ప్రధాన సంపాదకులు:
తాటిపాముల మృత్యుంజయుడు
సంపాదక బృందం:
తమిరిశ జానకి
కస్తూరి ఫణిమాధవ్
'ప్రభో , కాలం నీ చేతుల్లో అనంతం
నీ నిమషాల్ని లెక్కపెట్టగలవారెవరూ లేరు ' (గీతాంజలి, చలం)
'ఎందులోంచి ఎప్పుడు ఎలాగ పుట్టింది కాలము?
ఎవరివల్ల, ఎవరికోసం జరిగిందీ ఇంద్రజాలం?' (త్వమేవాహం, ఆరుద్ర)
'గాలంవలె శూలం వలె వేలాడే కాలం
వేటాడే వ్యాఘ్రం అది, వెంటాడును శీఘ్రం' (ఖడ్గ సృష్టి, శ్రీ శ్రీ)
పైవన్నీ మన తెలుగు కవులు తమ కవితల్లో కాలానికి అన్వయించుకున్న అర్థాలవి. మరి తత్వవేత్తలు, ఆధ్యాత్మికులు కాలాన్ని ప్రవాహమని, చక్రమని పరిగణించారు. ఇదలా ఉంచితే, శాస్త్రవేత్తలు కాలం ఈ విశ్వం ఉద్భవించినప్పటినుండి పుట్టిందని పేర్కొన్నారు. నిరంతరం క్రియప్రక్రియలతో నిరాఘాతంగా వ్యాపిస్తున్న ఈ విశ్వంలో ఎప్పుడో ఒకప్పుడు వివిధరూపాల్లో ఉన్న శక్తులు ఉట్టడుగుతాయని (Thermal Equillibrium), అప్పుడు సంకోచం ప్రారంభమై విశ్వమంతా ఒక కృష్ణబిలం (Black hole) లా మారుతుందని, అప్పుడు కాలం ఆగిపోతుందని కొందరు శాస్త్రవేత్తల అభిప్రాయం.
ఏదైతేనేం, తెలుగు సంసృతి కాలాన్ని ప్రభవ నుండి అక్షయ పేర్లతో అరవై సంవత్సరాలుగా విభజించింది. అందుకే ఈ కాలచక్రంలో ఒక పరిభ్రమణం పూర్తిచేసిన వారు షష్టిపూర్తి చేసుకోవడం కద్దు.
కొద్దిరోజుల క్రితమే కొత్త ఉగాది వచ్చింది. సంవత్సరం పేరు హేమలంబ. సిలికానాంధ్ర సుజనరంజని పాఠకులందరికి 'హేమలంబ నామ ఉగాది శుభాకాంక్షలు!'
అలాగే ఈ నెల నుండి సుజనరంజని మాసపత్రిక కొత్త కవళికలతో మీ ముందుకొస్తున్నది. మీకు నచ్చుతుందని మేము అనుకొంటున్నాము. మీ అభిప్రాయాలు చెప్పండి. వీలైతే సరిచేసుకుంటాము.
ఈ నూతన సంవత్సరంలో ప్రతి నిమిషం నిత్యనూతనంగా ఉండాలని ఆశిస్తూ...
-తాటిపాముల మృత్యుంజయుడు