-శారదాప్రసాద్
సాహితీ స్రష్టల్లో నోరి నరసింహశాస్త్రి గారు సుప్రసిద్ధులు. కవిగా, కథకునిగా, నవలాకర్తగా, విమర్శకునిగా, పరిశోధకునిగా బహుముఖీనమైన పాత్ర పోషించి తనదైన ప్రత్యేక బాణిలో తమ వాణిని వినిపించారు ఆయన. నోరి నరసింహశాస్త్రి గారు 6-2-1900 న మహాలక్ష్మమ్మ, హనుమచ్ఛాస్త్రి. దంపతులకు గుంటూరులో జన్మించారు. నోరివారి వంశము శిష్టాచార సంపదలో పేరుమోసినది.నరసింహశాస్త్రి గారి తండ్రి హనుమచ్ఛాస్త్రి గారు గుంటూరు “మిషను కళాశాల”లో సంస్కృతాంధ్రాధ్యాపకులు. వారి తండ్రి గోపాల కృష్ణయ్యగారు మంత్రశాస్త్ర కోవిదులు. అటువంటి గొప్ప వంశంలో నరసింహ శాస్త్రి గారు పుట్టారు. వీరి పినతండ్రి గురులింగశాస్త్రి గారు చెన్నపురి తొండ మండలము హైస్కూలులో పండిత పదవిలో ఉండేవారు. వ్యాకరణము, వేదాంతము, జ్యోతిషము, మున్నగు శాస్త్రములలో వీరిది గట్టిచేయి. తెలుగు వచనములో అనేక పురాణాలు వ్రాసారు. శ్రీ నరసింహశాస్త్రిగారు ఆంధ్రకవులలో సంప్రదాయ సిద్ధమైన రచన సాగించారు. ఆయన దేవిభాగవత రచన ప్రసిద్ధమైనది. ఆయన వ్రాసిన నారాయణభట్టు, రుద్రమదేవి, కవిసార్వభౌముడు(శ్రీనాధుడు) మున్నగు నవలలు ప్రసిద్ధి చెందాయి. బాపూ గారు తీసిన ఎన్టీఆర్ ఆఖరి సినిమా అయిన ‘శ్రీనాధ కవి సార్వభౌముడు’కి వీరి నవలే ఆధారం. ఈయన మంచి విమర్శకుడు. ఈయన సాహితీ మాగాణంలో అన్ని ప్రక్రియలను చేపట్టారు! 1918 వరకు నరసింహశాస్త్రి గారు గుంటూరులో ‘ఎఫ్ ఎ’ చదివారు. ఆ తర్వాత పచ్చయప్ప కళాశాలలో బి. ఏ. చదివి పట్టభద్రులయిన తరువాత, గుంటూరు కళాశాలలో రెండేండ్లు ఉద్యోగము చేసారు.1925 లో బి. యల్. పరీక్షలో నెగ్గి గుంటూరులో న్యాయవాది వృత్తిని ప్రారంభించారు. వీరి వివాహం నేతివారి ఆడపడుచు హనుమాయమ్మ గారితో జరిగింది. తన 27 వ ఏట నుండి రేపల్లెకు మకాము మార్చి చివరదాకా అక్కడే న్యాయవాదిగా కొనసాగారు. సంస్కృతాంధ్రాలను గురుముఖాన అభ్యసించారు . పదవయేటనే కవి కావాలనే కోరిక నరసింహశాస్త్రి గారిలో ఉదయించింది .ఆయన కోరిక సఫలీకృతం కావటానికి చేయూత ఇచ్చిన వారు శ్రీ శివశంకర శాస్త్రిగారు. కొడవటిగంటి వేంకట సుబ్బయ్య, త్రిపురారిభట్ల వీరరాఘవస్వామి, పెద్దిభట్ల పూర్ణశర్మ, కోపల్లె శివకామేశ్వరరావు మున్నగు ప్రథమ ‘సాహితీసమితి ‘ కవుల స్నేహముతో నరసింహశాస్త్రి గారికి నవ్యసాహిత్యములో ఒక వెలుగు కనిపించింది. 18 ఏళ్ళు నిండేవరకు వీరు వీరగ్రాంథిక వాదులు. తరువాత,వ్యావహారిక భాషావాదులు.పద్యరచన కూడ వ్యావహారికములోనే సాగించాలని కొన్నాళ్ళు వీరు పట్టుదలతో ఉన్నారు. దాన్ని కొద్దిగా ఆయనే సడలించుకొని పద్యమునకు గ్రాంథికము, గద్యమునకు వ్యావహారి భాషను ఎన్నుకున్నారు. 1930 నుండి శాస్త్రి గారిలో ఆధ్యాత్మిక ధ్యాస మొదలై 41 సం లో పూర్ణదీక్ష తీసుకున్నారు.శ్రీ నరసింహశాస్త్రి గారు కధా రచనలో కూడా సిద్ధహస్తులు. గులాబిపువ్వు, శ్యామసుందరుడు, గానభంగము, చేసుకున్నవారికి చేసుకున్నంత, భవిష్యత్తు, వధూసర -ఇలాంటి కథలు సాహితి, సఖి, భారతి, ఆంధ్రవార్షిక సంచికలలో ప్రచురించపడ్డాయి. శాస్త్రిగారి నాటికలు సోమనాధ విజయము, వరాగమనము, ఆత్మమృతి, పతంగయాత్ర, లాంటివి పఠిత రంజకములుగా వెలుగొందాయి.శ్రీ శివశంకరశాస్త్రి గారి వలెనే వీరు కూడాఎక్కువగా పద్య నాటికలు వ్రాసారు! నరసింహశాస్త్రిగారి ‘నారాయణభట్టు’ పేర్కొనదగిన మంచి నవల.వీరి గద్యరచనా విధానము చాల సరస మధురమైనది. పాత్రల సంభాషణలు ఉదాత్తముగా ఉంటాయి . కథాసంవిధానము మీద కంటే , విషయ విమర్శనము మీద వీరు ఎక్కువ దృష్టి పెట్టేవారు.నోరివారు ఆధునిక సాహిత్య ప్రక్రియలు అన్నింటిని వ్యాసాల్లో చక్కగా తెలియజేయడం వల్ల ఎన్నో పరిశోధనాత్మక విషయాలు వెలుగులోకి వచ్చాయి. సాహిత్య విమర్శకులుగా వీరిది ప్రత్యేక స్థానం.ఉత్తమ సాహిత్య లక్షణాలను గురించి వారు ‘నేటి సాహిత్య విమర్శ’ అనే వ్యాసంలో సవివరంగా తెలియజేశారు. ఉత్తమ కవి క్రోధాన్ని, ద్వేషాన్ని, కామాన్ని తన కావ్య వస్తువులుగా తీసుకోకూడదని వారు పదే పదే తెలియజేశారు. చారిత్రక నవలా ప్రక్రియకు నోరి నరసింహశాస్త్రి గారు పాముఖ్యాన్ని ఇచ్చారు!1949లో నారాయణభట్టు,1951లో రుద్రమ దేవి, 1958లో మల్లారెడ్డి, 1962లో కవిసార్వభౌముడు, 1968లో కవిద్వయం, వాఘిరా అనే నవలను రచించారు. బాలలకోసం కర్పూరద్వీప యాత్ర అనే నవలను కూడా వీరు రచించి బాలసాహిత్య రచయితగా కూడా ప్రఖ్యాతులయ్యారు.ఈయన మరికొన్ని రచనలు-గీతమాలిక, భాగవతావరణము(పద్యనాటిక), సోమనాథ విజయము(నాటకము), వరాగమనము, ఆత్మమృతి, తేనెతెట్టె , పతంగయాత్ర, స్వయంవరము, షణ్ణవతి, నారాయణభట్టు, రుద్రమదేవి (నవలలు) ఇంకను, అనేక కథలు, వ్యాసాలు. వీరు శ్రీదేవి భాగవతంలో కుమారీ పూజా విధానాన్ని 60 పద్యాల్లో తెలియజేశారు.
నవ్యసాహిత్య పరిషత్ కార్యవర్గ సభ్యులుగా ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ఉపాధ్యక్షులుగాను, విశిష్ట సభ్యులుగాను బహుముఖ సేవలు అందించారు. వీరికి కళ్యాణానందభారతి మహాస్వామివారు 1947 లో ‘కవిసమ్రాట్’ బిరుదును ప్రసాదించారు. అలాగే 1959లో ‘కవి మార్తాండ’ బిరుదును హయగ్రీవ విద్యాపీఠం వీరికి అందించారు. నరసింహ శాస్త్రి గారు,శృంగేరీ శ్రీ విరూపాక్ష శ్రీ పీఠాధీశ్వరులు జగద్గురు శ్రీ కళ్యాణానంద భారతీ మాంతాచార్య మహాస్వామి వారి వద్ద దీక్షను తీసుకొని గురుస్థానం పొందారు. వీరి దీక్షానామం విజ్ఞానానందనాధ. నరసింహ శాస్త్రి గారు తన 78వ ఏట వారి కుమారుడైన శ్రీ నోరి సుబ్రహ్మణ్యశాస్త్రి గారి ఇంట 3.1.1978 నాడు శ్రీదేవి సాయుజ్యాన్ని పొందారు. వీరి సాహిత్యంపై అనేక విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు జరిగాయి, జరుగుతున్నాయి.ఈ మహనీయుని సాహిత్యాన్ని ముందు తరాలకు అందించవలసిన బాధ్యత మనదే! నోరి ట్రస్టు వారు కొంతమేరకు ప్రచురణల ద్వారా నోరి వారి సాహిత్యాన్ని అందిస్తున్నా, తెలుగు విశ్వవిద్యాలయం వారు ఆ ప్రచురణల బాధ్యతను స్వీకరించాలి.
నోరి వారికి నా స్మృత్యంజలి!