సారస్వతం

కుమార సంభవం

-శారదాప్రసాద్

కుమారస్వామి జననం గురించి పురాణాలలో పలు కధలు ఉన్నాయి.మహాకవి కాళిదాసు వ్రాసిన కుమార సంభవంలో కుమారస్వామి జననం వరకే ఉన్నది.మిగిలిన వృత్తాంతం శివపురాణం,స్కాంద మరియు ఇతర పురాణాల్లో ఉంది. పూర్వం తారకాసురుడు అనే రాక్షసుడు అహంకారపూరితుడై సకల సజ్జనులను హింసిస్తూ ఉంటాడు.అతని బాధలను భరించలేని దేవతలందరూ కలిసి బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళి మొరపెట్టుకున్నారు. అప్పుడు బ్రహ్మదేవుడు వారితో ఇలా చెప్పాడు — శివుడు తపస్సు మానేసి పార్వతీదేవిని వివాహం చేసుకున్నట్లైతే,వారికి జన్మించే కుమారుడు తారకాసురుడిని అంతమొందిస్తాడు అని! దేవతలు వెంటనే శివుడి మీదకు మన్మధుడిని ప్రయోగిస్తారు. శివుడు మన్మథుడిని దహించి వేస్తాడు .తారకాసురుడిని అంత మొందించవలసిన అవసరాన్ని గుర్తించిన శివుడు తనకు పరిచర్యలు చేస్తూ ఉన్న పార్వతీదేవిని వివాహం చేసుకున్నాడు. వారిద్దరూ శృంగారంలో తేలియాడుతూ ఉన్న సమయంలో శివుడి రేతస్సు జారి భూమిపై పడింది. దానిని భూమి భరించలేక అగ్నిలో పడవేసింది.అగ్ని దాన్ని గ్రహించి దాన్ని భరించలేక గంగలో విడిచి పెడతాడు.. గంగ దాన్ని తీరంలోని రెల్లు పొదల్లో జారవిడుస్తుంది. రెల్లును సంస్కృతంలో శరం అంటారు . ఆ విధంగా శరవణంలో జన్మించడం వల్ల శరవణుడయ్యాడు. కృత్తికలుగా పిలువబడే ఆరుగురు ముని కన్యలు బదరికావనం తీసుకొని పోయి పెంచడం వల్ల కార్తికేయుడయ్యాడు. గంగానదిలో పడిన రేతస్సు ఆరు భాగాలుగా ఏర్పడింది. ఆ ఆరు భాగాలు అలల తాకిడికి ఏకమై ఆరు ముఖములు, పన్నెండు చేతులు, రెండు కాళ్ళతో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి జన్మించాడు.అందువల్ల ఆయనకు ‘షణ్ముఖుడు’ అనే పేరు ఏర్పడింది. ఆరు కృత్తికల చేత పెంచబడడం వల్ల స్వామికి ‘కార్తికేయుడు’ అనే పేరు ఏర్పడింది. సుబ్రహ్మణ్యస్వామి తారకాసురుడిపై దండెత్తి తారకాసురుడిని అంతమొందించి దేవతలను, ప్రజలను రక్షించాడు . తారకాసురుడి సోదరుడైన శూరపద్ముడు దేవతలను హింసిస్తూ ఉంటాడు. శూరపద్ముడిని సంహరించటానికి కార్తికేయుడు నిశ్చయించుకుంటాడు. వారిరువురి మధ్య యుద్ధం భీకరంగా సాగుతుంది.యుద్ధంలో ఆరోరోజున శూరపద్ముడు పక్షి రూపం ధరించి యుద్ధానికి వస్తాడు.ఆ పక్షి మీద కుమార స్వామి తన శూలాన్ని ప్రసయోగించి దాన్ని రెండు ఖండాలుగా చీలుస్తాడు!
ఆ రెండే నెమలి,కోడి పుంజు!అవి కుమారస్వామ్మిని శరణు వేడుకుంటాయి.కుమారస్వామి కనికరించి నెమలిని వాహనంగా,కోడిని ధ్వజంగా చేసుకుంటాడు.శ్రీ కుమారస్వామికి ఇద్దరు భార్యలున్నారు .వారే వల్లీ దేవసేనలు!షణ్ముఖుడి ఆరు ముఖాలు పంచ భూతాలను, ఆత్మను సూచిస్తాయంటారు. ఇంకా అవి యోగ సాధకులకు షట్చక్రాలకు సంకేతాలు.ఇంకొద్దిగా దీర్ఘంగా వివరిస్తాను .ఈ శరీరం ఒక పుట్ట. ఇందులో ఒక పాము ఉన్నది.అదే వెన్నుపూస లేక వెన్నుపాము.మనిషికి ముందు మూత్రాశయం ,వెనక మలాశయం. ఈ రెండింటి మధ్య కుండలిని పామువలె మూడు చుట్లు చుట్టుకొని ఉంటుంది. అదే మన జన్మ స్థానం కూడా! అంటే మన జన్మ స్థానం ఒక పాయిఖానా అన్నమాట! జాతక చక్రాన్ని కుండలినీ చక్రమని కూడా పిలుస్తారు.సాధకులు ఈ కుండలిని గురువు అనుగ్రహంతో లేపి వెన్నుపాము ద్వారా సహస్రారానికి చేర్చటానికి ప్రయత్నిస్తారు.ఈ ప్రక్రియలో విజయం సాధించే వారు అతి తక్కువ మంది.ఆ వెన్నుపామే సుబ్రహ్మణ్య స్వామి. వల్లీ, దేవసేనలు ఇడ ,పింగళ నాడులని యోగవిద్యలో నిపుణలైన వారి అభిప్రాయం. ఉత్థిత కుండలినీ శక్తికి ప్రతీకగా సుబ్రహ్మణ్యుడిని సర్పరూపంలో ఆరాధిస్తారు. షణ్మతాలలో కుమారోపాసన (సుబ్రహ్మణ్యోపాసన)ఒకటి. మిగిలినవి సౌర, శాక్త, వైష్ణవ, గాణాపత్య, శైవములు. అయితే అగ్ని గర్భుడు అని పేరు ఉన్న సుబ్రహ్మణ్యారాధన అగ్ని ఉపాసనతోనే జరుగుతుందని శాస్త్ర వాక్యము.అందుచేతనే పంచాయతన పూజలో ప్రత్యక్షంగా సుబ్రహ్మణ్య స్వామి వారి మూర్తి ఉండదు.అయితే దీపారాధన శివశాక్త్యాత్మకుడైన అగ్నిసంభవుడైన సుబ్రహ్మణ్యుని ఆరాధించడమేనని పెద్దలు చెప్తారు. ఈ విధంగా వైదిక ధర్మంలో సుబ్రహ్మణ్యోపాసన చెప్పబడింది.పరమ పురుషుడు శివుడు లేక విష్ణువు. అవ్యక్తశక్తి ఉమాదేవి లేక లక్ష్మీదేవి. వీరిరువురి సమైక్య సమన్వయ తత్వమూర్తి కుమారస్వామి అని స్కాంద పురాణం చెబుతోంది.అంటే కుమారస్వామిని పూజిస్తే శివశక్తుల్నీ,లక్ష్మీనారాయణులనీ కలిపి అర్చించినట్లే. ప్రకృతీ పురుషుల ఏకత్వం కుమార స్వామితత్త్వం.కుమార జననంలోనే అనేక తాత్త్విక మర్మాలు ఉన్నాయి. పరతత్వం అవ్యక్తం నుండి జగద్రూపం తీసుకొనే పరిమాణ క్రమం కుమార జననంలో కనబడుతుంది. అమోఘమైన శివతేజాన్ని పృథ్వి, అగ్ని, జలం (గంగ), నక్షత్ర శక్తి (షట్కృత్తికలు) ధరించి చివరకు బ్రహ్మతపోనిర్మితమైన శరవణం (రెల్లు తుప్ప) లోంచిఉద్భవించినవాడు కనుక శరవణభవుడు అయ్యాడు రామాయణంలో యాగరక్షణకు రామలక్ష్మణులు విశ్వామిత్ర మహర్షితో వెళుతుండగా,మార్గమధ్యంలో స్కందోత్పత్తి (సుబ్రహ్మణ్య జనన ఆఖ్యానము) వివరిస్తారు మహర్షి.కంచికామకోటి పీఠాధిపతిపరమాచార్య శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర మహాస్వామి వారి మాటలలో చెప్తే, ఉపాసనలో పరమశివుడికి కొన్ని ఇష్టం, అలాగే అమ్మ వారికి కొన్ని ఇష్టం, భక్తులు అమ్మకి అయ్యకి ఇద్దరికీ కలిపి పూజ చేయాలి అంటే కేవలం సుబ్రహ్మణ్యస్వామి వారికి పూజ చేస్తే చాలట.పురాణాల ప్రకారం శ్రీ వల్లి ఇంద్రుని కుమార్తె.తిరుత్తణి రాజైన కోయరాజు నందిరాజు కుమార్తె వల్లీదేవి. ఈమెను పెళ్లిచేసుకుంటానికి కుమారస్వామి కోయదొర వేషంలో వెళుతాడు.అయితే ఆమె తన అసలు రూపం సర్పజాతిదని తెలియచేసి,సర్పాకారం కలవాడినే పెళ్లి చేసుకుంటానని చెబుతుంది.
ఆమె ప్రేమలో పడిన కుమారస్వామి సర్పంగా మారి ఆమెను పెళ్లి చేసుకుంటాడు.అలా కుమారస్వామి సుబ్రహ్మణ్య స్వామిగా మారాడు. బ్రహ్మజ్ఞానం కలవాడే సుబ్రహ్మణ్యుడు.సర్ప దోషాలు ఉన్నవారు ఈ రూపంలో ఉన్న కుమారస్వామిని ఆరాధిస్తారు.బ్రహ్మకి మరియు పరమశివునికి కూడా ప్రణవార్ధం బోధించినవాడు కాబట్టి స్వామి సు-బ్రహ్మణ్య అంటే బ్రహ్మజ్ఞాని అని పిలువబడ్డాడు. అంతేకాదు, పుత్రాదిఛ్చేత్ పరాజయం అని చెప్పినట్లుగా, శంకరుడు, కుమారుని నుండి ప్రణవార్ధం విన్నాడు కాబట్టి, శివగురు లేదా స్వామినాథ అనే నామంకూడా ఉంది. సుబ్రహ్మణ్యస్వామిని మన ఆంధ్రదేశములో సుబ్బారాయుడిగా కూడా పిలుస్తారు . బాలుడిగా ఉండేవాడు, కుత్సితులను సంహరించేవాడూ, మన్మథుని వలె అందముగా ఉండేవాడు అని కుమారస్వామి అనే నామం వచ్చింది.స్వామి వారికి గల అనేక నామములలో “గురుగుహా” అనే నామం కూడా ఉంది. గురుగుహా అంటే, ఇక్కడే మన హృదయ గుహలలో కొలువై ఉన్న గురుస్వరూపము. సుబ్రహ్మణ్యుడు సాక్షాత్తు శంకరుడికే బోధించిన గురుస్వరూపము.”శరవణభవ” అనే ఆరు అక్షరాల నామమంత్రాన్ని పఠించడం మంచి ఫలితాలను ప్రసాదిస్తుంది.స్వామివారికి, స్కందుడు, సేనాని, మహాసేనుడు, శరవణభవ, కార్తికేయుడు, గాంగేయుడు, కుమారదేవుడు,వేలాయుధుడు, మురుగన్ అనే పేర్లున్నాయి ప్రతి సంవత్సరం మార్గశిర మాసం శుక్లపక్ష షష్టినాడు శ్రీ సుబ్రహ్మణ్య షష్టి పర్వదినాన్ని జరుపుకోవడం ఆచారం.
ఈ పర్వదినానికి సుబ్బరాయషష్టి, కుమారషష్టి, స్కందషష్టి, కార్తికేయషష్టి, గుహప్రియా వ్రతం వంటి పేర్లున్నాయి.శ్రీ సుబ్రహ్మణ్యం శరణం ప్రపద్యే “శరవణభవ”…ఓం శ్రీ వల్లిదేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః. శ – లక్ష్మీబీజము అధిదేవత శంకరుడుర – అగ్నిబీజము అధిదేవత అగ్నివ – అమృతబీజము అధిదేవత బలభద్రుడుణ – యక్షబీజము అధిదేవత బలభ్రద్రుడుభ – అరుణ బీజము అధిదేవత భద్రకాళీదేవివ – అమృతబీజము అధిదేవత చంద్రుడు*****శ – శమింపజేయువాడుర – రతిపుష్టిని ఇచ్చువాడువ – వంధ్యత్వం రూపుమాపువాడుణ – రణమున జయాన్నిచ్చేవాడుభ – భవసాగరాన్ని దాటించేవాడువ – వందనీయుడుఅని ‘శరవణభవ’కు గూఢార్థం. షదాననం చందన లేపితాంగం మహారసం దివ్య మయూర వాహనం రుదస్య నూనుం సురలోకనాథం శ్రీ సుబ్రహ్మణ్యం శరణం ప్రపథ్యే.

శుభం భూయాత్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked