సారస్వతం

కల్హణుడు

-శారదాప్రసాద్

రాజతరంగిణి (రాజుల నది) వాయువ్య భారత ఉపఖండం యొక్క చారిత్రిక సంచిక.మరీ ప్రత్యేకంగా కాశ్మీరు చరిత్రకు సంబంధించి ప్రామాణిక గ్రంథం. దీన్ని సంస్కృతంలో రచించారు. రాజతరంగిణిని కాశ్మీరీ బ్రాహ్మణుడు కల్హణుడు క్రీ.శ.12వ శతాబ్దంలో వ్రాశారు.ఈ రచన సాధారణంగా కాశ్మీరు సంస్కృతీ సంప్రదాయాలను నమోదు చేస్తుంది.కానీ రాజతరంగిణిలోని 120 శ్లోకాలు అనంత దేవరాజు కుమారుడైన కలాశ్ రాజు పరిపాలనాకాలంలో జరిగిన అక్రమాలు, ప్రజావ్యతిరేక విధానాల గురించి వివరించింది. రాజతరంగిణిలోని ప్రాచీన చారిత్రిక వివరాలు ప్రాచీన భారతీయ చరిత్ర రచనకు ప్రామాణికంగా వినియోగపడుతున్నాయి. రాజతరంగిణి సంస్కృతభాషలో కాశ్మీరీ బ్రాహ్మణుడైన కల్హణుడు రాసిన కావ్యం. చారిత్రిక పాఠ్యంగా కాశ్మీరు ప్రాంతాన్ని గురించి వ్రాసిన గ్రంథాల్లో ఇది అత్యంత ప్రాచీనమైనది. కాశ్మీరు ప్రాంతం విస్తారంగా హిమాలయాలు, పిర్ పంజల్ శ్రేణి మధ్యలో వ్యాపించిన ప్రాంతం. కల్హణుని ప్రకారం కాశ్మీరు లోయ ప్రాచీనకాలంలో ఓ పెద్ద సరస్సు. ప్రఖ్యాతుడైన మహర్షి కశ్యపుడు బారాముల్లా వద్ద సరస్సు కరకట్టను త్రుంచివేయగా ఆ లోయలోని మొత్త నీరంతా బయటకు ప్రవహించింది. సంస్కృతంలో వరాహమూల అనే పేరుండేది బారాముల్లాకు. దీని అర్థం వరాహ మూలం అని వస్తుంది. ఇదే క్రమంగా బారాముల్లా అయింది. కల్హణుడు రచించిన రాజతరంగిణి గ్రంథం తెలుగు సాహిత్యంలో అనేక విధాలుగా ప్రఖ్యాతి చెందింది.

రాజతరంగిణిలోని పలువురు రాజుల కథలను ఇతివృత్తాలుగా స్వీకరించి తెలుగు రచయితలు, కవులు కాల్పనిక గ్రంథాలను, చారిత్రిక కల్పనలను రచించారు. తెలుగు సాహిత్యంలోని పలువురు గొప్ప గ్రంథకర్తలు ఈ క్రమంలో వ్రాశారు. నవలలు, కథలు, పద్యకావ్యాలు రాజతరంగిణిని ఆధారం చేసుకుని వ్రాశారు. వీటిలో ప్రఖ్యాతమైన కొన్ని రచనలు: విశ్వనాథ సత్యనారాయణ గారు వ్రాసిన కాశ్మీర రాజవంశావళి నవలలు, పిలకా గణపతిశాస్త్రి గారు రచించిన కాశ్మీర పట్టమహిషి నవల, మరికొన్ని నవలికలు, కస్తూరి మురళీకృష్ణ వ్రాసిన కాశ్మీర రాజతరంగిణి కథలు. 7,836 శ్లోకాలలో పొందుపరచిన కాశ్మీర రాజుల చరిత్రను ఇందులో ఉంది. 1148-49 మధ్య రాజ తరంగిణి రాశాడు రాజతరంగిణిలో ఎనిమిది తరంగాలుగా కలియుగారంభం నుంచి గల కాశ్మీర రాజుల చరిత్రను కావ్యంగా రచించారు. ఆధునిక చరిత్రకారులు భారత చరిత్ర పరిశోధనలకు ఆధారంగా స్వీకరించిన ప్రామాణిక గ్రంథం రాజతరంగిణి.చారిత్రిక వాస్తవికతతో పాటుగా కల్పన, రమణీయత వంటి కావ్య లక్షణాలను కలిగిన రాజతరంగిణి కావ్యం తెలుగు సాహిత్యకారులను ఆకర్షించింది.కల్హణుడు కాశ్మీర రాజు జయచంద్రుని ఆస్థానకవి. ఇతని కాలం 1127-1149. కల్హణుడి తండ్రి అమాత్య చంపకుడు. కల్హణుడి తండ్రి కాశ్మీర రాజు హర్షుడి ఆస్థానంలో పనిచేసాడు. ఆ తర్వాత కొంతకాలానికి మంత్రి అయ్యాడు. వీరిది శైవ మతం అయినా వీరికి బౌద్ధం అంటే అభిమానం. రాజతరంగణీయం శాంత రస ప్రధానంగా సాగిన కావ్యం. తనకు పూర్వ కవుల రాసిన గ్రంధాలనే ఆధారంగా చేసుకొని దీన్ని రాసానని ఆయన సవినయంగా పేర్కొన్నాడు! ఎన్నో శాసనాలను పరిశోధించి రాసిన గొప్ప కావ్యం ఇది. పూర్వపు రాజుల నుంచి తన కాలం రాజుల చరిత్రలన్నీ ఇందులో రాశాడు.

స్టెయిన్ అనే ఆంగ్లేయుడు దీన్ని 1900లో ఇంగ్లీష్ లోకి అనువదించి ప్రచురించాడు. 1617లో జహంగీర్ కాలంలోని హైదర్ మాలిక్ పర్షియన్ భాషలోకి దీన్ని అనువదించాడు. పిరదౌసి రాసిన షానామా కంటే రాజ తరంగిణిలో నిజాలు ఎక్కువగా ఉన్నాయి.కల్హణుడు వ్యాకరణ పండితుడు. అర్ధ, రాజనీతి బౌద్ధ శాస్త్రాలను వంటపట్టించుకున్నాడు. కాశ్మీర పదజాలం సంస్కృతంలో కూడా చేరింది. అశోకుడి ముందరి యాభై రెండు రాజుల చరిత్ర గురించి చెప్పాడు .కనిష్కుడి కాలంలో ఆచార్య నాగార్జునుడు ఉన్నాడని రాసాడు. కాశ్మీర రాజు హర్షుడు క్రూరుడని, అతను నాలుగు వేల బౌద్ధ ఆరామాలను, విగ్రహాలను ధ్వంసం చేసినట్లు చెప్పాడు. “ఐతిహాసిక విషయాలను ఇంత సునిశితంగా పరిశీలించి చరిత్ర గ్రంథం వ్రాయడంలో కల్హణుడు అనుసరించిన పద్ధతి పందొమిదవ శతాబ్దికి చెందిన ఐతిహాసికాలకు మార్గదర్శకము” అని అంటూ, ముజుందార్ “భారతీయేతిహాసానికి మూలాధారాలు” (Sources of Indian History) అనే గ్రంథంలో కల్హణుని ఐతిహాసిక దృష్టిని ఎంతగానో ప్రశంసించారు. తన గ్రంధం సరస కావ్యంగా సంతరించినట్లు కల్హణుడే చెప్పాడు. కొందరు పూర్వ కవులు చూపించినట్లుగా అక్కడక్కడ తన శాస్త్రపాండిత్యాన్ని కూడా చూపించాడు కల్హణుడు. ఒక ప్రదేశంలో నివసించడానికి అలవాటు పడడమూ (అన్వయము) అలవాటు పడకపోవడమూ (వ్యతిరేకము) అనే దానిని పట్టే ఇది స్వదేశము అది విదేశము అనే భావాలు కలుగుతూ ఉంటాయట. కల్హణుడు రాసిన కశ్మీర రాజతరంగిణిని ఆధారం చేసుకుని విశ్వనాథ రాసిన ఆరు నవలల మాలికలో యశోవతి మొదటిది. వేలయేళ్ల చరిత్రను సాధికారికంగా నిర్ధారించుకుని ఆసక్తికరమైన వర్ణనలతో కల్హణుడు 11శతాబ్దిలో రాసిన కశ్మీర రాజతరంగిణి అటు చారిత్రిక గ్రంథంగా, ఇటు కావ్యంగా ప్రాముఖ్యత పొందింది.

పాశ్చాత్య చరిత్ర పండితులు, వారిని అనుసరించిన భారతీయ చరిత్ర పండితులు చరిత్రలోని ఎన్నో అంశాలను విస్మరించి మన గతానికి అన్యాయం చేశారని చెప్పే విశ్వనాథ దృష్టి సహజంగానే కశ్మీర రాజతరంగిణిపై పడింది. రాజతరంగిణిలో రాసిన పలువురు రాజులు, రాణులు, వారి జీవితాలు, ఆనాటి వాతావరణాన్ని అంశంగా తీసుకుని 6 నవలల మాలికను విశ్వనాథ సృష్టించారు. కాశ్మీర రాజవంశ నవలలు ఇవి:యశోవతి, పాతిపెట్టిన నాణెములు, మిహిరకులుడు, కవలలు, సంజీవకరణి,భ్రమరవాసిని. “యశోవతి” నవల రచనా కాలం 1966. కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ ఈ నవలను ఆశువుగా చెప్తుండగా ఆయన శిష్యుడైన గరికపాటి సత్యనారాయణ లిపిబద్ధం చేశారని రచయిత కుమారుడు విశ్వనాథ పావనిశాస్త్రి గారు నిర్థారించారు. 1966లో తొలిముద్రణ పొందిన ఈ నవల 2006కు మొత్తం మూడు ముద్రణలు పొందింది. ద్వాపర యుగ కాలమందు మిధిలానగరమును పాలించిన రాజుకు కుమార్తె యశోవతి. అంద చందాలు కలిగిన ఆమె కృష్ణునిపై అపారమైన భక్తి, విశ్వాసాలు కలిగి ఉంటుంది. తరచు ఆ రాజ్యానికి వచ్చే కాశ్మీర రాజు ఆమెను చూచి తన కుమారునకు ఆమెను వధువుగా చేయాలని ఉబలాటపడి వివాహం జరిపిస్తాడు. ఈ పుస్తకమును శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం (తిరుపతి) వారు డిగ్రీ విద్యార్ధులకు 1972 లో తెలుగు నాండిటేల్ పాఠ్య గ్రంధముగా నిర్ణయించినారు.కాశ్మీరీ చరిత్రకారుడు కల్హణుడు రాసిన ‘రాజ తరంగిణి’ మినహాయిస్తే భారతదేశంలో ఒక సక్రమ, సమగ్రమయిన చరిత్ర గానీ చారిత్రక కధనాలు గానీ ఉనికిలో ఉన్నట్లు మనకు కనబడవు. పరిశోధన అంటే వైభవాలను మాత్రమే చెప్పటం కాదు, చరిత్రలోని చీకటి కోణాలను కూడా వెలికితీయటం అని తెలుస్తుంది ఈ గ్రంధం చదివితే! నిష్పక్షపాతంగా రాసిన ఈ గ్రంధం దేశంలోని పండితులందరి దృష్టినీ ఆకర్షించింది. ‘రాజతరంగిణి’ కావ్యంలో కల్హణుడు సవివరంగా పేర్కొన్నట్లుగా అఖండ భారతంలోని అన్ని ప్రాంతాలలోనూ బ్రాహ్మణులు విస్తరించి ఉన్నారు. ఉత్తర భారతంలో సారస్వత, కన్యాకుబ్జ, గౌడ, ఉత్కళ, మైథిలి అనే పేర్లమీద పంచగౌడులుగా, దక్షిణ భారతంలో కర్ణాటక, తెలుగు, ద్రవిడ, మహారాష్ట్ర, గుజరాత్‌ పేరిట పంచ ద్రావిడులుగా ఉన్న బ్రాహ్మణులు, భారతావనికి ఆవల ఉన్న దేశాలలోనూ ఉన్నారు. నేపాల్‌లో ‘బహున్‌’లుగా, ఒకప్పటి బర్మా అయిన నేటి మయన్మార్‌లో ‘పొన్న’లుగా వివిధ పేర్లతో బ్రాహ్మణులు ఉన్నారు. కాశ్మీర్ లోని శారదామాత ఆలయం చాలా పురాతనమైనది. ఇప్పుడు పాకిస్తాన్ లో ఉన్న కాశ్మీర్ భూభాగంలో ఉన్న ఈ మందిరం చారిత్రికంగా చాలా ముఖ్యమైనది. కాశ్మీర్ చరిత్రకారుడైన కల్హణుడు తన రాజ తరంగిణిలో ఈ మందిరం గుర్కించి చాలా వివరంగా వ్రాశాడు. “నమస్తే శారదా దేవి కాశ్మీర మండల వాసిని” అన్న ప్రార్ధన దేశమంతటా వినిపించేది. శాండిల్య మునికి శారదా దేవి ఇక్కడ ప్రత్యక్షమైనదని అంటారు. దేశంలోని పండితులందరికీ ఇది పరమ పవిత్రక్షేత్రం. ఆది శంకరాచార్యులవారు, రామానుజాచార్యులవారు వంటి గురువులు ఇక్కడికి వచ్చి దేవి దర్శనం చేసుకొన్నారని అంటారు. ఈ మందిరం ఉన్న స్థలాన్ని కూడా కల్హణుడు తన కాశ్మీర రాజచరిత్రలో వర్ణించాడు. కస్తూరి మురళీకృష్ణ వ్రాసిన కాశ్మీర ‘రాజతరంగిణి కథలు’ జాగృతి పత్రికలో ధారావాహికంగా వచ్చాయి. దీన్ని ఎమెస్కో వారు ప్రచురించారు! ఆ కధలను రచయితా ఆసక్తికరంగా రాసాడు. ఆసక్తి గలవారు ఆ కధలను చదివి మరిన్ని విషయాలను తెలుసుకోగలరు!

భారత దేశపు మొట్ట మొదటి చారిత్రిక రచయిత,కవిపండితుడైన కల్హణుకి స్మృత్యంజలి!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked

1 Comment on కల్హణుడు

సూర్యం said : Guest 5 years ago

మంచి విషయాలను తెలియచేసారు

  • గుంటూరు