కవితా స్రవంతి

మనిషినే ప్రేమిస్తాను

– శిష్ట్లా. వి.యల్.యన్.శర్మ

మనిషి జీవితానికి
ప్రయాణం కావాలి
కాలమనే వాహనం కావాలి
చైతన్యమనే స్పందన కావాలి
మజిలీలలో
అనుభవాలు దాచుకొనే
మనస్సు కావాలి…..

ఈ ప్రయాణం నీ ఒక్కడిది కాదు
నీ ఒక్కడికోసం కాదు
కాలవాహినిలో నీవు
కలసిపోయేవరకు……
నీ తోటి జీవి కొరకు….

ప్రక్కవానితో కలిసి
బంధాల్ని ఆస్వాదిస్తూ
మనిషిగా చరిత్రవౌతూ…

మనసు సంద్రంలో
భావాల అలలతో
తీరాలు చేరాలనే తపనతో
బడబాగ్నులు దాచుకుంటూ
తుఫానులను తట్టుకుంటూ….

మనుషుల్ని కలపాలని
మనిషిగా నిలపాలని
నీ ప్రయాణం మనీషిగా సాగాలని….

జీవనదులన్నీ సముద్రంలో కలిసినట్లు
మనసు జీవజల ప్రవాహం
కాల సముద్రంలో కలిసి
మనిషిని అందించాలని……

అందుకే మనిషి ప్రయాణమంటే
నాకిష్టం…..అందుకే
మనిషినే ప్రేమిస్తాను
మనిషినై ప్రేమిస్తాను!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked