-శారదాప్రసాద్
ఆధ్యాత్మిక మార్గంలో చాల కష్టతరమైన సాధనామార్గం కుండలినీ యోగం.దీనిని అభ్యసించటానికి అనుభవం కలిగిన గురువు తప్పనిసరి. పుస్తకాలు చదివి, ఎక్కడో విని విషయ సేకరణ చేసి కుండలినీ యోగ సాధనకు ఉపక్రమించరాదు. అసలు కుండలినీ అంటే ఏమిటో తెలుసుకుందాం!ఇదొక అనంతమైన శక్తి! దీని స్థావరం మూలాధారం! లలితా సహస్ర నామాల్లో అమ్మవారికి ‘కుండలినీ’ అనే పేరు కూడా ఉండటం మీరు గమనించే ఉంటారు. ముందు పురీష నాళం ,వెనక మలాశయం -వీటి మధ్యనే ఉంది మూలాధారం. ఇదే మన జన్మ స్థానం! మూలాధారంకు ఆధారం మూల(Root). విశేషమేమంటే అమ్మవారి నక్షత్రం కూడా మూలా నక్షత్రమే!అందుకే శక్తి ఆరాధకులు కుండలినీ యోగాన్ని చేస్తుంటారు. మన కర్మ ఫలాలు అన్నీ కుండలినిలోనే నిక్షిప్తం అయి ఉంటాయి. జీవితమంతా అంతా కుండలిని ఆజ్ఞ ప్రకారమే సాగుతుంటుంది.రాజయోగ సాధకులు కూడా దీన్ని అభ్యసిస్తారు. నూతన యోగ మార్గ ప్రవక్త మాస్టర్ CVV యోగ మార్గాన్ని అనుసరించే వారికి ,వారు initiation తీసుకున్నప్పటినుంచే కుండలిని చైతన్యవంతమౌతుంది. అయితే కుండలిని చైతన్యమయినట్లు తెలిసేది సీనియర్ సాధకులకే! మాస్టర్ CVV యోగమార్గాన్ని అనుసరించేవారికి ఈ కుండలిని పనిచేయటం సర్వ సాధారణం!మిగిలిన వారిలో ఇది నిద్రాణమై ఉంటుంది. దానిని ప్రేరేపించటానికి మిగిలిన మార్గాల్లో గురువు అవసరం ఉంది.గురువు సహాయం లేకుండా కుండలినిని చైతన్యం చేసుకోవటం కేవలం రామకృష్ణ పరమహంస లాంటి యోగపురుషులకే సాధ్యం! ఇష్టమొచ్చినట్లు ఎవరైనా కుండలినిని ప్రేరేపించటానికి ప్రయత్నిస్తే–వాళ్ళు పిచ్చి వారుగా అవుతారు,మరికొందరు మరణిస్తారు!ఈ కుండలిని శక్తినే శ్రీ విద్యగా కూడా ఆరాధిస్తారు కొందరు. ఆరు/ఏడు చక్రాలను దాటుకుంటూ సహస్రారానికి కుండలిని శక్తిని చేర్చటమే ఈ యోగ పరమావధి. అది సహస్రారానికి చేరుకోగానే సాధకుడికి నిర్వికల్ప సమాధి స్థితి వస్తుంది. సహస్రార కేంద్రంలో శివ శక్తుల సంయోగం వల్ల అనంత శక్తి విస్ఫోటన జరుగురుంది. సాధకుడికి దివ్య శక్తులు లభిస్తాయి!మూలాధారం ఒక పద్మంలా ఉంటుంది. ఆ పద్మంలో ఒక త్రికోణం ఉంటుంది. అది శూన్య త్రికోణం. అక్కడే కుండలిని ఒక పాములాగా మూడున్నర చుట్లు చుట్టుకొని అదృశ్యంగా నిద్రిస్తుంది. మూడున్నర చుట్లు ఎందుకంటే–
ఇప్పటివరకు జరిగిన సృష్టి పరిణామంలో- ఖనిజ దశ, వృక్ష దశ, జంతు దశ అనే మూడు దశలు పూర్తయ్యాయి. నాల్గవ దశ మానవ దశ. ఇది సగమే పూర్తయింది. అందుకే మూడున్నర చుట్టలు చుట్టుకొని ఉంది.పరిపూర్ణ మానవుడు తయారైతే అది నాలుగు చుట్లు చుట్టుకొని ఉంటుందని కొందరి అభిప్రాయం. అయితే ఈ కుండలిని స్కానింగ్ లాంటి పరీక్షలకు కనపడదు. ఈ కుండలిని నుంచి 72 వేల నాడులు బయలు దేరుతాయి!వీటిలో సుషుమ్న, ఇడ, పింగళ ముఖ్యమైనవి!కుండలిని వెన్నెముక ద్వారా ప్రయాణిస్తుంది.వెన్నెముకను చాలామంది వెన్నుపాము అంటారు!ఈ శరీరం ఒక పుట్ట. అందులో ఉన్న మరో పామే వెన్నెముక. అందుకే మనలో కొంతమంది నాగారాధన చేస్తుంటారు. వెన్నెముకకు కుడి ఎడమలలో ఇడ, పింగళ నాడులుంటాయి! శాక్తేయులు వెన్నెముకను కుమారా స్వామిగా ,ఇడ ,పింగళ నాడులను వల్లీ, దేవసేనలుగా భావిస్తారు! ఇడ, పింగళ నాడులు ప్రతి కేంద్రం వద్దా చుట్టూ తిరుగుతూ పద్మం చుట్టూ ప్రదక్షిణం చేస్తూ కనుబొమల మధ్య సుషుమ్నతో కలసి త్రికూట రూపాన్ని ధరిస్తాయి. కుండలినిలో కోటిమంది సూర్యుల ప్రకాశం ఉంటుంది. ఈ చక్రం తత్త్వం పృధ్వీ తత్త్వం!(భూమి). దీని అధిదేవత బ్రహ్మ, నడిపించే శక్తి ఢాకిని. దీని బీజాక్షరం ‘లం ‘. శిరస్సు పైన ఉండేదే సహస్రారం. ఇది శివుని స్థానం. కుండలినీ యోగంలో కుండలినిని జాగృతం చేయడానికి ప్రాణాయామ సాధన ఒక ముఖ్యమైన మార్గము. కుండలినీ శక్తి సహస్రారం చేరినప్పుడు యోగసాధకుడు ఒక అనిర్వచనీయమైన ఆనందాన్ని అనుభవిస్తాడు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే అరిషడ్వర్గాలను జయించినప్పుడే ఇది సాధ్యమవుతుంది.
కుండలినీ శక్తిని జాగృతం చేయడానికి ముందు దేహ శుద్ధి (purification of body), నాడీ శుద్ధి (purification of nadis/nervous system), మనో శుద్ధి (purification of mind), బుద్ధి శుద్ధి (purification of intellect) జరగాలి.కుండలిని అన్నిచక్రాలు దాటుకుంటూ సహస్రారానికి చేరుకుంటుంది. దీనికి తీవ్ర సాధన అవసరం!ఎప్పుడైతే అది సహస్రారానికి చేరుకుంటుందో అక్కడ ఉన్న సహస్ర దళ పద్మం వికసిస్తుంది . అప్పుడు సాధకుడికి నిర్వికల్ప సమాధితో పాటు దివ్య శక్తులు సిద్ధిస్తాయి! ఈ స్థితినే అష్టాంగ
యోగలోని అత్యున్నత దశ అయిన “సమాధి స్థితి”గా కూడా పేర్కొంటారు. సాధకుడికి అన్ని రకాల క్లేశాలూ తొలగిపోతాయి. శరీరం, మనస్సుల నుండి పూర్తిగా విడిపోతాడు.చాలా మందికి నాభి కింద వరకే కుండలినీ ప్రయాణించటం జరుగుతుంది. నాభి క్రింద ప్రదేశం విషయ వాంఛలకు ,కామానికి నిలయం!ఆ కోరికలు తీర్చుకొని వైరాగ్యం పొందితే ,అది మరింత ముందుకు సాగుతుంది. విశ్వామిత్రుడికి లభించిన ప్రగతి మేనకతోటి సంయోగం తర్వాతే లభించింది. అందుకనే బ్రహ్మచారులు,సన్యాసులు యోగసాధనకు పనికిరారని చెబుతుంటారు కొందరు. శ్రీ కృష్ణ పరమాత్మ కూడా సంసారంలో ఉంటూనే ,తామరాకు మీద నీటి బొట్టులా ఉండమని బోధించాడు! ఈ యోగాన్ని సాధించటానికి చాలా సంవత్సరాలు పడుతుంది. కుండలిని చైతన్యాన్ని పొంది ప్రయాణిస్తున్నప్పుడు శరీరంలో ప్రకంపనలు (Vibrations) పుడుతాయి!శరీరం తీవ్రమైన బాధలకు లోనౌతుంది కొందరికి.అయితే మాస్టర్ CVV యోగ సాధకులు ఎటువంటి బాధలకు లోనుకారు!
ఇప్పుడు షడ్చాక్రాలు,వాటి స్థానాలను గురించి తెలుసుకుందాం!
షడ్చక్రాలు /సప్త చక్రాలు మన శరీరంలోని వెన్నుపూసలోనున్న ప్రదేశాలు.
- మూలాధార చక్రము (Mooladhara) : వెనక గుద స్థానము,ముందు లింగ స్థానము -ఇదే మూలాధార స్థానం.
- స్వాధిష్ఠాన చక్రము (Swadhisthana) : లింగమూలమున గలదు. ఆరు దళములతో సిందూరవర్ణము గల జలతత్వ కమలము గలది. దీని బీజ మంత్రం “వం”.
- మణిపూరక చక్రము (Manipura) : నాభి మూలమందు గలదు. పది దళములు గలిగి, నీల వర్ణము గల అగ్ని తత్వ కమలము ఇది . దీని బీజ మంత్రం “రం”.
- అనాహత చక్రము (Anahatha) : హృదయ స్థానమునందు ఇది ఉంటుంది. పండ్రెండు దళములు గలిగి, హేమవర్ణము గల వాయుతత్వ కమలము.దీని బీజమంత్రం “యం”.
- విశుద్ధి చక్రము (Vishuddha) : దీని స్థానం కంఠం . పదహారు దళములు గలిగి, శ్వేత వర్ణము గల ఆకాశతత్వ కమలము. దీని బీజ మంత్రం “హం”.
- ఆజ్ఞా చక్రము (Ajna) : భ్రూ (కనుబొమల) మధ్య ఉంటుంది. రెండు వర్ణములతో గూడిన రెండు దళములు కలిగిన కమలము. దీని బీజ మంత్రం “ఓం”.
- సహస్రార చక్రము (Sahasrara) : బ్రహ్మ రంధ్రమునకు అధోముఖముగ సహస్ర దళములతో వికసించియున్న పద్మము ఇది . సహస్రార కమల కర్ణిక యందు ప్రకృతి పురుషుల సమైక్య స్థితి యగు పరబిందువు చుట్టును మాయ గలదు. ఆత్మజ్ఞానమును సాధించిన పరమ హంసలు మాత్రమే పొందగలిగిన స్థానమిది. దీనిని శైవులు శివస్థానమనియు, వైష్ణవులు పరమ పురుష స్థానమనియు, ఇతరులు హరిహర స్థానమనియు, దేవీభక్తులు దేవీస్థానమనియు చెప్పుదురు. ఈ స్థానమునెరిగిన నరునకు పునర్జన్మ లేదు.మానవ శరీరమునందు 72000 నాడులు కలవని అనేక శాస్త్రములు వివరిస్తున్నాయి.యోగసాధనలోని ఆసన- ప్రాణాయామ పద్ధతుల ద్వారాను-ధారణ ధ్యానాదుల సాధనచేతను శరీరమందలి నాడులను శుభ్రపరచి,మూలాధారమునందు నిదురించుచున్న శక్తిని ఉత్తేజపరచ వచ్చు.
ఇడనాడి-పింగళ నాడుల స్థానాన్ని గురించి పైన చెప్పాను. సుషుమ్ననాడి (నాసాగ్రము మధ్యన)కలదు. ఇడ నాడిని చంద్ర నాడి అని, పింగళనాడిని సూర్య నాడి అని కూడ అంటారు ఈ నాడుల చైతన్యాన్ని కుండలిని చైతన్యంగా చెప్పవచ్చు! ప్రాశ్ఛాత్యుల శాస్త్రము ప్రకారము మెదడు నందు గల భాగములలో ఎడమ భాగమునకు కుడి నాసాగ్రముతోను, మెదడులోని కుడిభాగమునకు ఎడమ నాసాగ్రముతోను సంబంధము కలదు . మెదడులోని ప్రతీ కణమునకు నాడులు కలుపబడి ఉన్నవి.
ఆ నాడులు మానవ శరీరమందలి అన్ని భాగములకు ప్రాణశక్తిని అందించుచున్నవి.ఇక్కడ ‘ప్రాణశక్తి’ అంటే మనం అనుకునే ఆక్సిజన్ కాదు!ఆది పరాశక్తి(Origin) నుండి ప్రతి వారికి నిరంతరం ప్రాణశక్తి బ్రహ్మరంధ్రం ద్వారా అందుతుంటుంది.ఏ భాగానికైతే ఈ ప్రాణశక్తి సరిగా అందదో ,ఆ భాగానికి వ్యాధులు సంక్రమిస్తాయి.పైన చెప్పినట్లుగా మూలాధారంలో నిక్షిప్తమైన ప్రణాళిక ఆధారం మన జీవితం,జీవనం నడుస్తాయి!
మనకు కావలసినవన్నీ మన శరీరంలోనే ఉన్నాయి!అవి ఉన్నాయని తెలుసుకోవటమే యోగమార్గానికి మొదటి అడుగు!
******
గమనిక—ఇది మాస్టర్ సీవీవీ యోగసాధకుల కోసం కాదు,కుండలినీ గురించి ఆ యోగంలో మరో విధంగా చెప్పబడింది!మాస్టర్ గారు అనుమతిస్తే అది కూడా మీకు మరొకసారి తెలియ చేస్తాను!