సారస్వతం

కొప్పరపు కవులు

-టీవీయస్.శాస్త్రి

భారతీయ భాషా సాహిత్యాలలో మరే భాషకు లేని విలక్షణమైన స్థానాన్ని తెలుగు భాషా సాహిత్యాలకు తెచ్చిపెట్టిన ప్రక్రియ అవధానం. పద్య విద్యకు పట్టంగట్టిన సాహిత్య ప్రదర్శన కళగా అవధాన ప్రక్రియ ప్రత్యేక గుర్తింపును పొందింది నాటి తిరుపతి వెంకటకవులు, కొప్పరపు సోదర కవులు మొదలుకుని ఆధునిక కవుల వరకు పద్యాన్ని అవధాన వేదికలపై ఊరేగించిన మహాకవులెందరో ఉన్నారు. కాళిదాసు కావ్యాలకు సంజీవనీ వ్యాఖ్య రాసి విశ్వవిఖ్యాతి గడించిన మల్లినాథసూరి మెదక్ జిల్లావాడే. వీరి తాతగారైన మల్లినాథుడు కాకతీయ ప్రభువు ప్రతాపరుద్రుని ఆస్థానంలో శతావధానం నిర్వహించి కనకాభిషేక సత్కారాన్ని పొందాడని ప్రతీతి. బహుశా వీరే మొట్టమొదటి అవధాని అయి ఉంటారు. ఈ విషయమై విస్తృతమైన పరిశోధన చేయవలసి ఉంది.కొప్పరపు సోదర కవులు తెలుగు సాహిత్య అవధానంలో ప్రసిద్ధిచెందిన జంట సోదరకవులు. కొప్పరపు కవులుగా ప్రఖ్యాతులైన కొప్పరపు వేంకట సుబ్బరాయ కవి, కొప్పరపు వేంకట రమణ కవి గుంటూరు జిల్లా నరసరావుపేట దగ్గర ఉన్న కొప్పరం వాస్తవ్యులు. వీరు వేంకటరాయలు మరియు సుబ్బమాంబ దంపతులకు జన్మించారు. వీరిలో పెద్దవాడు కొప్పరపు వేంకట సుబ్బరాయ కవి (నవంబరు 12, 1885 – మార్చి 29, 1932) మరియు రెండవవాడు కొప్పరపు వేంకటరమణ కవి ( డిసెంబరు 30, 1887 – మార్చి 21, 1942). వీరి గురువులు రామడుగు కృష్ణశాస్త్రి మరియు పోతరాజు రామకవి. ఈ సోదరులిరువురు పదహారేళ్ళు నిండకనే
ఆశుకవిత్వాన్ని ప్రదర్శించి కొప్పరపు సోదర కవులుగా పేరుపొందారు.కొప్పరపు సోదర కవులు 1908 మొదలుకొని అసంఖ్యాకంగా అష్టావధానాలు చేసి “కవిత పుట్టిల్లు సోదర కవుల ఇల్లు” అనే ఖ్యాతిపొందారు. వీరు లక్కవరం, గద్వాల, చల్లపల్లి వంటి సంస్థానాలలో 150 సభలలో అష్టావధాన, శతావధాన, ఆశుకవితా ప్రదర్శనలిచ్చారు.సుబ్బరాయ కవి తన 5వ ఏట హనుమత్‌ కవచ రూప నక్షత్రమాల అనే 27 పద్యాలు చెప్పారట. కొప్పరపు కవులు తమ ఎనిమిదవ ఏటే శతకాలు ఆశువుగా చెప్పారు. తమ 12వ ఏట అష్టావధానాలు చేశారు. 16 వ యేట శతావధానాలు చేశారు. 20వ ఏటికి గంటకి 300 పద్యాలు చెప్పే స్థాయిని సాధించారు. వీరి మొదటి ఆశుకవిత్వ సభ అల్వాలు లష్కరులో ఆదిరాజు తిరుమలరావు వీరికి ముంగాలి అందెను బహూకరించాడు. వీరు చెన్నపురి, బాపట్ల, విశదల, చీరాల, గుంటూరు, పంగిడిగూడెం, హైదరాబాదులలో చేసిన శతావధానాలు ప్రఖ్యాతమైనవి. వీరు ప్రబంధ శైలిలో గంటకు 500 పద్యాలు చెప్పేవారు. మార్టేరు సభలో పందెం వేసి గంటకు 720 పద్యాల లెక్కన అరగంటలో మను చరిత్రను ఆశువుగా
చెప్పినట్లు తెలుసున్నది.గుంటూరులో అప్పటి ప్రముఖ న్యాయవాది పాటిబండ సూర్యనారాయణ గారింట్లో భోజనం చేసే సమయంలోనే మూడు శతకాలు ఆంజనేయస్వామిపై చెప్పారు. కొమరర్రాజు వెంకట లక్ష్మణరావు విజ్ఞాన చంద్రిక గ్రంథ మండలి సమక్షాన నిర్వహించిన సభలో గంటలో నాలుగు వందల ఎనభై పద్యాలు చెప్పారు. గంటకొక ప్రబంధాన్ని ఆశువుగా సృష్టించడం ప్రపంచ సాహిత్యంలో అత్యాశ్చర్యకరమైన ప్రతిభ. ఈ కవులు ఉదయమే లేచి సాధనగా మహాభాగవతాన్ని ఆశువుగా చెప్పుకునేవారట. ఒక శతావధానంలో సీతను రాముడు అరణ్యానికి ఎందుకు పంపాడో సమర్థిస్తూ పద్యం చెప్పమన్నారు. ఈ పద్యం ఆశువుగా చెప్పింది.
అలా లంకాపురి సీత సాధ్వియని వహ్న్యదుల్‌ దిశాధీశ్వరుల్‌
తెలుపం జేర్చితి నీయయోధ్య జనసందేహంబుపో దొంటిరీ
తుల దేవావళి తెల్పునంతవఱకిందున్నిల్పగాదంచు శ్రీ
నళినాక్ష్యంశజ సీత గాన కనిచెన్‌ రాముండు రాజాగ్రణీ!
‘నళినాక్ష్యంశజ’ అద్భుతమైన ప్రయోగం. ప్రాసస్థానంలో అర్ధగాంభీర్యంతో కూర్చున్న పదం ఇద్దరు ఉపాసకుల మేధాసంపత్తికి చిహ్నం. తిరుపతి వేంకట కవులు, కొప్పరపు కవుల మధ్య జరిగిన వివాదాలు ఆనాడు పెను సంచలనాలు. నాటి పత్రికల్లో ఈ వార్తలు ప్రధాన శీర్షికలుగా అల్లరి చేశాయి. ఈ రెండు జంటల మధ్య సాగిన పోరులో మహాద్భుతమైన పద్యాల సృష్టి జరిగింది.వీరవాసరంలో చిలకమర్తి లక్ష్మీనరసింహంగారు అధ్యక్షత వహించిన ఒక సాహిత్య సభలో మూడు గంటల్లో నాలుగు వందలకు పైగా పద్యాలతో ‘శకుంతల కథ’ను అద్భుతమైన ప్రబంధవర్ణనలతో పూర్తి చేశారు. వీరికి బాల సరస్వతి, ఆశు కవీంద్ర సింహ, విజయ ఘంటికా, ఆశుకవి చక్రవర్తి, కుండినకవి హంస, కవిరత్న, అవధాన పంచానన, కథాశుకవీశ్వర, ఆశుకవి శిఖామణి మొదలైన బిరుదులు ఉన్నవి.వేదము వేంకటరాయ
శాస్త్రి గారు , కొక్కొండ వెంకటరత్నం పంతులు గారు ,వావిలికొలను సుబ్బారావు గారు, వసురాయ కవీంద్రుడు , కావ్యకంఠ వాసిష్ఠ గణపతి మునీంద్రులు, కాళ్లకూరి నారాయణరావు గారు, జయంతి రామయ్య పంతులు గారు మొదలైన అనేక ప్రసిద్ధాంధ్ర సంస్కృత పండితులు కొప్పరపు సోదర కవుల అవధాన కవితా సరస్వతిని
తిలకించి హారతిపట్టారు.కొప్పరపు సోదర కవుల పూర్వ వంశీయులలో కామరాజ కవి జాంబవతీ పరిణయమును
మరియు వేంకటరత్నకవి శాంభవీ శతకం మరియు రామదండకం లను రచించారు.వేంకట సుబ్బరాయశర్మ మరణం తర్వాత వేంకటరమణ కవి తమ అనుంగు సోదరుడైన కొప్పరపు బుచ్చిరామ కవి(డిసెంబరు 9, 1892 – మే 29, 1956)
తో కలిసి ఆశుకవితా సభలు చేశాడు. వీరు అవధానాలలో కొన్ని లక్షల పద్యాలు చెప్పారు.వేంకట సుబ్బరాయకవి గారి కుమారుడు కొప్పరపు సీతారామ ప్రసాదరావు అవధానాశు కవితా ప్రదర్శనలిచ్చి ప్రసిద్ధిచెందాడు. వేంకటరమణకవి కుమారుడు మల్లికార్జునరావు, సీతారామ ప్రసాదరావుతో కలిసి సభలలో పాల్గొని అల్పవయస్సులోనే మరణించాడు.వీరి
మద్రాసు మరియు గుంటూరు సభలను గురించి చిరుమామిళ్ల లక్ష్మీనారాయణ ప్రసాదు , కాకినాడ సభలను గురించి చేగంటి బాపిరాజు సేకరించి 1911 ప్రాంతంలో ప్రచురించారు. వీరి ఈ రెండు సంకలనములను మరికొన్ని అవధానాశు కవితా పద్యాలను కలిపి కుంటముక్కల జానకీరామశర్మ 1963 సంవత్సరంలో “కొప్పరపు కవుల యశోడిండిమ” అనే పేరుతో రెండు సంపుటాలుగా మకర సంక్రాంతి పర్వదినాన ప్రచురించాడు. వీరి జీవితచరిత్రను నిడదవోలు వెంకటరావు గారు 1973 సంవత్సరంలో రచించాడు.వీరి రచనలు–కనకాంగి,పసుమర్తి వారి వంశావళి,జ్ఞానోపదేశము, నారాయణాస్త్రము ,సుబ్బరాయ శతకము,కృష్ణకరుణా ప్రభావము,దైవ సంకల్పము ,దీక్షితస్తోత్రము,శతావధానము …
మున్నగునవి.మహాపండితులైన వీరి జ్ఞాపకార్థం “శ్రీ కొప్పరపు కవుల కళాపీఠము” పేరుతో సెప్టెంబరు 9, 2002 సంవత్సరంలో వీరి దౌహిత్రుడు మాచవరం వేంకట చెంచురామ మారుతి సుబ్బరాయశర్మ (మా శర్మ) విశాఖపట్టణంలో స్థాపించాడు. ఈ సంస్థ ద్వారా 2003 సంవత్సరంలో “కొప్పరపు సోదర కవులు” మరియు 2004 సంవత్సరంలో “కొప్పరపు సోదర కవుల కవిత్వము” అనే గ్రంథాలను డా. గుండవరపు లక్ష్మీనారాయణ ప్రచురించాడు.

అవధాన విద్యను సుసంపన్నం చేసిన ఈ ప్రతిభామూర్తులకు నివాళులు!

****

Leave a Reply

Your email address will not be published. Required fields are marked