శృంగార దూతికలు
-టేకుమళ్ళ వెంకటప్పయ్య
దూతికలు అనగా రాయబారులు. నాయకుని తరఫున నాయికతో, నాయిక తరఫున నాయకునితో శృంగార దూతకార్యం నెరపడానికి నియోగించే వారు. అన్నమయ్య వీరిని రాయబారపు పడతి, చెలికత్తె అంటాడు. అలంకార శాస్త్రాలలో దాసి, సకియ, దాది, నటి, పొరుగమ్మ, యోగిని, చాకలి, చిత్రకర్మ చేయు స్త్రీలు దూతికలుగా వ్యవహరిస్తారని ఉన్నది. ఇంకా తాంబూలమమ్మే స్త్రీలు, వంటకత్తెలు, గానము మరియూ నాట్యము నేర్పే స్త్రీలు దూతికలుగా వ్యవహరించిన సందర్భాలు ఉన్నాయి. శ్రీకృష్ణుడు రుక్మిణీదేవి కి పారిజాత పుష్పం ఇచ్చిన సందర్భంలో అలాంటి దూతికయే సత్యభామకు విషయం చేరవేసింది. ఆ దూతిక చెప్పిన మాటలవలన కోపించిన సత్యభామను శ్రీకృష్ణుడు ఎంతో బ్రతిమాలవలసి వచ్చింది. చివరకు స్వర్గలోకంపై యుద్ధం ప్రకటించవలసి వచ్చింది. శ్రీ వేంకటేశ్వరస్వామి పద్మావతీ అమ్మవారితో సంధాన సందర్భంలో స్వామి ఎరుక వేషాన్ని ధరించడం తెలిసిందే గదా! ఆమెకూడా ఒక దూతికయే. శృంగార కార్యాలు నెరవేరాలంటే ఈ దూతికలు ప్రముఖ పాత్ర వహించే వారు.
అన్నమయ్య ఒకానొక కీర్తనలో నాయిక తరఫున దౌత్యకార్యానికి బయలుదేరిన దూతిక కూడా మన్మధావస్తకు గురైన విషయాన్ని గమ్మత్తుగా వివరిస్తాడు. ఆమె హావభావలను పరికించిన తోడి చెలికత్తెలు ఆమెను మందలిస్తారు. చూడండి.
ఈ కీర్తనలో నాయిక తరఫున వెళ్తున్న దూతిక యొక్క మన్మధావస్త, తోటి దూతికలు ఆమెను వారించిన విధానం పరిశీలిద్దాం.
కీర్తన:
పల్లవి: కంటిలేవే నీసుద్దులు లిక్కడ నమ్మతో జెప్పేను
వెంట వచ్చినదానను వెస నన్నెరగవా
చ.1. యెడమాట లాడవచ్చి యేల సిగ్గులువడేవే
నడుమ నూరక యేల నవ్వు నవ్వేవే
చిడుముడి నటనతో శిరసు వంచనేటికే
తొడరి పొందులు సేసే దూతికవు నీవు || కంటిలేవే ||
చ. 2. చన్నుల మీద పయ్యెద జారనేల తోసేవే
సన్నలనే మోవితేనె చల్లనేటికే
కన్నులారుచుకొంటాను కతలేమి చెప్పేవే
పన్నిన రాయబారపు పడతివి నీవు || కంటిలేవే ||
చ.3. నిలుచుండి నీకు నీకే నివ్వెరగు లయ్యేవే
చెలరేగి మేనేల చెమరించేవే
అలుమేలుమంగ నేలే నప్పుడే శ్రీవేంకటేశు
డెలమి జెలకత్తెవు యేలంటేవే నీవు || కంటిలేవే ||
(రాగము: పాడి, 28-405 రాగిరేకు 1869)
విశ్లేషణ: ఈ కీర్తనలో శ్రీవేంకటేశ్వరుడు నాయకుడు, నాయిక అలమేలుమంగమ్మ నాయకుని వద్దకు రాయబారానికి వెళ్ళిన దూతిక తనకు తానే మన్మధావస్థకు గురి అయినది. ఆవింతను చూసిన తోడి చెలికత్తెలు ఆమె చేష్టలు చూసి ఆమెను గట్టిగా మందలిస్తున్నారు.
పల్లవి: కంటిలేవే నీసుద్దులు లిక్కడ నమ్మతో జెప్పేను
వెంట వచ్చినదానను వెస నన్నెరగవా
అహాహా! చూశానులేవే నీ డంబాల మాటలు. నీ సూక్తులు. నీ బులిబుజ్జికపు చేతలు. చాలా బాగున్నవి. ఇవన్నీ మేము అమ్మకు నివేదిస్తాము. దూతికగా మా వెంట వచ్చినదానవు ఇదేమి తరహా చెప్పు? హడావుడిలో నీవెవరవో ఎందుకు వచ్చావో కూడా మరచిపోయావా! అంటూ మందలిస్తున్నారు.
చ.1. యెడమాట లాడవచ్చి యేల సిగ్గులువడేవే
నడుమ నూరక యేల నవ్వు నవ్వేవే
చిడుముడి నటనతో శిరసు వంచనేటికే
తొడరి పొందులు సేసే దూతికవు నీవు
ఎలప్రాయపు మాటలు మాట్లాడుతూ, దూతకార్యపు మాటలు చెప్పవచ్చినదానవు నీవు సిగ్గుపడడమెందుకు? మధ్య మధ్యలో ఆ ముసి ముసి నవ్వులేమిటి? చిలిపిచేష్టలు చేస్తూ నీ తల ఎందుకు వంచుకుంటున్నావు? అమ్మ మాటల ననుసరించి పొందు చేయడానికి వచ్చినదానవు నీవు. మరచిపోయావా ఏమిటి?
చ.2. చన్నుల మీద పయ్యెద జారనేల తోసేవే
సన్నలనే మోవితేనె చల్లనేటికే
కన్నులారుచుకొంటాను కతలేమి చెప్పేవే
పన్నిన రాయబారపు పడతివి నీవు.
నీ పాలిండ్లపై పమిటెను ఎందుకు అలా జారవిడిచి బహిరంగం చేస్తున్నావు. నీకు అర్ధమౌతోందా నువ్వు చేసే పనులు? చిన్న చిన్నగా మాట్లాడుతూ అధరామృతం ఒలికిస్తున్నావు మాటి మాటికీ. ఆ కన్నులు అరమోడ్పులవుతున్నాయి, మాకు ఎవేవో కధలు చెప్తున్నావు తన్మయత్వంతో. నీవు అమ్మ పంపిన రాయబారివన్న విషయం నీకు స్పృహలో ఉన్నదా లేదా? చెప్పు మొదట అని గద్దిస్తున్నారు తోడి దూతికలు.
చ.3. నిలుచుండి నీకు నీకే నివ్వెరగు లయ్యేవే
చెలరేగి మేనేల చెమరించేవే
అలుమేలుమంగ నేలే నప్పుడే శ్రీవేంకటేశు
డెలమి జెలకత్తెవు యేలంటేవే నీవు
నిలబడి నిలబడి నీకు నువ్వే లోలోపల ఏదో భయం నటిస్తున్నావు. నీ దేహం ఎందుకు స్వేదంతో నిండిపోతోంది. అలమేలు మంగమ్మను ఏలుకునే శ్రీవేంకటేశ్వరుని ప్రియమైన చెలికత్తెవు నీవు, ఆవిషయం పూర్తిగా మరచిపోయి ప్రవర్తిస్తున్నావు. ఈ విషయం అమ్మకు నివేదిస్తాము సుమా! అని మందలిస్తున్నారు చెలికత్తెలు.
ముఖ్యమైన అర్ధాలు: సుద్దులు = మంచిమాటలు, డంబములు; వెస = వేగము, హడావుడి, శీఘ్రము; ఎడమాట = యెలప్రాయపు మాటలు, యవ్వనంలో ఉన్న స్త్రీ మాట్లాడే మాటలు; చిడుముడి = చిలిపి శృంగార చేష్టలు; తొడరి = అనుసరించు; చన్నుల = పాలిండ్ల, రొమ్ముల; పయ్యెద = పైట; సన్నలు = అల్పము; నివ్వెరగు = భయము.
-0o0-