సారస్వతం

అన్నమయ్య శృంగార నీరాజనం

శృంగార వియోగ నాయిక

-టేకుమళ్ళ వెంకటప్పయ్య

అలమేలు మంగమ్మ శృంగార తాపాన్ని అద్భుతంగా వర్ణిస్తున్నాడు అన్నమయ్య. స్వామి రాలేదని మదన తాపంతో ఉన్నది. చల్లదనం కలిగించే వస్తువులు కూడా మంట మండిస్తున్నాయి. అన్ని కీర్తనల్లో వాడే “శ్రీవేంకటేశ్వర” అనే మకుటం కాకుండా ఈ కీర్తనలో “శేషాద్రి వల్లభుడు” అని క్రొత్తరకంగా సంబోధించడం వింతగానే ఉంది. చిత్తగించండి.
కీర్తన:
పల్లవి: చలిగాలి వేడేల చల్లీనె కప్పురపు
మలయజము తానేల మండినే

చ.1.పాపంపు మనసేల పారీనే నలుగడల
చూపేల నలువంజజూచీనే
తాపంపు మేనేల తడవీనె పూవింటి
తూపేల చిత్తంబు దూరీనే || చలిగాలి||

చ.2.వాయెత్తి చిలుకేల వదరీనె పలుమారు
కోయిలలు దామేల గొణగీనే
రాయడికి నలులేల రాసీనే మాతోను
కాయజుడు తానేల కసరీనే|| చలిగాలి||

చ.3.ఏకాంతమున నేల యెదురైతినే తనకు
లోకాధిపతికేల లోనైతినే
చేకొనిదె మన్నించె శేషాద్రివల్లభుడు
పైకొనిదె మమ్మేల పాలించెనే || చలిగాలి||
(రాగం: శ్రీరాగం; రేకు సం: 63, కీర్తన; 5-191)

విశ్లేషణ: ఈ కీర్తనలో శ్రీవేంకటేశ్వరుడు నాయకుడు, నాయిక అలమేలుమంగమ్మ – అన్నమయ్య అలమేలుమంగమ్మతో ఏమి చెప్పిస్తున్నాడో గమనించండి. అది విని చెలికత్తెలు సైతం వాపోతున్నారు మీరు కూడా వినండి.

పల్లవి: చలిగాలి వేడేల చల్లీనె కప్పురపు
మలయజము తానేల మండినే
అలమేలు మంగమ్మ చెలులతో…. చెలీ! ఈ చలిగాలి చూశారా? వేడిగా మారిపోయి నాకు మరింత తాపాన్ని కలుగజేస్తున్నది. కర్పూరంతో కూడిన గంధం సైతం నా మేను మండిస్తున్నదేమిటి? ఏమిటీ విచిత్రం అని వాపోతున్నది.

పాపంపు మనసేల పారీనే నలుగడల
చూపేల నలువంజజూచీనే
తాపంపు మేనేల తడవీనె పూవింటి
తూపేల చిత్తంబు దూరీనే
ఈ విచిత్రమైన పాడు ఆలోచనలతో మనసు నలువైపులకు పారిపోతున్నదేమిటే! నా చూపులు నలుదిక్కులకు దేనికోసం వెదుకుతున్నాయి? విరహ బాధతో నా మనసు వేగి వేగి పోతున్నది. మన్మధ బాణాలు నాకు గ్రుచ్చుకొని ఏల బాధిస్తున్నాయి? నాకెందుకీ బాధ! చెలులాలా చెప్పండే!

వాయెత్తి చిలుకేల వదరీనె పలుమారు
కోయిలలు దామేల గొణగీనే
రాయడికి నలులేల రాసీనే మాతోను
కాయజుడు తానేల కసరీనే
ఈ చిలుక చూశావా? అనేక సార్లు గొంతెత్తి ఏదో కూస్తూనే ఉంది. కోయిలమ్మలు అదే పనిగా ఏదో గొణుగుతూనే ఉన్నాయి. అసలీ కోనేటి రాయుడిని నాతో ఆ బ్రహ్మదేవుడు ఎందుకు కలిపాడో తెలీదు. మన్మధుడు నాపై ఎందుకు కినుక వహించాడో అర్ధం కావడంలేదు. నన్ను నిలువనీయకుండా జేస్తున్నాడే!

ఏకాంతమున నేల యెదురైతినే తనకు
లోకాధిపతికేల లోనైతినే
చేకొనిదె మన్నించె శేషాద్రివల్లభుడు
పైకొనిదె మమ్మేల పాలించెనే
చెలులారా! ఆ వెంకటపతికి నేను ఒంటరిగా ఎందుకు ఎదురయ్యానే! సరే ఎదురైతినెపో! ఎందుకు లొంగిపోయాను? నేను లొంగితినెపో! ఆ శేషాద్రి వల్లభుడు నన్ను ఆదరించి ఏల స్వీకరించాడే! అలా చేకొని ఎందుకు ఏలుకుంటున్నాడే? నన్నిప్పుడు నిలవకుండా జేస్తున్నాడు గదే!
ముఖ్య అర్ధములు: మలయజము = చందనము; పారీనే = పారిపోవడం; మేనేల? = శరీరం ఎందుకు?; తడయు = ఆలశ్యము జేయు; పూవింటు తూపు = మన్మధ బాణములు; చిత్తము = మనసు; వాయెత్తి (వాయి తమిళ పదం) = నోరెత్తి; వదరేనె = ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం; గొణుగుట = చిన్నగా మాట్లాడుట; నలువ = బ్రహ్మ; కాయజుడు = మన్మధుడు; కసరు = కోపగించుకొను; లోనవడం = లోబడడం; చేకొను = ఆదరించు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked