ధారావాహికలు

రామాయణ సంగ్రహం

రావణాసుర సంహారం

అప్పుడాయన తన తమ్ములతో ఈ ఉపద్రవం గూర్చి ప్రస్తావించి, ‘లవణుణ్ణి వధించే బాధ్యత మీలో ఎవరు తీసుకుంటార’ని ప్రశ్నించగా లక్ష్మణుడు చిరకాలం అరణ్యవాసం చేసి సౌఖ్యధూరుడై ఉన్నాడని, భరతుడు పద్నాలుగేళ్ళు వ్రతోపవాస తపోదీక్షలో ఉన్నాడని అందువల్ల లవణుణ్ణి సంహరించే కర్తవ్యం తనదని శత్రుఘ్నుడు శ్రీరామచంద్రుడికి విన్నవించుకున్నాడు. దానికి శ్రీరాముడు ఆమోదించి శత్రుఘ్నుణ్ణి అభినందించాడు. ‘అట్లా లవణుణ్ణి హతమారిస్తే, వాడి రాజ్యానికి నిన్ను పట్టాభిషిక్తుణ్ణి చేస్తాను’ అని వాత్సల్యం చూపాడు శత్రుఘ్నుడి మీద. అప్పుడే లాంఛనంగా తక్కిన తమ్ములను ఆనందిస్తూ ఉండగా శ్రీరాముడు మధురాజ్యానికి శతృఘ్నుణ్ణి పట్టాభిషిక్తుణ్ణి చేశాడు. ఈ సన్నివేశంలో లవణుడు పారాలోకగతుడైనట్లు అని అందరూ ఆనందించారు.
అప్పుడు శ్రీ రాముడు తన తమ్ముడుకి ఒక దివ్యాస్త్రాన్ని బహుకరించాడు. అది శ్రీమన్నారాయణుడు సృష్త్యాదిని మధుకైటభులను సంహరించిన మహాప్రభావం కల అస్త్రమని, తరువాతనే సృష్టి జరిగిందనీ చెప్పి దాన్ని శతృఘ్నుడికి అనుగ్రహించాడు శ్రీరాముడు.
‘రావణుడిపై నేను దీనిని ప్రయోగించటానికి ఇష్టపడలేదు. దీన్ని ప్రయోగిస్తే సకల లోక సంక్షోభం కలుగుతుందని నిగ్రహించుకున్నాను.’ అని కూడా చెప్పాడు శ్రీరాముడు. ఇంకా పరమశివుడు మధువుకు శూలం ఇచ్చిన సంగతి కూడా శ్రీరాముడు చెప్పాడు. అది లవణుడి చేతిలో ఉంటే వాణ్ణి జయించడం సాధ్యం కాదనీ, వాడు దాన్ని ధరించి ఉందని సమయంలోనే వాణ్ణి వధించడం సాధ్యమవుతుందనీ, ఒడుపుగా ఆ సమయం చూసి లవణుణ్ణి సంహరించాలనీ శతృఘ్నుడికి భోదించాడు శ్రీరాముడు. ‘నీవు వాడి మీదకి యుద్దానికి వస్తున్నట్లు తెలియకుండా ఉపాయంగా వాణ్ణి హతమార్చాలి. వాణ్ణి ప్రత్యక్షంగా యుద్దానికి ఆహ్వానిస్తే వాడి చేతిలో ఉన్న శూలం తన ప్రభావం కనపరుస్తుంది’ అని తమ్ముడికి యుద్దంలో అనుసరించవలసిన వ్యూహాలు, ఉపాయాలూ భోదించాడు.
శత్రుఘ్నుడు అన్నలందరికీ మొక్కి పరులకు యుద్దసన్నాహం తెలియకుండా బయలుదేరాడు. వెళ్ళేముందు శ్రీరాముడికి ప్రదక్షిణ నమస్కారాలు చేశాడు. వశిష్టులవారికి పాదాభివందనం ఆచరించాడు.
ముందుగా సైన్యాన్ని ప్రచ్చన్నంగా వాల్మీకి ఆశ్రమప్రాంతంలో విడియింపచేశాడు. ఆ తరువాత ఒంటరిగా వాల్మీకి ఆశ్రమంలో చేరాడు. ఆ రాత్రి అక్కడ విశ్రమించటానికి శత్రుఘ్నుడు వాల్మీకి మహాముని అనుమతి వేడుకున్నాడు. అప్పుడు వాల్మీకిమహర్షి శతృఘ్నుణ్ణి ప్రియవాక్కులతో ఆదరించాడు. ‘ఇది రఘుకులానికి చెందిన ఆశ్రమమే కాబట్టి ఇందులో ఉండటానికి నీవు ఎవరి అనుమతీ కోరనక్కరలే’దని ప్రియభాషణం చేశాడు ఆ మహాముని.
అప్పుడు శత్రుఘ్నుడు ఆశ్రమవృత్తాంతం ఏమిటో వివరించవలసిందిగా మహామునిని ప్రార్ధించాడు. అప్పుడా కథంతా వాల్మీకి మహర్షి చెప్పుకొంటూ వచ్చాడు. “‘ శత్రుఘ్నా! పూర్వం మీ వంశంలో సౌదాసుడనే మహారాజుండేవాడు. ఆయన మహాపరాక్రమవంతుడే కాక, ధర్మవర్తనుడు కూడాను. సౌదాసుడు ఒకనాడు ఈ ప్రాంతానికి వేటకు వచ్చాడు. అప్పుడీ ప్రాంతమంతా నిర్మానుష్యంగా ఉండేది. అందుకు కారణం ఏమంటే ఇద్దరు రాక్షసులు పులి రూపంలో సంచరిస్తూ కనపడిన ప్రాణినల్లా తినేసేవాళ్ళు. వనమంతా నిర్విరామంగా వాళ్ళు సంచరిస్తూ ఉండేవాళ్లు.
ఒకసారి వేట కోసం వచ్చిన సౌదాసుడికి ఒక్క మృగమూ కన్పించలేదు. ఆయనకు వేసట కలిగింది. ఇంతలో పులి జంట కన్పించింది. ఆయన అసలే అసహనంతో ఉన్నాడేమో ఆ పులి జంటపై శరప్రయోగం చేశాడు. దాంతో ఒకపులి అక్కడికక్కడే హతమైంది. రెండో పులి క్రోధించి సౌదసుణ్ణి దూషించి ఆదృశ్యమై పోయింది. ఆయన తర్వాత తన పట్టణానికి చేరుకున్నాడు. ఆ విషయం మరచిపోయినాడు.
కొంతకాలానికి ఆ మహారాజుకు యజ్ఞం చేయాలన్న సంకల్పం కలిగింది. ఈ ప్రాంతంలో యజ్ఞసన్నాహం చేశాడు. అప్పుడు సౌదాసమహారాజూ చేతిలో వేటుపడి ఆయన్ను దూషించి ఆదృశమైన పులి రాక్షసుడు ఒకరోజు యజ్ఞసమాప్తి కాలంలో వశిష్టముని రూపంలో వచ్చి ‘మహారాజా! నాకు నరమాంసంతో విందారగించాలని వుంది.’ అని ఆయనను కోరాడు. ఇది వింతలలో వింత అయినా సౌదాసమహారాజు కాదనలేక పోయినాడు. ఆయన కోర్కె తీర్చాలని అట్లాగే సిద్దం చేయించాడు. ఇంతలో అసలు వసిష్టులవారు వచ్చి ఆ అకృత్యానికి కోపించి రాజును నరమాంసభక్షకుడై పోయేట్లు శపించాడు. సౌదాసుడికి కూడా ఆగ్రహం కలిగింది. తానుకూడా వసిష్టుణ్ణి శపించడానికి నీటి పుడిసిలి పట్టాడు. అప్పుడాయన భార్య మదయంతి ఆయనను వారించింది. ఇది అకృత్యమని చెప్పింది. చేసేది లేక ఆ నీటిని మహారాజు తన కాళ్ళమీదనే చల్లుకున్నాడు. ఆ పాదాలు వన్నెతరిగి వికృతమై పోయినాయి. అప్పటినుంచి ఆయన కల్మాషపాదుడని పేరు పొందాడు. ఆ తరవాత వసిష్టుడు శాంతించి జరిగిన దుర్మార్గం తెలుసుకున్నాడు. ‘ఈ శాపం ఊరికే పోదు. నీవు పన్నెండు సంవత్యరాలు నా శాపం అనుభవించి తరువాత శాపపీడ తొలగి ఇక్ష్వాకురాజులలో సుప్రతిష్టుడి వవుతావు’ అని ఊరట కలిగించాడు. ఈ ఆశ్రమమే ఆయన యజ్ఞస్థలి కాబట్టి ఇది మీదే” అని వాల్మీకిమహర్షి శతృఘ్నుడికి ఆ పూర్వ కథ చెప్పాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked