– యస్. యస్. వి రమణారావు
ఉదయం తొమ్మిదికల్లా రాజు కారుతో సిబిఐ గెస్ట్ హౌస్ దగ్గర సిద్ధంగా ఉన్నాడు.అభిషేక్ వచ్చి కారులో కూర్చున్నాడు.’ఎడ్రస్ సార్”అడిగాడు రాజు.”లక్ష్మీపురం దగ్గరకు వెళదాం. అక్కడికి వెళితే గుర్తు పట్టగలను “విశ్వామిత్రని చూశానని చెప్పి గొప్ప షాక్ ఇచ్చారు సార్.మేమింకా విశ్వామిత్ర హోమ్ కి భయపడి అండర్గ్రౌండ్ లోకి వెళ్ళిపోయాడని అనుకుంటున్నాం అంతవరకు.”నవ్వాడు అభిషేక్,కారులోంచి అందంగా కనబడుతున్న విశాఖ నగరాన్ని చూస్తూ.”మీరు వెళ్ళాక జగదీష్ గారు మినిష్టర్ గారికి ఫోన్ చేసి చెప్పినప్పుడు ఆయనకూడా షాక్ అయ్యారు సార్” “అందులో నా గొప్పతనం ఏముంది?It`s purely accidental.”
“వాట్ ఈజ్ మిరకిల్ టు మేన్ ఈజ్ లాజికల్ టు గాడ్ అన్నాడు సార్ షేక్స్పియర్. భగవంతుడు మీద్వారానే ఈ కేసు సాల్వ్ చేద్దామనుకుంటున్నాడు సార్.అందుకునే మిమ్మల్ని విశ్వామిత్రని కలుసుకునేలా చేశాడు.”అంతవరకూ సిటీని చూస్తూ లైట్ మూడ్ లో ఉన్న అభిషేక్ తల తిప్పి రాజు కేసి చూస్తూ అడిగాడు కొంచెం ఆశ్చర్యంగానే “దైవభక్తి ఎక్కువలా ఉందే.బాగా మాట్లాడుతున్నారు కూడా” “దైవభక్తి ఎక్కువే సార్” రాజు ఒక క్షణం ఆగాడు”బి.ఎ.ఇంగ్లీష్,తెలుగు రెండూ పూర్తి చేశాను సార్.జస్ట్ అవుట్ ఆఫ్ ఇంటరెస్ట్” “చదువేకాదు సంస్కారం కూడా ఉంది మీలో” “థాంక్యూ సార్. లక్ష్మీపురం వచ్చేసాం”అంటూ పవర్ విండోస్ దించాడు రాజు. అభిషేక్ చుట్టూ చూశాడు.
“ఎస్.ఇప్పుడు, ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటే ఫుడెక్స్ బేకరీ షాపు వస్తుంది.అక్కడనుంచి రైట్ తీసుకుంటే దసపల్లా రెస్టారెంట్,పక్కన మళ్ళీ రైట్ తీసుకుంటే,అంటే బిహైన్డ్ దసపల్లా రెస్టారెంట్ ,ప్రశాంతి నగర్ అక్కడే కదా?”అడిగాడు అభిషేక్.”ప్రశాంతి నగరా..?”అంత ఎ.సి.కారులో కూడా రాజు మొహంలో చెమటలు పట్టాయి.అభిషేక్ చూడకుండా వెంటనే మొహం తుడుచుకున్నాడు.చెమటైతే తుడుచుకున్నాడు గాని రాజు మొహంలో భయాందోళనలు తొలగిపోలేదు.”నగర్ అదే కావచ్చు కాని,స్ట్రీట్ నంబర్ సేమ్ కానకర్లేదు.స్ట్రీట్ నంబర్ ఒకటే అయినా అదే ఇల్లు కానక్కర్లేదుగా”
“రాజు గారూ,ఏమిటి గొణుక్కుంటున్నారు?ఎనీ ప్రోబ్లెం?”అడిగాడు అభిషేక్
“అబ్బే ఏంలేదు సార్.మీరు ఇప్పుడు మీరు చెప్పిన అడ్రస్ మననం చేసుకుంటున్నానంతే”
మాటల్లోనే కారు ప్రశాంతి నగర్ లోకి ఎంటర్ అయింది.
“అరే చెప్పకుండానే కరట్ స్ట్రీట్ కు తీసుకు వచ్చేసారే,అదే అక్కడ ఒక రెడ్ గేట్ కనబడుతోంది కదా, ఆ అపార్ట్మెంట్సే”
’ఆహా ఏమి విధిలీల ఏ ఇల్లైతే కాకూడదనుకున్నానో అదే ఇల్లు’రాజుకి బుర్ర పని చేయలేదు”ఆర్ యు ష్యూర్ సార్.ఆ ముందర ఇంకో రెడ్ గేట్ ఉంది చూడండి.అదేమో.లేకపోతే ఆ కుడి పక్కన ఒక ఎల్లోగేట్ ఉంది చూడండి.అదిరిపోయింది.పోనీ అక్కడ ఆపమంటారా?”
అభిషేక్ మొహంలో వెంటనే చికాకు కనబడింది ఆ మాటలు వినగానే. ఒక్కసారిగా లవర్ బాయ్ రోల్ నుంచి ఆఫీసర్ రోల్ కి వచ్చేశాడు.
“వాట్ నాన్సెన్స్ మిష్టర్ రాజు”కొంచెం గట్టిగానే అన్నాడు.వెంటనే రాజు ఉలిక్కిపడి ఈలోకంలోకి కానిస్టేబుల్ డ్యూటీలోకి వచ్చేశాడు.
“సారీ సార్”అని గట్టిగా అంటూ చెప్పిన చోటే కారు ఆపాడు.prasamthimanshions.అభిషేక్ కారు దిగి అపార్ట్మెంట్ కాంప్లెక్స్ లోకి ఎంటర్ అవుతుంటే “సార్” అని మళ్ళీ గట్టిగా అరిచాడు
ఉలిక్కిపడి మళ్ళీ వెనక్కి తిరిగాడు అభిషేక్.”వాట్ రాజు?”అన్నాడు కొంచెం విసుగ్గా
“ఈరోజు నాకు కాదు మాఆవిడకి డాక్టర్ అప్పాయింట్ మెంట్ ఉంది సార్.కొంచెం వెళ్ళాలి”
“ఒకె.కార్ కీస్ ఇచ్చి వెళ్ళండి.”
“ఒకె సర్”చేతిలోని కార్ కీస్ అభిషేక్ కి ఇచ్చేశాడు.
“థాంక్యూ సార్.వెళ్ళొస్తాను సార్”
రాజు వెనక్కి తిరిగాడు.అపార్ట్మెంట్ కాంప్లెక్స్ లోకి లిఫ్ట్ దగ్గరకు వెళ్ళబోతూ”రాజు గారూ”పిలిచాడు అభిషేక్
“సార్”ఉలిక్కిపడుతూ వెళ్ళిపోతున్నవాడల్లా తిరిగి అభిషేక్ వైపు చూశాడు రాజు.
“ఎందుకైనా మంచిది. మీరు కూడా ఒకసారి చూపించుకోండి. వయసొచ్చింది కదా, బిపి, షుగర్..”
“తప్పకుండా సార్. థాంక్యూ సార్”.
లిఫ్ట్ దగ్గరకు వెళ్ళిన అభిషేక్ లిఫ్ట్ దగ్గరకు వెళ్ళకుండా సడన్ గా వెనక్కు తిరిగి మెట్ల దగ్గరకు వెళ్ళి చక చక రెండు ఫ్లోర్స్ మెట్లు ఎక్కాడు.అక్కడ తెరిచి ఉన్న ఒక ఇంటిలోపలకు ఆ ఇంట్లో వాళ్ళందరూ ఆశ్చర్యపోయి చూస్తుండగానే “ఎక్స్యూజ్ మి” అంటూ ఆ ఇంటి బాల్కనీలోకి దూసుకుపోయాడు.బాల్కనీలోంచి వీధి మొత్తం కనబడుతోంది.రాజు ఎవరితోనో చాలా సీరియస్ గా మట్లాడుతున్నాడు.మొహంలో ఆందోళన స్పష్టంగా కనబడుతోంది.కొంతసేపు మాట్లాడాక ఫోన్ కట్ చేసి ఆటో ఎక్కాడు.
అభిషేక్ గూడా తలాడిస్తూ వెనక్కు తిరిగాడు.వెనక్కి తిరగగానే అతనికేసి ఆరాధనాపూర్వకంగా చూస్తున్న ఆ ఇంటివాళ్ళు కనబడ్డారు.’సారీ’ చెప్పబోయేంతలో “యు ఆర్ అభిషేక్, శివహైమ అక్క ఫియాన్సీ,ఏమ్ ఐ రైట్?”మెరుస్తున్న కళ్ళతో అడిగింది ఒక పంతొమ్మిదేళ్ళ అమ్మాయి.
కళ్ళు పెద్దవయ్యాయి అభిషేక్ కి.నెమ్మది అడుగులు వేస్తూ ఆఇంటి బయటకు వచ్చాడు.అక్కడ ఇంకా చాలామంది నిలబడి ఉన్నారు.అందరూ ఇండియన్ క్రికెట్ టీమ్ మెంబర్స్ ఒక చీఫ్ గెస్ట్ కి వరసలో నిలబడి అందరినీ పరిచయం చేసుకుంటూ షేక్ హాండ్ ఇచ్చినట్లు అందరూ షేక్ హాండ్ ఇచ్చారు.వరసలో ఆఖరున ఉన్నాయన “ఫిఫ్త్ ఫ్లోర్”చెప్పాడు.అభిషేక్ మెట్లు ఎక్కి వెళుతుంటే అందరూ ఒక్కసారిగా చప్పట్లు కొట్టారు.
(సశేషం)