శారదాప్రసాద్ (టీవీయస్.శాస్త్రి)
వేదాల యొక్క చివరి భాగాలను అంటే అంతములయిన (వేద+అంతములు)వేదాంతాలకు ఉపనిషత్తులని పేరు. ఉపనిషత్తులు మనమంతా దివ్యాత్మ స్వరూపులమని చెబుతున్నాయి .మరణించే ఈ శరీరంలో అమృతత్త్వమైనది ఒకటి ఉంది. అదే ఆత్మతత్త్వం. మానవుడు ఇంద్రియాలు తమంతట తామే పని చేస్తున్నాయని అనుకుంటాడు . కానీ, అంతర్గతంగా లోపల ఉన్న శక్తితత్త్వమే దివ్య చైతన్యమనీ మానవునికి తెలియదు. లోపలున్న ఆత్మ మనకంటికి కంటిగా, చెవులకు చెవిగా, మనస్సుకు మనస్సుగా ఉన్నదని కేనోపనిషత్ ఉద్ఘోషిస్తుంది. శరీరంలోని ఒక అవయవం ఇంకొక అవయవాన్ని బాధించడం అసహజమైన చర్య. ఆ విధంగానే ఈ ప్రపంచంలో ప్రతి ప్రాణి భగవంతుని అవయవాలు.ఈ ఆత్మ చెవికి చెవి, మనసుకు మనసు, వాక్కునకు వాక్కు మరియు ప్రాణానికి ప్రాణము, కన్నుకు కన్ను అని ఆ పరబ్రహ్మ తత్వాన్ని అపూర్వ౦గా తెలిపినది కేనోపనిషత్.
అడవులలో గురుశిష్యుల మధ్యన జరిగిన చర్చలనే ‘ఉపనిషత్తులు’ అంటారు. ఈ ఉపనిషత్తులు వేదంలోని భాగంలో ఒకటిగా చెబుతారు. వేధంలోని ఈ ఉపనిషత్తులు తత్త్వ జ్ఞానం గురించి, దానికి సంబంధించి మహర్షులు అనుభవాల గురించి క్షుణ్ణంగా మనకు విశదపరుస్తాయి. ఉపనిషత్తులు మొత్తం 108 ఉన్నప్పటికీ వాటిలో పది మాత్రమే ప్రధానమైనవి.
అవి– 1.ఈశోపనిషత్తు
2. కఠోపనిషత్తు
3. ముండకోపనిషత్తు
4. కేనోపనిషత్తు.
5 ప్రశ్నోపనిశషత్తు
6.మాండూక్యోపనిషత్తు
7.తైత్తరీయోపనిషత్తు
8. ఐతరీయోపనిషత్తు
9. బృహదారణ్యకోపనిషత్తు.
10. చాందోగ్యోపనిషత్తు.
“ఉపనిషత్” అను పదానికి అర్థం సమీపములో ఉండడం. సత్యాలను గురువు దగ్గర తెలుసుకోవడం లేక ఆత్మ(పరమాత్మ)కు సమీపములో ఉండడం అని అర్థం. ఉపనిషత్తులు అంటే బ్రహ్మవిద్య, జీవాత్మ, పరమాత్మ,
జ్ఞానము, మోక్షము, పరబ్రహ్మ స్వరూపమును గురించి వివరించేవి. నాలుగు వేదాలకు కలిపి 1180 ఉపనిషత్తులు ఉన్నాయి.
వేదముల శాఖలు అనేకములు ఉన్నందున ఉపనిషత్తులు కూడ అనేకములు ఉన్నాయి. గీతలో కృష్ణుడు ఉపనిషత్తుల, వేదాంతాల సారాన్ని చెప్పాడు. అవి ప్రతి ఒక్కరికీ మార్గనిర్దేశనం చేసేలా ఉంటాయే తప్ప మూఢ విశ్వాసాల వైపు మళ్లించేలా ఉండవు.ఉపనిషత్తులు అనేక మంది రచయితలకు ఆపాదించబడ్డాయి, వారి పేరు మీద చేయబడ్డాయి.అవి, యాజ్ఞవల్క, ఉద్దాలక మరియు అరుణి అనేవి ప్రారంభ ఉపనిషత్తులు ప్రముఖంగా కనిపిస్తాయి. ఇతర ముఖ్యమైన రచయితలు శ్వేతకేతు, శాండిల్య, ఐతరేయ, పిప్పలాద మరియు సనత్కుమార పేరు మీద ఉన్నాయి. ఇంకనూ చర్చించు, తర్కించు, విచారించు, వివేచించు వారు అయిన గార్గి, మరియు యాజ్ఞవల్క భార్య మైత్రేయి ముఖ్యమైన మహిళలు పేరు మీద కూడా ఉన్నాయి.
వేదముల వలే ఉపనిషత్తులు కూడా శ్రుతులుగా అందించబడినవి.ఉపనిషత్తులలో జీవాత్మ, బ్రహ్మముల భావనను విచారించడం జరిగింది. ఇవి ప్రధానంగా రెండు రకాల సిద్ధాంతాలకు దారితీశాయి. అవి అద్వైతం అనగా జీవాత్మ మరియు పరబ్రహ్మములు వేర్వేరుగా లేవని అవి రెండూ ఒక్కటేనను భావన. రెండవది ద్వైతం. అనగా జీవాత్మ వేరు బ్రహ్మము వేరు. బ్రహ్మము సర్వ స్వతంత్రుడు, కర్త. జీవాత్మ నిమిత్త మాతృడు.తత్వాన్ని దాటి శాశ్వత స్థితిని పొందడానికి ఉపయోగపడే మోక్షవిద్య ఉపనిషత్తులలో ఉన్నదని కులపతి ఎక్కిరాల కృష్ణమాచార్య గారు అన్నారు .ఒకప్పుడు మహా ఋషులు , ఋషి పుత్రులు ఒకచోట చేరి … ఆత్మ అంటే ఏమిటి?అనాత్మ అంటే ఏమిటి? జీవుడు ఎవరు ? జీవుల, ఈశ్వరుడి సంబంధం ఎటువంటిది ? చివరికి ఎక్కకడికి పోతాం ? అన్న ప్రశ్నల గురించి చర్చలు జరుపగా వచ్చిన జవాబులే ఉపనిషత్తులు.
వేదాలు అపౌరుషేయాలు. ఎన్నటికీ శాశ్వతంగా విరాజిల్లే సత్యాల సమాహారమే వేదాలు. అలా ఋషులు ఆవిష్కరించిన ఆ సత్యాలు నాల్గు భాగాలుగా క్రోడీకరింపబడ్డాయి. అవే ఋగ్, యజుర్, సామ, అధర్వణ వేదాలు. ప్రతి వేదమూ మూడు ప్రధాన భాగాలుగా వర్గీకరింపబడింది. అవి, సంహితలు, బ్రాహ్మణం మరియు ఆరణ్యకం (ఉపనిషత్తులు – చరమ సత్యాన్ని గురించిన వివరణ). చరమ సత్యాన్ని గురించిన విచారణలో మనిషి మనసు అందుకోగలిగిన ఎల్లలను ఉపనిషత్తులు ఆవిష్కరింప చేస్తాయి.”శ్రుతి” అనగా ‘వినిపించినది’ అని అర్ధం .అంటే ఈ విధమైన శాస్త్రాలు సామాన్యమైన వ్యక్తులచే రచింపబడలేదు.”మంత్రద్రష్ట” లైన ఋషులకు అవి దైవం చేత “వినిపించినవి”. చతుర్వేదాలు శ్రుతులు. ఇవి మనుష్యులచే రచింపబడలేదు గనుక వీటిని “అపౌరుషేయములు” లేదా “నిత్యములు” అని కూడా అంటారు. ఇవి హిందూ ధర్మమునకు మౌలికమైన ప్రమాణాలు.
శ్రుతులను కన్నులతో చూచి ఆ అర్థములను చక్కగా అవలోకనం చేసుకోవటం సమస్త జీవులకు కష్టం కనుక వాటిని సరళంగా, వివరణగా, విచారణగా విశ్లేషించి స్మృతులను స్మరించారు మహర్షులు.”స్మృతి” అనగా “స్మరించినది” అనగా “గుర్తు ఉంచుకొన్నది” అని అర్ధం . ఇవి శ్రుతుల తరువాతి ప్రమాణ గ్రంధాలు. విధి, నిషేధాల(మానవులు, సంఘము ఏవిధంగా ప్రవర్తించాలి, ఏవిధంగా ప్రవర్తించ కూడదు అనే విషయాలు) గురించి స్మృతులు వివరిస్తాయి.కనుక శ్రుతులు, స్మృతులు, ఉపనిషత్తులు,ధర్మశాస్త్రములు, ఇతిహాసములు, పురాణములు అన్నీ పరమ ప్రమాణాలే.శ్రుతుల్లో చెప్పిన విషయాల్ని గుర్తుంచుకుని అందరికీ అర్థమయ్యేలా చెప్పిన పుస్తకాలు స్మృతులు.వేదంలోనూ, ఉపనిషత్తుల్లోనూ చెప్పిన సిద్ధాంతాన్ని స్మృతులలో కథల రూపంలో చెప్పినా మూల విషయంలో ఎటువంటి మార్పు ఉండదు.సామాజికాంశాన్ని గురించి చెప్పేటప్పుడు మాత్రం కాల,మాన పరిస్థితుల్ని బట్టి కొన్ని మార్పులు ఉండొచ్చు .ఈ మార్పును వేదమే అంగీకరిస్తుంది. తైత్తిరీయ ఉపనిషత్తులో (1-11) ‘‘అథ యది తే ధర్మ విచికిత్సా వా’’ అంటూ మొదలయ్యే వాక్యం అర్ధం — ‘‘ఒకవేళ నీవు వెళ్ళిన ప్రాంతంలో ధర్మాన్ని గురించి , ప్రవర్తనను గురించి కానీ ఏమైనా సందేహాలు వస్తే ,అప్పుడు ఆ దేశంలో స్వార్థంలేని వారు, సత్యవంతులు,సమబుద్ధి ఉన్న మహాత్ములు ఎలా ప్రవర్తిస్తారో అలాంటి దానినే యధాతధంగా ధర్మంగా స్వీకరించు ’’అని .
భగవంతుడిని గురించి ,జీవుని గురించి ఉపనిషత్తులు, భగవద్గీత లాంటి పుస్తకాలు చెప్పే విషయంలో ఎటువంటి మార్పు ఉండదు.కానీ స్మృతుల్లో (ధర్మశాస్త్రాల్లో) మార్పు కనిపిస్తుంది.నేడు విమర్శింపబడే వర్ణవ్యవస్థ గురించి ఒక ఉదాహరణ- ‘‘క్షత్రియుడు గాని, వైశ్యుడు గాని, శ్రద్ధావంతులు, శుచిగలవారు అయినప్పుడు వాళ్ళ గృహాలలో జరిగే హవ్య, కవ్యాది కర్మలలో బ్రాహ్మణులు భోజనం చేయాలి’’ (పరాశరస్మృతి 11-13). అంటే యజ్ఞం చేయించినా,శ్రాద్ధ కర్మలు చేయించినా వారి ఇండ్లలో భోంచేయాలి అని అర్థం. సద్గురు శ్రీ శివానందమూర్తి గారి ప్రేరణతో ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడు గారు ‘కౌండిన్యస్మృతి’ (ఎమెస్కో వారి ప్రచురణ) అనే పుస్తకాన్ని రాశారు. ఇది పైన చెప్పిన విషయాల్ని ఇంకా వివరంగా తెలుపుతుంది.
శుభం భూయాత్!