సారస్వతం

అన్నమయ్య శృంగార నీరాజనం

-టేకుమళ్ళ వెంకటప్పయ్య

యిందుకంటె నున్నదదే యెంచఁగ మూలధనము

ఈ కీర్తనలో అన్నమయ్య ప్రతిపాదంలో “మూలధనం” అనే మాటను వాడారు. మనం ఈ నాటి అర్ధంలో చూస్తే మూలధనం అంటే ఒక వ్యాపార సంస్థ యొక్క కార్యక్రమము కొనసాగుటకు అవసరమైన పెట్టుబడి ధనము. దీనిని కంపెనీ వాటాలవలన కాని, ఋణపత్రములవలనకాని, అప్పువలనకాని, గత సంవత్సరములలో కలిగిన లాభాంశముల వలన కాని సేకరింపవచ్చును. కానీ, కొన్ని శతాబ్దుల క్రితం ధనవంతులు తమ వద్ద మిగిలి ఉన్నధనాన్ని భూమిలో ఒకచోట మూటగట్టి దాచిపెట్టుకుని అవసరమైనపుడు తీసి వినియోగించేవారు. ఇంకా బాగా ధనవంతులైతే లంకెల బిందెల్లో దాచుకునేవారు. ఈ కీర్తనలో అన్నమయ్య లౌకిక మూలధనం కాక శృంగారపరమైన మూలధనం ఏమిటో వివరిస్తున్నాడు. అన్నమయ్య అనేక కీర్తనల్లో ఈ మూలధనం అనే ప్రస్తావన ఉంది. “మేలులో సాకారము మించులోకము భాగ్యము తాలిమితో నీకు మూలధనమాయను” – “సిగ్గులే మూలధనమా చేరి పైకొనఁగరాదా అగ్గమై శ్రీ వేంకటేశుఁడలమఁగాన” అంటూ ప్రస్తావించడం చూడవచ్చు.

కీర్తన:
పల్లవి: యిందుకంటె నున్నదదే యెంచఁగ మూలధనము
కందువ తలపోఁతలే కడు మూలధనము
చ.1 వనితకుఁ బతిమీఁది వలుపే మూలధనము
మునుకొన్న తమకమే మూలధనము
కనుఁగొనే నెమ్మోము కళలే మూలధనము
వినయపుఁ జేఁతలే వెస మూలధనము ॥యిందుకంటె॥
చ.2 నేసవెట్టి పెండ్లాడిన సిగ్గులే మూలధనము
మోసలైన పులకలే మూలధనము
ఆస పడి చూచే చూపే అన్నిటా మూలధనము
రాసి కెక్క చిఱునవ్వే రతి మూలధనము ॥యిందుకంటె॥
చ.3 కప్పుకొన్న వేడుకల కౌఁగిలే మూలధనము
ముప్పిరి మోవి తేనెలే మూలధనము
యిప్పుడే శ్రీ వేంకటేశుఁ డింతలోనే చెలిఁగూడె
చెప్పరాని భోగములే జిగి మూలధనము ॥యిందుకంటె॥
(రాగం: రామక్రియ; రేకు సం:496-1, కీర్తన; 12-511)
విశ్లేషణ:
పల్లవి: యిందుకంటె నున్నదదే యెంచఁగ మూలధనము
కందువ తలపోఁతలే కడు మూలధనము
ఓ చెలీ, నెచ్చెలీ.. మనం యోచించి చూస్తే.. ఇంతకంటే ఎక్కువైన మూలధనం ఒకటున్నది. వలచి వలపించుకొన్నవారికి, తమ ఏకాంతంలో ప్రియుల గురించి అల్లుకొన్న శృంగారపరమైన ఆలోచనలే అసలైన అంతులేని మూలధనము.
చ.1. వనితకుఁ బతిమీఁది వలుపే మూలధనము
మునుకొన్న తమకమే మూలధనము
కనుఁగొనే నెమ్మోము కళలే మూలధనము
వినయపుఁ జేఁతలే వెస మూలధనము
ఏ స్త్రీ కైనా తన భర్తమీద ఉన్న ప్రేమానురాగాలే అన్నిటికన్న ఎక్కువైన మూలధనము. అన్నిటికీ పారవశ్యమైన ప్రేమే మూలధనము. దానికంటే పరిపూర్ణ చంద్ర కళల వంటి ఇంతి మోము కళలే గొప్ప మూలధనము. వినమ్రురాలై ఆమె చేసే పనులే అసలైన మూలధనము.
చ.2. నేసవెట్టి పెండ్లాడిన సిగ్గులే మూలధనము
మోసలైన పులకలే మూలధనము
ఆస పడి చూచే చూపే అన్నిటా మూలధనము
రాసి కెక్క చిఱునవ్వే రతి మూలధనము
అక్షింతలు వేయించుకుని పెండ్లాడిన నాటి దినపు సిగ్గులు, మొలకెత్తిన ఆ పులకరింతలు. ఆశతో ప్రియునికై ఎదురుచూసే చూపులే మూలధనం సుమా! మనోహరమైన చిరునవ్వులు చిందించే ఆ ప్రియుని చూపులే అసలైన మూలధనం అంటున్నాడు అన్నమయ్య.

చ.3. కప్పుకొన్న వేడుకల కౌఁగిలే మూలధనము
ముప్పిరి మోవి తేనెలే మూలధనము
యిప్పుడే శ్రీ వేంకటేశుఁ డింతలోనే చెలిఁగూడె
చెప్పరాని భోగములే జిగి మూలధనము
ఇంకా కప్పుకొన్న వేడుకైన కౌగిళ్ళే మూలధనం అంటున్నాడు. ప్రేయశీప్రియుల అధరామృతమే నిజమైన మూలధనము. ఇంతలోనే వెంకటేశ్వరుడు అమ్మ పద్మావతిని గూడినాడు. చెప్పుటకు వీలుకాని వారిభోగములే అత్యంత విశిష్టమైన మూలధనము.
ముఖ్య అర్ధములు ఇందుకంటే = ఇంతకంటే; యెంచగ = భావింపదగ్గ; కందువ = జాడ, ఏకాంతస్థలము, సంకేతము, చమత్కారము – ఇక్కడ ఏకాంతములోనున్నప్పుడు అనే అర్ధం తీసుకోదగును; తలపోతలు = ఆలోచనలు; మునుకొన్న = ప్రధమముగా, అన్నిటికంటే ముందుగా; తమకము = ప్రేమ, మోహము; నెమ్మోము కళలు = స్త్రీ యొక్క మోము అందాన్ని చంద్రుని కళలతో ఉపమానించి చెప్పడం; సేసవెట్టి = అక్షింతలు వేసి; పులకలు = గగుర్పాటు, పులకరింతకు గురియగుట; రాశికెక్కు = అధికతరమగు, పెద్దదైన, కుప్పలుగా, రతిమూలధనము = సమాగమమే గొప్ప మూలధనము అన్న అర్ధంలో; కప్పుకొన్న = కౌగిలితో కప్పబడిన; ముప్పిరి = అల్లుకొను; మోవి తేనె = అధరామృతము; జిగి = ప్రకాశించు, దేదీప్యమైన.

-0o0-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked