సారస్వతం

అన్నమయ్య శృంగార నీరాజనం

-టేకుమళ్ళ వెంకటప్పయ్య

ఇద్దరూ నిద్దరే మనమేమి చెప్పేదే

ఈ కీర్తనలో అన్నమయ్య తన్ను తాను చెలికత్తెగా భావించుకొని తోడి చెలికత్తెలతో అంటున్నాడు. ఏమి చెప్పమందువే చెలీ! నాయికా నాయికలు ఇద్దరూ ఇద్దరే ఒకరి మరొకరు తీసిపోరు ఏవిషయంలోను. అహోబల నారసింహుడైనా, ఆ యమ్మ శ్రీమహాలక్ష్మి అయినా అంటూ అన్నమయ్య శృంగార వ్యవహారాలను ఏకరువు పెడుతున్నాడు. ఆ విశేషాలు ఈ కీర్తనలో చూద్దాం.
కీర్తన:
పల్లవి: ఇద్దరూ నిద్దరే మనమేమి చెప్పేదే
బద్దుగా దాపెను మెచ్చెఁ బ్రహ్లాదవరదుఁడు ॥ ఇద్ద ॥
చ.1. చక్కని మొకముచూసి సారెసారె మాటలాడి
చిక్కించెనాపె తొలుత చేరియాతని
మిక్కిలి మేలుదియై మేను చెమరించఁగాను
పక్కన నాపెను నవ్వేఁ బ్రహ్లాదవరదుఁడు ॥ఇద్ద॥
చ.2. పీఁటమీఁదఁ గూచుండి ప్రియములు చెప్పి చెప్పి
దూఁటి చన్నులనొ త్తెను తొలుతాతని
పాటించి యాతని మోవిపండు చూచి నోరూరఁగా
బాటగానాపెను నవ్వెఁ బ్రహ్లాదవరదుఁడు ॥ఇద్ద॥
చ.3. కాఁగిలించుక యిందిర కన్నులవలపు చల్లి
ఆఁగెను శ్రీవేంకటేశు నౌభఁళానను
చేఁగదేరఁ జొక్కియాపెఁ జూచి ఆతఁడె తానై
పాఁగినరతుల నవ్వెఁ బ్రహ్లాదవరదుఁడు ॥ఇద్ద॥
(రాగం: శంకరాభరణం; రేకు: 224-2,కీర్తన; 8-140)

విశ్లేషణ:
పల్లవి: ఇద్దరూ నిద్దరే మనమేమి చెప్పేదే
బద్దుగా దాపెను మెచ్చెఁ బ్రహ్లాదవరదుఁడు
ఆహా! ఓహో! చెలులారా! చూస్తున్నారా! ప్రహ్లాదవరదుడైన శ్రీనివాసుడు, మరియూ అమ్మ శ్రీమహాలక్ష్మి యిద్దరూ యిద్దరే సుమా! మనం చెప్పగలిగేది చెయ్యగలిగేది యింకనేమున్నది ఆ తిరుమలనాధుడు ఆమెకు వ శ్యుడు, ఆమెకు బద్ధుడు కనుక దగ్గరై యున్నాడు చెలులారా! అంటూ హాస్యం ఆడుతున్నది ఓ చెలి.

చ.1. చక్కని మొకముచూసి సారెసారె మాటలాడి
చిక్కించెనాపె తొలుత చేరియాతని
మిక్కిలి మేలుదియై మేను చెమరించఁగాను
పక్కన నాపెను నవ్వేఁ బ్రహ్లాదవరదుఁడు
ఆ శ్రీదేవి చంద్రబింబము వంటి చక్కనైన మోమును చూపి మాటి మాటికీ ఆ శ్రీవారితో ముచ్చటిస్తున్నది. ఆ శ్రీవారు కూడా ఆదినుండీ ఆమెకు వశ్యుడయేట్టు చేసిన ఘనత మన అమ్మదే! ఆమె స్వామిని ఎక్కువగా ప్రేమించి ఆమె శరీరము చెమటతో చెమరించగా ఆయన ప్రక్కన చేరిన ఆమెను చూసిన ప్రహ్లాద వరదుడైన శ్రీవేంకటేశ్వరుడు నవ్వుతూ దరిచేరాడు.

చ.2. పీఁటమీఁదఁ గూచుండి ప్రియములు చెప్పి చెప్పి
దూఁటి చన్నులనొ త్తెను తొలుతాతని
పాటించి యాతని మోవిపండు చూచి నోరూరఁగా
బాటగా నాపెను నవ్వెఁ బ్రహ్లాదవరదుఁడు
వారిద్దరూ కన్నుల పండువగా పీటలమీద కూర్చొని (ఉన్నతాసనము అన్న భావన), ప్రియ భాషణములాడుకొంటూ, ఆమె కుచాగ్రభాగముతో శ్రీవారికి తగిలేటట్లు చేసి, శ్రీవారికి తన దొండపండ్ల వంటి తన అధరములతో యున్న మోమును చూపి ఆయనకు నోరూరునట్లు చేయగా ఆ ప్రహ్లాదవరదుడు మధురముగా ఒక విధమైన పారవశ్యంతో ఆమెను చూసి నవ్వెను.

చ.3. కాఁగిలించుక యిందిర కన్నులవలపు చల్లి
ఆఁగెను శ్రీవేంకటేశు నౌభఁళానను
చేఁగదేరఁ జొక్కియాపెఁ జూచి ఆతఁడె తానై
పాఁగినరతుల నవ్వెఁ బ్రహ్లాదవరదుఁడు
ఆ శ్రీదేవిని చూసిన శ్రీనివాసుడు ఆమె కన్నులపై వలపు బాణాలు విసరి కౌగలించుకున్నాడు. అలాగే శ్రీవేంకటేశ్వరుడు అహోబల పుణ్యక్షేత్రము నందు శ్రీనారసింహుడుగా ఆమెకు చిక్కి ఆమెను చూస్తూ పరవశమున, ఆమెను గూడి మధుర రతుల దేలుచూ నవ్వుతున్నాడు.

ముఖ్య అర్ధములు బద్దుగా = బద్ధుడుగా, వశుడుగా; దాపెను = దగ్గరగా, దాను ఆపెను అనే అర్ధం కూడా గమనించ వచ్చును; మొకము = మొహము; సారెసారె = మాటి మాటికీ; చిక్కించుట = చిక్కుట, వశ్యుడయ్యాడని చెప్పడం; మేలుది = మేలుగూర్చునది; చెమరించగా = స్వేదంతో తడవగా; ఆపెను = ఆమెను; దూటి = నెట్టు, వత్తు; మోవిపండు = ముఖ కమలమనే ఆమె మోము, దొండపండ్లవంటి అధరములు గలిగిన ఆమె మోము; ఔభళాన = అహోబలమునందు; చేగ = చేవ; చొక్కు = పారవశ్యము, మోహము; పాగి = వసతి, దారి, మార్గము;

-0o0-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked