సుజననీయం

ఎన్నటికి చెడని వాగ్గేయం

మనం నిత్యజీవితంలో అగుపించే వస్తువులు కాలక్రమేణ క్షీణిస్తూ చివరకు అంతరించిపోతాయి. బంగారు ఆభరణాలకు కూడా ‘తరుగు’ ఉంటుంది. విశాల విశ్వంలో ఉన్న అతిపెద్ద నక్షత్రాలు చిట్టచివరి దశలో కాంతిని గుప్పిట బంధించే ‘కృష్ణబిలాలు’గా మారుతాయని విజ్ఞానశాస్త్రం ఋజువు చేస్తున్నది.

కాని, సర్వకాల సర్వావస్థలయందు అనుక్షణం, ప్రతి తలంపు శ్రీ వేంకటేశ్వరుడుపై మోపిన అన్నమాచార్యుడు ‘శ్రీహరి పాదతీర్థమె చెడని మందు’ అంటూ శుక్రవారం స్వామికి జరిగే తిరుమజ్జనోత్సవంలో కీర్తించాడు. ‘చెడని మందు ‘ అతి తేలికైన తేటతెల్లని పదం. చిన్న పిల్లాడు కూడా అర్థం అలవోకగా చెప్పేస్తాడు. ఎల్లప్పుడు హితాన్ని కోరుతూ, తన పాండిత్యం ఎక్కడా ఆధిపత్యం చేయనీయకుండా, సంకీర్తనలు రచిస్తూ స్వరపరుస్తూ పాడుతూ నాట్యం చేస్తూ ప్రజల హృదయాలలో సుస్థిర స్థానం సంపాదించాడు అన్నమయ్య.

మే 25, 26, 27 తేదీల్లో సిలికానాంధ్ర అన్నమయ్య జయంతి ఉత్సవాన్ని ఎంతో ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా నిర్వహించిన వివిధ కార్యక్రమాల ఫోటోలు ‘ఈ మాసం సిలికానాంధ్ర ‘ శీర్షికలో చూడవచ్చు. అలాగే, ఈ ఉత్సవ సందర్భంగా సుజనరంజని ప్రత్యేకసంచిక కూడా పుస్తకరూపంలో ముద్రించి వెలువడించాం. వచ్చిన అతిధులకు కుటుంబానికొక పుస్తకం అందించాం.

ఆ ప్రత్యేకసంచికలో అన్నమయ్య గురించి ఎంతో విలువైన సమాచారం ఉంది. వేటూరి ప్రభాకరశాస్త్రి కుమారుడు ప్రొఫెసర్ వేటూరి ఆనందమూర్తి, ప్రముఖ నాట్యాచార్యుడు వి ఏ కె రంగారావు, డా.పప్పు వేణుగోపాలరావు, పూర్వ టిటిడి ఆస్థానగాయకుడు గరిమెళ్ళ బాలకృష్ణప్రసాద్, డా.మేడసాని మోహన్, డా.వైజార్సు బాలసుబ్రహ్మణ్యం, డా. శేషులతా విశ్వనాథ్ వ్యాసం, ఆచార్య రవ్వా శ్రీహరి, గంధం బసవశంకరావు వంటి మహామహుల రచనలు ఇందులో ఉన్నాయి.

ఒక వారంలో, ఆ సావనీర్ సాఫ్ట్ కాపీని అంతర్జాలంలో పెట్టాలని యోచన. తిరిగి ఈ వెభ్ సైట్ ను సందర్శించమని ప్రార్థన!

– తాటిపాముల మృత్యుంజయుడు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked