దేవీదేవరల శృంగార సంవాదము
-టేకుమళ్ళ వెంకటప్పయ్య
సంవాదము అంటే ప్రశ్నోత్తర రూపమగు సంభాషణము అని అర్ధం ఉన్నది. శృంగారంలో నాయిక అలక వహించి యున్న సమయంలో నాయకుడు శృంగారంగా ఏదో అడగడం దానికి నాయిక పైకి కోపం నటిస్తూనే లోపల ప్రేమ దాచుకుని చిరుకోపం నటిస్తూ సమాధానాలనిస్తూ ఉంటుంది. నాయికా నాయకుల సంభాషణలు మనకు పోట్లాటలాగా అనిపించినా అవి అన్నీ శృంగార సంభాషణలలోని భాగమే! నాయికను వశపరచుకోడానికి నాయకుడు అలాగే నాయకునికై నాయిక సత్యభామలా కోపం నటించడం ఇవన్నీ ఉత్తుత్తవే! అమ్మ అలమేలుమంగమ్మను శ్రీనివాసుడు ఏవిధంగా తన సంవాదంతో స్వాధీన పరచుకుంటాడో అన్నమయ్య ఈ కీర్తనలో తెలియజేస్తున్నాడు.
ఈ కీర్తనలో అన్నమయ్య నాయకుని చేత నాయికతో శ్రీనివాసునితో ఏమి చెప్తున్నాడో చూద్దాం.
కీర్తన:
పల్లవి: మగువ నేరుతువే మాఁటలు । నీవు
తగిలి తెలుసుకో తారుకాణలు
చ.1. చెనకేనే వో చెలియా – నీ
చెనకులే కావా చెక్కులవి
పెనఁగకు చనుఁగవ పిసికేనే యవి
గనములు చేతికిఁ గడు గట్టులురా॥మగు॥
చ.2. నవ్వేనే వో నలిలాక్ష – నీ
నవ్వులు నిజమైనవి నేఁడు
జవ్వాది మేనఁ జమరేనే
వువ్విళ్ళయ వలపూరిఁ గదరా॥మగు॥
చ.3. తలఁపించేనే తమకములు – ఆవి
తలఁచకతొల్లే తలకెక్కె
యెలమిని శ్రీవేంకటేశుఁడనే – నే –
నలమేల్మంగను ఆలనే కదరా॥మగు॥
(రాగము: తెలుఁగుఁగాంబోది, 28-203 రాగిరేకు 1835)
విశ్లేషణ: ఈ కీర్తనలో శ్రీవేంకటేశ్వరుడు నాయకుడు, నాయిక అలమేలుమంగమ్మ
నాయకుడు శ్రీనివాసుడు అమ్మ అలమేలుమంగమ్మతో సరదా సంవాదం చేస్తున్నాడు తిలకించండి.
పల్లవి: మగువ నేరుతువే మాఁటలు । నీవు
తగిలి తెలుసుకో తారుకాణలు
ఓ మగువా! ఎన్ని మాటలు నేర్చావే! నీవు ఋజువులు తెలుసుకో మొదట నా మీద నిందలు వేసే ముందుగా అంటున్నాడు శ్రీవేంకటేశ్వరుడు.
చ.1. చెనకేనే వో చెలియా – నీ
చెనకులే కావా చెక్కులవి
పెనఁగకు చనుఁగవ పిసికేనే యవి
గనములు చేతికిఁ గడు గట్టులురా
ఓ చెలీ! నిన్ను కొనగోట అలా తాకినంత మాత్రాన ఆ తాకిడికి నీ చెక్కిలి గోటి నొక్కులకు ఎర్రబారదా? ఓ చెలీ నాతో మారు పలుకవద్దు. నీ వక్షములను పిసికితే అవి నా చేతికి ఘనమైన కొండలవలె కనిపిస్తాయి.
చ.2. నవ్వేనే వో నలిలాక్షి – నీ
నవ్వులు నిజమైనవి నేఁడు
జవ్వాది మేనఁ జమరేనే
వువ్విళ్ళయ వలపూరిఁ గదరా
నవ్వకే ఓ చేపకన్నులుగల మీనాక్షీ! నీ అసలైన నవ్వులు ఈ నాడు నిజమైనవి. జవ్వాది మొదలైన సుగంధ ద్రవ్యములు శరీరంపై పూయబడి నన్ను చెమరిస్తున్నాయి. వలపులు మరీ మరీ ఊరడంచేత తొందరగా ఉంది నాకు అంటున్నాడు నాయకుడు.
చ.3. తలఁపించేనే తమకములు – ఆవి
తలఁచకతొల్లే తలకెక్కె
యెలమిని శ్రీవేంకటేశుఁడనే – నే –
నలమేల్మంగను ఆలనే కదరా
ఈనాడు నిన్ను చూస్తుంటే ఎంతో మోహపరవశుడిని అవుతున్నాను. ఈ విరహాన్ని తట్టుకోలేకపోతున్నాను. అవి తలుచుకుంటూ ఉంటే మొదలే తలకెక్కుతోంది మోహం. ప్రేమతో ఉన్న శ్రీవేంకటేశ్వరుడిని. నీ నాధుడను. నేను అలమేల్మంగను ఏలుకునే వాడనే కదా! అంటున్నాడు శ్రీనివాసుడు.
ముఖ్యమైన అర్ధాలు: తారుకాణo = ప్రమాణము, దృష్టాంతము, ఋజువు; చెనకు = తాకు, కొనగోట నొక్కు; చెక్కు = చెక్కిలి; పెనగు = చుట్టుకొను, మారుపలుకు; గనము = ఘనము, గొప్పది; కడు = మిక్కిలి; గట్టు = తీరము, కొండ (వైకృతము); ఉవ్విళ్ళు = తొందర; తమకం = మోహం, విరహం; తొల్లి = ముందు; ఎలమి = ఆనందం, వికాసం, ప్రకాశము, ప్రేమ; ఆలను = ఆలన పాలన చూసేవాడు, ఏలుకొనేవాడు.
-0o0-