సుజననీయం

దేశభక్తి కవిత

దేశమే నేను-నేనే దేశము

రచయిత్రి-తమిరిశ జానకి

దేశమంటే మట్టికాదని దేశమంటే మనుషులని
పాడుకుందాం గురజాడవారి జాడలో !
వట్టిమాటలు కావవి గట్టిమేలుకొలుపులు
మనసా వాచా కర్మణా దేశాన్ని ప్రేమించు మనుషులం మనమవుదాం
మంచిమనసులకు రూపాలు అవుదాం !
నడుచుకుందాం తోటిమనిషికి సాయపడుతూ
నడవనిద్దాం వారి వృద్ధికి అడ్డుపడక !
నటనకాదు దేశభక్తి
స్వతహాగా రావాలి మనసులోంచి !
దేశం నాకేమిచ్చిందని రుసరుసలాడకు
దేశానికి నేనేమి చెయ్యగలనని యోచించు !
ఏడాదికోసారి ఎగరవేస్తే జెండా
అయిపోదు బాధ్యత అని తెలుసుకుందాము !
కులమతభేదాలు కుతంత్రాలు కూలదొయ్య్కపోతె
ప్రక్షాళన చెయ్యకుంటె అవినీతీ అక్రమాలు
దేశమేగతి బాగుపడును భవిత ఏ తీరున చక్కపడును !
భావిభారత పౌరుల తీర్చిదిద్దాలంటె ఉండాలి మెండుగా దేశమంటే భక్తి
నేనే దేశము దేశమే నేనన్న భావన నిండాలి మనసున దండిగా !
ఎందరి త్యాగఫలమో మనదేశ స్వాతంత్ర్యం
అర్పించుకుందాము అందరికీ వందనాలు !
గౌరవించుకుందాము దేశమాతనూ కన్నతల్లినీ అది మన ధర్మం
నిలుపుదాం ధర్మాన్ని ధరణిపై
నిరంతరంగా ఆరని అఖండజ్యోతిలా !
……………………………………………………………………………..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked