సారస్వతం

‘పూర్ణ పురుషుడు’, శ్రీమదజ్జాడ ఆదిభట్ల నారాయణ దాసు

 

డా. ఉపాధ్యాయుల రాజ రాజేశ్వరి దేవి

మొదటి భాగం :

(2014 శ్రీ వేంకటేశ్వర సంగీత నృత్య కళాశాల  తిరుపతి వారి ఆధ్వర్యంలో శ్రీమదజ్జాడ ఆదిభట్ల నారాయణ దాసవర్యుల 149 జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన హరికథా సప్తాహంలో సమర్పించిన వ్యాసముల ఒకటి)

ఉపోద్ఘాతము

సంగీత సాహిత్య సార్వభౌమ’, ‘లయ బ్రహ్మ’, ‘పంచముఖీ పరమేశ్వరుడు’, ‘హరికథా పితామహ’, ‘అట పాటల మేటి’ లాంటి ఎన్నో బిరుదులూ ఆయనను వరించాయి. ఆరున్నర దశాబ్దాల సంగీత, సాహిత్య, హరికథా కళా ప్రస్థానంలో ఆయన అందుకోని సన్మానం లేదేమో. రాజ సన్మానాలూ, పౌర సన్మానాలూ, బిరుద ప్రదానాలూ గజారోహణలు, సువర్ణ ఘంటాకంకణ ధారణలూ, గండపెండేర ధారణలూ ఇలా ఎన్నో, ఎన్నెన్నో గౌరవాలు ఆయనకు లభించాయి.

ఆదిభట్ల నారాయణ దాసుగారు తెలుగులో, అచ్చతెలుగులో, సంస్కృతంలో సుమారు ఏభై గ్రంధాలను రచించారు. వాటిలో స్వతంత్ర కావ్యాలు, ప్రబంధాలు, అనువాద గ్రంధాలు, వచన గ్రంధాలు, కవితా సంపుటాలు, శతకాలు, వేదాంత పరిశోధనలు, సంగీత ప్రబంధాలు, హరికథలు, పిల్లల నీతికథలు వగైరా ఉన్నాయి. అన్ని కళలలో ప్రావీణ్యం గల ఆయనను ‘ది హిందూ‘ పత్రిక (జూన్ 30, 1894) ‘బహుముఖ ప్రజ్ఞాశాలి’ అని శ్లాఘించింది. ఆ మహనీయుని సంగీత సాహిత్య పాండిత్యాన్ని “సంగీత వైదుష్యము, “హరికథ సృష్టి, “సాహిత్య పరిచయం అనే విభాగాలలో పరికిద్దాం.

సంగీత వైదుష్యము

మేఘగంభీర శారీరము. లయ తాళ ప్రతిభ. అనన్యసామాన్యమైన గానకౌశలము: ఆదిభట్ల నారాయణ దాసుగారికి అనువంశికంగా కొంత, దైవానుగ్రహంచేత మిక్కిలిగా, స్వాభావికంగానే సంగీత జ్ఞానం అలవడింది. అయిదేళ్ళ వయసులోనే రాగయుక్తంగా భాగవత పద్యాలను చదివి, అదే భాగవత గ్రంధాన్ని బహుమతిగా పొందారాయన. ఎంతో విలువైనదిగా ఆయన పదిలపరచుకున్న ఆ భాగవత గ్రంధమే ఆయన జీవన గమనాన్ని నిర్దేశించింది.

నాకు ‘అయిదేళ్ళ వయసునుండే పురాణము చదివి, లయజ్ఞానంతో పాడి ఇతరులను సంతోషపెట్టగలిగే నేర్పు అలవడింది’, అని ఆయన తన స్వీయచరిత్రలో చెప్పుకున్నారు. పెక్కు రాగవరసలలో పురాణములు అర్ధ స్పూర్తిగా  చదవగల మేనమామలతో, ‘కొంచం ఓపిక పట్టండి మీకంటే ఎక్కువగా రాగవరసలో చదువుతాను’ అని చిన్ననాడే ప్రతిజ్ఞ చేసి తన భవిష్య వాణిని వినిపించారు.

‘పుస్తకాన్ని గిరగిర తిప్పుతూ శరవేగమున గీర్వాణాంధ్రములు చదువుట; ఒక్కసారి వినిన మాత్రమున గీర్వాణాంధ్రాంగ్లేయ పద్యముల మరల చదువుట; పల్లవిపాడుట; పెక్కురాగాములాలాపించుట; గీర్వాణాంధ్రములలో అనేక వృత్తములలో కవిత్వము చెప్పుట; అవధానము చేయుట; అపూర్వ కల్పనలతో ఆంధ్ర,, ఆంగ్లేయ భాషలలో వేలకొలది జనులుగల సభలలో పాడుచూ ఉపన్యసించుట నా విద్యలు’, అని అయన తన ప్రజ్ఞాపాటవాలను పరిచయం చేసుకున్నారు.

నారాయణ దాసుగారు వంతరాము అనేగ్రామంలో తనమేనమామల ఇంటిలో ఉండగా అక్కడికి వాసా సాంబయ్య అనే వైణిక విద్వాంసుడు వచ్చాడు. సాంబయ్యగారిది  సంగీత విద్వాంసుల  వంశం. ఆయన బొబ్బిలి సంస్థానంలో వైణిక విద్వాంసుడు. ఆయన నారాయణ దాసుగారి సంగీతాలాపనవిని  సంతోషించి ఆయన తలిదండ్రులతో ‘ఈ పిల్లవాని కంఠంలో మాధుర్యం ఉంది; అంతేకాక ఇతనికి మంచి లయజ్ఞానం ఉంది. సంగీత శిక్షణ ఇస్తే మంచి గాయకుడు అవుతాడు. నాతొ బొబ్బిలి పంపండి. నేను సంగీతం నేర్పుతాను అన్నారు.’ అందుకు అంగీకరించిన తల్లితండ్రులు ఆ పిల్లవానిని సాంబయ్య గారితో బొబ్బిలికి పంపించారు. అప్పటికి ఆ పిల్లవాని వయసు పదకొండు సంవత్సరాలు.  శారదానుగ్రహమైన తన సంగీత ప్రతిభను ఆ వయసుకే గుర్తించిన దాసుగారు ‘త్రోవలో సులభముగా చిక్కిన నన్ను శిష్యమిషపై పరిచారకునిగ కొని పోతున్నాడు’ అని స్వగతంగా అనుకొని ‘గురువుగారి’ ననుసరించారు.  ఆయన ఆత్మ విశ్వాసం అవాస్తవం కాదని నిరూపించే సంఘటన ఒకటి ఆయన బొబ్బిలి చేరిన కొద్దిరోజులకే సంభవించింది.

ఒకనాడు కోటలో భోజనానికని బయలుదేరిన దాసుగారు ఉత్సాహంగా పాడుకుంటూ వెళ్తున్నారు. దారిలో ఒకచోట ఎర్రని దుప్పటి కప్పుకున్న పండుముదుసలి ఒకాయన కూర్చొని ఉన్నాడు. అయన వదనం పాండిత్యశోభతో  ప్రకాసిస్తోంది. దాసుగారిని దగ్గరకు రమ్మని, ‘ఇప్పుడు నువ్వు పాడుతున్న పాట మళ్ళీ పాడు’ అని ఆదేశించాడు. దాసుగారు రెట్టించిన ఉత్సాహంతో ఉల్లాసంగా రాగాలాపన చేసారు. ఆ వృద్ధ పండితుడు ఆ పాటకు ఎంతో సంతోషించి చెంతనున్న వారితో ‘విన్నారా ఈ పిల్లవానికెవరు నేర్పారో కాని శుభ పంతువరాళి రాగం ఎంత శ్రావ్యంగా పాడేడో! పూర్వజన్మ వాసన ఉండాలిగాని సంగీతం ఒకరు నేర్పితే వచ్చేది కాదు.’ అని ప్రశంసించేడు. దాసు గారిని ప్రశంసించిన వృద్ధుడు ఒక గొప్ప సంగీత విద్వాంసుడు. అయన పేరు తుమరాడ వెంకయ్య. అ వృద్ధ పండితుని ప్రశంస సత్యదూరం కాదు. ఎందుకంటే నిజానికి అంతవరకూ దాసుగారు ఇతరులు పాడితే విని, తనకు తానుగా పాడుకోడం తప్ప గురువుల ద్వారా సంగీతం నేర్చుకోలేదు. దాసు గారు అలవోకగా పాడిన పాట అప్రయత్నంగానే ఒక రాగక్రమంలో – అందులోను ఎంతో సాధన చేస్తేగాని పట్టుబడని కఠిన రాగవరుసలో – వెలువడింది అంటే  దానికి ఖచ్చితంగా శారదాదేవి అనుగ్రహమే కారణం అయిఉండాలికదా!

ఆ తరువాత వెంకయ్య గారు దాసుగారి పూర్వాపరాలు విచారించి సంగీతం నేర్చుకోడానికి బొబ్బిలి వచ్చాడని తెలుసుకొని తన ఇంటిలో ఒక ‘వారం’ ఇస్తానని మాట ఇచ్చాడు. ఆరోజుల్లో గురుకుల పద్ధతిలో జరిగే విద్యాభ్యాసం కొనసాగాలంటే విద్యార్ధులకు వారంలోని ఏడు రోజులూ ఏడుగురు గృహస్థుల ఇళ్ళలో ‘వారం’ కుదరాలి. దాసుగారికి ఎంత ప్రయత్నించినా ఏడు వారాలు లభించలేదు. ఒక నెల పాటు బొబ్బిలిలో కష్టాలకోర్చి తన స్వగ్రామానికి తిరిగి రాక తప్పలేదు. దీని పర్యవసానం ఏమిటంటే దాసుగారి గురుముఖమైన సంగీత శిక్షణ ఒక నెలలో ముగిసింది. ఆ తరువాత  అంతా స్వయం కృషి, దైవానుగ్రహమే!  అందుకే కొన్ని దశాబ్దాల తర్వాతి కాలంలో చెళ్ళపిళ్ళ వెంకట శాస్త్రి గారు దాసుగారిని ‘పుంభావ సరస్వతి, అని కొనియాడితే ఆ ప్రశంస స్వభావోక్తే కాని అతిశయోక్తి కానేకాదు.

దాసుగారి సంగీత యాత్రలో (జైత్ర యాత్ర ఇంకా ముందుంది!) రెండవ అధ్యాయం విజయనగరానికి మకాం మార్చడంతో మొదలయింది. ఇంగ్లీషు విద్య నేర్చుకొంటే ఏదైనా ఉద్యోగం సంపాదించి జీవితంలో స్థిరపదతాడనే ఉద్దేశంతో దాసుగారి తల్లిదండ్రులు ఆయనను తన రెండవ అన్న సీతారామయ్యగారి ఇంటికి విజయనగరం పంపించారు. న్యాయవాద వృత్తిలో ఉన్న సీతారామయ్యగారు విజయనగరంలో కానుకుర్తివారి వీధిలో నివాసం ఉండేవారు. అప్పటినుండి విజయనగరమే దాసుగారి స్థిరనివాసం అయింది. విజయనగరం మహారాజావారి ఆస్థాన సంగీత విద్వాంసుడు నిరాఘాటం క్రిష్ణయ్యగారు సీతారామయ్యగారి ఎదురింట్లో కాపురం ఉండేవారు. ఆయనవద్ద సంగీతం నేర్చుకోమని దాసుగారిని ఆయనకు అప్పగించారు, వారి తండ్రిగారు. క్రిష్ణయ్యగారు సంగీతం పాడేటప్పుడు తల, చేతులు,  మొహం, కళ్ళు ఎలా తిప్పుకుంటారో ఆ అభినయం అంతా దాసుగారు నేర్చుకోడమే కాకుండా అంతకంటే ఒకపాలు ఎక్కువగా చేయడం మొదలు పెట్టారు.  దాంతో గురువుగారికి చాలా కోపం వచ్చింది. దాసుగారి తండ్రితో ‘శాస్త్రిగారూ మీ అబ్బాయి నన్ను వెక్కిరిస్తున్నాడు. వాడికి నేను పాఠం చెప్పను’ అని ఆయన తప్పుకున్నారు. ఆవిధంగా గురువుదగ్గర సంగీతం నేర్చుకునే ఇంకొక (నిజానికి ఆఖరి) అవకాశం కూడా దాసుగారు పోగొట్టుకున్నారు. ఇక అంతా స్వయంకృషి, దైవకృపే. అయితే ఈవృత్తాంతంతో దాసుగారిలో నిక్షిప్తంగా ఉన్న ఇంకొక కళ బహిర్గతం అయింది. అదే నటన. దానిగురించి వారి హరికథా సృష్టి, ప్రదర్శనకృషి విషయప్రస్తావన వచ్చినపుడు పరిశీలిద్దాం.

ఆ రోజుల్లో విజయనగరం నిజంగా విద్యల నగరమే! విజయనగర రాజకుటుంబాలకు ఉత్తరదేశంతో, ముఖ్యంగా మధ్యప్రదేశ్ లోని  రీవా సంస్థానంతో సంబంధాలు ఉండేవి. ఆకారణంగా విజయనగర రాజాస్థానంలో అనేక ప్రాంతాలనుంచి వచ్చిన కవులూ, గాయకులూ, ఇతర కళాకారులూ ఉండేవారు. ఒకవిధంగా చెప్పాలంటే అప్పటి విజయనగరం శ్రీకృష్ణదేవరాయలు, భోజరాజుల విద్వత్సభలను తలపించేది.

కర్ణాటక-హిందుస్తానీ సంకీర్ణ బాణీ రూపకల్పన: నారాయణ దాసుగారు ఏకసంతగ్రాహి. నీరు భూమిలో ఇంకినట్టు ఆయన విద్యలను అంతర్గతం చేసుకునేవారు. విజయనగర రాజాస్థానంలో మొహబ్బత్ ఖాన్ అనే హిందుస్తానీ సంగీత విద్వాంసుడు ఉండేవాడు. అయన సాంగత్యంలో దాసుగారు హిందుస్తానీ సంగీత బాణీని ఆకళింపు చేసుకున్నారు. దానితో, అప్పటికే కర్నాటక సంగీతంలో ప్రావీణ్యం ఉన్న అయన అనుసరణలో, ఆ రెండు సంప్రదాయాల మేలుకలయికగా, ఒక కొత్త సంప్రదాయం, ‘కర్ణాటక-హిందుస్తానీ సంగీతాల సంకీర్ణ బాణీ’ వెలువడింది. (అలాగే కొంతకాలం పిదప, అంటే ముప్ఫైఏడు సంవత్సరాల వయసులో ఒక మౌల్వి సాంగత్యంవల్ల ప్రేరేపితులై, దాసుగారు అరబిక్, పెర్షియన్ భాషల పుస్తకాలు తెప్పించుకుని తనకు తానే గురువై ఆ భాషలు నేర్చుకున్నారు. ఆ అధ్యయనం వారు సుమారు అరవై సంవత్సరాల వయసులో చేపట్టిన ఒమర్ ఖైయం రూబాయిల అనువాద రచనకు నాంది పలికింది.)

కాలక్రమేణా నారాయణ దాసుగారు విజయనగర సంగీత కళాశాలకు ప్రిన్సిపాల్ గా నియమితులయినపుడు, ఆయన రూపకల్పన చేసిన ‘కర్ణాటక-హిందుస్తానీ సంగీతాల సంకీర్ణ బాణీ’ ఆ కళాశాల పాఠ్యప్రణాళికలో భాగం అయింది. విజయనగరం సంగీత కళాశాలలో సంగీత విద్యనభ్యసించిన విద్వాంసులు ఈనాటికీ ఆ బాణీని అనుసరిస్తున్నారు. దురదృష్టవశాత్తూ ఆ సంప్రదాయానికి నారాయణ దాసుగారే ఆద్యుడనే గుర్తింపు రాలేదు. దానిని ‘విజయనగరం సంగీత బాణీ’గా పిలుస్తారు.

సశేషం ….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked