవ జయంతి రోజున అయినా ఆయనను ఆరాధించాలి. హయగ్రీవుడి పటాన్ని పూజగదిలో ఉంచి పూజించాలి. హయగ్రీవ స్వామి అలయాలు భారతదేశమంతటా అనేక ప్రదేశాలలో ఉన్నాయి.ఈయనకు ప్రసిద్ధమైన దేవాలయం ఆంధ్ర ప్రదేశ్ లోని కృష్ణా జిల్లాలోని మచిలీపట్నంలో ఉంది. *విశుద్ధ విజ్ఞాన ఘన స్వరూపం! విజ్ఞాన విశ్రాణన బద్ధదీక్షమ్!* *దయానిధిం దేవభృతాం శరణ్యం! దేవం హయగ్రీవమహం ప్రపద్యే*!! *శుభం భూయాత్ !*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked

1 Comment on హయగ్రీవ స్వామి

vyaasa moorthy said : Guest 6 years ago

చక్కని ఆధ్యాత్మిక రచనలను అందిస్తున్న రచయితకు అభినందనలు !

  • hyderabad